తంతి

వికీపీడియా నుండి
(టెలిగ్రాఫ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తంతి లేదా టెలిగ్రాఫ్ అనునది విద్యుత్ స్పందనల సంకేతాల ద్వారా సమాచారాన్ని ఒకచోటు నుండి మరొక ప్రదేశానికి పంపించే వ్యవస్థ. టెలీగ్రాఫ్ అనే పదం టెలి (tele, గ్రీకు:τηλε అనగా "దూరం"), గ్రాఫియన్ (graphein గ్రీకు:γραφειν అనగా "రచన") అనే రెండు గ్రీకు పదాల కలయిక. సమాచారాన్ని సుదూర ప్రాంతాలకు ప్రసారం చేయుటకు ఉపయోగపడే వ్యవస్థ.

చరిత్ర

[మార్చు]

టెలిగ్రాఫ్ విధానం క్రొత్తదైనప్పటికీ, దీని మూలసూత్రం పాతదే. క్రీ.పూ.500 ప్రాంతంలో పర్షియా చక్రవర్తి డేరియన్ రాజాజ్ఞలను, వార్తలనూ ప్రకటించటానికి బిగ్గరగా అరవగలిగే వాళ్ళను కొండశిఖరాలపై వినియోగించేవాడట. గ్రీకులు దృశ్య టెలిగ్రాఫ్ విధానాన్ని వాడేవారు. మండుతున్న దివిటీల సముదాయాన్ని పర్వత శిఖరాలనుంచి ప్రత్యేక పద్ధతిలో తిప్పుతూ సంకేతాల ద్వారా అక్షరాలను ఇతరులకు సూచిస్తుండేవారు. కార్తజీనియన్లు, రోమన్లు ఇలాంటి పద్ధతులనే ఉపయోగించారు. నేడు ఆర్లియన్స్ అని పిలువబడుతున్న సెనాకం వద్ద ఆనేక మంది రోమనులు హత్య చేయబడ్డారనే వార్త అరుపుల మూలంగా ప్రజలందరికీ త్వరగా అందించబడిందని జూలియన్ సీజర్ ఒక పుస్తకంలో వ్రాశాడు. ఏదైనా ప్రముఖ సంఘటన జరిగితే, అక్కడి ప్రజలు బిగ్గరగా అరవడం ద్వారా ఇతరులకు తెలపడం పరిపాటిగా ఉండేదట. ఆఫ్రికాలో మరో పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది. తొర్ర పరిమాణాలు వేరు వేరుగా ఉండే చెట్టు బోదెలతో తయారుచేసిన ఢంకాలను బజాయిస్తే, వివిధ శబ్ద స్వరాలు యేర్పడతాయి. వీటి సంకేతాల ద్వారా సందేశాలు పంపబడుతూ ఉండేవి. దక్షిణ అమెరికా అమెజాన్ ప్రాంతంలో కూడా ఇలాంటి సాధనం ద్వారానే సమాచారాన్ని ఒక మైలు దూరం దాకా అందించుకునేవారు. పచ్చి కట్టెలను అంటించి, పొగ సంకేతాల ద్వారా అనేక దేశలలో వార్తలు పంపుతుండేవారు.

దృశ్య టెలిగ్రాఫ్

[మార్చు]
Construction schematic of a Prussian optical telegraph (or semaphore) tower, C. 1835

18 వ శతాబ్దం అంతం దాకా ఈ విధానాల్లో అభివృద్ధి జరుగలేదు. 1792 లో క్లాడ్ చావ్ అనే మెకానిక్, ఫ్రెంచి జాతీయ సదస్సులో ఓ దృశ్య టెలిగ్రాఫ్ పద్ధతిని ప్రదర్శించాడు. ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు రాబర్ట్ హుక్ ఒక శతాబ్దానికి పూర్వం ప్రతిపాదించిన సలహా ఆధారంగా ఇది నిర్మించబడింది. వివిధ దురాక్రమణ సైన్యాలతో సతమతమవుతున్న ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని వెంటనే అంగీకరించింది. ఫలితంగా 1794 లో పారిస్, లిల్లీ నగరాల మధ్య తొలి చాప్ టెలిగ్రాఫ్ సంబంధం నెలకొల్పబడింది. పశ్చిమ, మధ్య ఐరోపా లలో కూడా ఇలాంటి సౌకర్యం విస్తృతంగా కల్పించబడింది.

ఈ దృశ్య టెలిగ్రాఫ్ పనిచేయటానికి గాను ఎత్తయిన స్తంభాలను ఆరేసి మైళ్ల దూరంలో ఒక్కొక్కటి చొప్పున నాటారు. సంకేతాలుగా వాడటానికి వీలుగా వీటిపై కడ్డీలను బిగించారు. అక్షరాలకు, విరామ చిహ్నాలకు అంకెలకు సంకేతాలను నిర్ణయించారు. టెలిస్కోప్ లను చేత ధరించిన ఆపరేటర్లు ఈ స్తంభాలపై ఎక్కి కూర్చుంటారు. మొదటి స్తంభం ఉండే వ్యక్తి, కడ్డీలను వంచటం ద్వారా సంకేతాలను సూచిస్తాడు. తరువాతి టెలిగ్రాఫ్ స్తంభం పై ఉండే ఆపరేటర్ దీన్ని టెలిస్కోప్ ద్వారా గమనించి తానూ అలాగే చేస్తాడు. ఈ విధంగా పారిస్ నుంచి 130 మైళ్ళ దూరంలో ఉండే లిల్లీ నగరానికి 22 స్తంభాల మీదుగా సందేశాలను పంపడానికి కేవలం 2 నిముషాలే పట్టింది. ఈ పద్ధతి తృప్తి కరంగా పనిచేయటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

నెపోలియన్ కూడా చాప్ టెలిగ్రాఫ్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించి, శత్రు సైన్యం కదలికలను వెంటనే కనుగొని, తన సైన్యాలకు శీఘ్రంగా ఆజ్ఞలు జారీ చేసేవాడు. 1809 లో ఆస్ట్రియన్ లు మ్యూనిచ్ ని ఆక్రమించుకోగా, ఈ విధానం మూలంగానే పారిస్ లో ఉన్న నెపోలియన్ ఆ రోజే సమాచారాన్ని తెలుసుకొని, ఆరు రోజుల లోపుగానే మళ్ళీ పట్టణాన్ని గెలుచుకోగలిగాడు. తన మిత్రుడైన బవేరియా రాజును సకల రాజ మర్యాదలతో నెపోలియన్ మళ్లీ మ్యూనిచ్ లో ప్రతిష్ఠింనప్పుడు, అతని ఆనందానికి హద్దులు లేకపోయాయి. తాను మళ్ళీ రాజ్యాధికారాన్ని పొందడానికి కారణభూతమైన టెలిగ్రాఫ్ విధానాన్ని చూసి, ముగ్ధుడైన రాజు దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి వీలుందేమో పరిశీలించాలని సోమరింగ్ అనే శాస్త్రజ్ఞుడిని ఆదేశించాడు.

