తప్పెటగుళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తప్పెటగుళ్ళు, ఉత్తరాంధ్ర యాదవుల కళారూపం. ఈనాటికీ పల్లె గ్రామాలలో నాగరికతకు దూరముగానున్న గొల్ల కులస్థులు ప్రదర్శించే తప్పెటగుళ్ళు కొన్ని వందలు సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఈ కళారూపాన్ని కాపాడుకొస్తున్నారు. కోనారులు, యాదవులు, గొల్లలుగా పిలువబడే ఈ కులస్థులు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఈ నాటికీ మేకలు, గొర్రెల మందలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విద్యకు దూరమై పొద్దంతా గొర్రెలను, మేకలను పొలాలలోను, అడవులలోనూ మేపుతారు. రాత్రిపూట మందలవద్ద గొర్రెలకు కాపలా కాస్తుంటారు. వీరు ఒంటరితనాన్ని మరచిపోవడానికి వీరు నోట నుండి అనేక రకాలైన పాటలు వస్తుంటాయి. కుటుంబాలకు దూరంగా, రాత్రి పూట మందకాపలా సమయంలో వీరు ఈ తప్పెటగుళ్ళుపాట, గొల్లచెరువు మొదలైన పాటలను, కాటమరాజు కథలు పాడుతుంటారు.

ఉత్తరాంధ్రలో

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, జిల్లాలలో తప్పెట గుళ్ళు కళారూపం ప్రచారంలో ఉంది. ఇది సంప్రదాయ నృత్యం. గొల్ల కులానికి చెందిన వారు ఎక్కువగా చేస్తూ వుంటారు. వారికి పశువులూ, గొఱ్ఱెలూ, మేకల మందలూ ఎక్కువ. వర్షాలు పడక పశు గ్రాసానికి కూడా కష్టమై నప్పుడు భగవంతుని కటాక్షంకోసం చేసే దేవతా రాధనలో ఈ తప్పెట గుళ్ళు ప్రముఖ స్థానం వహిస్తాయంటారు.ముఖ్యంగా యాదవులు జరిపే గంగ జాతర దశావతారాలు ముఖ్య మైనవి. కాటమ రాజు భార్య గంగమ్మ, పార్వతీ దేవి శివుని ఆజ్ఞ మేరకు కాటమ రాజు భార్యగా జన్మించిందనీ, ఆ గంగమ్మ యాదవ కులానికి ఆరాద్య దేవత అనీ, యాదవుల నమ్మకం. శివుని దర్శించిన భక్తు లందరికీ అన్ని వాయిద్యాలనూ ఇచ్చి వేయగా మిగిలి పోయిన తప్పెట గుళ్ళను మాత్రం మిగిలిని యాదవులకు ఇచ్చారని వారి కథనం. తప్పెట గుళ్ళు రొమ్ముకు వ్రేలాడే తట్ట్లు కట్టు కుంటారు. రొమ్ము మీదే ఆ వాయిద్యం తప్పెట గుళ్ళు:

నాడు అశేష ఆంధ్ర ప్రజా సామాన్యాన్ని ఉర్రూతలూగించిన వారి ఉత్సాహ ఉద్వేగాలతో, ఉద్రేక పరచి ఆనంద డోలికలలో ఊగులాడించిన రాజాధి రాజులతో పాటు సామాన్య ప్రజలను మెప్పించి, వారి మన్ననలు పొంది, రంగ రంగ వైభోగంగా వారి జీవితాలలో జీవించి, వారి వారి జీవితాలను తీర్చి దిద్దిన నాతి జానపద కళా రూపాలతో పాటు తపెటగుళ్ళు అనే విశిష్ట సంగీత నృత్య కళా రూపం. ఈ నాడు అక్కడక్కడా కనిపిస్తూ కొన వూపిరితో కొట్టు కుంటూ దిక్కూ తెన్నూ లేక ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంది.

