నిడమర్తి ఉమా రాజేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిడమర్తి ఉమారాజేశ్వరరావు
నిడమర్తి ఉమారాజేశ్వరరావు
జననం(1923-10-17)1923 అక్టోబరు 17
మరణం2010 జూలై 25(2010-07-25) (వయసు 86)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఉమారాజ్
వృత్తి
 • సంపాదకుడు, విశాలాంధ్ర ప్రచురణాలయం(1965-67),
  * సంపాదకుడు, విశాలాంధ్ర దినపత్రిక సాహిత్యానుబంధం(1967-77),
  * అనువాదకుడు, ప్రగతి ప్రచురణాలయం, మాస్కో(1977-1992)
క్రియాశీల సంవత్సరాలు1939-2015
అభ్యుదయ రచయితల సంఘం, బెంగళూరు శాఖ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అనువాదకుడు, ప్రచురణకర్త, అరసం నిర్వాహకుడు
గుర్తించదగిన సేవలు
యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం,
ప్లేటో జీవితం - బోధనలు,
తొలి వేకువలో అశ్వని దర్శనం
జీవిత భాగస్వామిశ్యామలాదేవి
పిల్లలుమల్లిక్, మాధవి
తల్లిదండ్రులునిడమర్తి లక్ష్మీనారాయణ, వెంకమ్మ
బంధువులునిడమర్తి అశ్వనీ కుమారదత్తు

నిడమర్తి ఉమారాజేశ్వరరావు(అక్టోబర్ 17, 1923 - జూలై 25,2010) ఒక రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, అనువాదకుడు, ప్రచురణకర్త. కార్మిక నాయకుడు, కమ్యూనిస్ట్ నేత నిడమర్తి అశ్వనీ కుమారదత్తు ఇతనికి అన్న.

జీవిత విశేషాలు

[మార్చు]

ఉమారాజేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా, నిడమర్రు గ్రామంలో 1923, అక్టోబర్ 17వ తేదీన నిడమర్తి లక్ష్మీనారాయణ వెంకమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించాడు.

1936- 38లలో విశాఖపట్నంలో హైస్కూల్‌ విద్యాభ్యాస కాలంలో చండ్ర రాజేశ్వరరావు, తన అన్న అశ్వనీ కుమారదత్తుల ప్రభావంతో కమ్యూనిస్ట్ అభిమానిగా మారాడు. 1939లో పశ్చిమ గోదావరిజిల్లా ఉండి పట్టణ హైస్కూల్‌ లో విద్యార్థుల సమ్మెకి నాయకత్వం వహించి విజయవంతంగా నడిపి, నెలరోజులు సస్పెండ్‌ అయ్యాడు. అదే సంవత్సరం కాకినాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌ మహాసభలో కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడ్డాడు. 1943లో శ్యామలాదేవితో జరిగిన ఇతని వివాహానికి అడివి బాపిరాజు, కాటూరి వెంకటేశ్వరరావు, మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్ వంటి ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. 1942లో తాడేపల్లిగూడెం తాలూకాలో పార్టీ హోల్‌టైమరుగా పని ప్రారంభించిన ఉమారాజ్‌ రచనా వ్యాసంగం 1942లో ప్రజాశక్తిలో జోయ వీరగాథ, గెరిల్లా ప్రచురణతో ప్రారంభమైంది. 1929లో అన్నా ప్రచురణతో ప్రారంభించిన ప్రోలెటేరియన్‌ సీరిస్‌ను ఇతడు తన అన్న అశ్వినీకుమార దత్తుతో కలిసి 1943లో ప్రగతి ప్రచురణాలయం పేరిట పునరుద్ధరించి, నిర్వహించాడు. ఆంధ్రదేశంలోని తొలిసోషలిస్టు ప్రచురణాలయాల్లో యిది ఒకటి. 1943లో అశ్వినీకుమారదత్తుతోబాటు అనువదించిన చైనా ఎర్రసైన్యం మొదలుకొని ఇతడు సుమారు నూరు అనువాదాలు చేశాడు. 1947లో కడపలో సోషలిస్టు స్టడీ సర్కిల్‌ నిర్వహణలో పాల్గొన్నాడు. 1950 నుండి 1965 ఆగస్టు దాకా కర్నూలు జిల్లా బేతంచెర్లలో పరిశ్రమ నిర్వహణకాలంలో సైతం రచనా వ్యాసంగం కొనసాగించాడు. 1965 డిసెంబరు నుంచి 1967 దాకా విజయవాడలో విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకునిగా పనిచేశాడు. దేవరకొండ బాలగంగాధర తిలక్‌ కవితలు 'అమృతం కురిసిన రాత్రి'నీ, తిలక్‌ కథలునూ, సుప్తశిల వగైరా నాటికలనూ విశాలాంధ్ర ప్రచురణాలయానికి సేకరించి పెట్టాడు.