విద్యుత్ టెలిగ్రాఫ్

[మార్చు]

స్కాట్లండ్ వైద్యుడు చార్లెస్ మారిసన్ విద్యుత్తు ద్వారా సంకేతాలను ప్రసారం చేయచచ్చునని 1753 లోనే సూచించాడు. ఈ పద్ధతి లోనే కొన్ని ప్రయోగాలు జరిగాయి కూడా. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగించి టెలిగ్రాఫ్ చేస్తే, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తి అవుతాయి. వోల్టా విద్యుత్ ఘటాలలో రెండు డజన్ల లోహం చీలలని వాడాడు. ఒక్కొక్క చీల ఒక అక్షరాన్ని సూచిస్తుంది. ప్రసారిణి వద్ద వోల్టా ఘటాలు రెండు డజన్ల చీలలు ఉంటాయి. ఒక గాజు పాత్రలో ఆసిడ్ కలిపిన నీళ్ళు గ్రాహకంగా పనిచేస్తుంది. ఇందులో కూడా 24 లోహపు చీలలు ఉంటాయి. ప్రసారిణిలో ఉండే చీలలను గ్రాహకంలో ఉండే చీలలతో 24 తీగలు కలుపుతాయి. ప్రసారిణి వద్ద ఒక్కొక్క అక్షరాన్ని సూచించే చీలను వోల్టా ఘటానికి కలిపితే గ్రాహకంలో చీలవద్ద హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ గాలి బుడగల రూపంలో ఉత్పత్తి అవుతుంది. ఏ ఏ చీలల వద్ద ఇలా గాలి బుడగలు బయలు దేరతాయో వాటి ఆధారంగా సందేశాల్ని తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి కాస్త క్లిష్టమైనప్పటికీ బాగానే పనిచేసింది. ఒక్ లోహం తీగలో విద్యుత్తు ప్రవహించినపుడు, దానికి దగ్గరగా ఉండే అయస్కాంత సూచిక అపవర్తనం చెందుతున్నదని కోపెన్ హేగెన్ లో ఫొఫెసర్ ఆయిర్‍స్టెడ్ కనుక్కోవటం టెలిగ్రాఫ్ పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులకు కొత్త బాట చూపింది. గాటింజన్ వేధశాల (objervatory) డైరక్టర్ గా పనిచేస్తున్న ఫ్రీడిచ్ గాన్ మ్యూనిచ్ లో సోమరింగ్ నిర్మించిన టెలిగ్రాఫ్ పరికరాన్ని చూచి, చాలా ప్రభావితుడై ఈ విభాగంలో కృషి చేయడం ప్రారంభించాడు. గొటింజన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యుడుగా పనిచేస్తున్న వెబర్ తో కలిసి వేధశాల నుంచి భౌతిక శాస్త్ర ప్రయోగశాల వరకు సుమారు రెండు మైళ్ళ దూరం తెలిగ్రాఫ్ తీగలను సంధించాడు. గ్రాహకంలో అయస్కాంత సూచికకు బదులు ఇనుప బద్దని వాడారు. ప్రసారిణి నుంచి వచ్చే తీగలో విద్యుత్తు మారినప్పుడల్లా గ్రాహకంలోని ఇనుప బద్దలో కదలికలు ఏర్పడతాయి. దీనికి ఓ చిన్న అద్దం అతికించబడి ఉంటుంది. అద్దానికి ముందు భాగంలో టెలిస్కోప్, స్కేలు ఉంటాయి. టెలిస్కోప్ లో చూచినప్పుడు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి. ఇనుపబద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్కోప్ లో చూచినప్పుడు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి. ఇనుప బద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్కోప్ లో అపవర్తనం ఏర్పడుతుంది. ఇలాంటి అపవర్తనాలలో అక్షరాలను సూచించే కోడ్ ని శాస్త్రజ్ఞులిద్దరూ తయారుచేసుకున్నారు.

వైజ్ఙానిక విషయాలను పరస్పరం అందించుకునే ఉద్దేశముతో ఈ ఏర్పాటు చేసినప్పటికీ, గణనీయమైన దూరానికి సందేశాలను పంపే మొదటి విద్యుత్ టెలిగ్రాఫ్ పరికరం ఇదే అని చెప్పవచ్చు. మైకెల్మన్ వస్తున్నాడు అనే వార్తను వాళ్ళు తొలిసారిగా ఈ పరికరం ద్వారా పంపగలిగారు. పరికరాన్ని అమర్చడంలో మైకెల్మన్ అనే మెకానిక్ శాస్త్రజ్ఞులకు తోడ్పడ్డాడు. ఈ సందేశాన్ని 40 అనువర్తనాలద్వారా పంపటం జరిగింది.

కొద్దిమంది శాస్త్రజ్ఞులకు తప్ప ఈ పరికరం నిర్మాణం అజ్ఞాతంగానే ఉండి పోయింది. దీన్ని విస్తృత ప్రాతిపదికపై అభివృద్ధి చేయాలన్న ఆలోచన వాళ్ళకెందుకో తట్టలేదు. కానీ మానవ శరీరంలో నాడీ వ్యవస్థ లాగా, ప్రపంచ దేశాలన్నింటినీ రైల్వే పట్టాలతోను, టెలిగ్రాఫ్ తీగలతోనూ కలపగలిగితే దేశాల మధ్య దూరం తగ్గడమే కాకుండా మెరుపు తీగ వేగంతో వార్తల్ని అందజేయవచ్చని వెబర్ ఒకప్పుడు మనసులో అనుకున్నాడట.

ఒకప్పుడు తన వద్ద చదువుకున్న స్టీన్ హీల్ ని నిత్యజీవితంలో ఉపయోగపడేలా టెలిగ్రాఫ్ విధానాన్ని మెరుగుపరచాలని గాస్ సలహా యిచ్చాడు. ఇనుప బద్దకు బదులుగా స్టీన్ హీల్ రెండు అయస్కాంత సూచికలను వాడి, వాటిద్వారా రెండు కలాలు కదిలేలా అమర్చాడు. కదులుతున్న కాగితం చుట్టపై ఈ కలాల వల్ల చుక్కలు ఏర్పడతాయి. 1837 లో ఈ టెలిగ్రాఫ్ విధానం మ్యూనిచ్ లో రాయల్ అకాడమీ, వేధశాలల మధ్య ఏర్పాటయింది. ఇంతలో న్యూరెంబర్గ్, ఫర్త్ నగరాల మధ్య రైల్వే మార్గం పక్కనే టెలిగ్రాఫ్ తీగలను అమర్చే పని స్టీన్ హీల్ కి అప్పగించబడింది.