కళింగ కళారూపమిద

[మార్చు]

అది ఆ నాటి కళింగాంధ్ర దేశంలో ఉత్తమ కళారూపంగా వెలుగొందిన జానపద కళారూపం. అది ఈనాడు కను మరుగై పోతూ ఉంది. ఈనాడు ఉత్తరాంధ్ర దేశంలో పల్లెటూళ్ళలో పల్లె ప్రజలు పోషణతో సంరక్షింపబడుతూ ఉంది. ప్రతి ఏటా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్లలోనూ పండుగ దినాల్లోనూ ఉత్సాహంగా ప్రదర్శింపబడుతూ ఉంది. తప్పెట గుళ్ళు జానపద సంగీత నాట్య దృశ్య రూపకం, రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెట లాంటి ఒక వాయిద్య పరికరాన్ని రొమ్ములపై కట్టుకుని రెండు చేతులతోనూ వివిధ గతులలో ఉధృతంగా వాయిస్తూ, కాళ్ళకు గజ్జెలు కట్టి ఒకే విధమైన రంగుల నిక్కర్లను తొడిగి, కేకలతో రూపాలతో కేరింతాలు కొడుతూ, ఆనందంతో వలయాకారంగా తిరుగుతూ కట్టు దిట్తమైన శాస్త్రీయ మైన అడుగులతో అందరూ వంగుతూ, లేస్తూ, గెంతుతూ, సుదీర్ఘ రాగాలతో ఆలాపన చేస్తూ మృదు మధుర మైన సంగీతంతో మధురంగా పాటలు పాడుతూ ప్రేక్షకులను రంజింప చేస్తారు.


చరిత్ర

[మార్చు]

తప్పెటగుళ్ళూ పాట మొదట శ్రీకాకుళం జిల్లా లోనే పుట్టిందంటారు. అయినా ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలవరకు విస్తరించింది. గొల్లలు ఎక్కువగా ఉండే ప్రతి గ్రామంలో తప్పెటగుళ్ళు బృందం ఒకటి ఉంటుంది. ఇప్పటికీ ఈ నాలుగు జిల్లాల్లో పెద్ద పెద్ద బృందాలు ఇక ఎన్ని ఉంటాయో చెప్పలేము. అయితే ఇది ఏ జిల్లాలో పుట్టినా గొల్లవారి నోటిలో గొల్లవారి మందలలో పుట్టిందనేది నిజం. దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రదర్శనా విధానం

[మార్చు]

తప్పెట గుళ్ళను ప్రదర్శించేటప్పుడు వీరు రంగురంగుల బనియన్లు ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకొని ఒకే విధమైన రంగు రంగుల నిక్కర్లను తొడిగి, లంగోటి లాంటి గోచీలను ధరించి, రేకుతో గుండ్రంగా తయారుచేసిన తప్పెటగుండెను గుండెకు కట్టుకొని రెండు చెతులతో వివిధ గతులలో ఉధృతంగా వాయిస్తారు. కేకలతో, అరుపులతో కేరింతలు కొడుతూ, ఆనందంగా గుండ్రంగా తిరుగుతూ శాస్త్రీయమైన అడుగులతో అందరూ గంతులేస్తూ, గెంతుతూ సుదీర్ఘ రాగాలతో ఆలాపన చేస్తూ తప్పెటలను కొడుతూ పాటలు పాడతారు.

జట్టు నాయకుని ఆట, మాట ప్రకారమే ప్రదర్శన జరుగుతుంది. వీరి ముఖాలను చూస్తే వీరందరూ నిరక్షరాస్యులేనని ఇట్టే చెప్పేయవచ్చు. కొంత మందికీ పొడవైన జుట్టులుంటాయి. మరికొంత మంది గోచీలను కూడా కట్టుకుంటారు. వీరు నాగరికతకు దూరంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనం.లయబద్ధంగా నృత్యం చేసే ఈ బృందాలలో పదిహేను నుండి 20 మంది వరకూ ఉంటారు. తాళం, లయ తప్పకుండా, క్రమం తప్పకుండా వలయాకారంలో తిరుగుతూ వీరు చేసే నృత్యం కన్నులపండుగగా ఉంటుంది.

