బిల్ల మహేందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిల్ల మహేందర్
బిల్ల మహేందర్
జననంసెప్టెంబరు 09
వేలేర్, హన్మకొండ జిల్లా
నివాస ప్రాంతంహన్మకొండ, హన్మకొండ జిల్లా
వృత్తిప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు
ప్రసిద్ధితెలుగు సాహితీవేత్త, సమాజ సేవకులు

బిల్ల మహేందర్ ప్రముఖ వర్థమాన తెలుగు సాహితీవేత్త, సమాజ సేవకులు.[1]

జననం[మార్చు]

బిల్ల మహేందర్, 1976 సెప్టెంబరు 09 న హన్మకొండ జిల్లా లోని వేలేరు గ్రామంలో జయ, రాజమౌళి దంపతులకు రెండవ సంతానంగా జన్మించాడు.[1]

కుటుంబ నేపథ్యం[మార్చు]

మహేందర్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే బతుకుదెరువు కోసం బొంబాయికి వలస వెళ్ళారు. వీరిది సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం. మహేందర్ తండ్రి ప్రస్తుతం సిరిసిల్లలో చేనేత కార్మికుడిగా, తల్లి దినసరి కూలీగా పనిచేస్తున్నారు.

బాల్యం[మార్చు]

మహేందర్ బాల్యమంతా దాదాపు వేలేర్ లోనే గడిచింది. రెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు కొంతకాలం బొంబాయిలో గడిచింది. చిన్నతనంలోనే అతనికి పోలియో వ్యాధి సోకింది. అయినా కూడా చాలా చురుకుగా ఉండేవాడు.

విద్యాభ్యాసం[మార్చు]

మహేందర్ పాఠశాల విద్యాభ్యాసమంతా వేలేర్లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కొనసాగింది. ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మహాకవి శ్రీశ్రీ గారి ప్రముఖ రచన మహాప్రస్థానం పుస్తకం చదివాడు. దాంతో శ్రీశ్రీ మీద అభిమానం, సాహిత్యం మీద అభిరుచి, ఆసక్తి ఎర్పడ్డాయి. పదవ తరగతిలో తెలుగు మాస్టారు బోధనా ప్రభావం వల్ల తెలుగు భాష పట్ల గౌరవం, ఇష్టం ఏర్పడింది.1993-1998 మధ్య కాలంలో వరంగల్ లోని చందా కాంతయ్య స్మారక కళాశాలలో ఇంటర్మీడియేట్, డిగ్రీ విద్య అభ్యసించాడు. ఆ తర్వాత 1999లో నాగార్జున సాగర్ లోని ఉపాధ్యాయ విద్యా కళాశాలలో బి.ఎడ్. పూర్తి చేసాడు. అనంతరం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.(తెలుగు)లో పట్టభద్రుడయ్యాడు.[1]

ఉద్యోగం[మార్చు]

విద్యాభ్యాసం అయిపోగానే 2000 సంవత్సరంలో డి.ఎస్సీ. ద్వారా ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. మొదట దేవరుప్పుల మండలంలోని ప్రాథమిక పాఠశాలలో, ఆ తర్వాత నర్మెట్ట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసాడు. ప్రస్తుతం హసన్ పర్తి మండలంలోని సుబ్బయ్యపల్లె గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు.

వివాహం[మార్చు]

2002లో సరితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు(అక్షిత్, ఆశ్రిత్) కలిగారు.

రాణిస్తున్న రంగాలు[మార్చు]

సాహితీ కృషి[మార్చు]

మొదట ప్రేమ, ప్రకృతి మొదలగు అంశాల మీద కవిత్వం రాసిన మహేందర్ ఆ తర్వాత సామాజిక అంశాల గురించి కవిత్వం రాయడం ప్రారంభించాడు. 2009 నుండి కొనసాగిన తెలంగాణ స్వరాష్ట్ర సాధన మలిదశ ఉద్యమం మహేందర్ ను బాగా ప్రభావితం చేసింది. ఉద్యమాలలో, సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటూనే ఆ భావజాలంతో రాసిన గేయాలతో 2011లో పోరుగానం అనే తన తొలి సంపుటి వెలువరించాడు. ఉద్యమం తీవ్రస్థాయికి చేరిన సందర్భంలో విద్యార్థుల ఆత్మబలిదానాలను చూసి చలించిపోయి బలిదానాలు మరుద్దాం అనే శీర్షికతో ఒక దీర్ఘ వ్యాసాన్ని రాసి, బుక్లెట్ గా రూపొందించి, పంచి పెట్టి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 2012లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంతోనే పిడికిలి అనే స్వీయ కవితా సంపుటి ఆవిష్కరించాడు. మహేందర్ తెలంగాణ ఉద్యమం మలిచిన కవిగా తనను తాను పేర్కొంటాడు.

