మహమ్మద్ ఖదీర్ బాబు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
మహమ్మద్ ఖదీర్ బాబు | |
---|---|
జననం | మహమ్మద్ ఖదీర్ బాబు 1972 ఏప్రిల్ 28 కావలి , నెల్లూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ |
నివాస ప్రాంతం | హైదరాబాద్ ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా |
ఇతర పేర్లు | ఖదీర్ బాబు |
వృత్తి | పాత్రికేయుడు రచయిత |
మతం | ఇస్లాం |
తండ్రి | మహమ్మద్ కరీంసాహెబ్ |
తల్లి | సర్తాజ్ బేగం |
'మహమ్మద్ ఖదీర్ బాబు [1]' ఒక తెలుగు కథా రచయిత
రచయిత పరిచయం:
[మార్చు]ఖదీర్ బాబు సొంత ఊరుకావలి, నెల్లూరు జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్ వాస్తవ్యులు. ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్ లో పనిచేసి, సాక్షి ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం.
అవార్డు : 2013 మే 18...ప్రసిద్ధ కథకుడు మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు, 2012 కి, ‘కథాకోకిల’ అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబుకి హోసూరులో కథకుల సదస్సులో ప్రదానం చేశారు.
బ్రిటీష్ కౌన్సిల్ ఫెలోషిప్ : జూన్ 2013..ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ప్రతిష్ఠాత్మక 'చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్ ' కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి.ఈ ఫెలోషిప్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గెస్ట్ ప్యాకల్టీగా పనిచేస్తున్న నాగా మనోహర్ రెడ్డి ఈ కథలను అనువాదం చేయడానికి పొందారు. తెలుగు కథలకు ఈ ఫెలోషిప్ దొరకడం ఇదే తొలిసారి. ఖదీర్ బాబు తాజా పుస్తకం `మెట్రో కథలు`.
రచనలు:
[మార్చు]- మొదటి కథ ' పుష్పగుచ్ఛం' ను 1995 లో వ్రాసారు.
- దర్గామిట్ట కతలు (1 edition - first published in 1999 )
- పోలేరమ్మబండ కతలు (1 edition - first published in 2004)
- పప్పుజాన్ కథలు (1 edition - first published in 2004)
- బాలీవుడ్ క్లాసిక్స్ (1 edition - first published in 2010)
- మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు,
- నూరేళ్ల తెలుగు కథ (1 edition - first published in sep 20011)
- న్యూ బాంబే టైలర్స్ (కథల సంపుటి) (1 edition -published 2012 ఫిబ్రవరి 15)
- బియాండ్ కాఫీ (కథల సంపుటి) (1 edition -published August 2013)
- కథలు ఇలా కూడా వ్రాస్తారు (1 edition -published March 20, 2016)
- మెట్రో కథలు (1 edition - published ఏప్రిల్ 2018}
దర్గామిట్ట కతలు
[మార్చు]ఇందులో ఇరవై ఐదు కథలున్నాయి నూట నలభై పేజీల్లో. అన్నీ చిన్న చిన్న కథలే. పుస్తకం కవరు అక్బరు వేసిన వర్ణ చిత్రంతో ముచ్చటగా వుంది. ప్రతి కథకీ ముందూ చివరా మోహన్ గీసిన రేఖా చిత్రాలు గిలిగింతలు పెట్టిస్తాయి. ఈ కతలన్నీ 1998-99 మధ్యన ఆంధ్రజ్యోతి వార పత్రికలో అచ్చయ్యాయి.
ఈ పుస్తకం సమీక్షకై ప్రధాన వ్యాసం: దర్గామిట్ట కతలు చూడండి.