జట్టు నాయకుడే గురువు

[మార్చు]

తప్పెట గుళ్ళు బృందానికి ఒక నాయకుడు వుంటాడు.అతనే ఆ బృందానికి గురువు. నాయకుని చెప్పు చేతల్లో ప్రదర్శనం సాగుతుంది. కేవలం తప్పెట గుళ్ళతో నృత్యం చెయ్యటం మాత్రమే కాక నాయకుడు, రామాయణం, భారతం బొబ్బిలియుద్ధం మొదలైన కథలను చెపుతూ మధ్య మధ్య రంధరంధరా మా స్వామి జన్నయ్య వంటి కొన్ని కీర్థనలు పాడుతూ ప్రేక్షకులను సంభ్ర మాశ్చర్యాలలో ముంచెత్తుతారు.లయ బద్ధంగా నృత్యం చేసే ఈ బృందాలలో ఇరవై మంది వరకూ వుంటారు. ఎంత మందైనా వుండవచ్చు.కాని వారు సమర్థులై వుండాలి. తాళం,లయ తెలిసి తప్పకుండా నృత్యం చేయ గలిగి వుండాలి. క్రమం తప్పకుండా వలయా కారంగా తిరుగుతూ వీరు చేసే నృత్యం కన్నుల పండువుగా వుంటుంది.

యాదవుల కళారూపం

[మార్చు]

ముఖ్యంగా ఈ కళను గొల్ల సుద్దులను ఆదరించిన యాదవులే ఈ కళనూ ఆరాధిస్తారు. ప్రదర్శన స్థాయి పెరిగే కొద్దీ ప్రదర్శకులు ప్రదర్శన మధ్యలో వారి వారి ప్రత్రిభా విశేషాలను ప్రదర్శిస్తారు. ఒకరి కంటే మరొకరు మిన్నగా రెండు భాగాలుగా చీలి పోయి పోటీలు పడతారు. ఒకరి కంటే మరొకరు తప్పెట్ల మీద వాద్య వరుసలనూ గమకాలనూ వినిపిస్తారు. ప్రదర్శనం పతాక స్థాయి చేరే సరికి సర్కసులో మాదిరి ఫీట్సు చేసే ప్రేక్షకుల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తారు. నిజానికి తప్పెట గుళ్ళ ప్రదర్శనానికి ఈ సర్కస్ ఫీట్సుకూ సమన్యయం వుండడు. ఉండక పోయినా ప్రేక్షకులు ఉత్కంఠతో ఈ సాహస ప్రదర్శనాన్ని చూస్తారు. నృత్యం చేస్తూనే వలయా కారంగా తిరుగుతూనే రయము తప్ప కుండానే, చిందులు త్రొక్కుతూనే ఒక ప్రక్క అతపెటలు వాయిస్తూనే, నెమ్మదిగా ఒకరిపైన మరొకారు ఎక్కుతూ అంచె లంచెలుగా గోపురాకారంగా నిలిచి నప్పుడు ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా వుంటుంది. పై వారి బరువు నంతా క్రింది వారు భరిస్తూ వుంటే ప్రక్కనున్న కొద్ది మంది లయ తప్పకుండా పాటలు పాడుతూనే వుంటారు.

ఏకాగ్రతా నృత్యం

[మార్చు]

కూచి పూడి నృత్యంలో నెత్తిన చెంబూ కాళ్ళ క్రింద పళ్ళెమూ మాదిరి వీరు కూడా నీరు నింపిన మట్టి కుండ అంచులపై ఒకరు నిలబడితే, అతనిపై మరొవాద్య కారుడు తప్పెటలను వాయిస్తూనే నీరు నింణ్దిన కుండను నెత్తిన పెట్టుకుని వీరు తొణక కుండా, ఒక ప్రక్క తప్పెట వాయిస్తూ నీరు తొణికి పోతాయేమో అనే దృష్టి లేకుండా నృత్యం చేస్తూ వుంటే చుట్టూ చేరిన జన సందోహం చప్పట్లు చరుస్తారు.