ఒక వికలాంగుడిగా తను ఎదుర్కున్న సమస్యలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది కవులను సంప్రదించి వారి చేత ప్రత్యేక ప్రతిభావంతుల పై కవితలు రాయించి 100 కవితలతో కాలాన్ని గెలుస్తూ.. అనే కవితా సంకలనాన్ని రూపొందించి 2014లో వెలువరించాడు. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో వికలాంగుల గురించిన అంశంతో వచ్చిన తొలి కవితా పుస్తకంగా గుర్తింపు పొందింది, అలాగే మహేందర్ కు సంపాదకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. 2015లో కూడా అదే అశంతో తన స్వీయ కవితలతో గెలుపు చిరునామా అనే సంపుటి ప్రచురించి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా విడుదల చేయించాడు.

తన అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. సామాజిక సమస్యలకు స్పందిస్తూ రాసిన పలు కవితలతో 2016లో కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ప్రశ్నలు అనే కవితా సంపుటి వెలువరించాడు. అదే సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘం-వరంగల్ శాఖకు సంయుక్త కార్యదర్శిగా నియమితుడయ్యారు. తన పనితనంతో అనతికాలంలోనే ఎదిగి ప్రస్తుతం అదే సంస్థకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, భాధ్యతలు చేపట్టి సాహిత్య సేవ కొనసాగిస్తున్నాడు.

చాలా సాహిత్య పత్రికలు, దిన పత్రికలు, మాస పత్రికలు, సంకలనాలు, అంతర్జాల పత్రికలలో మహేందర్ రచించిన పలు కవితలు, పాటలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ప్రముఖుల ప్రశంసలందుకున్నాయి. 2015లో తన స్వగ్రామం మీదున్న మక్కువతో తను రాసిన పాటలతో మా ఊరు అనే ఒక ఆడియో సీడీ కూడా రూపొందించి విడుదల చేశాడు.2020లో ఇప్పుడొక పాట కావాలి, తను నేను వాక్యం అనే రెండు కవితా సంపుటులను ఒకేసారి వెలువరించాడు. అవి మరింత పేరు తీసుకొచ్చాయి. అదే 2020 సంవత్సరంలో కరోనా వైరస్ వ్యాధి విపత్తు కాలంలో కోవిడ్-19, వలసదుఖం అనే రెండు కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించి వెలువరించాడు. కోవిడ్-19లోని కవితలు ఓరుగల్లుకు చెందిన కవులు రాసినవి. వలసదుఖంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందికి పైగా కవులు వలస కార్మికుల పై రాసిన కవితలున్నాయి.[1]. గతంలో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన 'బిల్కిస్ బానో' అత్యాచార సంఘటన నేపథ్యంలో శిక్షకు గురైన నేరస్తులను గుజరాత్ ప్రభుత్వం 2022 ఆగష్టు 15న క్షమాభిక్ష పేరుతో విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఆమెకు సంఘీభావంగా తెలుగు కవులు రాసిన కవితలతో తన సంపాదకత్వంలో 'బిల్కిస్ బానో' అనే కవిత్వ సంపుటాన్ని తీసుకొచ్చారు.

ప్రచురించిన పుస్తకాలు[మార్చు]

బిల్ల మహేందర్ పుస్తకాలు
తను-నేను-వాక్యం విడుదల దృశ్యం
ఇప్పుడొక పాట కావాలి విడుదల దృశ్యం
 • పోరుగానం (తెలంగాణ ఉద్యమ గేయ సంపుటి) - 2011
 • బలిదానాలు మరుద్దాం (బుక్లెట్) - 2011
 • పిడికిలి (తెలంగాణ ఉద్యమ కవితా సంపుటి) - 2012
 • కాలాన్ని గెలుస్తూ.. (ప్రత్యేక ప్రతిభావంతుల పై కవితా సంకలనం) – సంపాదకత్వం - 2014
 • గెలుపు చిరునామా (ప్రత్యేక ప్రతిభావంతుల పై కవితా సంపుటి) - 2015
 • కొన్ని ప్రశ్నలు - కొన్ని జ్ఞాపకాలు(కవితా సంపుటి) - 2016
 • తను - నేను - వాక్యం (కవితా సంపుటి) - 2020
 • ఇప్పుడొక పాట కావాలి (కవితా సంపుటి) - 2020
 • కోవిడ్ 19 (కరోనా వ్యాాధి విపత్తుపై కవితా సంకలనం) – సంపాదకత్వం - 2020
 • వలసదుఃఖం (వలస కార్మికులపై కవితా సంకలనం) – సంపాదకత్వం - 2020
 • బిల్కిస్ బానో (సంఘీభావ కవితా సంపుటి) - 2022

సామాజిక సేవ[మార్చు]

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) (ప్రస్తుతం TPTF) సభ్యుడిగా ఉంటూ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు కొనసాగించాడు.

