కొండా వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: en:Konda Venkatappaiah
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6428924 (translate me)
పంక్తి 59: పంక్తి 59:
[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]

[[en:Konda Venkatappaiah]]

20:06, 8 మార్చి 2013 నాటి కూర్పు

కొండా వెంకటప్పయ్య
జననంఫిబ్రవరి 22, 1866
గుంటూరు
మరణంఆగస్టు 15, 1949
ఇతర పేర్లుదేశభక్త
వృత్తిస్వాతంత్ర్య సమర యోధుడు, పాత్రికేయుడు

కొండా వెంకటప్పయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఆయన గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‍కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు.

తొలి జీవితం

1866 సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరు లో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. ప్రాధమిక విద్య గుంటూరు మిషన్ స్కూలులో, ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తిచేసి తరువాత బి.ఎల్. పట్టాపొంది బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. వెంకటప్పయ్యకు మొదటి నుండి పౌరవ్యవహారలలో ఎక్కువ ఆసక్తి వుండటం వలన, అదే పనులు చేయడానికి ఎక్కువ ఉత్సాహపడేవాడు. దేశభక్తి, ప్రజాసేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడురూపాయిలు తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవాడు.

కృష్ణా పత్రిక

ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో, జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాలలో కృషి జరుగుతున్న రోజులలో వెంకటప్పయ్య 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించాడు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపి, గుంటూరులో స్థిరపడగానే దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావు కు అప్పగించాడు. న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జనే ప్రధాన వృత్తిగా పెట్టుకోలేదు. దాన, ధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ముకొనవలసి వచ్చింది. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా నికేతన్‍కి వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మివేసి పది వేల రూపాయల విరాళం ప్రకటించాడు. 1910లో బందరులో జాతీయ కళాశాలకు ఆయన ప్రారంభోత్సవం జరిపాడు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన

1912 మే నెలలో కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయ మహాసభ నిడదవోలులో జరిగింది. అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లాలేదు. కొవ్వూరు నుంచి బెజవాడ వరకు కృష్ణా జిల్లాయే. ఆ సభలోనే కొండా వెంకటప్పయ్య సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలగు గుంటూరు యువకులు పదకొండు తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మంతనాలు జరిపారు. 1913లో గుంటూరు జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరిగింది. అదే ప్రదేశంలో కొండా వెంకటప్పయ్య సలహా మేరకు ప్రధమాంధ్ర మహాసభ బి.ఎస్.శర్మ అధ్యక్షతన జరిగింది. దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన రాయబార వర్గంలో కొండా వెంకటప్పయ్యదే ప్రధాన పాత్ర. నెల్లూరు లో జరిగిన ఆంధ్ర మహాసభకు అతనే అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రం రూపొందించాడు. 1917లో రాజ్యాంగ సంస్కరణల విషయమై పరిశీలనలు జరపడానికి మాంటేగ్ - చమ్స్‍ఫర్డ్ ప్రతినిధి వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రతినిధివర్గం మద్రాసు కు వచ్చినప్పుడు భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాల విభజన అవసరాన్ని ఉగ్గడించిన ఆంధ్ర ప్రతినిధులలో కొండా వెంకటప్పయ్య ముఖ్యుడు.


1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఇది తొలివిజయం. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్యదర్శి వెంకటప్పయ్యే. ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు కలసి ఒకే నియోజక వర్గంగా ఉండేది. ఓటర్లు అంతా కలిపితే 500 మంది మాత్రమే. ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి కొండా వెంకటప్పయ్య మద్రాసు కౌన్సిలుకు ఎన్నికయ్యాడు. సహాయక నిరాకరణోద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెసు పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే కొండా వెంకటప్పయ్య అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత ఆయన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడై అభిలభారత కాంగ్రెస్ సభ్యుడయ్యాడు.


1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయల విరాళాలుగా స్వీకరించి స్వరాజ్యనిధికి సమర్పించాడు. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యంలో పాల్గొన్నందుకు ఆయన మొదటిసారి శిక్ష అనుభవించాడు.

అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా

1923 లో కాకినాడ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు చారిత్రాత్మకమైనవి. సహాయనిరాకరణ శాసనోల్లంఘనల అనంతరం శాసన సభా ప్రవేశ వాదులకు, బహిష్కరణ వాదుల మధ్య తీవ్ర చర్చలు జురుగుతున్న రోజులవి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన దేశబంధు చిత్తరంజన్ దాస్ ఈ విభేదాల మధ్య తన పదవికి రాజీనామా చేశాడు. మధ్యే మార్గంగా వెంకటప్పయ్యని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అయ్యాడు. స్వల్పకాలమే అయినా అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని బెజవాడకు తరలించారు. ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణ ఘట్టం. గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్యే ఆ రోజుల్లో నాయకత్వం వహించేవాడు. ఆంధ్ర ఖద్దరుకి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రాధనమైనది.