వివిధ విన్యాసాలు

[మార్చు]

ప్రదర్శన స్థాయి పెరిగేకొద్దీ వారిలో వారు ఒక్కొక్కరు తమ ప్రతిభా విశేషాలను ప్రదర్శిస్తారు. ఒకరిని మించి మరియొకరు దరువులు వేసి దరువులకనుగుణంగా ఆడతారు. వాయిద్యవరుసలను గమకాలను వినిపిస్తారు. ప్రదర్శన పతాకస్థాయికి చేరుకునేటప్పటికి సర్కస్ ఫీట్లు లాంటి ఫీట్లు చేస్తారు. నృత్యం చేస్తూనే, లయ తప్పకుండా, వలయాకారం తప్పకుండా చిందులు తొక్కుతూనే ఒక ప్రక్క తప్పెట్లు వాయిస్తూనే నెమ్మదిగా ఒకరిపై మరొకరు ఎక్కుతూ అంచెలంచెలుగా గోపురం ఆకారంలో నిలిచి చివరన మరో వ్యక్తి నలబడి తప్పెట్లు వాయిస్తాడు. చివరికి ఒక్కొక్కరుగా దిగుతారు. మొగ్గలు వేస్తారు. ఒక వ్యక్తి క్రింద వెల్లకిల పడుకొని దరువులు వేస్తూ కాళ్ళను భూమికి తాకిస్తూ చుట్టు తిరుగుతాడు. కుండపై నిలబడి నృత్యం చేస్తారు. రెండు, మూడు చెంబులను నీటితో తలపై పెట్టుకొని అవి పడిపోకుండా నృత్యం చేస్తారు.

లయను గుణ్యమైన పాటలు పడుతారు. ఎన్నో భక్తి గేయాలతో పాటు దశావతారాలు, కృష్ణ లీలలు, సారంగధర చరిత్ర, చెంచీత, అమ్మవారి చరిత్ర లాంటి కథాగేయాలను కూడా పాడుతూ సన్ని వేశాల కనుగుణమైన అభినయాలను ప్రదర్శిస్తూ వారి వారి ప్రతిభను కనపర్చే విన్యాసాలు చేస్తారు. వివిధ బంగిమల్లో తప్పెట్లు వాయించటమే కాక, ఒకరి మీద మరొకరు ఎక్కి ఒకని సహాయంతో రెండు వైపులా ఇద్దరు వ్రేలాడుతూ తప్పెటలు వాయించటం రెండు జట్లుగా విడి పోయి తప్పెట గుళ్ళు వాయిస్తూ వారి ప్రతిభను ప్రదర్శించటం అలాగే ఒక కుండ పైన ఒకరు నిలబడి అతని పైన మరొకరు నిలబడి గుళ్ళు వాయిస్తారు. విన్యాసాలలో లెగిరి అమాంతంగా క్రింద పడటం, మోకాళ్ళ మీద కూర్చుని విన్యాసంగా గుళ్ళు వాయించటం. ఇలా ఈ ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆశ్చర్య పర్చే విధంగా నాలుగైదు గంటలు సాగుతుంది. పగటి పూట తమ వృత్తిని చూసు కుంటూ రాత్రి పూట ప్రదర్శనాలను ఇస్తారు. అలాగే రాత్రి పూటే శిక్షణ కూడా పొందుతారు. వారి వారి బిడ్దలకు చిన్న తనం నుంచే ఈ విద్యలో శిక్షణ యిస్తారు. ముఖ్యంగా తప్పెట గుళ్ళలో పురుషులేపాల్గొంటారు; ఒక పొరాంతానికే ప్రాముఖ్యం ఇచ్చే ఈ కళారూపం జాతీయ వుత్సవాలలోనూ విదేశాలలోనూ కూడా ప్రదర్శింప బడుతూ ఉంది.

అభినయ విన్యాసం

[మార్చు]

ముఖ్యంగా ఈ ప్రదర్శనాలు జాతర్లలోనే జరుగుతాయి. ఈ ప్రదర్శినం రాత్రి పూటే ప్రదర్శింప బడుతుంది. ప్రదర్శన మంతా అభినయ విన్యాసంతో తొణికిస లాడుల్తుంది. పాటకు తగిన తాళం, తాళానికి తగిన లయ, లయకు తగిన నృత్యం నోటితో పాట, ముఖంలో ఉత్సాహ వుద్రేకాలతో కూడిన సాత్విక చలనం కొట్ట వచ్చి నట్లు కనబడతాయి. తప్పెట గుళ్ళు ప్రదర్శనం ఏ గ్రామంలో ఇవ్వ దలచుకుంటారో ఆ గ్రామ పెద్దల వద్ద పావలా డబ్బులతో కొంచెం బెల్లం బజానాగా స్వీకరించి ఏ తేదీన ప్రదర్శనం ప్రదర్శించాలో నిర్ణయించు కుంటారు.