మహేందర్ గతంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్ పియస్) లో సభ్యులుగా ఉంటూ దానికి అనుబంధంగా ఏర్పడిన ఫిజికల్లీ చాలెంజ్డ్ టీచర్స్ యూనియన్ (పిసిటియు) వరంగల్ జిల్లా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా, అనంతరం డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించాడు. గత దశాబ్ద కాలంగా దివ్యాంగుల హక్కులు, ఆత్మ గౌరవం కోసం కృషి చేస్తూ వివిధ సమస్యల పట్ల స్పందిస్తూనే సాహిత్య పరంగా దివ్యాంగుల అస్తిత్వం కోసం పలు రచనలు చేసి పుస్తకాలను ప్రచురిస్తున్నాడు.విద్య ద్వారానే సమానత్వం సాధించబడుతుంది అనే అంబేద్కర్ మాటను స్పూర్తిగా తీసుకుని, ప్రార్ధించే పెదాల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్న మథర్ థెరిస్సా సూక్తిని తనలో నింపుకొని కలిసి వచ్చిన మిత్రుల సహకారంతో 2014లో అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న విద్య ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాడు మహేందర్. ఆ సంస్థ ద్వారా వికలాంగ, అనాథ, నిరుపేద విద్యార్థులకు తగిన చేయూతనిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.2020 ఆగస్టు నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగ మేధావులు, ఉద్యమకారులతో సమాలోచన జరిపి, దివ్యాంగుల సామాజిక వేదిక (Differently Abled Social Forum) అనే సంస్థను స్థాపించి, దాని ద్వారా దివ్యాంగులకు సంబంధించిన వివిధ సమాచారాన్ని అందజేయడంతో పాటుగా, వివిధ దివ్యాంగ అంశాలపై అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తున్నాడు. అదే విధంగా ఇదే వేదిక ద్వారా యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసి కొన్ని కాలమ్స్ (కవిత్వం, వ్యక్తిత్వ వికాసం, విజేత, కళ, ఇంటర్వ్యూ ) ద్వారా దివ్యాంగులలో ఆత్మస్ధైర్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తూ, వారి అస్తిత్వం కోసం కృషి చేస్తున్నాడు.

అలాగే ఇంకెన్నో ఇతర సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ నిస్వార్ధంగా తన వంతు సేవలు అందిస్తున్నాడు.

నిర్వహిస్తున్న పదవీ భాధ్యతలు[మార్చు]

 • విద్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
 • దివ్యాంగుల సామాజిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు
 • తెలంగాణా రచయితల సంఘం - వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
 • దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ నిర్వహణ సభ్యులు
 • దివ్యాంగుల కో-ఆర్డినేషన్ మెంబర్ హన్మకొండ

అందుకున్న అవార్డులు/పొందిన సన్మానాలు[మార్చు]

 • జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - కలెక్టరేట్, వరంగల్ జిల్లా - (2015)
 • బో.వే.రా. రాష్ట్రస్థాయి ప్రత్యేక పురస్కారం - తెలంగాణ తెలుగు భాషా పరిరక్షణ సంఘం, జగిత్యాల - (2015)
 • డా. ద్వా.నా. శాస్త్రి రాష్ట్రస్థాయి ప్రత్యేక పురస్కారం - (2015)
 • మహాత్మ జ్యోతిభా ఫూలే జాతీయ పురస్కారం – భారత దళిత సాహిత్య అకాడమీ, ఢిల్లీ - (2016)
 • స్ఫూర్తి పురస్కారం - పద్మావతి ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ - (2018)
 • కాళోజీ పురస్కారం - తెలంగాణ రచయితల సంఘం, కరీంనగర్ జిల్లా శాఖ - (2019)
 • బిఎస్ రాములు స్ఫూర్తి పురస్కారం - విశాల సాహిత్య అకాడమి, హైదరాబాదు - (2019)
 • డా. రాధేయ కవితా పురస్కారం - డా. రాధేయ కవితా పురస్కార కమిటీ, అనంతపురం జిల్లా - (2020)
 • రొట్టమాకురేవు అవార్డు - కవి సంగమం, హైదరాబాద్ - 2022
 • బెస్ట్ రోల్ మోడల్ అవార్డు -2022 - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (2022)

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 "పిడికిలి బిగించి కాలాన్ని జయిస్తున్న బిల్ల | అంకురం". NavaTelangana. Archived from the original on 2022-12-07. Retrieved 2021-10-06.

ఇతర లింకులు[మార్చు]