నిడుదవోలు వేంకటరావు
నిడుదవోలు వేంకటరావు | |
---|---|
జననం | జనవరి 3, 1903 |
మరణం | అక్టోబర్ 15 1982 |
వృత్తి | రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కళాప్రపూర్ణ |
తల్లిదండ్రులు |
|
నోట్సు | |
విద్యారత్నం,పరిశోధనపరమేశ్వర అనే బిరుదులు పొందారు |
నిడుదవోలు వేంకటరావు (జనవరి 3, 1903 - అక్టోబర్ 15, 1982) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. సాహిత్య విమర్శకులు, ప్రాచీన గ్రంథ పరిష్కర్త, అసాధారణ పరిశోధకులు
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన విజయనగరం జిల్లాలో జనవరి 7, 1903లో ఒక పండిత కుటుంబములో విజయనగరంలోని సుంధరంపంతులు, నాగమ్మ దంపతులకు జన్మించారు.ఆర్వేల నియోగులు, కౌండిన్యసగోత్రులు ఆపస్తంబ సుత్రులు.తండ్రి సుంధరంపంతులు గ్రంథాలయోద్యమ కార్యకర్తగా పైరు పొందినవారు.ఈ పండితుని ఇంట్లో 19౦౦ నాటికే ౩౦౦ ముద్రిత గ్రధాలు,15౦౦ తాళపత్ర గ్రధాలు ఉండేవి.వీరు విజయనగరంలోనే ప్రారంభ విద్యాభ్యాసం చేసి, అక్కడ కళాశాలలో తెలుగు, చరిత్రఅభిమాన విషయాలుగా 192౦ లో బి.ఏ పట్టా పొందారు. తరువాత పైచదువులకు చదవటానికి తగినవసతులు లేక, విజయనగరంలోని మద్రాసు ఇంపీరియల్ బ్యాంకులో గుమాస్తాగా చేరారు.
ఆయన ఉన్నత పాఠశాల, ఇంటరు చదువు విశాఖపట్నంలోనూ, బి.ఎ. విజయనగరంలోనూ పూర్తి చేసారు. 1925లో బి.ఎ. పట్టం అందుకుని ఆర్థికపరిస్థితుల కారణంగా పైచదువుకి వెళ్లలేక, ఇంపీరియల్ బాంక్ (ఈనాటి స్టేట్ బాంక్) లో గుమాస్తాగా చేరేరు 1926లో. 1939 వరకూ గుమాస్తాగా పని చేసేరు. ఆ రోజుల్లో పిఠాపురం రాజావారు సూర్యారాయాంధ్ర నిఘంటువులో ఉద్యోగం ఇచ్చేరు. 1944 నుండి 1964వరకూ మద్రాసువిశ్వవిద్యాలయంలో ఉద్యోగం.తొలుత వీరు చేసిన ఉద్యోగము ధన విషయమున చిన్నదయి పరిశోధన విషయమున చిరస్మరణీయమై, ఆంధ్రశైవ వాజ్మయ విచారణాత్మక బహువిధ వ్యాసరచనా వ్యాసాంగమునకు కారణమైనది.అది వీరు చేసిన సూర్యరాయాంధ్ర నిఘంటువు ఏర్పాటుకు చాలా దోహదము అయినది.
ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు తీరిక కాలంలో, అనేక పద్య గద్య రచనలు చేస్తూ భారతి మొదలగు పత్రికలలో ప్రచురిస్తుండేవారు. తండ్రి సమకూర్చి ఉంచిన తాళపత్రాది గ్రంథాలు తనివితీరా చదివి క్రమంగా సాహిత్య పరిశోధన జిజ్ఞాసను పెంపొందించుకున్నారు. 1939 లో వీరు కాకినాడలోని సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయంలో పండితులుగా చేరి, నిఘంటు నిర్మాణంలో కొంత కాలం పాల్గొన్నారు. 1941 లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం సహా, ఎం. ఎ. పట్టా పొంది, 1942 వరకు కాకినాడలోని కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసారు. 1944 వీరు చెన్నై వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయంలో ఐదేళ్ళు జూనియర్ లెక్చరర్ గా పనిచేసి, తరువాత 1949 నుండి సీనియర్ లెక్చరర్ గా, తరువాత క్రమంగా రీడరుగా, ఆంధ్ర శాఖాధ్యక్షులుగా 1964 వరకు పనిచేసి, భాషా సాహిత్యాలలో విశిష్ట పరిశోధనను సాగించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ చేసిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1966 వరకు యు. జి . సి ప్రొఫెసరుగా ఆంధ్ర మహాభారత పరిశోదిత ప్రతికి సంబంధించిన పధకంలో పనిచేసారు. 1942 లో నరసరావుపేట ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు వీరికి “విద్యారత్న” గౌరవం ఇచ్చారు. 1951 లో విశ్వనాధ సత్యనారాయణ అద్యక్షతన విజయవాడలో జరిగిన సన్మాన సభలో “పరిశోధన పరమేశ్వర ” గౌరవం ఇచ్చారు. 1973 లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వీరిని “కళా ప్రపూర్ణ ” గౌరవం ఇచ్చింది. వీరి రచనలన్నింటినీ స్థూలంగా నాలుగు విధాలుగా విభజించవచ్చు. 1 : పద్యరచనలు: గాంధీ మహాత్ముని 50 వ జన్మదినోత్సవ సందర్భంలో 2-10-1919 న రచించిన పద్యాలే, ఈ పండితుని తొలి పద్య రచనలు. తరువాత పరవస్తు రంగాచార్యుల గురించి (1921), వెంకట రమణ అనే పేరుతో రచించిన వివిధ పద్యాలను ఆ తరువాత అన్నింటిలోనూ, వీరికి కవిగా పేరు తెచ్చిన రచనలు “మించుపల్లె ”, “తెలుపుపొలుగు”, “ఆంధ్రనలందా” అనే మకుటంతో రాసిన కవి స్తుతులు. “పోట్టిశ్రీరా మోదరణము” అనే ఉదాహరణ కావ్యం, “శ్రీరామ గీతామృతం” ఈ కోవకు చెందినవే. వార్ధక్యంలో విశ్రాంతి తీస్కోనే సందర్భంలో, రోజుకు నాలుగైదు పద్యాల చొప్పున మంగాసమేత శ్రీ వెంకటేశ్వర స్తుతి పద్యాలు రాయటమే కాక, తెలుగు దేశపు సాహిత్య రంగంలో వీరికి తెలిసిన వారిలో ప్రతి ఒకరి గురించి ఒక పద్యం చొప్పున 2500 పద్యాలు రాసారు. ఆధునికాంధ్ర సాహిత్య రచనకు ఈ పద్యాలు కొంతవరకు ఉపకరించగలవు. 