ఫుప్పుజాన్ కథలు (పిల్లల జానపద సంపద)
[మార్చు]ఇందులో మొత్తం 44 కథలు ఉన్నాయి
- బఠాణిరాజుది బలే తమాషా
- జింకమ్మాజింకమ్మా
- సెబ్బాష్ రాజుగారు
- సుబుర్ బాషా
- గుత్తి వంకాయ కూర
- నిద్రనేది ఒకటి ఉంది కదా
- అల్లాకే నామ్ పా ఖైరాత్ కర్
- బీ ఫిత్నీ
- నక్కసాయెబు - నక్క బీబీ
- నక్టామాము
- ఆకలి - ఆపిల్ పండు
- ఫలాతున్ పిచుక కథ
- హమ్ న హలాల్ తుమ్ న హరామ్
- మూడు ఖర్చులు
- తైమూరు రాజు - చీమ
- యా బలఖ్ యా బాషా
- ఎంత చేసుకుంటే అంత
- భర్రున ఎగిరిపోయిందోచ్
- మనుషుల కథ పిల్లినే అడగాలి
- ఎక్కడి నుంచి రాకడ? ఎక్కడికి పోకడ?
- మఛిలీ బందర్ బాషా
- ఎవరు ఫైల్వాను?
- షర్ఫుద్దీన్
- మిట్టూ రాజా
- కొంచెం అంటే ఎలా కుదురుతుంది
- భాయ్ ఖీర్
- ఖలీఫా గారికి ఒకటవ పాఠం
- ఏడుగురు అన్నలకు ఒకే చెల్లెలు
- ఖలీఫా గారికి రెండవ పాఠం
- షారమ్మ
- చార్ ఖస్ రత్ కే ఇన్ సాన్
- దాల్ గోట్నీ దెబ్బ
- ఉత్ రో ఉత్ రో సావల్ రాణి
- హసన్ హబ్బాల్
- నెత్తిమీద గట్టిగా మూడు మొట్టు
- పరేస్తాన్ కా పరా
- తెలివి కతలు
- ముందు పనసకాయ ఇలా లేదు
- అమ్మ ఇంటి బూడిద
- ప్రవక్త చెప్పిన కథ
- కాన్ కరేలా
- రెండో పిట్ట
- బిస్మిల్లా యిర్రహమా నిర్రహీమ్
- జోమ్ పూర్ ఖాజీ
పోలేరమ్మబండ కతలు
[మార్చు]కొంత మంది పిల్లలు, ఉన్నత పాఠశాల పిల్లలు, ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న కాలేజీ పిల్లలు యీ కతలని చాలా ఇష్టంగా కూడబలుక్కుని మరీ చదువుతున్నారని పేరెంట్స్ ద్వారా తెలిసినప్పుడు నా కల్ళెమ్మటి నీళ్ళోచ్చినాయి. ఎక్కడ కావలి, ఎక్కడ పోలేరమ్మ బండ....ఎక్కడ శ్రీధరుగాడు, ఎక్కడ మురళీగాడు, ఎక్కడ మాలకొండలరావుగాడు, కదీరుగాడు....వీళ్ళంతా ఇవ్వాళ చాలా మందికి ఫ్రెండ్స్ అయినారు. ఇంకా విచిత్రమేమంటే ఈ కతలు అయిపోయినాక ఒకాయన మా ఆఫీసుకి వచ్చి ఈ కతల్లోని నలుగురు ఫ్రెండ్సూ టెన్త్ తోటి ఆగిపోకుండా డిగ్రీలు చదివి ఉద్యోగాలు తెచ్చుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని సెటిలయ్యేదాకా ఈ కతలు రాస్తావా చస్తావా అని కూర్చున్నాడు అదీ ఈ కతల భాగ్యం. ఈ భాగ్యం నాది కాదు, ఈ భోగమూ నాది కాదు. ఇది బాల్యానిది. ఈ బాల్యం ఎవరు రాసినా, ఎప్పుడు రాసినా ఆ భాగ్యమూ, భోగమూ వాళ్ళకీ దక్కుతాయని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. - మహమ్మద్ ఖదీర్ బాబు
1970-80 మధ్యకాలంలో హిందీలో వచ్చిన సినిమాల కథనాలు, వాటి తెరవెనుక కథలు, నిర్మాణంలో ఎదురైన సాధక బాధకాలు, ఉత్తమ చిత్రాలుగా ప్రజల గుండెల్లో నిలవడానికి గల కారణాల విశ్లేషణలతో... 50 బాలీవుడ్ ఉత్తమ చిత్రాలను పరిచయం చేస్తూ సాక్షి ఫ్యామిలీలో మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన వ్యాసాల సంకలనం ‘బాలీవుడ్ క్లాసిక్స్’.