ప్రదర్శన

[మార్చు]

ఈ కళారూపాన్ని గొల్ల కులస్థులు చేసుకొనే గాపు సంబరాలలోనూ, గంగాదేవి పండగలలోనూ, గ్రామదేవత పండుగ, దేవుడు సంబరాలు, శ్రీరామకొలువులోను ప్రదర్శనలిస్తారు. అప్పుడప్పుడు రాజకీయనాయకుల, ప్రభుత్వ పథకాల ప్రచారంలోనూ ఊరేగింపులోనూ పాల్గొంటారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కళ

[మార్చు]

ఇది రాష్ట్రంవ్యాప్తంగానే కాకుండా ఢిల్లీ (రిపబ్లిక్ దినోత్సవాలలో), బొంబాయి, పాట్నా వంటి ప్రదేశాలలోనే కాకుండా శ్రీలంక మొదలైన దేశాలలోనూ, తానా సభలలోనూ ప్రదర్శించబడ్డాయి.

కథాంశము

[మార్చు]

రామాయణం, మహాభారతం, భాగవతము పురాణాలలో ఇతిహాసాలలోని కావ్యాలలో ఈ కళాకారులు గేయరూపకాలుగా అల్లుతుంటారు. 19 వ శాతాబ్దానికి చెందిన శ్రీకాకుళం నివాసి బలివాడ నారాయణ రాసిన తొలి తప్పెటగుళ్ళు కథా గేయం "శ్రీకృష్ణ" ఇప్పటికీ చాలా ప్రచారంలో ఉందని తెలుస్తుంది. అయితే ఈ కళాకారుల నోటిద్వారా మౌఖిక సాహిత్యం, మాండలికాలు, గ్రామీణ యాస, భాషలతో కూడిన పదాలే వస్తాయి. చెంచులక్ష్మి, సారంగధర, తూర్పుభాగవతం దరువులు, లక్ష్మణమూర్చ, తేలుపాట, గాజులోడిపాట, రెల్లిదానిపాట, మందులోడిపాట, చుట్టపాట, పాలు, చల్లలమ్మడం, స్థానిక ఇతివృత్తాల ఆధారంగా పాటలు పాడతారు. అయితే ఒక చరనం పాడి దానిని అనేక తాళ వరుసలతో పాడి దరువులు వేసి నృత్యం చేసి సుమారు కొన్ని గంటలు పాటు రెండు మూడు చరణాలను సాగదీసి పాడతారు.

తప్పెటగుళ్ళ బాణీలు

[మార్చు]

వీరి భాష బాణీలు స్థానిక యాసలో ఉంటాయి. నిరక్షరాస్యులైనందున కొన్ని శబ్దాలు కూడా దుశ్శబ్దాలుగా పలుకుతారు. అయితే అవి అక్షరాస్యులమైన మనకు మాత్రమే పుస్తక భాష ప్రకారం తప్పుగా కనిపిస్తాయి. వారు గ్రామాలలో కుటుంబాలలో ఆడుకొనే మాటల మాదిరిగా యాస, మాండలికాల కలగలపుతో పాటలు పాడతారు.

