తమ్మారపు వెంకటస్వామి వీధినాటకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1975లోని కుచిపూడి స్టాంప్

కూచిపూడి భాగవతుల వీథి నాటక ప్రదర్శనలతో ఆంధ్ర దేశం అంతటా విజయ యాత్ర సాగిస్తున్న రోజుల్లో అంత వుత్తమం గానూ వీథి నాటకాలు ప్రదర్శించి సెహబాష్ అనిపించు కున్న వ్వక్తి తమ్మారపు వెంకటస్వామి స్వగ్రామం ఒంగోలు తాలూకాలోని తమ్మవరం.అతను దేవదాసి కులానికి చెందిన వ్వక్తి. బాల్యంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే, ఆగ్రామం లోని కుందుర్తి వారి వద్ద సంస్కృతం నేర్చుకుని తరువాత పగటి వేషాలను అద్భుతంగా ప్రదర్శించి ఆ తరువాత కట్టు దిట్టమైన వీథి నాటక సమాజాన్ని నడిపిన దిట్ట.

జుట్టులో కట్టుబాటులు[మార్చు]

వెంకటస్వామి జట్టులో చేరిన వారందరూ కళావంతుల కులానికి చెందిన వ్వక్తులే. ఆయన జట్టులో పురుషులు పురుష పాత్రలు, స్త్రీ పాత్రలు స్త్రీలు ధరిస్తూ వుండేవారు. అందరదీ అమ్మనబ్రోలు గ్రామమే. అందులో పెద్ద హనుమయ్య నాయిక పాత్రలను చెల్లయ్య, చిన్న హనుమయ్య, మాణిక్యం ఇతర పాఅత్రలు ధరించేవారు. అలివేలమ్మ నాయిక పాత్రలు నిర్వహిస్తూ వుండేది. మంగ తాయమ్మ మాత్రం పురుష పాత్రలు ధరించేది. ఈ జట్టు ధేనువుకొండ వెంకయ్య రచించిన ఉత్తర గోగ్రహణ నాటకాన్ని అమ్మనబ్రోలు వాస్తవ్యులు నాగినేని వెంకటప్పయ్య వ్రాసిన హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శిస్తూ వుండేది. అవిగాక శశిరేఖా పరిణయం, ఉషాపరిణయం, నలచరిత్ర, భామా కలాపం, గొల్ల కలాపం మొదలైన ప్రదర్శనాలను కూడ కొనసాగిస్తూ వుండే వారు.

జట్టు జట్టంతకూ చక్కని విందు[మార్చు]

వెంకటస్వామి జట్టు ఒక వూరిలో ప్రదర్శనాలు ప్రారంభిస్తే ఇక రోజుల తరబడి ఆ గ్రామంలోనే వివిధ నాటకాలు ప్రదర్శిస్తూ వుండేవారు. ప్రతి ప్రదర్శనానికి నాలుగు రూపాయలిచ్చేటట్లూ ఇంటికి ఒకరు చొప్పున జట్టులోని వాళ్ళకు భోజనాలు పెట్టేటట్లు ఏర్పాటు జరగగానే ప్రదర్శనం జరుగుతూ వుండేది.ఆ జట్టులో సత్యభామ పాత్రధారిణి అలివేలు చాల అందకత్తె కావటం వల్ల ప్రతివాళ్ళు ఆమెనే భొజనానికి ఆవ్యానిస్తూ వుండేవాళ్ళట. ఆమె అందుకు అంగీకరిస్తే విందు షడ్రసోపేతంగా జరిగేదట. ఈ సంగతి గ్రహించిన వెంకటస్వామి ప్రతి ఇంటివారికీ, సత్యభామే భోజనానికి వస్తుందని చెప్పి వచ్చేవాడట. ఆ విధంగా ఆ జట్టులోని వాళ్ళందరికీ చక్కని విందు అందేదట.

ప్రదర్శనం ప్రారంభం[మార్చు]

నాటక ప్రదర్శనం నాడు రంగస్థలానికి ముందు వరుసలో కరణం, మునసబు ఆదిగా అన్ని వర్గాల వారూ కూర్చునేవారట. సాధారణంగా ఈ జట్టు ప్రదర్శనలు భాగవతంతో ఆరంభమయ్యేవి, అందులో ముఖ్య పాత్రలు శ్రీ కృష్ణుడు, సత్యభామ, గొల్లభామ, సుంకరి కొండడు. ఈ పాత్రలు తెర వెడలే ముందు రంగ స్థలానికి రెండు ప్రక్కలా వెండి దివిటీల్ని పాత్రధారుల ముఖాలకు దగ్గరగా వుంచి వాటిపై గుప్పెడు గుగ్గిలం చల్లేవారు. ఆ వెలుగులో ఠీవిగా విఱ్ఱవీగుతూ పాత్రలు రంగ స్థలంలో ప్రవేశించేవి. ఆనాటి రంగస్థలానికి యవనిక, అడ్డంగా పట్టే వెడల్పయిన గుడ్డ మాత్రమే వేషధారణలో ఉపయోగించే ఆభరణాలన్నీ తేలిక కొయ్యతో కాకి బంగారం అంటింపులతో తయారయ్యేవి.