60వ దశకం నుండి 80 వ దశకం వరకూ హిందీ చిత్రసీమ నుండి వచ్చిన కొన్ని కళాత్మక చిత్రాలకు సంబంధించి రచయిత శ్రీ ఖదీర్‌బాబు, వారం వారం ఒక ప్రముఖ దినపత్రికలో రాసిన 50వ్యాసాలను `బాలీవుడ్ క్లాసిక్స్` పేరుతో సంకలనంగా ప్రచురించటం జరిగింది.
మన్ చాహే గీత్
[మార్చు]గాయం చేయనివాడు గాయకుడే కాదు మనల్ని వెంటాడి వేధించడం చేతకానిది ఒక పాటా కాదు అంటూ మొదలుపెట్టిన వెనుక పేజీవ్యాఖ్య (పబ్లిషరు చే) ఈ పుస్తకానికి అతికినట్టు సరిపోయింది.
“మన్ చాహే గీత్” ... మహమ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన హిందీ పాటలు-పరిచయాలు చాలా సరళంగాను, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. సురయ్యా, షంషాద్ బేగం, తలత్ మహమూద్, మన్నాడే నుండి రఫీ, లతా, కిశోర్ ల వరకు అందరి గాయకుల్ని, గొప్ప గొప్ప సంగీతదర్శకుల్ని పరిచయం చేసిన తీరు అద్భుతంగా ఉంది. అంతటి గొప్ప కళాకారులకి కేవలం రెండేసి పేజీలు ఎలా సరిపోతాయన్న సందేహాన్ని పుస్తకంలోకి ప్రవేశించగానే పటాపంచలు చేసేశాడు ఖదీర్ బాబు. సంగీతం గురించి చాలా సూటిగా చెబుతూనే అందరి సంగీతకారుల జీవిత కోణాల్ని స్పృశించిన పద్ధతి చాలా బావుంది.
పాటల రికార్డింగు సందర్భాలలో తీసిన అలనాటి మేటి సంగీతకారుల ఫోటోలు గొప్ప అనుభూతినిస్తున్నాయి. అవే పాటలు ఈ పుస్తకం చదవకముండు ఒకరకమయిన ఆనందాన్ని ఇస్తే, చదివిన తరువాత ఆయా సంగితకారులతో, గాయని గాయకులతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్టు అవే పాటలు మనకు బాగా తెలిసున్న వాళ్ళు మనకోసమే కంపోజ్ చేసినట్టు పాడినట్టు అనిపిస్తాయి. పరిచయ వ్యాసాలు ఇంత బావుండడం వల్ల సమయం తీసుకొని మళ్ళి ఆ పాత పాటల కలెక్షను బయటకు తీసి వింటున్నానంటే పుస్తకం ఎంత ప్రభావవంతంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సంగీతప్రియులు తప్పక షెల్ఫులో ఉంచుకోవాల్సిన పుస్తకం.