ఒక తీగను మాత్రమే వాడి, విద్యుత్ వెనక్కి రావటానికి రైలు పట్టాలనే వినియోగించవచ్చునని స్టీల్ హీల్ మొదట్లో అనుకున్నాడు. కానీ ఇది కుదరలేదు. ప్రయోగాలు చేస్తున్నప్పుడు భూమి ఉత్తమ విద్యుద్వాహకంగా పనిచేస్తుందని స్టీన్ హీల్ కనుగొన్నాడు. ప్రసారిణి, గ్రాహకం రెండిటినీ వేరు వేరు లోహం బద్దలకు సంధించి, వాటిని తడిగా ఉన్న భూమిలోకి జొనిపితే రెండో తీగ అవసరం లేకుండా భూమి ద్వారా ఇవి సంధించబడతాయి.

మ్యూనిచ్ లో రష్యా రాయబారి కార్యాలయం ఉండేది. అందులో పాల్ షిల్లింగ్ అనే అధికారి పనిచేస్తుండేవాడు. ఇతనికి విజ్ఞానశాస్త్రంలో అభిరుచి ఎక్కువ. సోమరింగ్ నిర్మించిన టెలిగ్రాఫ్ నమూనాని, ఇతడు ఉదార భావాలు కలిగిన వాడైనప్పటికీ, వార్తా ప్రసార సౌకర్యాలు అభివృద్ధి చెందితే తన నిరంకుశ అధికారాలు దెబ్బతింటాయని భయపడి టెలిగ్రాఫ్ తీగలను అమర్చడం గానీ, దాన్ని గురించి వైజ్ఞానిక పత్రికల్లో రాయడం గానీ చేయరాదని షిల్లింగ్ ని ఆదేశించాడు.

కుక్-వీట్‍స్టన్ టెలిగ్రాఫ్ పద్ధతి

[మార్చు]
Cooke and Wheatstone's electric telegraph

కానీ షిల్లింగ్ మాత్రం వ్యక్తిగత అభిరుచిని వదులుకోలేక ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. 5 అయస్కాంత సూచికలతో అతడు ఓ నమూనాని తయారుచేసి 1835 లో బాన్ నగరంలో జరిగిన సైన్సు కాంగ్రెస్ సదస్సులో ప్రదర్శించాడు. దీన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న విలియం కుక్ లండను కింగ్ కళాశాలలో ఆచార్యుడుగా పనిచేస్తున్న వీట్ స్టన్ తో కలిసి పరిశోధనలు ప్రారంభించాడు. లండన్-బ్లాక్ వాల్ రైలు మార్గం వెంబడి వీళ్లిద్దరూ తొలిసారిగా ఇంగ్లండ్ లో టెలిగ్రాఫ్ తీగల్ని అమర్చారు. ఇది విజయవంతం కావటంతో రైల్వే అధికారులు పొడింగ్డన్, స్లో నగరాల మధ్య 19 మైళ్ళ పొడవునా టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించి ఇది ఎలా పనిచేస్తుందో వచ్చి చూడాలని ప్రజల్ని ఆహ్వానించారు. తీగలతో, అయస్కాంత సూచికలతో ఆడుకుంటున్న ఆపరేటర్ ల లీలలను గమనించడం తప్ప ఈ కొత్త వింతను ఏం చేసుకోవాలో ప్రజలకు పాలుపోలేదు. 1845 జనవరి ఒకటో తేదీన జరిగిన ఓ సంఘటన వాళ్ళలో సంచలనం కలిగించింది.

పాడింగ్టన్ లో పనిచేసే ఆపరేటర్ కి టెలిగ్రాఫ్ యంత్రం ద్వారా ఈ వార్త అందించబడింది. -- "సాల్టిల్ లో ఓ హత్య ఇప్పుడే జరిగింది. హంతకుడుగా అనుమానింపబడ్డ వ్యక్తి స్లో నుంచి ఉదయం 7.42 సమయానికి మొదటి తరగతి పెట్టెలో లండన్ కి బయలుదేరాడు. గోధుమరంగు కోటు కాళ్ళదాకా ధరించి, అతడు రెండో పెట్టెలో ప్రయాణం చేస్తున్నాడు."

ఆపరేటర్ వెంటనే పోలీస్ స్టేషనుకు వెళ్లి విషయం తెలియజేశాడు. పాడింగ్ టన్ స్టేషను లోకి రైలు వచ్చేసరికి మామూలు దుస్తులు ధరించిన ఇద్దరు పోలీసు అధికారులు సిద్ధంగా నిలబడి, హంతకుడిని గుర్తించి, అరెస్టు చేయగలిగారు. కోర్టులో జరిగిన విచారణ అందరిలోనూ ఉత్కంఠ లేపింది. టెలిగ్రాఫ్ సౌకర్యం వల్లనే హంతకుడిని పట్టుకోగలిగామని పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు. "టెలిగ్రాఫ్ తీగలే ముద్దాయిని ఉరి తీశాయి"—అని లండన్ ప్రజలు బాహాటంగానే చెప్పుకున్నారు.

శామ్యూల్ మోర్స్

కుక్-వీట్‍స్టన్ టెలిగ్రాఫ్ పద్ధతి ఒకే సూచికతో పనిచేసేలా నిర్మాణంలో మార్పులు చేశారు. ఈ పద్ధతి బ్రిటన్ లో చాలా కాలం వాడుకలో ఉండేది. దీనికంటే మెరుగైన పద్ధతి అమెరికాలో కనుగొనబడింది. దీన్ని కనుగొన్నవాడు విజ్ఞాన శాస్త్రజ్ఞుడు కాకుండా ఒక కళాకారుడు కావటం ఆశ్చర్యకరమైన విషయమే. కనెక్టికట్ లో ఓ చర్చి అధికారికి మోర్స్ అనే కొడుకు పుట్టాడు. అతడు చిన్నప్పటి నుండి పాఠశాలలో తనతోపాటు చదువుకునే విద్యార్థుల చిత్రపటాలను గీచి వాళ్ళనుంచి కొంత డబ్బు పొందేవాడు. 30 యేళ్ళ వయస్సు వచ్చేసరికి చిత్రకారుడుగా గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. అతడు గీసిన ప్రెసిడెంట్ మన్రో, లాఫయటీ మొదలైన నాయకుల చిత్రపటాలు ఇప్పటికీ వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లోని సార్వజనిక భవనాల్లో చూడవచ్చు. అతని భార్య చాలా అందంగా ఉండేది. ఆమె మరణానంతరం అతడు వియోగ బాధతో ఏ పనీ చేయలేకపోయాడు. మనశ్శాంతి కోసం ఐరోపా యాత్రకెళ్ళి 1832 లో తిరిగి వచ్చాడు. అప్పటికే అతడు నలభయ్యో వడిలో పడ్డాడు.

