తుర్లపాటి కుటుంబరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుర్లపాటి కుటుంబరావు
Turlapati Kutumba Rao.jpg
తుర్లపాటి కుటుంబరావు
జననం(1933-08-10) 1933 ఆగస్టు 10 /ఆగస్టు 10, 1933
విజయవాడ
నివాస ప్రాంతంవిజయవాడ
వృత్తిపాత్రికేయత
సాధించిన విజయాలుఅధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్
పదవీ కాలము2010-06-21 --
భార్య / భర్తకృష్ణకుమారి
పిల్లలుప్రేమజ్యోతి, జవహర్లాల్ నెహ్రూ
తండ్రిసుందర రామానుజరావు
తల్లిశేషమాంబ

తుర్లపాటి కుటుంబరావు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత మరియు వక్త. చిన్నప్పడే నార్ల వేంకటేశ్వరరావు గారి సంపాదకీయాలకు ప్రభావితుడై పత్రికారచన ప్రారంభించాడు. 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందాడు. తన 60ఏళ్ల పైబడిన పాత్రికేయవృత్తిలో 30, 40, 50, 60 వార్షికోత్సవాలను ప్రముఖుల చేతులమీదుగా జరుపుకొన్న వ్యక్తి.1993 నాటికి పదివేలకు పైబడి బహిరంగసభలకు అధ్యక్షోపన్యాసాలు చేసి మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. అర్ధశతాబ్ది కాలంలో ఏ పదవి లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా సభలకు అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావే నని గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు పేర్కొన్నాడు. జూన్ 21, 2010 న ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాడు[1] .

వ్యక్తిగత జీవితం[మార్చు]

తుర్లపాటి కుటుంబరావు ఐదుగురు సహోదరులలో మధ్యముడు. తనకు అక్క, అన్న మరియు తమ్ముడు, చెల్లి ఉండడంతో ప్రతి విషయంలో ఆలోచనలు మధ్యమ మార్గంగా ఉండేవని అన్నాడు. తండ్రి న్యాయవాది కనుక న్యాయవాది కావాలని కోరిక ఉన్నా చివరికి పాత్రికేయుడిగా మారాడు. పామర్రు ఉన్నతపాఠశాలలో నాల్గవ ఫారం చదువుతున్నప్పుడు వక్తృత్వ పోటీలలో రాణించాడు. అయితే స్త్రీలకు విద్య అవసరమా? కాదా? అనే చర్చాంశంలో అవసరం కాదని హేళనతో ఉపన్యసించినప్పుడు బాధపడిన విద్యార్థినులకు క్షమాపణ చెప్పి, తన మాటలను ఉపసంహరించుకున్నాడు. ఆ తరువాత స్త్రీలను గౌరవించాలని నిర్ణయించుకొని కృష్ణకుమారిని ముందు పరిచయాలలో పిలుపుకు వాడిన ఏమండీ అనే పదాన్ని భార్య అయిన తర్వాత కూడా కొనసాగించాడు.

కలకత్తాలో ఆంధ్రా అసోషియేషన్ వారు 1959 రిపబ్లిక్ దినోత్సవాలలో తుర్లపాటికి, ప్రముఖ నాట్య కళాకారిణి కృష్ణకుమారికి సన్మానం నిర్వహించారు. ఆ సందర్భంగా కలకత్తా ప్రయాణంలో వారి మనస్సులు కలిసి అమ్మాయి పట్టుదలపై 1959, జూన్ 12 న పెళ్ళి జరిగింది. ఆంధ్రజ్యోతిలో చేరిన మొదటిరోజే పుట్టిన కూతురికి ప్రేమజ్యోతి అనీ, తరువాత కలిగిన కుమారునికి తన వివాహ సందర్భంగా సందేశం పంపిన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరుని పెట్టాడు.

తన కుమారుని 16వ ఏట తన భార్య పరమపదించింది. ఆ తరువాత తన కుమారుడు, కోడలు, మరియు మనుమల ప్రేమ ఆప్యాయతలతో జీవనం సాగిస్తున్నాడు.