నూరేళ్ళ తెలుగు కథ
[మార్చు]నూరేళ్ళ తెలుగు కథ అనే సంకలనము రచయిత చెప్పిన నూరుగురు కథకుల నూరు ప్రసిద్ధ కథలు,పునఃకథనం /రీటెల్లింగ్ కథలు. ఈ కథలు సాక్షి దినపత్రిక ఫ్యామిలీ సెక్‌షన్లో రోజూ గొప్ప గొప్ప కథలు రాసిన ఒక తెలుగు కథలను పాఠకులకు పరిచయం చేసిన నూరు ప్రసిద్ద (పునఃకథనం /రీటెల్లింగ్) కథలు. పాత తరం గొప్ప కథకులను కొత్తతరం పాఠకులకు పరిచయం చేయడానికి అతి కొద్ది జాగాలో కథ పరిచయము చేసిన రీటెల్లింగ్ కథా సంకలనము నూరేళ్ళ తెలుగు కథ.
పాఠకులకు పాతకథలని తిరిగిచెప్పటం మొదలుబెట్టి అక్టోబరు 2010 నుంచి ఫిబ్రవరి 2011 వరకూ వారానికి ఐదారు కథల చొప్పున 75గురు కథకులు వ్రాసిన 75 కథలను పరిచయం చేశాడు ఖదీర్‌బాబు. సాక్షిలో అక్కడికి ఆ శీర్షిక ఆపేసినా, ఇంకో 25 కథలను చేర్చి మొత్తం 100 మంది రచయితలు రాసిన 100 కథల పరిచయాల్ని ఇప్పుడు ఒక సంకలనంగా తీసుకువచ్చాడు. ఒకో పరిచయం మూడునుంచి ఐదు పేజీలవరకూ ఉంటుంది. ఎంచుకున్న ప్రతి కథనూ ఖదీర్‌బాబు సంక్షిప్తంగా పరిచయం చేసి, తర్వాత ఆ కథను విశ్లేషిస్తూ, కథకుణ్ణి కూడా పరిచయం చేస్తాడు. ప్రతి పరిచయం ముందూ రచయిత ఛాయాచిత్రం, పరిచయం తర్వాత క్లుప్తంగా రచయిత వివరాలు ఉంటాయి. ప్రతి కథకూ ఖదీర్‌బాబు పెట్టిన ఆసక్తికరమైన కొత్త శీర్షిక ఉంటుంది.
న్యూ బాంబే టైలర్స్:
[మార్చు]న్యూ బాంబే టైలర్స్:[2] ఈ పుస్తకంలో మొత్తం 12 కథలు (న్యూ బాంబే టైలర్స్, దావత్, జమీన్, దూద్ బఖష్, కింద నేల ఉంది, ఒక వంతు, రాత్రిపూట, ఢాఖన్, ఒక సాయంత్రం అదృష్టం, పెండెం సోడాసెంటర్, ఖాదర్ లేడు, గెట్ పబ్లిష్డ్ ) (కొన్ని కథలు సంక్షిప్తంగా)
ఈ కథా సంపుటం లోని మొదటి కథ న్యూ బాంబే టైలర్స్ . ఈ కథ పేరునే పుస్తకానికి పేరుగా పెట్టారు. కావలి లోని పీరుభాయి అనే కుర్రాడు బాంబే వెళ్లి అక్కడి కొత్త ఫాషన్స్ నేర్చుకుని కావలి వచ్చి అక్కడి రైల్వే రోడ్ లో బాంబే టైలర్స్ అనే పేరుతో ఒక దర్జీ దుకాణం తెరిచి అక్కడి కాలేజ్ విద్యార్థుల, పెద్ద రెడ్ల అభిమానం సంపాదించుకుంటాడు. పేరు, డబ్బు సంపాదించుకుంటున్న తరుణంలో పులిమీద పుట్రలా ఆ ఊరు చివర కొత్తగ కొన్ని రేడీమేడ్ దుస్తుల కర్మాగారాలొచ్చి స్థానిక దర్జీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం కలుగచేస్తాయి. దర్జీలు దుకాణాలు మూసివేసి ఈ రేడీ మేడ్ ఫాక్టరీలలో కూలీలుగా చేరిపోతుంటారు. మెల్లగా ఈ ప్రభావం బాంబే టేలర్స్ పై కూడా పడి తండ్రీ కొడుకులు రేడీ మేడ్ కర్మాగారంలో కూలీలుగా చేరటానికి వెళ్లినప్పుడు, వారి పేర్లకు బదులుగా కొన్ని అంకెలుతో వారిని పిలవాల్సొస్తుంది. అంతే కాదు; ముందే కత్తిరించిన కొన్ని బట్టలు ఇచ్చి, కుట్టి తీసుకు రమ్మంటే, పీరుభాయి అది అవమానంగా భావిస్తాడు. బలుసాకైనా తిని బ్రతుకుతా కాని ఈ పని నా వల్ల కాదు అని ఉద్యోగం నిరాకరిస్తాడు. ప్రపంచీకరణ దుష్ఫలితాలను చక్కగా వివరిస్తుందీ కథ.