2. గ్రంథ పరిష్కరణలు, పీఠికలు; తెలుగు ప్రాచీన గ్రంథ పరిష్కరణలో పేరు ప్రతిష్ఠలను తెలుగుదేశంలో పొందిన ముగ్గురు పండితులలో వీరు ఒకరు. తక్కిన ఇరువురు; మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి. అసమనధారణ శక్థితో వేలకు వేలు ప్రయోగాలను, పద్యాలను గుర్తుంచుకొని కావ్య పరిష్కరనలను ఒక కళగా రూపొందించిన పరిశోధకులు వీరు. మద్రాసు ప్రభుత్వపు ప్రాచ్య లికిత గ్రంథాలయం ప్రక్షణ, తంజావూరు సరస్వతీ మహల్ పక్షాన తెలుగు రాత ప్రతులను ఎన్నిక్క చేసే నిపుణుల స౦ఘంలో సభ్యులుగా వీరు గణనీయ కృషి చేసారు. ఆ గ్రంథాలయంలో కొన్ని గ్రంథాలను వీరు పరిష్కరించారు. వీటిలో పేర్కొనదగ్గవి : ‘ఖడ్గ లక్షణ శిరోమణి’, ‘కట్టావరదరాజ రామాయణము’ ‘రాజ గోపాల విలాసము’ వావిళ్ళవారు, ఆంధ్ర గ్రంథమాల, ఆంధ్ర సాహిత్య పరిషత్ మొదలగు పలువురు ప్రచురణ కర్తలు తమ గ్రంథాలలో ప్రముఖ మైన కొన్నింటిని వీరిచేత పరిస్కరింప చేసి ప్రచురించారు. సివతత్వసారం, కుమార సంబవము, అన్యవాదకోలాహలము, బసవపురానము, ఉత్తర హరివంశ ము, భాస్కర రామాయనము ఈ కోవకు చెందినవాటిలో కొన్ని. ఈ పరిశోధనకు పండితుడు పీఠికలు సంతరించిన ప్రభందాలు ఇరవైకి పైగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి, శ్రీ వెంకటేశ్వర శతకము, శతక సంపుటము, పట్టాభిరామ పాండిత్యం, రావిపాటి గురుమూర్తి శాస్త్రి రచించిన వ్యాకరణము, ప్రస్నోత్తరాంధ్ర వ్యాకరణము, లఘు వ్యాకరణము, ప్రౌఢవ్యాకర్ణము మొదలైన వ్యాకరణ గ్రంథాలు వీరు సామకూర్చిన పీఠికలతో వెలువడ్డాయి. బహుజనపల్లి వారి శబ్దరత్నాకరానికి అదనంగా 10 వేల శబ్దాలను చేర్చడమే కాక ఆ నిఘంటువుకు వీరి పీఠికను కూడా సమకూర్చారు. అది 1958 లో ముద్రితం. వీరు పీఠికలు సంతరించిన మరికొన్ని గ్రంథాలు: వీరి వీరచిత “వీరశైవ ప్రమాణ శతకాభరణము”; పాల్కురికి సోమనాధుని బసవోదాహరణము; భాస్కరలింగ శాస్త్రి కృత వీర భద్ర సముచ్చయము; వంగూరి సుబ్బారావు గారు వాజ్మయ చరిత్ర, శతక కవుల చరిత్ర.
పరిశోధన గ్రంథాలు
[మార్చు]మద్రాసు విశ్వ విద్యాలయ ప్రచురణలలో విరు రచించిన ఈ గ్రంథాలు ఈ పండితుని పరిశోధన పాటవానికి ప్రతీకలు ; ‘తెలుగు కవుల జీవితలు’ ‘తెలుగు సాహిత్యం లో దాక్షిణాత్య సంప్రతయము’ ఇంగ్లీష్ అనువాద వివరణలతో కూడిన 32 తెలుగు గద్య పద్య శాసనాలు, ద్రావిడ భాషలు తారతమ్యాలను గురించిన సంపుటాలలో తెలుగుకు సంబంధించిన సంపుటం. 1949-196౩ మధ్య తెలుగు భాషా సమితి, సాహిత్య అకాడమీల నుండి బహుకృతులు అందుకున్న ఈ క్రింది రచనలు వీరి పరిశోధన పాండితికి నిదర్శనాలు; త్రిపురాంతకోదాహరణము, ఆంధ్ర వచన వాఙ్మయము, కర్ణాటకాంధ్రముల పరస్పర ప్రభావము, విజయనగర సంస్థానము.
