Jump to content

నీలంరాజు వేంకటశేషయ్య

వికీపీడియా నుండి
(నీలంరాజు వెంకట శేషయ్య నుండి దారిమార్పు చెందింది)
కాకినాడ తాటినార వర్తక సంఘం వారు నీలంరాజు వెంకట శేషయ్యను సన్మానించినప్పటి దృశ్యం. (జనవరి 1961)

నీలంరాజు వేంకటశేషయ్య ప్రముఖ పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, నటుడు, సాహితీకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.

వేంకటశేషయ్య 1905, డిసెంబరు 22న, ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకాలోని కొరిసపాడులో జన్మించాడు.[1] మహాత్మా గాంధీ పిలుపు విని పదిహేనేళ్ల వయస్సులో పాఠశాల వదిలి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. టంగుటూరి ప్రకాశం పంతులు స్వరాజ్య పత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్న కాలంలో ఆయనకు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. ఆంధ్ర కేసరి అడుగుజాడలలో నడచి అటు పాత్రికేయం, ఇటు నాటక ప్రదర్శనం, మరొకవైపు జాతీయ స్ఫూర్తిని పుణికి పుచ్చుకున్నాడు. అతి పిన్న వయసులోనే పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించి స్వరాజ్య, ఆంధ్రపత్రికలలో పనిచేసి తర్వాత సొంత వార పత్రిక నవోదయను స్థాపించాడు. ఆంధ్రపత్రికలో విలేఖరిగా చేరి, ఉప సంపాదకుడుగా, ఆ తరువాత సంపాదకుడిగా ఎదిగాడు. ఆంధ్రపత్రికలో విలేఖరిగా ఉన్నకాలంలో సినిమా పేజీని నీలంరాజు నిర్వహించేవాడు. 1945 నుండి 1951 వరకు ఆరు సంవత్సరాల పాటు ఆంధ్రపత్రిక సంపాదకునిగా పనిచేశాడు.[1] 1960 నుండి 1969 వరకు ‘ఆంధ్రప్రభ’ దినపత్రికకు సంపాదకునిగా కూడా నీలంరాజు వేంకట శేషయ్య వ్యవహరించాడు.[2]

కంచిస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతికి ప్రియ శిష్యుడై ‘నడిచే దైవం’గా కంచిస్వామిని అభివర్ణిస్తూ ఒక గ్రంథాన్ని రచించాడు. భద్రాచలం రామాలయ పునరుద్ధరణకు విశేష కృషి చేశాడు. భద్రాచలంలో రామదాసు ధ్యాన మందిరం కట్టాలని సంకల్పించి, కట్టించాడు. ‘మరపురాని మనీషి’ శీర్షికలో తిరుమల రామచంద్రతో ఎన్నో వ్యాసాలు రాయించి ఎందరో మరుగున పడిన మాణిక్యాలను సమాజానికి పరిచయం చేసింది వెంకట శేషయ్యనే.

టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు నుండి నడిపించిన స్వరాజ్య పత్రికలో వేంకటశేషయ్య పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం మద్రాసు నుండి వెలువడే ఆంధ్రపత్రికలో నీలంరాజు సినిమా పేజీ నిర్వహించేవాడు. 1939లో విడుదలైన ఉషా పరిణయం చిత్రంలో అనిరుద్ధుని పాత్రలో నటించాడు, ఆంధ్ర నాటక కళా పరిషత్‌కు కార్యదర్శిగా కూడా వ్యవహరించాడు.[3] 1934లో నాట్య కళ అనే పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడిగా ఉన్నాడు. అనేక నాటకాలలో కూడా నటించాడు.

మూలాలు

[మార్చు]