గోగినేని భారతీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోగినేని భారతీదేవి
Gogineni Bharatidevi.jpg
జననంఆగష్టు 15, 1908
మరణంసెప్టెంబర్ 21 , 1972
వృత్తిసంఘసేవ
జీవిత భాగస్వాములుఎన్.జి.రంగా

గోగినేని భారతీదేవి (1908 - 1972) స్వతంత్ర సమర యోధురాలు, సంఘ సేవిక.

ఈమె గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా, మాచవరం గ్రామములో వెలగా సుబ్బయ్యకు 15.8.1908 న జన్మించింది. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి. రంగా ఈమెను 1924లో వివాహం చేసుకున్నారు. గుంటూరు శారదా నికేతన్ లోను, చెన్నైలోని విద్యోదయా పాఠశాల లోను విద్యాభ్యాసము చేసి, రంగాతో బాటు ఇంగ్లాండు వెళ్ళి ఆక్స్ ఫర్డ్ లో రస్కిన్ కళాశాలలో చదివింది.

స్వదేశము తిరిగి వచ్చిన పిదప భర్తతో బాటు స్వాతంత్ర్యోద్యమములో పాల్గొని కారాగారవాసం అనుభవించింది. 1931లో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమము సందర్భములో తెనాలిలో ఆరు నెలలు ఆందోళన చేసింది. సహాయ నిరాకరణోద్యములో పోరాడి వెల్లూరు జైలులో ఒక సంవత్సరము నిర్బంధించబడింది. వెంకటగిరిలో జమీందారీ రైతుల ఆందోళనలో దెబ్బలు తిన్నది. హరిజనోద్యమము, దళితులతో సహభోజనాలు, కులాంతర వివాహాలు మున్నగు పలు కార్యక్రమాలు జరిపింది.

ఈమె 1936 లో గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలుగా ఎన్నికయ్యారు.1940-42 మధ్య ఆంధ్ర కర్షక కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా చేసింది. 1946-47లో మద్రాసు రాష్ట్ర విద్యాసలహా సంఘమునకు సభ్యురాలు. 1956లో కృష్ణా జిల్లా ఘంటశాలలో ఆంధ్ర మహిళా అధ్యక్షురాలు. 1958-64 లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యురాలుగా ఉన్నారు.

1952-53లో రాయలసీమ కరవు వచ్చినపుడు బాధితుల సహాయమనకై నిరంతరము శ్రమించింది. "అన్నపూర్ణ" అని కొనియాడబడింది.

నిడుబ్రోలులో భర్తకు చేదోడుగా ఉండి, చివరకు సెప్టెంబరు 21, 1972న మరణించింది.

మూలాలు[మార్చు]