1933లో మహాత్ముడు ఆంధ్రలో హరిజన యాత్ర సాగించాడు. అనేక గ్రామాలలో హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించాడు. ఆంధ్రదేశంలో ౬౫వేల రూపాయలు హరిజన నిధి వసూలైంది. ఒక వంక భార్య మృత్యుశయ్యపై ఉన్నప్పటికీ కొండా వెంకటప్పయ్య హరిజన సేవలో ఉన్నతులై తిరుగుతున్నాడని మహాత్మాగాంధీ అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడుగా

1929లో సైమన్ కమీషన్ రాక సందర్భంలోనూ, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలు శిక్షలు విధించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యాడు. భాషా ప్రాతిపదిక మీద మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభిజించాలని కొండా వెంకటప్పయ్య శాసన సభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. 1920 నుంచి 1949లో కీర్తి శేషులయ్యే వరకు ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాజకీయాలలో ఆయన స్థానం దేశ రాజకీయలలో మదనమోహన మాలవ్యా స్థానం లాంటిది. కాంగ్రెస్ అగ్రనాయకులందరు దేశ భక్తను గౌరవించేవారు.

ఏమైనా యావద్భారత రాజకీయరంగంలో ఆంధ్రజాతి తన ప్రతిభకు, త్యాగాలకు సముచిత స్థానం పొందలేకపోయినట్లే, "దేశభక్త " కొండా వెంకటప్పయ్య అఖిల భారత రాజకీయలలో తన ప్రతిభకు, త్యాగానికి సముచిత స్థానం పొందలేకపోయాడు. 1938లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర శాసన సభా కాంగ్రెస్ పక్షంలో ముగ్గురు కార్యదర్శులలో ఒకడిగా ఆయన్ను నియమించి ఆయన త్యాగలకు ఆ విధంగా విలువకట్టారు. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు కూడా అధ్యక్షడిగా పని చేశాడు.

అఖిల భారత చరఖా సంఘానికి జీవిత కాలం సభ్యుడిగా వున్నాడు. గ్రంథాలయోద్యమానికె కూడా తోడ్పడ్డాడు. ఆయన స్వరాజ్యపోరాటంలో వుండగా ఆయన సతీమణి పక్షవాతంతో మరణించింది.

రచనలు

కొండ కడలూరు జైలులో వున్నప్పుడు "డచ్ రిపబ్లిక్" అనే గ్రంథాన్ని రచించాడు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశాడు. "శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి" అన్న భక్తి రసభరితమైన శతకాన్ని రచించాడు. ఆయన ఇంగ్లీషులోనూ తెలుగులోనూ మంచి వక్త, కవి. మొదటి నుంచి నాటకాలంటే కొండా వెంకటప్పయ్యకు చాలా మక్కువ, స్త్రీ పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు.


కళాదృష్టితో, కళాతృష్ణతో, మానవతవాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి కొండా వెంకటప్పయ్య 1949 ఆగష్టు 15 వ తేదీన దేశ స్వాతంత్ర్య పుణ్యదినాన దేశభక్తులైన వారందరినీ సంతాప సాగరంలో ముంచుతూ స్వర్గస్థులయ్యాడు.

స్వాతంత్రం తరువాత కాంగ్రెస్ గురించి

కొండా వెంకటప్పయ్య వ్రాసిన విషయం గురించి వార్త[1]

కొండా వెంకటప్పయ్య ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. [2] స్వాతంత్ర్యం తరువాత పెచ్చుపెరిగిన అవినీతి గురించి ఆయన మహాత్మా గాంధీకి ఇలా రాసాడు. "మనం మనస్ఫూర్తిగా కోరుకొన్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్య యోధులలో నీతి నియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతున్నది. ప్రజలు కాంగ్రెస్‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెసు అవినీతికి ఆలవాలమైపోతున్నది. వారిని అదుపు చేయాల్సిన పోలీసు వ్యవస్థ కాంగ్రెసువారి కట్టడిలో ఉండిపోయింది. పైసా ఆదాయంలేనివారు ఇప్పుడు మహారాజులలాగా పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారు. కాంగ్రెసు ఎమ్.ఎల్.ఏలూ, ఏమ్.ఎల్.సి లు తరచు జోక్యం చేసుకోవడం వలన జిల్లా కలెక్టరులూ, రెవిన్యూ అధికారులూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఈ పైరవీకారుల ప్రభావం దుష్ప్రచారం భయంతో నిజాయితీగల వారు తమ పదవులలో ఉండే పరిస్థితి లేదు."

ఇది స్వాతంత్రం వచ్చిన నాలుగు నెలలలో, 1947 డిసెంబరులో కొండా వెంకటప్పయ్య మహాత్మా గాంధీకి వ్రాసిన లేఖ.

బయటి లింకులు