వీరి పేరున విజయవాడలో లబ్బిపేటలో ఒక వీధికి " తుర్లపాటి కుటుంబరావు వీధి " పేరు పెట్టారు.[2]

పాత్రికేయజీవితం[మార్చు]

ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకీయాల ప్రభావంతో తుర్లపాటి పత్రికారచన ప్రారంభించాడు[3].తుర్లపాటి కుటుంబరావు పత్రికా రచన 1947 మార్చి నెలలో కేవలం 14 సంవత్సరాలవయస్సులో స్వరాజ్యంలో స్వరాష్ట్రం అనే శీర్షికతో మద్రాసు నుండి వెలువడే మాతృభూమి రాజకీయ వారపత్రికతో ప్రారంభమైంది. ఆ రచన స్వాతంత్ర్యోద్యమం ఫలితంగా 1947 పిభ్రవరి 20 న బ్రిటీషు ప్రధాని స్వాతంత్ర్య ప్రకటన చేసిన సందర్భంగా ఇక ఆంధ్రరాష్ట్రం పై దృష్టిపెట్టవలసిన ఆవశ్యకతను వివరిస్తూ రాసింది. ఎన్.జి. రంగా నిర్వహించిన వాహిని కి సహ సంపాదకునిగా, చలసాని రామారాయ్ నిర్వహించిన ప్రతిభ కు సంపాదకునిగా ప్రకాశం పంతులు గారి ప్రజాపత్రిక లో ఆంధ్ర ప్రాంత వార్తల సంపాదకునిగా పనిచేశాడు.1955 లో డాక్టర్ టివిఎస్ చలపతిరావు గారి ప్రజాసేవ ఆ తరువాత ఆంధ్రజ్యోతి లో 1960 మే 21 నుండి 1963 జూన్ వరకు మరియు 1965 నుండి 1991చివరి వరకు పనిచేసి తదుపరి స్వేచ్ఛా పాత్రికేయనిగా తన వ్యాసంగం కొనసాగించాడు. 1960 లో ప్రారంభించిన వార్తలలోని వ్యక్తి అనే శీర్షికను మొదటి నాలుగు సంవత్సరాలు రోజువారీ శీర్షికగా ఆ తరువాత వారంవారీ శీర్షికగా 1991 వరకు కొనసాగించి ఆ తరువాత వార్త పత్రికలో 2010 నాటికి 50 సంవత్సరాలు నిర్వహించిన ఘనత తుర్లపాటిదే. ఈ శీర్షికలో భాగంగా నాలుగు వేలకుపైగా వ్యక్తుల జీవితరేఖాచిత్రాలు రచించాడు. ప్రజా జీవితంలో కాని రాజకీయరంగంలో కాని ప్రాచుర్యం లభించటానికి ఉపన్యాసాల తరువాత ఈ శీర్షికే కారణమని తన ఆత్మకథ లో పేర్కొన్నాడు[4].

చలనచిత్రాలపట్ల వున్న ఆసక్తిని గమనించి ఆంధ్రజ్యోతిలో చిత్రజ్యోతి విభాగానికి తదుపరి ప్రారంభించిన జ్యోతిచిత్రకు సంపాదకునిగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం కుటుంబరావుని నియమించింది.అయితే జ్యోతిచిత్ర పనిలో పెద్ద పాల్గొనలేదని, వివేకానందమూర్తి మరియు తోటకూర రఘు చూసుకొనే వారని అత్మకథలో పేర్కొన్నాడు.

స్వాతంత్ర్యం తరువాత తొలి మంత్రివర్గంలో ఆంధ్రునికి చోటివ్వకపోవడాన్ని నిరసిస్తూ "స్వాతంత్ర్యోద్యమంలో అగ్రశ్రేణిలో నిలబడి అశేష త్యాగాలు చేసిన ఆంధ్రుల కివ్వవలసిన గౌరవమిదేనా? ఆంధ్రులలో కేంద్రమంత్రిత్వం నిర్వహించగల దక్షులు కాంగ్రెస్ హై కమాండ్ కు కానరాలేదా? అని ఆంధ్రప్రభ లో రాసిన లేఖ చాలా సంచలనం కలిగించింది. వయోధికుడైనప్పటికీ 2003 మేలో తెలుగు కి ప్రాచీన భాషా ప్రతిపత్తి ఇవ్వాలని హిందీ తరువాత రెండవ అధికార భాషగా చేయాలన్న ఉద్యమాలకు బీజం వేశాడు.