ఓడలో తిరిగి వస్తుండగా, అమెరికాకి చెందిన ఓ కుర్ర డాక్టరు విజ్ఞాన సంబంధమైన వార్తలను, తమాషాలను ముచ్చటిస్తూ తోటి ప్రయాణీకులకు వినోదం కల్పించసాగాడు. పారిస్ లో ఫొఫెసర్ ఆంపియర్ ప్రదర్శించిన విద్యుదయస్కాంతాన్ని చూసి ప్రభావితుడై అతడు వోల్టా ఘటంతో సహా ఓ విద్యుదయస్కాంతాన్ని తనతో బాటు తెచ్చాడు. ఇనుపకడ్డీ చుట్టూ తీగను చుట్టి విద్యుత్తు ప్రవహింప జేస్తే అది తాత్కాలిక అయస్కాంతంగా మారుతుందని, విద్యుత్తును ఆపివేయగానే అది మామూలు ఇనుప కడ్డీ అయిపోతుందనీ అతడు ప్రయోగం చేసి అందరికీ చూపించాడు.

ప్రయోగాలను మోర్స్ అతి జాగ్రత్తగా పరిశీలించాడు. మెరుపు తీగలా అతని మస్తిష్కంలో ఓ ఆలోచన మెరిసింది.

"విద్యుదయస్కాంత వలయంలో ఎక్కడో ఒక చోట విద్యుచ్ఛక్తి అస్తిత్వాన్ని కంటికి కనవడేలా చేయగలిగితే, సమాచారాన్ని వెంటనే ప్రసారం చేయటానికి వీలవుతుంది కదా"

అని అనుకున్నాడు. ఈ ఆలోచన రావటమే తరువాయి, కళాకారుడు యంత్ర నిర్మాతగా మారిపోయాడు.

మోర్స్ టెలిగ్రాఫ్

[మార్చు]
మోర్స్ కీ
మోర్స్ కోడ్

విద్యుచ్ఛక్తిని ఉపయోగించి సంకేతాలను ప్రసారం చేయడంలో అదివరకు జరిగిన ప్రయోగాల సంగతి మోర్స్ కేమీ తెలియదు. వివిధ దేశాల మధ్య వార్తా ప్రసారాల కోసం సమర్థవంతమైన అధునాతన పరికరాన్ని రూపొందించటం చాలా అవసరమని అతడు గ్రహించాడు. పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్ ని ఆర్థికంగా, సామాజికంగా గుర్తు తెలియకుండా మార్చివేసింది. అమెరికాలో కూడా ఇలాంటి మార్పులే వస్తున్నాయి. రవాణా సాధనాలుగా నేలమీద గుర్రం, జలమార్గాల్లో తెరచాప తెరమరుగున పడిపోయి వాటి స్థానంలో ఆవిరి శక్తి ఊపందుకుంది. శారీరక శ్రమతో నెమ్మదిగా జరుగుతున్న వస్తువుల ఉత్పత్తి రాను రాను యాంత్రిక పరికరాలు వాడటంతో అనేక రెట్లు పెరిగింది. పరిశ్రమల్లో పెట్టుబడి ఎక్కువైంది. అధిక లాభాలను పొందాలంటే వస్తువులను వివిధ దేశాలకు ఎగుమతి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నిత్య జీవితంలో మార్పులు చాలా త్వరగా ఏర్పడుతూ వచ్చాయి. కానీ వార్తా ప్రసారం మాత్రం నత్తనడకలా మునుపటి లాగా సాగుతుండేది. చావ్ టెలిగ్రాఫ్ విధానం సామాన్యులకు అందుబాటులో లేనంత దుబారాగా ఉండేది. పైగా అందులో ఉపయోగించే కోడ్ ని ఎవరైనా సులభంగా తెలుసుకోగలిగేలా ఉండేది.

సముద్ర ప్రయాణంలో మోర్స్ ఈ సమస్యను గురించే తీవ్రంగా ఆలోచిస్తూ, మనసులో మెదిలిన ఆలోచనల్ని నమూనాల రూపంలో ఓ పుస్తకంలో రాసి పెట్టాడు. న్యూయార్క్ చేరాక తీరిక దొరికినప్పుడల్లా టెలిగ్రాఫ్ పరికరం తయారుచేయాలని ప్రయత్నించాడు. చిత్ర పటాలను గీసేటప్పుడు వాడే కొయ్య చట్రం, చెడిపోయిన గడియారంలోని చక్రాలు, ఒక చిన్న బాటరీ, స్వహస్తంతో తయారుచేసిన ముతకరకం విద్యుదయస్కాంతం -- వీటితో కొన్ని వారాలు తంటాలు పడి టెలిగ్రాఫ్ పరికరాన్ని సిద్ధం చేశాడు. అది అనుకున్నంత సమర్థవంతంగా కాకపోయినప్పటికీ, తక్కువ దూరాల్లో బాగా పనిచేసింది. బాటరీలో విద్యుత్ ఘటాల సంఖ్యను పెంచినప్పటికీ, సంకేతాలు 50 అడుగుల దూరం కంటే ఎక్కువ వెళ్ళలేక పోయాయి. అంటే దూరం ఎక్కువైతే విద్యుత్ ప్రవాహం చాలా తగ్గిపోయేది.

ఈ మొరటు నమూనాతోనే సుమారు రెండేళ్ళ వరకూ మోర్స్ శ్రమించాడు. హఠాత్తుగా ఓ రోజు మెరుపులా మరో ఆలోచన తట్టింది. తపాలా సర్వీసు ప్రారంభించిన తొలి రోజుల్లో తపాలా సంచులను మోయటానికి గుర్రాలను వినియోగించేవారు. గుర్రాలు అలసిపోయినప్పుడు వాటికి విశ్రాంతి ఇచ్చి, వేరే గుర్రాలను బండికి జోడించటానికి కొన్ని ప్రత్యేక స్థానాలను నిర్ణయించి ఉంచేవారు. ఇలా అంచెల వారీగా తపాలా సంచులను తీసుకెళ్ళే పద్ధతిని రిలే పద్ధతి అనేవారు. ఇలాంటి పద్ధతిని టెలిగ్రాఫ్ సాధనంలో ప్రవేశపెట్టాలని మోర్స్ నిశ్చయించాడు. మొదటి దశలో విద్యుత్ ప్రవాహ రూపంలో ఉండే సంకేతాలు సుమారు 40 అడుగుల దూరం వెళ్ళాక బలహీనమవుతుందని ఇదివరకే తెలుసుకున్నాం. ఈ దశలో చిన్న విద్యుదయస్కాంతాన్ని అమర్చి, ఇది ఓ ఇనుప ముక్కను ఆకర్షించేలా చేస్తే, మరో బాటరీ సహాయంతో రెండో దశలో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఇది మరో 50 అడుగుల దూరం దాకా వెళ్లగలుగుతుంది. అక్కడ మూడో దశను అమర్చవచ్చు. ఇలా చేస్తూ పోతే విద్యుత్ సంకేతాలు ఎంత దూరమైనా వెళ్ళడానికి వీలవుతుంది.