1967 నుండి 1977 మే దాకా విశాలాంధ్ర సాహిత్యానుబంధ సంపాదకునిగా పనిచేసి, అభ్యుదయ రచయితలకు దాన్నొక వేదికగా తీర్చిదిద్దాడు. కృష్ణాజిల్లా అరసం ప్రధాన కార్యదర్శిగా నాటక విభాగం, చిత్రకళావిభాగం ప్రారంభించి ధవళ సత్యం దర్శకత్వంలో, వీరాసారధ్యంలో ఎం.జి.రామారావు రచించిన ఎర్రమట్టి నాటక ప్రదర్శనకూ, గని వంటి గాయకులు, మోహన్‌ వంటి అభ్యుదయ చిత్రకారుల తయారీకి, ఉదయతార, ఎర్రపూలు, సమైక్యతావాణి, సుడి వగైరాలతో అరసం ప్రచురణకి నాంది పలికాడు. 1977 నుండి 1992 వరకు మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకుడిగా పనిచేశాడు.

ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి-కోశాధికారిగా అరసం పునరుద్దరణ కృషిలో ముఖ్యపాత్ర వహించాడు. ఇతని సంపాదకత్వంలో పందకొండేళ్ళ కృషి ఫలితంగా స్వెత్లానా ద్జేనిత్‌ కూర్చిన రష్యన్‌-తెలుగు నిఘంటువు వెలుగు చూసింది. భార్య శ్యామలాదేవితో కలిసి హిందీ నుండి కిషన్‌ చందర్‌ ఐదుగురు లోఫర్లు, జంగ్లీ లను తెలుగులోని అనువదించాడు. ఇతడు 1992లో పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారం అందుకున్నాడు.[1]

మాస్కోలో ఉద్యోగ విరమణానంతరం బెంగళూరులో స్థిరపడి అక్కడ అరసం శాఖను ప్రారంభించాడు. 1997 నుండి 2008 వరకు బెంగళూరులో అరసం తరఫున 103 కార్యక్రమాలను నిర్వహించాడు. బెంగళూరు శాఖ తరఫున కథాతరంగాలు, కవితాతరంగాలు సంకలనాలను తన సంపాదకత్వంలో వెలువరించాడు.[2]