- జమీన్:
ఈ సంపుటి లోని జమీన్ కథకు 1999లో దాని కళాత్మక కాల్పనిక చిత్రణకై కథ అవార్డ్ వచ్చింది. సంక్షిప్తంగా జమీన్ ఇతివృత్తం: ఇది ఇద్దరు బాల్యమిత్రుల కథ. కసాయి కొడుకు హుసేన్, మాలపల్లెలో నివసించే బ్రమ్మయ్య ల మధ్య అనుబంధం ఎక్కువే. చీరాలలో ఉండే హుసేన్‌కు తన స్వస్థలమైన కావలిలో చిన్న ఇల్లు కట్టుకోవాలని, అక్కడే కనుమూయాలని ప్రగాఢ కోరిక. స్థలం లభ్యమయ్యిందన్న కబురు బ్రమ్మయ్య నుంచి అందగానే కావలికి పయనమైన హుసేన్ ఆ స్థలం తన మిత్రుడు బ్రమ్మయ్యదే అని తెలుసుకొని ఆనందభరితుడవుతాడు. అయితే బ్రమ్మయ్య కొడుకు రమణ ఆర్.ఎస్.ఎస్. పార్టీలో చేరి ఆ సిద్ధాంతాలను ఒంటపట్టించుకొని, సాయిబు హుసేన్ కు స్థలం అమ్మకానికి తన తీవ్ర అసమ్మతిని తెలియపరుస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించటంతో, ఖిన్నుడయిన హుసేన్ చీకటిలోనే తన ఊరు చీరాలకు తిరుగు ప్రయాణం కట్తాడు, వికల హృదయంతో.
- ఒక సాయంత్రపు అదృష్టం:
ఈ కథను చెప్పటం కష్టం; ఎందుకంటే ఇందులో కథ కంటే అనుభూతి ఎక్కువ. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే కథానాయకుడు తన ఊహల్లో క్రియ కంటే ఎప్పుడూ ముందుండి, ప్రకృతి సహజమైన అనుభూతులకు దూరమవుతూ, వేదనకు లోనవుతుటాడు. అయితే ఒక వర్షం కురిసిన సాయంకాలం, పూలమ్మి అమ్మే పూలబుట్టలలోంచి వచ్చే పూల పరిమళాళలకు పరవశుడై, తన భార్యకు అనూహ్యంగా సంతోషాన్ని కలిగించే, చిన్న చిన్న ఆశ్చర్యాలు కలిగించి ఆమెను సంతోషపెడ్తాడు. రేపు లేదన్నట్లుగా, ఆ సాయంత్రం వారిరువురిదే అన్నట్లుగా, ఆ రాత్రి అనుభవిస్తారు. మరుసటి రోజు ఎప్పటిలా తెల్లవారింది. కథానాయకుడిలో ఆశావాదం పెల్లుబికింది. అయినా రేపు మిధ్య, ఈ రోజే నిజం అన్నట్లుగా తన కర్తవ్యానికుపక్రమిస్తాడు.
