నెల్లుట్ల రమాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెల్లుట్ల రమాదేవి
జననం
వరంగల్‌లోని స్టేషన్‌ఘన్‌పూర్‌,తెలంగాణ
వృత్తితెలుగు కవయిత్రి,కథకురాలు,ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు.
జీవిత భాగస్వామిదేవేందర్
పిల్లలుఇద్దరు కుమారులు(ధృవ తేజ్‌, నయన్ దీప్‌)

నెల్లుట్ల రమాదేవి తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు.[1] ఆమెకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'కథ' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[2] ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె కథలు, కవిత్వం రాయడమేకాక కార్టూన్‌ ప్రక్రియలోకూడా ఆమెకు మంచిప్రవేశం ఉంది. రమణీయం, మనసు భాష, మనసు మనసుకూ మధ్య పుస్తకాలను వెలువరించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

రమాదేవి జనగామ జిల్లా, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం, స్టేషన్‌ఘన్‌పూర్‌ లో రామచంద్రరావు, శకుంతలాదేవి దంపతులకు జన్మించింది.తండ్రి వ్యవసాయం చేయిస్తూ కరణం వృత్తి చేసేవాడు ఆమె పాఠశాల విద్యను స్టేషన్‌ఘన్‌పూర్‌లో పూర్తిచేసారు.బాల్యం నుండి ఆమెకు మిమిక్రీ అంటే ఆసక్తి ఎక్కువ. చదువు విషయంలో ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించేది. ఆమె తల్లి పుస్తకాలు, నవలలు బాగా చదివేది. పిల్లలను కూడా చదివేందుకు ప్రోత్సహించేది. పత్రికలలో గల కార్టూన్లు చూసి ఆసక్తి కనబరచేవారు. ఇంటర్ చదువుతున్నప్పుడు మొదటిసారి కార్టూన్ వేసారు. 1978 లో ఆమె మొదటి కార్టూన్ స్వాతి పత్రికలో అచ్చువేయబడినది. ఆమె కళాశాల విద్య హైదరాబాదులోని రెడ్డి మహిళా కళాసాలలో జరిగింది. ఆమె వివాహం 1983 లో దేవేందర్ తో జరిగింది. ఆమె భర్త ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రిపోర్టర్‌గా చేశారు. గ్రూప్‌ 2 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె బ్యాంక్‌ ఉద్యోగంలో చేరారు. మొదట్లో గ్రామీణ బ్యాంక్‌లో 1984లో చేసారు. 1986లో ఆంధ్రా బ్యాంక్‌ క్లర్క్‌గా చేరి ప్రస్తుతం మార్కెటింగ్‌ జోనల్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు.ఆమెకు ఇద్దరు కుమారులు(ధృవతేజ్‌, నయనదీప్‌). ఇలా ఇప్పటికీ బ్యాంక్‌ ఉద్యోగం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు కార్టూన్లు వేస్తూ కవితలు,కథలు రాస్తున్నారు.

కార్టూనిస్టుగా

[మార్చు]

ఆమె ఎన్నో కథలు, కవితలు రాశారు. కానీ తనని కార్టూనిస్టుగా చెప్పుకోవడానికే ఆమె ఇష్టపడతారు. ఎందుకంటే కార్టూన్‌ వేసేటపుడు దైనందిన జీవితంలో జరిగే విషయాలే ప్రేరణ కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో, వివాహాలలో చాలా హాస్య విషయాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటికి కాస్త అతిశయోక్తి జోడిస్తే హాస్యం, వ్యంగ్యం ఉంటుంది. కథ, వ్యాసం, కవిత ఇవన్నీ చెప్పే విషయాలనే ఒక చిన్న స్థలంలోకార్టూన్‌ ద్వారా చెప్పవచ్చనేది ఆమె భావన.

కథలు

[మార్చు]

ఈమె కథల్లో మాతృత్వం విలువను చెప్పే స్త్రీలు, రాజకీయ నాయకుల వాగ్దానాలకు మోసపోయినవారు, బాధ్యతలేని భర్త నుండి దూరమై కుటుంబాన్ని పోషించుకునే ఇల్లాలు, కట్నం కోసం వెంపర్లాడే వ్యక్తిని భర్తగా అంగీకరించక తిరస్కరించే ఆత్మాభిమానం ఉన్న విద్యావంతులైన యువతులు ఈమె కథల్లో కనిపిస్తారు. ఇంకా పిల్లల సంతోషమే తన సంతోషంగా బ్రతికే మాతృమూర్తి, వ్యక్తిత్వమే ఊపిరిగా ఉన్న యువతులు, తనప్రేమను అర్థం చేసుకోలేని భర్తను చూసి నిస్సహాయులైన భార్యలు, వృద్ధాప్యంలో కూడా అమ్మమ్మే అమ్మవాత్సల్యాన్ని పంచే స్త్రీలు నెల్లుట్ల రమాదేవి కథల్లో కనిపిస్తారు.[3]

కవయిత్రిగా

[మార్చు]

వరంగల్‌లోని ఆకాశవాణి సెంటర్‌ ఆమెను కవయిత్రిగా మార్చేసింది.ఒక సారి కార్టూనిస్టుగా వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆమె కవితలు రాస్తానని తెలిసి కవితలు పంపమన్నారు. అప్పటి కప్పుడు రెండు కవితలు రాసుకొని చదివారామె. అప్పటి నుండి ఆమె కవితలు ఆకాశవాణిలో చదవమని అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఇలా ఆకాశవాణి వారే ఆమెను కవయిత్రిని చేశారు. దాంతో కవితలు రాయాలనే ఉత్సాహం ఆమెలో పెరిగింది. అలాగే వరంగల్‌లో ప్రతి ఉగాదికి కవితా సంపుటి వచ్చేది.దానికి కూడా ఆమె కవితలు పంపేవారు.

పురస్కారాలు

[మార్చు]
  1. రచయిత్రి విభాగంలో ప్రతిభా పురస్కారం 2015 - తెలుగు విశ్వవిద్యాలయం, 20 డిసెంబరు 2O16.[4][5]
  2. కథ విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)[6]

మూలాలు

[మార్చు]
  1. "ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 2". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-30.
  2. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
  3. నెల్లుట్ల రమాదేవి కథల్లో స్త్రీలు
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 9 June 2020.
  5. ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 9 June 2020.
  6. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.

ఇతర లింకులు

[మార్చు]