ఆయన త్రికరణశుద్ధిగా శైవ సిద్ధాంతాన్ని నమ్మడమే కాక, శైవ సాహిత్యం ఆనాటి సాంఘిక జీవనానికి అద్దం పట్టిందని గ్రహించాడు. హైందవ సాహిత్యం పండితులకి మాత్రమే పరిమతమయి, కేవలం వారి ఆచార, వ్యవహారాలని మాత్రమే గ్రంథస్థం చేసింది, కానీ బసవపురాణం వంటి శైవమత గ్రంథాలు వైదిక ధర్మాలని విడిచి ప్రజల జీవనానికి ప్రతీక అయి నిలిచాయి, అవి సరళ భాషలో సామాన్య జనానికి వేదాంత రహస్యాలు విడమరిచి చెప్పేయి అంటూ వెంకటరావు గారు దాదాపు ప్రతి పీఠికలోనూ, పరిష్కరణలలోనూ నిరూపించారు. ఆకోణంలోనుండి వెంకటరావు ప్రజల పండితుడుగా గౌరవం పొందేరు. ఏకసంథాగ్రాహి అని ప్రతీతి. వారు చదివిన ప్రతి పుస్తకం తిరిగి అప్పచెప్పగల సమర్థులు. వెంకటరావుగారు పండితారాధ్య చరిత్రకి విస్తృతమయిన పీఠికతోపాటు పరిష్కరించడంలో అసమానమయిన పాండిత్యాన్ని ప్రదర్శించేరని పండితులు శ్లాఘించేరు. నిజానికి ఆయన ఏ పుస్తకానికి పీఠిక రాసినా, కేవలం పుస్తకంలో వస్తువుకే పరిమితం చేయక, దానికి సంబంధించిన అనేక విషయాలు చర్చిస్తారు. వారిపీఠికలద్వరా పుస్తకం ప్రాచుర్యంలోనికి వచ్చినసందర్భాలు కూడా ఉన్నాయి. 1944లో త్రిపురాంతకోదహరణముకి విపుల పీఠిక రాసి ప్రచురించేరు. తొలిసారిగా ఈ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చింది నిడుదవోలు వెంకటరావుగారు. ఆయన ఉదాహరణ వాఙ్మయము అన్న గ్రంథం రాసి పండితులమన్నన అందుకున్నారు. శైవ సాహత్యంమీద విశేషంగా కృషి చేసేరు. పండితారాధ్యచరిత్రకి విస్తృతమైన పీఠిక వెంకటరావు గారికి ప్రతిష్ఠ తెచ్చింది.
పైన తెలుపబడినవే కాక, వారి రచనలలో బహుజనాదరణ పొందిన మరికొన్ని గ్రంథాలు : పోతన, చిన్నయసూరి జీవితము –హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము, ఉదాహరణ వాజ్మయ చరిత్ర, మెకెంజీ కైఫియత్తుల సంపుటాలు 17౦ లో మానవల్లి కవి 5౦ సంపుటాలను ఇంగ్లీష్ లోకి అనువదించగా, మిగిలిన 12౦ సంపుటాలను ఆంగ్లంలోకి అనువాదించిన ఘనత వీరిది. ఆ సంపుటాలు మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. 4పత్రికలు, రేడియోలకు రాసిన వ్యాసాలు : ఇవి బహుళ సంఖ్యలో ఉన్నాయి. ప్రామాణిక పరిశోధన పత్రికలకు వీరు రాసిన వ్యాసాలు సుమారు 2౦౦ తెలుగు భాష సమితి వారి విజ్ఞాన సర్వస్వానికి, తమిళ్ వాళర్చి క్కళగమునకు వీరు రచించిన అమూల్యవ్యాసాలు కొన్ని ఉన్న యి. అఖిల భారత ప్రాచ్య భాష సమావేశాలలోను, సేమినర్లలోను, ఈ పరిశోధకుని రచనలు కనబడుతాయి. తన జీవిత కాలంలో, బాషా సాహిత్య పరిశోధన సంబంధిచినంతవరకు జంగమ విజ్ఞాన సర్వస్వంగా గణనను పొంది 15-10-1982 న హైదరాబాదు లోని తన స్వగృహంలో కాలంచేశారు.