పండితులకు పాత్రధారుల సవాలు[మార్చు]

ఆ కాలంలో వీథి నాటకాల్లో సత్యభామ తన జడను తెర వెలుపల వేయడం, సభలో కూర్చున్న పండితులు భాగవతం విషయమై ప్రశ్నిస్తే జవాబు చెప్పగలనని సత్య భామ పాత్రధారిణి సూచించటం ఒక సంప్రదాయంగా వుండేది. ఈ సూచనకు పండితులు ఆగ్రహించి భాగవతం పద్యాలకూ కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలకూ భావార్థాలు చెప్పమని అడిగేవారు. అలివేలమ్మ వాటిని క్షుణ్ణంగా వల్లించేది. పండితులు అంతటితో తృప్తి చెందక ఆమెకు భరత శాస్త్రం, అలంకార శాస్త్రం గురించి ప్రశ్నలు అందించేవారు. వాటికి ఆమె తృప్తిగా జవాబు చెప్పగానె కొందరు పండితులు ఆమెను ప్రశంచించే వారు. మరి కొంతమంది తృప్తి పడకుండా ఆమెపై మంత్ర తంత్రాలు ప్రయోగించేవారు. అందు చేత ప్రతి నాటకం జట్టులోను ఒక మంత్ర శాస్త్ర వేత్త వుండి ఇటువంటి మంత్ర ప్రయోగాల్ని విఫలీకృతం చేసేవారు. నాటక ప్రదర్శనానంతరం అందరూ ఆ వేషాలతోనే గ్రామం లోని ప్రతి గడపకూ వెళ్ళి చీరలూ, ధోవతులు దండుకునేవారు. ప్రదర్శనం చూసి ముగ్దులైన గ్రామస్థులు ఎంతో ఆదరంతో వాళ్ళకు బహుమతులు ఇచ్చేవారు. ఈ విధంగా వెంకటస్వామి వీథి నాటకాల ప్రదర్శనలతో అరవై సంవత్సరాలు కళాసేవ చేసి ఎనబైవ ఏట తమ్మవరంలో మరణించాడు.

మూల నాటకాలు[మార్చు]

కూచిపూడి భాగవతులు వీథి నాటకాలను ఉధృతంగా ప్రదర్శిస్తున్న రోజులలో ఆయా కులాల వారు కూడా వీథి నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. అలా యానాదులు, గొల్లలు, చెంచులు నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. అలాగే మాలవారు కూడ వీథి నాటకాలను ప్రదర్శించేవారు. బయట వూరి నుండి వచ్చి, ఊరి వెలుపల పందిరి వేసి నాటకాలను ప్ర్ఫదర్శించేవారు. ఆగ్రజాతులు తప్ప ఇతర కులాల వారందరూ ఆ నాటకాలను తిలకించేవారు. ముఖ్యంగా వారు రామాయణానికి సంబంధించిన నాటకాలను ఆడేవారు. రాముడు, సీత లక్ష్మణుడు, హనుమంతుడు, మొదలైన పాత్రలు ధరించి నాటకాలాడేవారు.

ఆయా పాత్రలు ధరించే పాత్రలు మాత్రం అంత అందంగా వుండేవి కావు. మాసి పోయిన దుస్తులతో లక్క చేసిన రంగుల ఆభరణాలను ధరించే వారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని కీర్తనలు పాడుతూ పాటకు తగిన విధంగ నృత్యం చేస్తూ రంగస్థలంlO కలియ తిరిగే వారు. వారి నృత్యానికి అనుగుణంగా తప్పెట్లు తాళాలతో హంగు చేసేవారు. హార్మోనియం హంగుగా వుండేది. వారు పాడే పాటకు తలా తోక వుండేది కాదు. రామాయణ కథను కీర్తనలుగా పద్యాలుగా వారి వారి ఇష్ట ప్రకారం చేసి పాడేవారు. అయా ఘట్టాలలో కేకలు వేసి ప్రేక్షకులను ఉత్తేజ పర్చేవారు. ఈ నాటకాలను ప్రదర్శించే మాల వారు బ్రాహ్మణులను ఆశ్రయించే వారు కారు.