ఇంతలో అతనికి న్యూయార్క్ నగర విశ్వవిద్యాలయంలో చిత్రలేఖనంలో ప్రొఫెసరుగా ఉద్యోగం దొరికింది. తాను నిర్మించిన సాధనాన్ని ఓ రోజు విద్యార్థుల ముందు ప్రదర్శించాడు మోర్స్. ఆల్‍ఫ్రెడ్‍ వైల్ అనే విద్యార్థి ధనవంతుడైన తన తండ్రి వద్ద నుండి ఈ ప్రయోగశాల కోసం కొన్ని వేల డాలర్లను సమకూర్చిపెట్టాడు. డబ్బు ఇబ్బంది లేకపోవటంతో పరిశోధనలు నిర్విరామంగా, నిరాఘాటంగా కొనసాగాయి. నిర్మించిన కొత్త టెలిగ్రాఫ్ నమూనాని 1837 సెప్టెంబర్ 4 వ తేదీన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మోర్స్ ప్రదర్శించాడు. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరచడానికి "కీ" అనే కొత్త సాధనాన్ని మోర్స్ అందులో అమర్చాడు. దాన్ని మోర్స్ కీ అంటారు. అమెరికా జలసేన ఉపయోగించే కోడ్ సహాయంతో ఈ క్రింది వార్తను మోర్స్ తీగల ద్వారా ప్రసారం చేశాడు.. ---"టెలిగ్రాఫ్ విజయవంతమైన ప్రయోగం -1837 సెప్టెంబర్ 4" --- కానీ ఇంతకంటే సరళమైన కోడ్ ని తయారుచేస్తే గాని ఇది ప్రజలకందరికీ ఉపయోగపడదని మోర్స్ గ్రహించాడు.

మోర్స్ కోడ్

[మార్చు]

చిన్న సంకేతాలను డాట్ (Dot) అనీ, దీనికంటే ఎక్కువ కాలవ్యవధి ఉండే సంకేతాలను డాష్ (Dash) అనీ పేరు పెట్టి, వీటిద్వారా ఇంగ్లీషు భాషలోని అక్షరాలకు, సంఖ్యలకూ, విరామ చిహ్నాలకు, సంకేతాలను తయారుచేశాడు. దీన్ని తయారు చేయటంతో మోర్స్కి వైల్ ఎంతగానో సహాయ పడ్డాడు. ఉదాహరణకి ఇలా ప్రామాణీకరించిన కోడ్ లో 'e' అనే అక్షరాన్ని "డాట్", 't' అనే అక్షరాన్ని "డాష్" సూచిస్తాయి. ఈ సంకేతాలను మోర్స్ కోడ్ అంటారు. దీన్ని 1838 జనవరి 24 వ తేదీన విశ్వవిద్యాలయంలో ప్రకటించారు.

మోర్స్ టెలిగ్రాఫ్ కు అవరోధాలు

[మార్చు]

కొత్త వార్తా ప్రసార సాధనం కోసం అర్రులు చాచి నిరీక్షిస్తున్న ప్రపంచం టెలిగ్రాఫ్ ఆవిర్భావానికి జేజేలు పలుకుతుందనీ, తన కష్టాలు గట్టెక్కాయని మోర్స్ అనుకున్నాడు గానీ ముందున్న ముసళ్ళ పండగను ఊహించలేదు. టెలిగ్రాఫ్ పరికరాన్ని గురించి ఓ నివేదికను అమెరికా కాంగ్రెస్ కి సమర్పించాడు. వాషింగ్టన్ నుంచి బాల్టిమోర్ దాకా టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించటానికి 30,000 డాలర్ల మంజూరు కోసం ప్రతిపాదించిన బిల్లు మరుసటి కాంగ్రెస్ సమావేశంలో సిద్ధంగా ఉంచబడింది. తమ బతుకు తెరువు దెబ్బ తింటుందనే కారణంగా, తపాలా శాఖ లోని అధికారులందరూ టెలిగ్రాఫ్ సౌకర్యాన్ని ప్రతిఘటిస్తున్నారని పాపం మోర్స్ కి తెలియలేదు. ఇతర దేశాల్లో టెలిగ్రాఫ్ పట్ల అభిరుచి కలిగించటానికి, అతడు ఐరోపాకి బయలుదేరాడు. కానీ అక్కడ కూడా చుక్కెదురైంది. బ్రిటన్ లో కుక్-వీట్‍స్టన్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఫ్రాన్స్ అనుమతి ఇచ్చింది గానీ పని సజావుగా జరగడానికి వీలులేనన్ని కఠిన షరతులను విధించింది. రష్యా ప్రభుత్వ ఛాన్సలర్స్ తో టెలిగ్రాఫ్ సౌకర్యాలు కల్పించటానికి మోర్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. కానీ ఈ విషయం నికోలన్ చక్రవర్తికి తెలియగానే ఒప్పందం ప్రతిని చించివేసి గావు కేక పెట్టాడు. --"టెలిగ్రాఫ్ స్తంభాలను నాటడమే ఆలస్యం, రాజభక్తులు వాటిని పడగొడతారు. ఆ తీగల్లో ఏదో దెయ్యం ఉందన్న కారణం కావచ్చు, లేదా వంట కట్టెలు కోసం కావచ్చు."---

మోర్స్ అమెరికాకి తిరిగి వచ్చేసరికి ఆర్థిక సంక్షోభం మొదలైంది. తపాలాశాఖ అధ్యక్షుని కోరికపై బిల్లు కాంగ్రెస్ లో వీగిపోయింది. మోర్స్ ప్రతిపాదించిన కొత్త ముసాయిదాను కాంగ్రెస్ తిరస్కరించింది. తనకు చేదోడు వాదోడుగా, నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన ఆల్‍ఫ్రెడ్ కూడా టెలిగ్రాఫ్ గురించి తల బద్దలు కొట్టుకోకుండా చిత్రలేఖనంతో సరిపెట్టుకోవాలని మోర్స్ కి సలహా యిచ్చాడు. ఏళ్ళు గడిచిపోయాయి. హతాశుడైన మోర్స్ తుది అభ్యర్థనగా కాంగ్రెస్ కి ఇలా నివేదించాడు. --- "సంతృప్తి కరమైన జవాబు రాకపోతే టెలిగ్రాఫ్ ని శాశ్వతంగా వదిలేసి, శాశ్వతంగా బొమ్మలు గీసుకుంటూ కాలం గడుపుతాను." ---