రచనలు

[మార్చు]
 • చైనా ఎర్రసైన్యం (అనువాదం అశ్వనీకుమార దత్తుతో కలిసి)
 • ఐదుగురు లోఫర్లు (అనువాదం శ్యామలాదేవితో కలిసి)
 • జంగ్లీ (అనువాదం శ్యామలాదేవితో కలిసి)
 • యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం(అనువాదం)
 • విశ్వ పౌరుడు టామ్ పెయిన్ (అనువాదం అశ్వనీకుమార దత్తుతో కలిసి)
 • ప్రాచీన ప్రపంచ చరిత్ర (అనువాదం రాచమల్లు రామచంద్రారెడ్డితో కలిసి)
 • ప్లేటో జీవితం - బోధనలు (అనువాదం)
 • మాక్జిం గోర్కీ కథలు (అనువాదం)
 • అర్థశాస్త్ర క్రమపరిణామం:మార్క్స్ పూర్వపు అర్థశాస్త్రం (అనువాదం)
 • పారిస్ కమ్యూన్ గురించి మార్స్ ఏంగెల్సులు (అనువాదం)
 • తొలి వేకువలో అశ్వని దర్శనం
 • కథా తరంగాలు (సంపాదకత్వం వివినమూర్తితో కలిసి)
 • కవితా తరంగాలు (సంపాదకత్వం రాజేశ్వరి దివాకర్ల, అంబికా అనంత్‌లతో కలిసి)
 • రష్యన్ - తెలుగు నిఘంటువు (సంపాదకత్వం)
 • మధ్యే మధ్యే[3] (విమర్శావ్యాసాలు)
 • భారతదేశ ఆర్థిక వ్యవస్థ (అనువాదం)
 • చిట్టగాంగ్ వీరులు (కల్పనా దత్, అనిసెట్టి, కొండేపూడి శ్రీనివాస్‌లతో కలిసి)
 • శాస్త్రీయ కమ్యూనిజం: విజ్ఞానదీపిక
 • ప్రశాంత ప్రత్యూషాలు, అజేయ సైనికుడు : నవలలు (అనువాదం)
 • మార్క్సిస్టు తత్త్వశాస్త్రం (అనువాదం వై.విజయకుమార్, బి.రామచంద్రరావులతో కలిసి)
 • కొండగాలీ కొత్త జీవితం (ఆర్మేనియన్ కథలు అనువాదం)
 • మధ్య ఆసియాలో సోషలిజం (అనువాదం)
 • మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతం: గతితార్కిక భౌతికవాదం చారిత్రక భౌతికవాదం (అనువాదం)
 • మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంత మూల సూత్రాలు (అనువాదం)
 • పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఏమిటి? (అనువాదం)
 • పేదజనం శ్వేతరాత్రులు (అనువాదం)
 • మూడవ ఇంటర్నేషనల్ చరిత్రలో దాని స్థానం (అనువాదం)
 • సి.ఐ.ఇ. విషకౌగిలి (అనువాదం)
 • అక్టోబరు సోషలిస్టు మహావిప్లవం (కొండేపూడి లక్ష్మీనారాయణతో కలిసి)
 • ఆర్.ఎస్.ఎస్.ఫాసిస్టు పన్నాగాల్ని ఓడించండి (కె.ఎల్.మహేంద్రతో కలిసి)
 • తాత తపన మనవడి మథన : పిల్లల కథలు (అనువాదం)
 • వానరుడు మానవుడిగా మారే క్రమంలో శ్రమ నిర్వహించిన పాత్ర (అనువాదం)
 • ప్రపంచ ఆర్థిక, రాజకీయ, భూగోళశాస్త్రం: సులభ సంగ్రహ పాఠం (అనువాదం)
 • సోవియట్ విద్యాలయాలు (అనువాదం)
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్: సంక్షిప్త జీవితచరిత్ర (అనువాదం)
 • రక్తవాహిని (కథ అనువాదం)
 • అదనపు విలువ అంటే ఏమిటి? (అనువాదం)
 • సాంఘిక, రాజకీయశాస్త్రాల ప్రాథమిక జ్ఞానం : వర్గాలు, వర్గపోరాటం అంటే ఏమిటి? (అనువాదం)
 • ఆకాశపు అంచుల్లో (నవల అనువాదం)
 • అనుమానం (అనువాదం గద్దె లింగయ్యతో కలిసి)
 • గోతా కార్యక్రమ విమర్శ (అనువాదం)
 • నీలం నోట్‌బుక్ (నవల అనువాదం)
 • తత్త్వశాస్త్ర సంక్షిప్త చరిత్ర (అనువాదం ఏటుకూరు బలరామమూర్తితో కలిసి)
 • కలలు, సాంఘికజీవితం (అనువాదం)
 • సంసార సుఖం (నవల అనువాదం)
 • రష్యన్ చరిత్ర కథలూ, గాథలూ (అనువాదం)
 • మార్క్సిజం మౌలిక సమస్యలు (అనువాదం)
 • పిల్లల పెంపకంలో మెలకువలు (అనువాదం)
 • సోషలిజం అంటే ఏమిటి? (అనువాదం)
 • వి.ఐ.లెనిన్ సంకలిత రచనలు (అనువాదం)
 • ప్రాచీన ప్రపంచ చరిత్ర (అనువాదం)
 • కార్ల్ మార్క్స్ ఫ్రెడరిక్ ఏంగెల్స్ సంకలిత రచనలు (అనువాదం)
 • ఇ.లునాకార్‌స్కీ విద్యా శిక్షణలు: వ్యాసాల ప్రసంగాల సంకలనం (అనువాదం)

మరణం

[మార్చు]

అభ్యుదయ రచయిత, అరసం ఉద్యమకారుడు నిడమర్తి ఉమారాజేశ్వరరావు 2010, జూలై 25న బెంగళూరులో మరణించాడు[2].

మూలాలు

[మార్చు]
 1. విలేకరి (26 July 2010). "అభ్యుదయ రచయిత ఉమారాజేశ్వరరావు కన్నుమూత". విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original on 8 ఏప్రిల్ 2020. Retrieved 6 April 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
 2. 2.0 2.1 పెనుగొండ లక్ష్మీనారాయణ (6 April 2020). "అరసం చరిత్రలో నిశ్శబ్ద అధ్యాయం ఉమారాజ్". విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original on 6 ఏప్రిల్ 2020. Retrieved 6 April 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
 3. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి (30 March 2020). "అభ్యుదయ విమర్శకమూర్తి నిడమర్తి". విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original on 8 ఏప్రిల్ 2020. Retrieved 8 April 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)