- గెట్ పబ్లిష్‌డ్ :
మొదటిసారి మహ్మమ్మద్ ఖదీర్ బాబు రచన “గెట్ పబ్లిష్‌డ్’! 36 పేజీల చిన్న పుస్తకం. ఏ పత్రికలోనూ రాకుండా, డైరెక్ట్ కతానికగా ప్రత్యేక బుక్‌లెట్‌గా వచ్చింది. ఇపుడు అదే కథ ఈ పుస్తకంలో చేర్చారు. చారిత్రక అవసరం అనదగిన ఈ “మాష్టర్ పీస్’ కథానికలో వస్తువుని ముందుగా తెలుసుకుందాం. షకీల్ ఒక బాధ్యతాయుతమైన పదవిలోని పాత్రికేయుడు. అతనొక రిపోర్ట్ తయారు చేస్తున్నాడు. ఆ రిపోర్టే ఈ కథానిక.
“గెట్ పబ్లిష్‌డ్’లో (షకీల్ కాకుండా) మూడు పాత్రలు. ఒకటి ఏడేళ్ల ముష్టాక్. వాడు మసీదు దగ్గరికొచ్చేవారి చెప్పుల్ని భద్రపరిచి తిరిగి ఇచ్చేసే “”పని’’లో వున్నవాడు. “ముష్టాక్ నల్ల బంగారం. నల్ల ముత్యం. వాస్తవానికి వాణ్ణొక నల్లటి ముతకరబ్బరు బంతి అనాలి. చూడటానికి ముద్దుగా వుంటాడు. పట్టుకోవడానికి కండగా వుంటాడు’. “వాడి కళ్లల్లో కరెంటు ఉంటుంది. వొంట్లో తూనీగ ఎగురుతూ ఉంటుంది...’ వాడికి అమ్మా నాన్నా ప్రాణం. వారికి వీడు ఇంటిదీపం, కంటి వెలుగు. రెగ్యులర్‌గా మసీదుకు వచ్చీపోయే షకీల్‌కి -వీడొక ప్లెజంట్ స్మార్ట్ బాయ్. ముష్టాక్ తల్లి -ఫాతిమా -రెండోపాత్ర. “నేరేడు చెట్టు నీడలో, చుట్టూ చెప్పులు పెట్టుకుని, నల్లటి గువ్వలాగా...’ “ఆమె గొంతే ఆమె ఆకారం. ఆమె మాటే ఆమె వునికి...’ ఫాతిమా ఒక విలక్షణమైన ముస్లిం స్త్రీ. “మసీదులోని తెల్లటి గోడల మధ్య నల్లటి చారికలా కనిపిస్తూ ఉంటుందామె’ అంటాడు కథకుడు. ఇదీ వర్ణనాశిల్పం అంటే. పులుముడుకాదు. ఏకపదవాక్యంతో గుండె మీద ఆర్తినీ, అంత: కరణనీ గీరగలగాలి కథకుడు! ఆ తర్వాత ఆమె చుడీబజార్‌లో యాచిస్తూనూ కనిపిస్తూ ఉంటుందిట! ఇక, ఈమె భర్త- నయాబ్-మూడోపాత్ర. అతను అత్తర్ నయాబ్-పేరుకు. ఇతని కథ కొంచెం పెద్దదే. ఆటో డ్రైవర్‌గా, సెవెన్‌సీటర్ డ్రైవర్‌గా చేశాడు. ఏదీ అచ్చిరాలేదు. సంపాదనలేదు.