కట్ట కడపటికి 1843 మార్చిలో మోర్స్ బిల్లు కాంగ్రెస్ లో ప్రతిపాదించబడింది. సమావేశం బహు నాటకీయంగా మరుసటి రోజు తెల్లవారు జాముదాకా జరిగింది. కాంగ్రెస్ లో జరుగుతున్న వాదోప వాదాలను గ్యాలరీలో కూర్చొని వింటున్న మోర్స్ కి బిల్లు వీగిపోయే సూచనలు కనబడగానే అర్థరాత్రి రైలులో న్యూయార్క్ కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళే సరికి అతని వద్ద 27 సెంట్లు మాత్రమే మిగిలాయి. మరుసటి రోజు ఏకాంతంగా గదిలో కూర్చున్న మోర్స్ దగ్గరికి ఓ మిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. "89-83 ఓట్లతో బిల్లు ఆమోదించబడింది. నీవు గెలిచావు."

మోర్స్ టెలిగ్రాఫ్ ప్రారంభం

[మార్చు]

వాషింగ్టన్, బాల్టిమోర్ మధ్య పని వెంటనే ప్రారంభమైంది. ఓ ప్రముఖ వాణిజ్య సంస్థ ప్రతినిధి, ఎజ్రా కార్నెల్ రాగితీగలను సరఫరా చేశాడు. (కొన్నేళ్ళ తరువాత బాగాడబ్బు సంపాదించి తన జన్మస్థలంలో కార్నెల్ విశ్వవిద్యాలయం స్థాపించాడు) తపాలా శాఖ అధ్యక్షుడు శక్తి వంచన లేకుండా అనేక అంతరాయాలు కలిగించాడు. అతని మనుషులు రాత్రిపూట తీగలు తుంచివేసేవారు. నాటిన స్తంభాలను పడగొట్టేవారు. పనిచేస్తున్న కార్మికులను బెదిరించటానికి గాలిలో కాల్పులు జరిపేవారు. ఈ విధ్వంసక చర్యలను ఎదుర్కోవటానికి మోర్స్, వైల్ ఇద్దరూ రంగంలోకి దిగారు. విధ్వంసకాండకు కారకులైన వాళ్ళపై ఋజువులతో సహా అమెరికా అధ్యక్షునికి వినతి పత్రం సమర్పించారు. ఫలితంగా తపాలా శాఖ అధ్యక్షుడు రాజీనామా చేశాడు.

1844 మే 24 వ తేదీన "భగవంతుడు ఏం చేశాడు" (What hath god wrought) అనే సందేశం టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారమైనది. కానీ సామాన్య ప్రజలు దీన్ని పట్టించుకోలేదు. ఇంగ్లండులో జరిగినట్టుగానే కాకతాళీయంగా జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల టెలిగ్రాఫ్ అమాంతంగా ప్రచారంలోకి వచ్చింది. అధ్యక్ష పదవికి అభ్యర్థులను నిర్ణయించటం కోసం డమోక్రాటిక్ పార్టీ, బాల్టిమోర్ లో సమావేశం ఏర్పాటు చేసింది. అమెరికా 11 వ అధ్యక్షుడుగా పోటీ చేయడానికి జేమ్స్ నాక్స్ పోక్‍ నీ, ఉపాధ్యక్ష అభ్యర్థిగా సిలాన్ రైట్ నీ సమావేశం ఎన్నుకుంది. ఈ వార్తను వైల్ టెలిగ్రాఫ్ ద్వారా వాషింగ్టన్ కు చేరవేసే సరికి రైట్ కాంగ్రెస్ సభ చర్చల్లో పాల్గొంటున్నాడు. మోర్స్ స్వయంగా సందేశాన్ని రైట్ కి అందించాడు. పోటీలో పాల్గొనటం తనకిష్టం లేదని రైట్ ప్రకటించగానే మోర్స్ ఈ సమాచారాన్ని బాల్టిమోర్ కి పంపించాడు. ఉపాధ్యక్ష పదవికి రైట్ ని ఆమోదించి అరగంట గడవక ముందే అతడు అంగీకరించడం లేదన్న వార్తను డెమోక్రాటిక్ పార్టీ సమావేశంలో ప్రకటించేసరికి అందరూ దిగ్భ్రాంతులయ్యారు. వార్తను నమ్మలేక సతమతమవుతున్న సందర్భంలో, వాషింగ్టన్ నుంచి పార్టీ ప్రత్యేక దూత వచ్చి రైట్ తిరస్కృతిని ఆధికారికంగా తెలియజేశాడు. దీంతో మోర్స్ కనుగొన్న టెలిగ్రాఫ్ సాధనానికి అనన్య ప్రచారం లభించింది. పన్నెండేళ్ళ నిరంతర కృషి, నిరాశా నిస్పృహలు, యాతనలు ముగిశాయి. అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది. డాష్, డాట్ లతో కూడిన కొత్త టెలిగ్రాఫ్ భాష జైత్ర యాత్రకు బయలుదేరింది.

మహా సముద్రాలలో టెలిగ్రాఫ్ తీగలు

[మార్చు]
Major telegraph lines in 1891

అనేక ఐరోపా దేశాలు మోర్స్ టెలిగ్రాఫ్ విధానాన్ని ఆమోదించాయి. హాంబర్గ్, కక్స్ హావన్ మధ్య తొలిసారిగా 1848 లో టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించబడింది. మూడేళ్ళ తరువాత ఇంగ్లీషు ఛానెల్ లో టెలిగ్రాఫ్ తీగలు అమర్చ బడ్డాయి. 1858 లో ఇంగ్లండ్ శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్ అధ్వర్యంలో బ్రిటన్, అమెరికా దేశాల మధ్య టెలిగ్రాఫ్ సంబంధాలు నెలకొల్పబడ్డాయి. 1872 లో మోర్స్ చనిపోయే నాటికి ప్రపంచమంతటా టెలిగ్రాఫ్ సౌకర్యం విస్తరిల్లింది. అతడు సృష్టించిన కొత్త భాష అనేక దేశాల టెలిగ్రాఫ్ కార్యాలయాల్లో ప్రతిధ్వనించసాగింది.

