మహెజబీన్
మహెజబీన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1961 (age 62–63) నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
"'మహెజబీన్"' 20 వ శతాబ్ది చివరి దశకంలో అత్యంత ప్రభావశీలంగా కవితలల్లిన కవయిత్రి. సమకాలీన కవుల, విమర్శకుల మన్నన పొందిన అతికొద్ది మంది కవయిత్రులలో ఒకరు.
జననం
[మార్చు]మహెజబీన్ 1961లో నెల్లూరులో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె పూర్తి పేరు మహెజబీన్ మహ్మద్. ఈమె తండ్రి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. తల్లి ఒక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో పార్ట్ టైమ్ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఈమె బాల్యంలో ఆర్థికపరమైన కష్టాలను అనుభవించింది. పేద విద్యార్థుల స్కాలర్‌షిప్‌తో ఈమె ప్రాథమిక విద్య ఒక మిషనరీ స్కూలులో జరిగింది.
విద్య
[మార్చు]ఈమె శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1985లో పిల్లల మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, 1987లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి సామాజిక సేవా శాస్త్రంలో స్త్రీ శిశు సంక్షేమం ప్రత్యేక అంశంగా మాస్టర్ డిగ్రిని పొందింది. 1999లో హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి మానవ హక్కులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివింది. 2000లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో స్త్రీలహక్కులు ప్రత్యేక అంశంగా బ్యాచిలర్ డిగ్రిని పొందింది.
వైవాహిక జీవితం
[మార్చు]వీరి జీవిత భాగస్వామి పి.వి. ఉపేంద్ర.. వీరికి ఒక కుమారుడు కలడు.
వృత్తి - ప్రవృత్తి
[మార్చు]హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతూ, సామాజిక సేవలో విశిష్ట సేవలందిస్తున్నది. ఈమె జాయింట్ ఉమెన్స్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ఛాప్టర్‌కు ప్రోగ్రామ్ సెక్రెటరీగా పనిచేస్తున్నది. ఈమె వరకట్న వేధింపులు, వైవాహిక సమస్యలు, గృహహింస, మహిళలకు తాత్కాలిక ఆశ్రయం వంటి సమస్యలపై వర్క్‌షాప్‌లు మరియు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. మహే జబీన్ పర్యావరణ సమస్యలు, మహిళల రాజకీయ హక్కులు, లైంగిక సమస్యలపై బహిరంగ సభలను కూడా నిర్వహించింది. ఈమె ఫీనిక్స్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ అనే సంస్థకు కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నది. ఈ సంస్థలో భాగంగా, ఈమె మైనారిటీ మహిళలు, పిల్లలకు సంబంధించిన సమస్యలపై అవగాహన సామగ్రి, స్కిట్‌లను తయారు చేసింది. వీధినాటకాలకు దర్శకత్వం వహించి ప్రదర్శించింది. మైనారిటీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తోంది. ఈమె ప్రభుత్వ టీవీ ఛానెల్ అయిన దూరదర్శన్ ద్వారా మహిళలకు న్యాయపరమైన అవగాహన, సలహాలు సూచనలు అందించే కుటుంబ సలహా కార్యక్రమం చేతనను కూడా నిర్వహించింది. బాలకార్మిక (నిర్మూలన) చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కూడా మహే ప్రచారం చేస్తోంది. పట్టణ ప్రాంతాలలో బాలకార్మికులను గుర్తించడంలో రాష్ట్ర లేబర్ కమీషనర్ కార్యాలయంతో సమన్వయంతో, ఈమె అవగాహన చర్చలు నిర్వహించింది. మీడియాలో కథనాలను ప్రచురించింది. ముఖ్యంగా స్త్రీ, శిశు సంక్షేమం కొరకు చేస్తున్న సేవలకుగానూ ఈమెకు పలు పురస్కారాలు లభించాయి.
సాహితీ సేవలో...
[మార్చు]తెలుగు స్త్రీవాద కవయిత్రులలో చెప్పుకోదగిన వారిలో జబీన్ ఒకరు. 1991 నుండి కవిత్వం వ్రాస్తూ ఉన్నది[1].. ఓల్గా తదితరులతో కలిసి నీలి మేఘాలు అనే స్త్రీవాద కవితా సంపుటాన్ని వెలువరించింది. 1997లో తన తొలి కవితా సంకలనం "ఆకురాలు కాలం" ను ప్రకటించింది. ఇందులో 26 కవితలు ఉన్నాయి. ఆకురాలు కాలం, జ్ఙాపకం, జావళి, ఎలిజీ, నైసర్గిక స్వరూపం, స్ట్రీట్ చిల్డ్రన్ వాటిలో కొన్ని. స్ట్రీట్ చిల్డ్రన్ కవిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి విద్యార్థులకు (1990-2012 మధ్యకాలంలో) తెలుగువాచకంలో ఒక పాఠ్యాంశంగా ఉండేది. ఈమె కవిత్వంలో మనకు స్త్రీవాద దృక్పథం, విప్లవ సానుభూతి కనిపిస్తుంది.
జబీన్ కవిత్వంపై ప్రముఖుల వ్యాఖ్య
[మార్చు]- "A lyrical beauty" - కె.శివారెడ్డి
- " ఈ దశాబ్దపు మరో వాగ్ధానం జబీన్" - చేరా
అవార్డులు
[మార్చు]మహెజబీన్ సాహితీ, సామాజిక సేవా రంగాలలో అందిస్తున్న విశిష్ట సేవలకు పలు పురస్కారాలు అందుకున్నారు. వాటిలో కొన్ని...
- రమణ - సుమనశ్రీ అవార్డు (1999)
- జ్యోత్స్న కళాపీఠం అవార్డు (2006)
- రాజీవ్ గాంధీ మానవ సేవా అవార్డు ( 2007 )
- నారీశక్తి పురస్కారం (2008, భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా)
- తెలుగు భాషా పురస్కారం ( 2009 )