వీరు విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఏ. పట్టభద్రులైనారు. వీరు పిఠాపురం రాజావారి శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలోను, రాజావారి కళాశాలలో కొంతకాలం పనిచేశారు. అనంతరం మద్రాసులోని ప్రాచ్య పరిశోధన సంస్థలోని ఆంధ్ర శాఖలో చేరి క్రమేపీ ఆ శాఖకు అధ్యక్షులైరి. వీరు పరవస్తు చిన్నయసూరి జీవితచరిత్ర, కొప్పరపు సోదర కవుల చరిత్ర లను రచించిరి. 1982 అక్టోబరు 15 తేదీన దివంగతులయారు.
బిరుదులు
[మార్చు]- విద్యారత్న
- కళాప్రపూర్ణ
సాహిత్యం
[మార్చు]- త్రిపురాంతకోదాహరణము. విపుల పీఠికతో. 1944.
- చిన్నయసూరి జీవితము: పరవస్తు చిన్నయసూరికృత హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము సహితముగా. 1962.[1]
- దక్షిణదేశీయాంధ్ర వాఙ్మయము. The Southern School of Telugu Literature (with preface in English). 1954.
- కొప్పరపు సోదరకవుల చరిత్ర. 1973.
- నన్నెచోడుని కవితావైభవము: నన్నెచోడుని పద్యాలకు రుచిర వ్యాఖ్యానము. 1976.
- పోతన. 1962.
- తెనుగు కవుల చరిత్ర 1956.
- ఉదాహరణ వాఙ్మయ చరిత్ర. 1968.
- విజయనగర సంస్థానము: ఆంధ్రవాఙ్మయ పోషణ. 1965.
- ఆంధ్ర వచనవాఙ్మయము. 1977.
- ఆంధ్ర వచనవాఙ్మయము: ప్రాచీనకాలమునుండి 1900 ఎ.డి. వరకు. 1954.
పీఠికలు, వ్యాఖ్యానములు
[మార్చు]- శ్రీ నాచన సోముని హంస దింబికోపాఖ్యానము (ఉత్తర హరివంశము, చతుర్థ ఆశ్వాసము. 1972.
పరిష్కరించినవి
[మార్చు]- మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము. నిడుదవోలు వెంకటరావు విపుల టీకతాత్పర్యములతో. 1968
- నంది మల్లయ ప్రబోధ చంద్రోదయము. సం. నిడుదవోలు వెంకటరావు. 1976.
- బహుజనపల్లి సీతారామాచార్యులు. శబ్దరత్నాకరము. నిడుదవోలు వెంకటరావుచే సరిదిద్దబడింది. 1969.
ఇతర రచయితలతో సహకరించి కూర్చిన గ్రంథములు
[మార్చు]- మడికి సింగన. సకల నీతిసారము. సం. నిడుదవోలు వెంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు. 1970.
- మానవల్లి రచనలు. సం. నిడుదవోలు వెంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు. 1972.
- తెలుగు కన్నడముల సాంస్కృతిక సంబంధములు. సం. నిడుదవోలు వెంకటరావు, et. Al. 1974.
- తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ బాషలలో సాటి సామెతలు. కూర్పు. నిడుదవోలు వెంకటరావు, et. al., 1961.
నిడుదవోలు వెంకటరావు కృషి గురించి ఇతరుల రచనలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ వేంకటరావు, నిడదవోలు. చిన్నయసూరి జీవితము.
- కళాప్రపూర్ణ నిడుదవోలు వేంకటరావుగారి రచనలు - పరిశీలన, డాక్టర్ నిష్టల వెంకటరావు, రావు పబ్లికేషన్స్, హైదరాబాదు, 1998
బయటి లింకులు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- కళాప్రపూర్ణ గ్రహీతలు
- తెలుగు పరిశోధకులు
- 1903 జననాలు
- 1982 మరణాలు
- తెలుగు రచయితలు
- విజయనగరం జిల్లా రచయితలు
- విజయనగరం జిల్లా సాహితీ విమర్శకులు
- విజయనగరం జిల్లా సాహితీ పరిశోధకులు