వైర్‍లెస్ టెలిగ్రాఫ్

[మార్చు]

నికోలా టెస్లా, మరికొంతమంది శాస్త్రజ్ఞులు, ఆవిష్కర్తలు 1890 సంవత్సర ప్రారంభంలో వైర్‍లెస్ టెలిగ్రాఫ్, రాడియో టెలిగ్రాఫ్ లేదా రేడియో యొక్క ఉపయోగములను తెలియజేశారు. అలెగ్జాండర్ స్టెపనోవిచ్ పోవోవ్ తాను రూపొందించిన కాంతి శోధకంతో కూడిన వైర్‍లెస్ గ్రాహకమును ప్రదర్శించాడు.[1] 1895 మే 7 న తాను రూపొందించిన తంతిలేని గ్రాహకం (Wireless receiver) ని విలేకరుల సమావేశంలో గర్వంగా ప్రదర్శించాడు.ఇది 30 అడుగుల స్తంభమునకు తగిలించబడి సంకేతాలను వృద్ధిచేస్తుంది. ఆ విలేకరులలో ఒకరు తుపానులో కూడా ఈ లోహపు కడ్డీని ఉంచడం మంచి ఆలోచనేనా అని అడిగినపుడు ఇది చాలా మంచిది అని సమాధానమిచ్చాడు. మెరుపులతో కూడిన పిడుగు తగిలిన తర్వాత కూడా తన ఆవిష్కరణ మెరుపులను గుర్తిస్తుందని గర్వంగా ప్రకటించాడు.

1895 లో ఫ్రాన్స్లో ఆల్బెర్ట్ టర్‍పైన్ అనే శాస్త్రజ్ఞుడు మోర్స్ కోడ్ ఉపయోగించి 25 మీటర్ల దూరం వరకు రేడియో సంకేతాలను ప్రసారం, గ్రహించడం చేశాడు..[2]

Post Office Engineers inspect Marconi's equipment on Flat Holm, May 1897

1897, మే 17ఇటలీలో మార్కోనీ అనే శాస్త్రజ్ఞుడు 6 కి.మీ వరకు రేడియో సంకేతాలను పంపించగలిగాడు. మార్కోనీ కాడిఫ్ తపాలా కార్యాలయ ఇంజనీరు యొక్క సహకారంతో మొదటి వైర్‍లెస్ సంకేతాలను నీటి పైనుండి లివర్‍నాక్ నుండి వేల్స్ వరకు ప్రసారం చేయించాడు.[3] ఇటలీ ప్రభుత్వము దీనిపై శ్రద్ధ కనబరచక పోవటంతో 22 యేండ్ల ఆవిష్కర్త తాను రూపొందించిన తంతి విధానాన్ని (టెలిగ్రాఫీ) బ్రిటన్ కు తీసుకుని వెళ్ళి అచట జనరల్ తపాలా కార్యాలయం యొక్క ఛీఫ్ ఇంజనీర్ అయిన విల్లియం ప్రీస్ను కలిశాడు. 34 మీటర్ల పొడవు గల రెండు స్తంభములను లీవెన్ హాక్, ప్లాట్ హోం ల వద్ద నిలపడం జరిగింది. లీవిన్ హాక్ వద్ద గ్రాహకం కలిగిన 30 మీటర్ల స్తంభముపై స్థూపాకార మూత జింకుతో, శోధకం విద్యుద్బంధక రాగితీగతో ఉంచడం జరిగింది. ఫ్లాట్ హోం వద్ద ప్రసారం యొక్క వ్యవస్థ రుహ్ం కాఫ్ కాయిల్, ఎనిమిది బ్యాటరీలతో కూడినట్లు అమర్చాడు. మే నెల 11,12 తేదీలలో జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ మే 13 న లీవెన్ హాక్ వద్ద నిలకొల్పిన స్తంభం ఎత్తును 50 మీటర్ల ఎత్తుకు పెంచినపుడు మోర్స్ కోడ్ లో గల సంకేతాలు స్పష్టంగా గ్రహింపబడినవి. మొదటి సందేశం --" నీవు సిద్ధంగా ఉన్నావా"-- ("ARE YOU READY") ;

1898 లో తంతి రహిత ప్రసారాన్ని పోపోవ్ అనే శాస్త్రజ్ఞుడు నేవల్ కేంద్రం నుండి యుద్ధ నౌకకు విజయవంతంగా పంపించగలిగాడు.

1900 లో రష్యా సముద్ర తీర రక్షక నౌక "జనరల్ అడ్మిరల్ గ్రాఫ్ ఆప్రాక్‍సిన్" యొక్క సిబ్బంది తీరంనుండి వెళ్లిన జాలరివాళ్ళను గల్ఫ్ ఆఫ్ ఫిన్‍లాండ్ వద్ద రక్షించగలిగారు. దీనికి కారణం హాగ్‍లాండ్ ద్వీపం, రష్యా లోని కోట్కా లోని నావల్ బేస్ కు మధ్య జరిగిన టెలిగ్రాం ల బదిలీవలన. ఈ రెండు కేంద్రాలలో కూడా పోపోవ్ యొక్క సూచనల ప్రకారం తంతి రహిత ప్రసారం యేర్పాటు చేయబడింది.

టెలిగ్రాఫ్ వ్యవస్థలో మార్పులు

[మార్చు]

మోర్స్ విధానాన్ని అమెరికాలో థామస్ అల్వా ఎడిసన్, జర్మనీలో వెర్నర్ సీమెన్స్, ఇంగ్లండ్ లోఆయన సోదరుడు విల్లియం మెరుగుపరచారు. అతని మరో సోదరుడు కార్ల్ కృషి వల్ల రష్యాలో టెలిగ్రాఫ్ పట్ల ఉండే అపోహలు వైదొలిగాయి. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తమ రాజభవనానికి మాత్రం టెలిగ్రాఫ్ సౌకర్యాన్ని కల్పించడానికి జార్ అనుమతి ఇచ్చాడు. కానీ తీగలు బయటి నుంచి ఎవరికీ కనబడరాదన్న షరతును విధించాడు. కార్ల్ సీమెన్స్ అతని అభీష్టం మేరకు నీటి గొట్టాల పక్క న తీగ అమర్చాడు. దీంతో ప్రభావితుడైన జార్ రష్యా అంతటా టెలిగ్రాఫ్ తీగల ఏర్పాటుకు అంగీకరించాడు.

లండనులో జన్మించిన డేవిడ్ ఎడ్వర్డ్ హగ్స్ అనే సంగీత శాస్త్రజ్ఞుడు మోర్స్ కోడ్ తో నిమిత్తం లేకుండా అక్షరాలను, అంకెలను నేరుగా ప్రసారం చేయగలిగిన టెలిగ్రాఫ్ యంత్రాన్ని నిర్మించాడు. పియానోలో ఉన్నట్టుగా ఇందులో ఒకకీ బోర్డు ఉంటుంది. 52 కీ.లు ఉంటాయి. ఒక్కొక్క కీని అదిమినపుడు దానికి అనుగుణంగా ఉండే అక్షరం అవతలి పట్టణంలో ముద్రించబడుతుంది. ప్రస్తుతం మనం విస్తృతంగా వాడుతున్న టెలిప్రింటర్ ఈ సాధనం నుండే తయారుచేయబడింది.