పాత్రలన్నిటినీ పురుషులే ధరించేవారు. సీతారామ లక్ష్మణుల అరణ్యవాసము, లక్ష్మణ మూర్చ, సీతమ్మ శోకము ప్రదర్శించేవారు. సీతమ్మ శోకం ప్రదర్శించేటప్పుడు ప్రేక్షకుల కళ్ళ వెంట నీరు పెట్టుకునేవారు. ఒకనాటి ప్రదర్శనానికి ప్రదర్శకులందరికీ ఇంటికొకరి చొప్పున భోజనం పెట్టి వడ్లు, దుస్తుల్ని ఇచ్చేవారు. ఆ రోజుల్లో వారు గ్యాసు లైట్ల భరించలేక, ఆముదపు దివిటీల వెలుగుతురులో ఈ నాటకాలను ఆడేవారు. దివిటీలకు గాను ఆముదాన్ని నాటకాన్ని ఆడించే వారే ఇచ్చేవారు. ఆ రోజుల్లో పేదవారికి ఈ ప్రదర్శనాలు కన్నుల పండువుగా వుండేవి. తెల్ల వారేవరకూ ప్రదర్శించి తెల్లవారి ఇళ్ళకు వెళ్ళి వ్యాచించేవారు.

యానాదుల భాగవతాలు[మార్చు]

ఆంధ్ర దేశంలో కూచిపూడి వీథి భాగవతాలు రాష్ట్ర వ్వాప్తకంగా ప్రచారం పొందాయి. అయితే ఆయా ప్రాంతాలలో తూర్పు భాగవతమనీ, చిందు భాగవతమనీ, గొల్ల భాగవతమనీ, మాల భాగవతమనీ, ఇలా ప్రాంతీయంగా ప్రాచుర్యం పొందిన కళా రూపమే యానాదుల భాగవతం. కేవలం యానాదులు భాగవత్గాలకే పరిమితం కాక వివిధ కళారూపాలను కూడ ప్రదర్శిస్తారు.

ఈతరం వారికి తెలియక పోవచ్చును గానీ, నా చిన్నత్గనంలో, ఏవిటిరా ఆ యానాది కళలూ, యానాది గందులూ, యానాది చిందులూ, అనే మాటలు వింటూ వుండే వాడిని. అని అంటారు తెలుగు వారి జానపద కళారూపాలు గ్రంథ రచయిత శ్రీ మిక్కిలి నేని రాధా కృష్ణ మూర్తి. దీనిని బట్టి యానాదుల కళలు కొన్ని వున్నాయనీ, మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యానాదులు ఆంధ్ర దేశ మంతటా వున్నారని మనం చెప్పలేము. యానాదులు ఎక్కువగా, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరి అసలు వృత్తి ఒకప్పుడు బందిపోటు దొంగల బారినుండి గ్రామాలను కాపాడే కాపలాకాయడం. రాత్రిళ్ళు ఊరంతా వీథుల్లో తిరగటం పొలాల వద్ద పంటలను కాపాడటం. ఒకనాడు కూచిపూడి భాగవతుల ప్రభావం, అనేక జాతులమీదా, కూలాల మీదా పడినట్లే ఒక నాటక సమాజాన్ని చూసి, అనేక సమాజాలు ఉద్భవించినట్లే యానాదుల మీద కూడా ఆ ప్రభావం పడింది.

యానాది భాగవతులు[మార్చు]

యానాదుల్లో ఉత్సాహవంతులైన యువకులు ఒక ప్రక్క వూరి కాపలా చూసు కుంటూ భాగవతాలు నేర్చుకుని, జట్టులు జట్టులుగా, ఏబై సంవత్సరాల క్రితం సర్కారు జిల్లాలలో ప్రదర్శనాలు ఇస్తూ వుండేవారు. యానాది భాగవతుల్లో కుటుంబమంతా భాగవతాల్లో పాత్రలు ధరించేవారు. ఆనాడు ముఖ్యంగా కూచి పూడి భాగవతుల్లో పురుషులే స్త్రీ పాత్రలు ధరించేవారు.యానాది భాగవతాల్లో ముఖ్యంగా స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించడం వల్ల ప్రేక్షకుల్ని అధికంగా ఆకర్షించేవారు. దాదాపు జట్టులోని వారందరూ పాత్రలు ధరించినా, ఏదో ఒక వాయిద్యాన్ని కూడా వాయించ గలిగేవారు. ముఖ్యంగా వీరి నాటకాల్లో ప్రతి పాటకూ నృత్యం చేసేవారు. ఆ నృత్యం సున్నితంగా కాక కొంచెం మొరటుగా వుండేది. చిందులు మాత్రం ఉదృతంగా త్రొక్కేవారు. అందుకే యానాది చిందులనే పేరు వచ్చిందేమో.