పాత్రికేయ వృత్తిలో తన వ్యక్తిత్వాన్ని విశ్వమానవుడుగా భావించుకొని జాతి, మత, కుల, వర్ణ, వర్గ, స్త్రీ, పురుష విభేదాలకు అతీతమైన మానవుడు మానవునిపట్ల మానవీయదృక్పథంతో వ్యవహరించే మానవీయ వ్యవస్థ ఆవిర్భవించాలన్న అభిమతం పెంచుకున్నాడు.[4]

వక్తగా జీవితం[మార్చు]

తుర్లపాటి కుటుంబరావు తెలుగు వికీ దశాబ్ది ఉత్సవాలలో రెండవరోజున అధ్యక్ష ఉపన్యాసము చేస్తున్నప్పటి చిత్రం

1947అక్టోబర్ లో పిన్న వయస్సులోనే గన్నవరం తాలూకా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రథమ ఉపన్యాసంతో వక్తగా జీవితం ప్రారంభించాడు. విద్యాలయంలోని డిబేటింగ్ సొసైటీలో గల అనుభవంతో రాజకీయ అనుభవజ్ఞులున్న సభలో జంకు గొంకు లేకుండా మాట్లాడాడు. సినిమా రంగంపై వున్న అభిరుచి కారణంగా కేంద్రం ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫ్యాన్స్ అసోషియేషన్ వార్షిక ఫిలిం అవార్డుల ప్రదానోత్సవాలను వివిధ పట్టణాలలో నిర్వహించడంలో వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో వాగ్ధాటి పెరగడంతో మరింత ప్రాచుర్యం లభించింది.

సినీరంగంతో అనుబంధం[మార్చు]

సినిమాలపై అభిరుచితో ఆంధ్రజ్యోతిలో సినిమా శీర్షికను నిర్వహించడమే కాకుండా కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా మరియు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫ్యాన్స్ అసోషియేషన్ వార్షిక ఫిలిం అవార్డుల ప్రదానోత్సవాల వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అక్కినేని నాగేశ్వరరావు నట జీవితం వజ్రోత్సవం 1957లో విజయవాడలో జరిపినప్పుడు నటసామ్రాట్ బిరుదు ఆలోచనకు మరియు దాని అమలుకు మూలకర్తగా వ్యవహరించాడు. అంతకు ముందు సినీనటులకు గ్లామర్, విలువ లేని కాలం కాబట్టి, ఆ బిరుదు వలన సినీనటుల విలువని పెంచిందని, సినీ కళాకారులుకూడా గౌరవనీయులేఅన్న భావన విస్తరణకు దోహదం చేసిందని అక్కినేని పేర్కొన్నారని తుర్లపాటి తన ఆత్మకథలో రాశాడు.

చేజారిన శాసనమండలి సభ్యత్వం[మార్చు]

1978లో విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సమావేశాన్ని నిర్వహించిన తీరుకు ముగ్ధుడైన అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి శాసనమండలి కి గవర్నర్ నియామక సభ్యుడిగా చేయాలని అనుకున్నాడు కాని వీలవలేదు. 1982 లో కోట్ల విజయ భాస్కర రెడ్డి ప్రతిపాదన, 2004 లో పాత్రికేయుల తరపున నియమించాలన్న డాక్టర్ వై యస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదన కూడా చివరి క్షణంలో ఫలించలేదు. ఆయా సందర్భాలలో ప్రత్యామ్నాయంగా గ్రంథాలయ పరిషత్ అధ్యక్షునిగా నియమించాలన్న ఆనాటి ముఖ్యమంత్రుల ఆలోచన కొణిజేటి రోశయ్య హయాంలో 2010 లో నెరవేరింది.

ప్రముఖుల వ్యాఖ్యలు[మార్చు]

తన జీవితంలో తెలుగేతర దేశ రాజకీయనాయకుల ఉపన్యాసాలకు అనువాదకుడిగా వ్యవహరించడం, వారితో పాత్రికేయరంగంలో భాగంగా సమాలోచనలు చేయడం మరియు చాలా మంది రాష్ట్ర రాజకీయనాయకులకు రాజకీయ కార్యదర్శిగా పనిచేయడంలో చాలా మందికి అతి సన్నిహితంగా మెలిగాడు.