విద్యుత్ టైప్‍రైటర్ లాగ కనిపించే టెలిప్రింటర్ ఒక్కొక్క సంకేతాన్ని సమాన కాలవ్యవధులలు ఉండే ఐదు విద్యుత్ స్పందనల రూపంలో ప్రసారం చేస్తుంది. ఈ స్పందనల సముదాయాన్ని, రిసీవర్ టైప్ రైటర్ అక్షరాలుగా మార్చి టైప్ చేస్తుంది. అనేక దేశాల్లో పాత నమూనా టెలిగ్రాఫ్ యంత్రాల స్థానే టెలిప్రింటర్ లు వచ్చాయి. టెలిఫోన్ లాగ మనకు కావలసిన సంఖ్యను డయల్ చేసి సందేశాలను టెలిప్రింటర్ ద్వారా పంపడానికి ఇప్పుడు వీలవుతోంది.

నాగరికత అభివృద్ధి చెందటంలో టెలిగ్రాఫ్ ఎలాంటి కీలక పాత్ర ధరించిందో, జీవిత విధానంలో ఎలాంటి మూలభూతమైన మార్పులు తీసుకొచ్చిందో ఇదంతా మానవ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. దీని కారణంగా సువిశాల ప్రపంచం కుంచించుకు పోయింది. వార్తలు క్షణాల్లో ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. కాలం, దూరం, అత్యల్పమై పోయాయి. మంచికో, చెడ్డకో ప్రపంచ దేశాలన్నీ టెలిగ్రాఫ్ తీగలతోనూ, కేబుల్స్ తోను అవినాభావంగా బంధించబడ్డాయి.

విశేషాలు

[మార్చు]
  • 1845 జనవరి ఒకటిన ఓ హత్య జరిగింది. ‘‘సాల్టిల్‌లో ఓ హత్య జరిగింది. హంతకుడు స్లో అనే ప్రాంతంలో రైలు ఎక్కాడు. గోధుమ రంగు కోటు ధరించి ఉన్నాడు’’ అనే టెలిగ్రాఫ్‌ ద్వారా పోలీస్‌ స్టేషను‌కు సమాచారం ఇలా అందింది. అప్రమత్తమైన పోలీసులు హంతకుడి పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష వేసింది. టెలిగ్రాఫ్‌ తీగలే ఉరితీశాయని ప్రజలు బాహాటంగా చెప్పుకున్నారు.
  • తొలిసారిగా 1848లో హాంబర్డ్‌, కక్స్‌ హావన్‌ మధ్య మోర్స్‌ టెలిగ్రాఫ్‌ సౌకర్యం ఏర్పాటయింది.
  • 1895లో ఫ్రాన్స్‌ లో ఆల్బెర్ట్‌ టర్‌పైన్‌ అనే శాస్తజ్ఞ్రుడు మోర్స్‌ కోడ్‌ ఉపయోగించి 25 మీటర్ల దూరం వరకు రేడియో సంకేతాలను ప్రసారం, గ్రహించడం చేశాడు.
  • 1897, మే 17న ఇటలీలో మార్కోనీ అనే శాస్తజ్ఞ్రుడు 6 కి.మీ వరకు రేడియో సంకేతాలను పంపించగలిగాడు. మార్కోనీ కాడిఫ్‌ తపాలా కార్యాలయ ఇంజనీర్‌ సహకారంతో మొదటి వైర్‌లెస్‌ సంకేతాలను నీటి పైనుండి లివర్‌నాక్‌ నుండి వేల్స్‌ వరకు ప్రసారం చేయించాడు.
  • మన దేశంలో 1902లో సాగర్‌ ఐలాండ్స్‌, సాండ్‌ హెడ్‌‌‌‌స మధ్య మొట్టమొదటి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ కేంద్రం ప్రారంభం అయింది.
  • సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని తమ రాజ భవనానికి మాత్రం టెలిగ్రాఫ్‌ సౌకర్యాన్ని కల్పించడానికి జార్‌ అనుమతి ఇచ్చాడు. కానీ తీగలు బయటి నుంచి ఎవరికీ కనబడరాదన్న షరతును విధించాడు. కార్ల్‌ సీమెన్స్‌ అతని అభీష్టం మేరకు నీటి గొట్టాల పక్కన తీగ అమర్చాడు. దీంతో ప్రభావితుడైన జార్‌ రష్యా అంతటా టెలిగ్రాఫ్‌ తీగల ఏర్పాటుకు అంగీకరించాడు.
  • 1850 : మొట్టమొదటి టెలిగ్రాఫ్‌ లైన్స్‌ కలకత్తా నుంచి డైమండ్‌ హార్బర్‌ వరకు ప్రారంభమయ్యాయి.
  • 1851 : ఈస్ట్‌ ఇండియా కంపెనీ అవసరాల కోసం టెలిగ్రాఫ్‌ విధానం అందుబాటులోకి వచ్చింది.
  • 1853 : టెలిగ్రాఫ్‌ కోసం ప్రత్యేక విభాగం ఏర్పడింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
  • 1854 : దేశం మొత్తం మీద నాలుగు వేల మైళ్ల టెలిగ్రాఫ్‌ లైన్లు నిర్మాణం జరిగింది.
  • 1885 : ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం అమల్లోకి వచ్చింది.
  • 1902 : సాగర్‌ ఐలాండ్‌, శాండ్‌ హెడ్‌ ల మధ్య తొలి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ స్టేషను‌ ఏర్పాటైంది.
  • 1927 : ఇండియా, యుకె మధ్య రేడియో టెలిగ్రాఫ్‌ వ్యవస్థ ప్రారంభమైంది.
  • 1995 : భారత్‌లో ఇంటర్నెట్‌ వ్యవస్థ ఆరంభం.


2013, జూలై 15 :Closing Day of Telegraph in India, ఇండియాలో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడిన రోజు

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]
  1. Watson Jr., Raymond C. (2009). Radar Origins Worldwide: History of Its Evolution in 13 Nations Through World War II. Trafford Publishing. ISBN 1-4269-2110-1., Extract of page 278
  2. "Raconte-moi la radio: Albert TURPAIN". Pierre Dessapt. Archived from the original on 2009-06-20. Retrieved 2009-05-07.
  3. "Marconi: Radio Pioneer". BBC South East Wales. Archived from the original on 2012-07-22. Retrieved 2008-04-12.
"https://te.wikipedia.org/w/index.php?title=తంతి&oldid=3269079" నుండి వెలికితీశారు