తప్పేటగుళ్లు

[మార్చు]
  • కోరాడ అప్పన్న

గంగమ్మ కథ

[మార్చు]

యాదవులైన తప్పెట గుళ్ళ కళాకారులు ముఖ్యంగా చెప్పే కథ....... గంగమ్మ కథ....... గంగమ్మను వారు ఆరాధ్య కులదేవతగా ఆరాధిస్తారు. కాటమ రాజు భార్య గంగమ్మ అనీ, శివుని ఆజ్ఞ ననుసరించి, పార్వతీ దేవే గంగమ్మగా అవతారించిందని యాదవుల నమ్మకం. అంతే కాదు అందరికీ అన్ని వాయిద్యాలనూ దానం చేసిన శంకరుడు తన వద్ద మిగిలి వున్న తప్పెట గుళ్ళను యాదవుల కిచ్చినట్లు ఇతిహాసం. గంగమ్మ పట్ల వీరు ఎటువంటి భక్తి శ్రద్ధలను కలిగి వుంటారో, గంగమ్మ తిరునాళ్ళలో పాడుకునే ఈ పాటను తిలకిస్తే బోధపడు తుంది.

శోభనమో యమ్మ ... శోభనమే తల్లి
శోభనమో గంగ ... శోభన్మో తల్లి
మూడు మూళ్ళ నరులమే ... మురికి జన్మం మాది
ఎంగిలి కంఠాన మేమెంచి ... పిలువంగ లేము
పాచి నోరు తోను ... పాలింప లేమో మమ్మ
నీకు వందనమమ్మ లోక మాఅతవు నీవు
దబ్బ వనములోన ... దాగుండి నావు తల్లీ
నిమ్మ వనము లోన ... నిలిచి వున్నావు తల్లీ
నీకు వందన మమ్మ ... లోక మాతవు నీవు.

అంటూ గంగమ్మ దేవుని ప్రార్థిస్తూ కథను సాగిస్తారు. ముఖాలు పైకెత్తి, నివ్వెర పడి అలాగే ఆశ్చర్యంతో చూస్తూ వుంటారు. అది ఎంతటి అద్భుత ప్రదర్శనమో మనం ఊహించు కోవచ్చును. ఈ ప్రదర్శనం ఎంతో కట్టు బాటుతో క్రమ శిక్షణతో నడుస్తుంది. ఒక ధ్యేయంతో, లక్ష్యంతో నడుస్తుంది. ఎంతో భక్తి భావంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రదర్శనాన్ని సాగిస్తారు. వారి ప్రదర్శన వరుస క్రమంలో ఏ మాత్రం పొరపాటూ జరిగినా అవ మానంగా భావిస్తారు. అందువల్లే వారి ప్రదర్శనం ప్రారంభం నుండి అసాంతం వరకూ, ఎంతో ఆసక్తి కరంగా నడుస్తుంది.

ఎక్కడ వుందీ కళారూపం?

[మార్చు]

ఎంతో ఉత్తమ మైన ఈ కళా రూపం ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం జిల్లాలో అధిక ప్రచారంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం,గొల్లపేట గ్రామంలో కొర్రయి గంగయ్య దుర్యోధన అన్నదమ్ములు వలన కళారూపాన్ని సజీవంగా ఉంచారు, ఉంది.....విజయనగరం జిల్లాలో గజపతి నగరం తాలూకాలో పల్లపేట ..... మురిపెల్ల గ్రామాలలో ఈ కళారూపం సజీవంగా ఉంది. పెల్లాచిన నారాయణ, దుర్ల చిన అప్పల స్వామి నాయకత్వాన గజపతి నగరం వృత్తి కళాకారుల సమాఖ్య సహ కారంతో నడుస్తూ ఉంది. ఈ కళకు గుర్తింపు కావాలని డా: బి.ఎస్.ఆర్.మూర్తి దంపతులు ఎంతో కృషి చేస్తున్నారు. ఈనాడు గజపతి నగరం చుట్టు ప్రక్కల నలబై గ్రామాలలో శిక్షణ పొందిన తప్పెట గుళ్ళు దళాలు ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి దగ్గరలో వున్న షేరు మహమ్మదు పురంలో, శిక్షణతో కూడిన ....... కోన చిన్న వాడు ...... ఆధ్వర్యంలో ఉత్తమంగా ప్రదర్శనాలిస్తూ వచ్చింది. చిన్న వాడు వయసులో పెద్ద వాడై నందువల్ల ఆ కార్యభారాన్ని.... కోరాడపోతప్పుడు వహిస్తున్నాడు.

మూలం

[మార్చు]

తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.

యితర లింకులు

[మార్చు]