 • "తుర్లపాటి కేవలం ప్రఖ్యాత జర్నలిస్టు మాత్రమే కాదు -ఆయన మరెన్నో రంగాలలో ప్రతిభావంతుడు" - కె.ఆర్. నారాయణన్ , భారత మాజీ రాష్ట్రపతి
 • "గార్డియన్ ఆఫ్ తెలుగు" -రాజాజీ, భారత మాజీ గవర్నర్ జనరల్
 • "పత్రికానిర్వహణలో కుటుంబరావు దిట్ట, సభానిర్వహణలో దక్షుడు, జంకు గొంకూ లేకుండా మట్లాడే ఉపన్యాసకుడు"-ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు
 • "ఆధునిక రాజకీయ జర్నలిస్టులలో అందె వేసిన చెయ్యి, యువతరానికి మార్గదర్శకుడు"-నీలం సంజీవరెడ్డి, మాజీ భారత రాష్ట్రపతి
 • "ప్రెస్, పిక్చర్, ప్లాట్ ఫారం - ఈ మూడు తుర్లపాటి చేతిలోని పదునైన ఆయుధాలు. ఆయన అంతగా రాణించడానికి ఇవే కారణాలు."- వందేమాతరం రామచంద్రరావు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు .

అవార్డులు[మార్చు]

కుటుంబరావు సాహిత్యం మరియు విద్యారంగంలో చేసిన సేవలకు గాను 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించినది[5].ఇదేకాక మరెన్నో పురస్కారాలు పొందాడు. వాటిలో కొన్ని[3]

రచనలు[మార్చు]

నా కలం-నా గళం

ఆంధ్రకేసరి జీవితంలోని కొన్ని అద్భుత ఘట్టాలు, జాతి నిర్మాతలు, వార్తలలోని వ్యక్తులు (శీర్షిక సంకలనం),1857 విప్లవ వీరులు, మహానాయకులు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి , తొలి తెలుగు ప్రధాని పి. వి. నరసింహరావు అనేవి ఆయన కొన్ని రచనలు[6]. నా కలం - నా గళం అనే పేరుతో కుటుంబరావు ఆత్మకథ 65 సంవత్సరాల పాత్రికేయ జీవితం గడుపుతున్న 2011 లో రాయగా 2012, పిభ్రవరిలో విడుదలైంది. మద్దాలి సత్యన్నారాయణ శర్మ గారు మరి ఇతరుల ప్రోద్బలంతో తనఆత్మకథని రాశానని కుటుంబరావు ముందుమాటలో పేర్కొన్నాడు. మద్దాలి సత్యన్నారాయణ శర్మ తన సమీక్షలో[7] కలాన్ని, గళాన్ని దైవదత్తమైన దక్షతతో సారించి పేరుప్రఖ్యాతులు పొందిన ఏకైకతెలుగు పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావని పేర్కొన్నాడు. పిన్న వయస్సులోనే సినిమాలు పత్రికల ద్వారా ఆంధ్రదేశంలో ఆబాల గోపాలానికి పరిచయమైన వ్యక్తి కుటుంబరావు అని పొగిడాడు. తన జీవితచరిత్రలోని సంఘటనలను సన్నివేశాలను సూక్ష్మంలో మోక్షంగా చేర్చినందువల్ల, జీవితచరిత్ర చదివేవ్యక్తి ఆశించే వాస్తవాల పూర్తి వివరణ లేకపోవడంవల్ల ఆత్మకథకుని ప్రతిభ, ప్రజ్ఞ పూర్తిగా అవగాహనకు వీలవదని మరియు ఇతరులకు ప్రేరణనివ్వడానికి తగిన బలమివ్వదని అభిప్రాయపడ్డాడు.

మూలాలు[మార్చు]

 1. "Turlapati assumes charge". The Hindu. 2010-06-22. Retrieved 2014-02-23.
 2. ఈరంకి. "తెలుగు తేజోముర్తులు : పాత్రికేయులు, వక్త పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు". Retrieved 2018-07-14. |first= missing |last= (help)
 3. 3.0 3.1 "పాత్రికేయులు, వక్త పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు". సిలికానాంధ్ర. Retrieved 2014-02-23.
 4. 4.0 4.1 తుర్లపాటి, కుటుంబరావు (2012-02-01). నా కలం నాగళం. శ్రీ సుందర శేషమాంబ పబ్లికేషన్స్, విజయవాడ-522010.
 5. "Padma awardees honoured". The Hindu. 2002-03-28. Retrieved 2014-02-23.
 6. మన పాత్రికేయ వెలుగులు, (పేజీ 79) జిఎస్ వరదాచారి (పర్యవేక్షణ), ఆగష్టు 2011, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు.
 7. "కలం, గళం సారించిన సవ్యసాచి". India Today. Retrieved 2014-02-23.

బయటి లింకులు[మార్చు]