ప్రపంచంలో అక్కడక్కడా, అక్కడా ఇక్కడా -ఉగ్రవాదదాడులు, ఎవరు ఎవర్ని “టార్గెట్’ చేస్తారో, ఎందుకు చేస్తారో తెలీదు. విసిరిన పంజాదెబ్బకు ఎందరో మృతులు, ఎందరో క్షతగాత్రులు. అయితే పంజావిసిరిందెవరు? తెలీదు. అదో పెద్ద యక్షప్రశ్న. హైదరాబాద్‌లోనూ దుర్ఘటనలు. ఒక దురదృష్టకరరాత్రి.. బాగా పొద్దుపోయిన తర్వాత అన్నం ముందు కూర్చున్న నయాబ్‌ని లాగి, కొట్టి, ఫాతిమానీ నెట్టేసి గాయపరచి, ముష్టాక్‌కీ నాలుగు తగలనిచ్చి -నయాబ్‌ని “వాళ్లు’ లాక్కుపోయారు. ఆ తర్వాత జరగాల్సినదంతా జరిగింది. అదొక “ట్రీట్‌మెంట్ కథ’. ఇక్కడ ఫాతిమాని ఎవరు ఊరడించగలరు? ముష్టాక్ వొళ్లు తెలీని జ్వరంలో కాలిపోతున్నాడు. షకీల్ లాంటివాళ్లు అదీ ఇదీ చేద్దామని ముందుకొస్తే ఆమె తరస్కరిస్తుంది. ఉన్న వాళ్లిద్దరూ జీవచ్ఛవాలైనారు. దిగులు బండలయ్యారు. ఆ “ట్రామా’ అక్షరాలకి ఒదుగుతుందా!? చివరికి పదహారు రోజుల తర్వాత నయాబ్‌ని ఎవరో ఇంటి ముందు పడేసి పోయారు. కావడమే “మూలుగు’ వచ్చింది. బతికి వుండీ ఎందుకూ పనికిరాని ఒక మూటవచ్చింది. మీకూ నాకూ -నయాబ్ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి -చాలా “బతుకు’ చిత్రాలు దోహదం చేస్తాయి. కళ్లకు కడతాయి. “మళ్లీ నవంబర్ 26 వచ్చింది’! ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారో తెలీదు! అవును. ఇదే కథ! ముగ్గురు అమాయకుల ఛిద్రజీవన విషాదకావ్యం!
నయాబ్ కుటుంబం పడిన హింస. అనుభవించిన బాధ. జరిగిన హాని. ఎవరు బాధ్యుల? ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఇవీ షకీల్ అడగయే అడుగుతున్న ప్రశ్నలు. సభ్యసమాజం జవాబీయవలసిన ప్రశ్నలు. “ఈ దేశంలో కొందరు ఐడెంటీ చూపలేరు. అలాగని ఐడెంటిటీలేని వారుగా కూడా బతకలేరు. అందుకనే ఒక్కోసారి వాళ్ల ఐడెంటీయే వాళ్లకు ప్రమాదం తెచ్చిపెడుతూ వుంటుంది’! ఇదీ “గెట్ పబ్లిష్‌డ్’ కథానికకు ఇతివృత్త కేంద్రకం.
బియాండ్ కాఫీ
[మార్చు]బియాండ్ కాఫీ కథల సంపుటిలో పది కథలు ఉన్నాయి అవి ఆస్తి,ఘటన,టాక్ టైం,వహీద్, మచ్చ, ఏకాభిప్రాయం,పట్టాయ.ఇంకోవైపు.అపస్మారకం.
కథలు ఇలాకూడా రాస్తారు
[మార్చు]కొత్తగా కథలు, నవలలు రాయాలనుకుంటున్న లేదా రాస్తున్న రచయితలకు ఎన్నో సందేహాలు వుంటాయి. ఎలా రాయాలి? లేదా మనం రాస్తుంది కరెక్టేనా ? ఇవన్ని ఎవర్ని అడగాలి ? అని. అలాంటి ప్రశ్నలకు ఈ బుక్ ఒక సమాధానంగా ఉపయోగ పడుతుంది. ఈ బుక్ చదివిన తరవాత ఒక రచయితగా మనం ఏ స్టేజిలో ఉన్నామో తెలుస్తుంది. ఈ బుక్ ఒక్క రొజులో చదివి పక్కన పెట్టే ఒక కథ కాదు. మనం చదివే కొద్దీ మనల్ని మోటివేట్ చేసే ఎన్నో అధ్బుతమైన కథలు, ఎంతోమంది ప్రముఖ రచయితలు గురించి ,వాళ్ళు రాసే విధానం గురించి ఇందులో ఉంటుంది.