పూట భోజనం, పది రూపాయలు[మార్చు]

ఒక రాత్రి ప్రదర్శనానికి, రాత్రి పూట అందరికీ భోజనాలు పెట్టి పది రూపాయలిస్తే చాలు. ప్రదర్శనం తెల్లవార్లూ జరిగిపోతుంది. వీరి ప్రదర్శనాలు అంత శాస్త్రయుక్తంగా లేక పోయినా ముఖ్యంగా యవ్వనంలో వున్న స్త్రీ పాత్రల అభినయమూ, సంగీతమూ ప్రేక్షకుల్ని మాత్రం అమితంగా ఆకర్షించాయి. వీరు ప్రదర్శిచే భాగవతాలు, ఉషాపరిణయం, కృష్ణలీలలు, సావిత్రి, శసిరేఖా పరిణయం మొదలైనవి ప్రచారం పొందాయి. వీరి వాయిద్యాలు - మద్దెల - తాళాలు ... శ్రుతి పక్వమైన హార్మోనియం, వీర్ఫి ముఖానికి రంగులు, అర్దళం, గంగ సింధూరం, కాటుక, దుస్తులు, పూసల కోట్లు మొదలైనవి. ప్రదర్శన కాలం, ప్రారంభించింది మొదలు తెల్లవార్లూ ప్రదర్శించేవారు. ఈ మధ్య వీరి భాగవత ప్రడర్శనాల ప్రభావం చాల తగ్గి పోయింది.

యానాదుల వేషాలు[మార్చు]

  • ముఖ్యంగా ఈ నాటికి కూడ ఆంధ్ర దేశంలో పట్టణాలలోనూ, పల్లెలలోనూ దశరా పండుగ దినాలలోనూ, చిత్ర విచిత్రమైన వేషాలను చూస్తూనే వున్నాం.
  • అలాగే ల్యానాదులు కూడ పండుగకు చిత్ర విచిత్రమైన వేషాలు ధరించి చిందులు వేస్తూ వుంట్ఘారు. ఇది ఒక ప్రదర్శనంగా వుండదు. ఇంటింటికి తిరుగుతూ వ్యాచిస్తూ వుంటారు.
  • ముఖానికి రంగులు పూసుకుని రాగాలను తీస్తూ, చిందులు తొక్కుతారు. కొంత మంది గుర్రపు తలను ధరించిన డమ్మీ గుఱ్ఱాలలో దూరి వెనక్కూ ముందుకూ,తాళం ప్రకారం గుఱ్ఱపు నృత్యం చేస్తారు.
  • ముఖ్యంగా యానాది వేషాలలో చెంచులక్ష్మి, నారసింహుల పాత్రలూ, శ్రీకృష్ణుడూ, దుర్వోధనుడూ, భీముడూ, శివుడూ, రాముడూ మొదలైన పాత్రలు ధరిస్తారు.
  • వీరి పాత్రలకు కిరీటాలుగా అట్ట కిరీటాలను, కాగితపు పిండితో తయారు చేసిన గదల్నీ ధర్ఫించి, ఆ యా పాత్రల ప్రగల్బాలతో ఒక పాత్ర మీదకు మరొక పాత్రధారి లంఘిస్తూ వుండేవారు.

వారు ధరించే దుస్తులు పాత్రకు ఔచిత్యం ఏమీ వుండదు. ముఖం చూస్తే కృష్ణుడైనా ప్యాంట్లు తొడిగి బూట్లు వేసే కృష్ణుణ్ణి యానాది వేషాల్లోనే చూడలుగుతాము. రాముడు పాత్ర ధారి కోటు తొడుగుతాడు. ఇలాంటి అస్తవ్యస్త వేషధారణతో హాస్యాన్ని గుప్పించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. అందువల్లే యానాది వేషాలు వేయకు. యానాది చిందులు తొక్కకు అనే మాటలు పుట్టాయేమో తెలియదు. కాలం మారిన కొద్దీ ఆయా జాతుల కులాలకు సంబంధించిన సాంప్రదాయ కళా రూపాలన్నీ క్రమేపీ నశించి పోతున్నాయి. అయితే ఆ నశించి పోయే కళారూపం యొక్క వేషభాషల్నీ సంగీత నృత్యభాణీలనూ, వైనాలనూ రక్షించటం ఎంతైనా అవసరం.

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]