Jump to content

గిడుగు వేంకట సీతాపతి

వికీపీడియా నుండి
(జి.వి.సీతాపతి నుండి దారిమార్పు చెందింది)
గిడుగు వెంకట సీతాపతి
గిడుగు వెంకట సీతాపతి
జననంగిడుగు వెంకట సీతాపతి
జనవరి 28, 1885
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం
మరణంఏప్రిల్ 19, 1969
హైదరాబాదు
ఇతర పేర్లుగిడుగు వెంకట సీతాపతి
వృత్తిపర్లాకిమిడిలో చరిత్రోపన్యాసకులు
చలనచిత్రాలలోను, కొన్ని నాటకాలలోను నటించారు.
జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.
ప్రసిద్ధిసిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత.
తండ్రిగిడుగు వెంకట రామమూర్తి

గిడుగు వెంకట సీతాపతి (జనవరి 28, 1885 - ఏప్రిల్ 19, 1969) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి.

జననం

[మార్చు]

వీరు జనవరి 28, 1885 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన గిడుగు వెంకట రామమూర్తి దంపతులకు జన్మించారు.

మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, సవర భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. రైతుబిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల వంటి కొన్ని చలనచిత్రాలలోను, కొన్ని నాటకాలలోను నటించారు.

1945లో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో తెలుగు భాషా సమితి ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువుకు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.

వీరు రచించిన తెలుగు కావ్యాలలో ముఖ్యమైనవి: 'భారతీ శతకము', 'సరస్వతీ విలాసము', 'కొద్ది మొర్ర'. వీరు రాసిన 'బాలానందము' వంటి బాల సాహిత్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు బైబిల్ లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు రచించిన 'తెలుగులో ఛందోరీతులు' అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. పర్లాకిమిడి తాలూకాను ఒడిషా రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు లండన్ వెళ్ళి, శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒడిషా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.

తండ్రి అనంతరం రాజమండ్రి చేరిన సీతాపతి రాజకీయాలలో పాల్గొని జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.

వీరికి ఆంధ్రవిశ్వకళాపరిషత్ కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. వీరి ఇంగ్లీషు రచనలలోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్ లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్. గౌరవం ఇచ్చింది.

మరణం

[మార్చు]

వీరు ఏప్రిల్ 19, 1969లో హైదరాబాదులో పరమపదించారు.

నటించిన సినిమాలు

[మార్చు]

వంశవృక్షం

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు. "గిడుగు సీతాపతి జీవితం - రచనలు". p. 140.
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.

బయటి లింకులు

[మార్చు]