మెట్రో కథలు
[మార్చు]“మెట్రో కథలు” 25 కథల సంపుటి. “మెట్రో కథలు” నిజానికి ఒక దిన పత్రిక శీర్షిక కోసం రాసినవి. అప్పటికప్పుడు రాసినవే. అందుకేనేమో “ఇవి తెల్ల కాగితాల మీద పుట్టిన కథలు. తెల్ల కాగితాల పైనే తుదీ, మొదలును వెతుక్కున్న కథలు” అని ప్రకటించారు. అవి హైదరాబద్ గురించిన చారిత్రిక కతలు కాదు. ఈ మహానగరంలో జీవిస్తున్న వారి వర్తమాన చరిత్రకి సంబంధించిన కథలు.
‘సెల్ఫీ’, ‘రొటీన్’, ‘రూటర్’, ‘డిస్టేన్స్’, ‘నిద్రా సమయం’, ‘మెట్రో’, ‘టేస్ట్’ వంటి కథలన్నింటికీ దంపతీ సంబంధంలోని దూరమే ప్లాట్. సంఘటనలే వేరు. దాదాపు అన్ని కథలు స్త్రీ కోణం నుండి రాసినవే.
సంపుటిలోని కథల్లో నిజంగానే కొన్ని గొప్ప కథలున్నాయి. పితృస్వామ్యపు జెండర్ ఇన్సెన్సిటివిటీ కారణంగా స్త్రీల టాయిలెట్ సమస్యల పట్ల సామాజిక నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే “షీ”, ఆర్ధిక దారిద్ర్యం ధ్వంసం చేసే మానవ సంబంధాల్ని కళ్ళకి కట్టినట్లు వివరించే “నల్ల కాలర్”, ఋతువుల ప్రతాపం నుండి తమని తాము రక్షించుకోలేని నిస్సహాయ నిరుపేద వర్గాల జీవితాల్లోని విషాదం, ఏదైనా విపత్తు జరిగాక అతిగా స్పందించే మీడియా, నాగరీకుల హిపోక్రాటిక్ మూక మనస్తత్వంని ఎత్తి పొడిచే “సలి కోటు”, నిత్య జీవన సమరంలో కిందా మీద పడుతూ అయినా సరే జీవితం మీద ఆశని కోల్పోని అల్పాదాయ వర్గాల వారి ధీరోదాత్త జీవన చిత్రణ చేసే “జీరో బ్లడ్”, మెజారిటేరియనిజం కలగచేసే హింసాత్మక భయభ్రాంతుల మీద రాసిన “వుడ్ వర్క్”…ఈ కథలు అద్భుతమైనవి.
సూచికలు
[మార్చు]దర్గామిట్ట కతలు పోలేరమ్మబండ కతలు
అరుణ పప్పుగారి విశ్లేషణ సినీ వార్త (in https://web.archive.org/web/20170223222741/http://www.pravasarajyam.com/) విశ్లేషణ ...
బయటి లింకులు
[మార్చు]- ఈ లింకు న్యూ బాంబే టైలర్స్
- ఈ లింకు ఖదీర్ బాబు పుస్తకాల సంక్థిప్త వివరణ చూడండి
- ఈ లింకు -బియాండ్ కాఫీ కథల సంక్షిప్త వివరణ విశ్లేషణ-రివ్యూలు చూడండి
- ఈ లింకు నూరేళ్ళ తెలుగు కథ - మళ్ళీ చెప్పుకుంటున్న మన కథలు
- ఈ లింకు నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ
- ఈ లింకు కథలు ఇలా కూడా రాస్తారు
- ఈ లింకు కాంక్రీట్ మనుషుల వెతలు ఈ ‘మెట్రో కథలు’!