గరిమెళ్ల సత్యనారాయణ
గరిమెళ్ల సత్యనారాయణ | |
---|---|
జననం | గరిమెళ్ల సత్యనారాయణ జూలై 14, 1893 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలుక గోనెపాడు |
మరణం | డిసెంబర్ 18, 1952 ప్రియాగ్రహారం |
నివాస ప్రాంతం | ప్రియాగ్రహారం |
వృత్తి | గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తా విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడు ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శి ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఆనందవాణికి సంపాదకుడు ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడు |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత |
మతం | హిందూ మతము |
తండ్రి | వేంకట నరసింహం |
తల్లి | సూరమ్మ |
Notes 'మాకొద్దీ తెల్ల దొరతనం..' గేయ రచయిత |
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ (జూలై 14, 1893 - డిసెంబర్ 18, 1952) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను రాసిన 'మా కొద్దీ తెల్ల దొరతనం.." పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే "దండాలు దండాలు భారత మాత' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.[1]
తొలి జీవితం
[మార్చు]గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలుక గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న జన్మించాడు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. గరిమెళ్ళ ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. కన్నేపల్లి లక్ష్మీనరసింహం ఆర్థిక సాయంతో విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైనచోట్ల పైచదువులు చదివాడు. బి.ఏ. చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. గరిమెళ్ళ చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అతని స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కువకాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయాడు.
జాతీయోద్యమ స్ఫూర్తి
[మార్చు]1920 డిసెంబర్‍లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. మహాత్ముడి బాటలో అహింసా పోరాట పద్ధతికి జైకొట్టిన ఆయన తెల్లవాడు రకరకాల భేదాలు సృష్టించి దేశ ప్రజల్ని చీల్చి పబ్బం గడుపుకుంటున్నాడని, భారతీయుల అనైక్యతే వాడి బలమని భావించాడు. విదేశీయులకు బానిసలయ్యామని వాపోయాడు. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ 'మా కొద్దీ తెల్లదొరతనం..' పాటను వ్రాశాడు. ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా (12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా-ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. గరెమెళ్ళ పాట విన్న బ్రిటీషు కలెక్టరు తెలుగుభాష నాకు రాకపోయినప్పటికీ, ఈ పాటలో ఎంతటి మహత్తర శక్తి ఉందో, సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపర్చగలదో నేను ఊగించగలనన్నాడట. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీటోపి పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ..
మాకొద్దీ తెల్లదొరతనం- దేవ
మాకొద్దీ తెల్లదొరతనం అంటూ
ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట.
శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదల అయిన గరిమెళ్ళ మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగాడు. ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగాడు. ఇది చూసి ప్రభుత్వాధికారులు భయపడ్డారు. ఆయన బయట ఉండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి తిరిగి అరెస్టు చేశారు. కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచారు. మేజిస్ట్రేట్ రెండు సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించాడు.
గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే ఒదులుతామని చెప్పారట. కాని గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే ఉన్నాడు. అంతటి దేశభక్తుడు ఆయన.
బతుకు పుస్తకం
[మార్చు]జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నోచోట్ల సన్మానాలు చేశారు. ఆయన జీవితంలో మధుర ఘట్టం ఇదొక్కటే. ఆ తరువాత కొద్దిరోజులకు భార్య చనిపోయింది. అప్పుడాయనకి ఇద్దరు కుమార్తెలు. గరిమెళ్ళ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. అప్పులు పెరగడంతో వున్న ఆస్తి అమ్మేసి అప్పులు తీర్చాడు. ఉద్యోగం వదిలేశాక కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశాడు. శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి పద్దెనిమిది పుస్తకాలు అచ్చువేశాడు. అవి అమ్ముడుపోలేదు. ఆయన ఎక్కువగా రాజమండ్రి, విజయవాడ, మద్రాసులకు తిరుగుతూ వుండడంతో, వాటిని పట్టించుకోక పోవడం వల్ల వాటిని చెదలు తినేశాయి. వాటి వల్ల కూడా కొంత నష్టం వచ్చింది.
ఉద్యోగం, రచనలు
[మార్చు]1921లో గరిమెళ్ళ 'స్వరాజ్య గీతములు' పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమిళం నుండి "తిరుక్కురల్", "నందియార్", కన్నడ నుండి "తల్లికోట" గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. కొన్ని ఖండకావ్యాలు రచించిన ఆయన 'మాణిక్యం' అనే నాటకాన్నీ వెలువరించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన 'ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆంగ్ల పద్యం "హార్ట్ ఆఫ్ ది నేషన్" కు తెలుగు అనువాదం చేసాడు. శారదా గ్రంథమాలను స్థాపించారు. త్రిలింగ పత్రికలో 'దుందుభి, వికారి' కలం పేర్లతో రాజకీయ వ్యాసాలు రాసారు. 1937లో చీనా-జపాన్ అనే పుస్తకాన్ని రచించారు.[2] గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత ఆంధ్రప్రభలో చేరాడు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడుగా పనిచేశాడు. ఆ తరవాత కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించాడు.
చివరిదశ
[మార్చు]గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోధ్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. చైతన్యమూర్తి గరిమెళ్ల సత్యనారాయణ వార్ధక్య జీవితం దుర్భరం కావడం బాధాకరం. 'ప్రజాపాటల త్యాగయ్య'గా గుర్తింపు పొందిన దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు.
స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్ళను 'మాకొద్దీ నల్ల దొరతనం..' అనే గేయం వ్రాయలని అడిగారట. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదుట. చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెళ్ళ 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించాడు. ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు జరిపారు.
చిత్రమాలిక
[మార్చు]-
గరిమెళ్ళ, స్వరాజ్యకలం పుస్తకం
-
శ్రీకాకుళంలోని గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం
-
గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం క్రిందనున్న సమాచార ఫలకం
మూలాలు
[మార్చు]- ↑ "తెల్లదొరలను వణికించిన తెలుగు పాట". Sakshi. 2019-07-14. Retrieved 2021-10-20.
- ↑ సత్యనారాయణ, గరిమెళ్ళ. చీనా-జపాన్.
వనరులు
[మార్చు]- అమరావతి పబ్లికేషన్స్ వారి తెలుగు వెలుగులు
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1893 జననాలు
- 1952 మరణాలు
- తెలుగు రచయితలు
- విప్లవ రచయితలు
- తెలుగు కవులు
- శ్రీకాకుళం జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- శ్రీకాకుళం జిల్లా రచయితలు
- జీవితం అంత్యదశలో దారిద్ర్యం అనుభవించినవారు