మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము (ఆగస్టు 25, 1926 - జూన్ 15, 2010) కడపజిల్లాకు చెందిన అజ్ఞాత రచయిత.

మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము
మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము
జననంమైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము
ఆగస్టు 25, 1926
బుడుగుంటపల్లె, రాజంపేట మండలం, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణంజూన్ 15, 2010
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధికవి, రచయిత, చిత్రకారుడు
మతంహిందూ
తండ్రివేంకటసుబ్రహ్మణ్యము
తల్లిఅన్నపూర్ణమ్మ

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు కడప జిల్లా, రాజంపేట తాలూకా, బుడుగుంటపల్లెలో వేంకటసుబ్రహ్మణ్యం, అన్నపూర్ణమ్మ దంపతులకు 1926వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన జన్మించాడు[1]. ఇతడు ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. యజుశ్శాఖాధ్యాయి. భారద్వాజ గోత్రీయుడు. ఇతని వంశము (మైనంపాటి వంశము) చారిత్రక- సంగీత - సాహిత్య విశేషము కలది.[2] మైనంపాడులోని వేణుగోపాలస్వామి ఇతని కులదైవము.

విద్య, ఉద్యోగం

[మార్చు]

ఇతడు బుడుగుంటపల్లెలో ప్రాథమిక విద్య ముగించుకుని కోడూరులోని హైయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత గ్రామాధికారుల పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణుడై 1949వరకు గ్రామాధికారిగా పనిచేశాడు. లోకన రాఘవయ్య వద్ద సంస్కృతాంధ్రాలు చదువుకుని మద్రాసు విశ్వవిద్యాలయం వారి విద్వాన్ పరీక్షలకు కట్టి ఉత్తీర్ణుడై విద్వాన్ పట్టాను పొందాడు. తరువాత ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశాడు. కొన్నాళ్లు చిత్రలేఖనము అభ్యసించి ఫ్రీహాండ్, అవుట్‌లైన్, మోడల్ డ్రాయింగు, పెయింటింగు, డిజైనింగులలో హైయర్ సర్టిఫికెట్ కోర్సులు ముగించాడు. 1950లో కోడూరు(ఆర్.ఎస్) ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనోపాధ్యాయుడిగా చేరి 1958లో ఆంధ్రభాషోపాధ్యాయుడిగా నియమింపబడ్డాడు.

సి.పి.బ్రౌన్ రూపకర్త

[మార్చు]
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఊహాచిత్రం

తెలుగు సాహిత్యానికి విశేషమైన కృషి చేసిన కడప జిల్లా కలెక్టర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798-1884)యొక్క ఛాయాచిత్రాన్ని ఆ కాలంలో ఎవరూ భద్రపరచలేదు. అతని రూపురేఖలు ఎలా ఉంటాయో నేటితరానికి తెలియజేయడానికి లభ్యమైన అతని తండ్రి డేవిడ్ బ్రౌన్ ఫోటోలోని పోలికలను ఆధారం చేసుకొని జానమద్ది హనుమచ్ఛాస్త్రి అభ్యర్థన మేరకు మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము చిత్రించిన బ్రౌన్ ఊహాచిత్రమే ఈనాటికీ ప్రామాణికంగా పరిగణించబడుతున్నది.

వేమన కడపజిల్లా వాడే

[మార్చు]

యోగి వేమన కడపజిల్లా చిట్వేలు ప్రాంతానికి చెందినవాడని నిరూపిస్తూ ఎన్నో పరిశోధనా వ్యాసాలను ఇతడు వ్రాశాడు.

రచనలు

[మార్చు]

ఇతడు ఎన్నో నాటకములు, నవలలు, శతకములు, ఖండికలు వ్రాసి ఉన్నాడు. వీటిలో ఎక్కువభావము అముద్రితాలు. ఇతడు వ్రాసిన 'ఆకులు చెప్పిన అరవైనాలుగు కథలు' పిల్లల పత్రిక బాలమిత్రలో కొన్ని సంవత్సరాలు ధారావాహికగా ప్రచురితమైంది. ముద్రణకు నోచుకున్న ఇతని రచనలు:

1. త్రిలింగ భారతి: ఈ కావ్యము (శతకము?)లోని ప్రతి పద్యము ఆంధ్రదేశపు చారిత్రాంశాలను తెలుపుతుంది. వేదము వెంకటకృష్ణశర్మ దీనిని 'ఆంధ్రుల పురాణము'గా కొనియాడాడు.

2. శ్రీకృష్ణ తాండవము - గోపికాలాస్యము[3]: ఇది ఒక గేయ కావ్యము. భాగవతమును మథించి కృష్ణతత్త్వమును అర్థం చేసుకుని ఆనందోత్సాహముతో వ్రాసిన కావ్యము ఇది. ఈ గేయకృతిలో మొదట శ్రీకృష్ణతాండవము, తరువాత గోపికా లాస్యము వర్ణించబడింది. నాట్యకళలో తాండవము, లాస్యము అని రెండు భేదములున్నాయి. తాండవము ఉధృతమైనది. పురుషులకు ఉద్దేశింపబడినది. లాస్యము సుకుమారమైనది. స్త్రీలకు ఉద్దేశించబడింది. వీటికి అధిదేవతలు శివపార్వతులు. శ్రీకృష్ణుడు బాల్యములో కాళీయుని పడగలపై భరతశాస్త్ర పద్ధతిలో తాండవమాడినాడు. గోపికలు శ్రీకృష్ణునితో రాసక్రీడలనాడినారు. ఈ సన్నివేశాలను ఆలంబనగా చేసుకొని ఇతడు శ్రీకృష్ణ తాండవము - గోపికాలాస్యము అనే ఈ గేయకృతిని రచించాడు. ఈ కావ్యములో ఇతడు ప్రయోగించిన అనేక శబ్ద, క్రీడ, భరతనాట్య, సంగీత, శృంగార, అభినయ, ఆంగిక విషయాలను ప్రతి పుటలోను క్రింద లఘుటిప్పణిలో వివరించాడు. కవి స్వతహాగా చిత్రకారుడు కావడం చేత అక్కడక్కడ నాట్యభంగిమలను చిత్రించి ఈ కావ్యానికి మరొక విశిష్టతను చేకూర్చాడు. ఇతడు పుట్టపర్తి నారాయణాచార్యుల అభిమాని కావడం చేత అతని శివతాండవము పోకడలోనే ఈ కావ్యము నడిచింది. అయితే ఈ కావ్యరచనలో ఇతడు ఎన్నో కొత్తమార్గాలను కూడా తొక్కినాడు.

రచనల నుండి ఉదాహరణలు

[మార్చు]

అల్లదె కొండకోనల మహాద్భుత శిల్పకళానివేశముల్
కొల్లఁగ నిల్చియున్నవట; కోరికనుంగను'మెల్లోరా'గుహా
లెల్లను బౌద్ధచైత్యము లనేకములున్న వఖండ చిత్రముల్
చల్లని తల్లి! పొమ్మటుల జాలముగాదు త్రిలింగభారతీ!

ఉర్విని దేవళంబులె మహోన్నతికెక్కెను శిల్పశాలలై
పూర్వము తెల్గుభూధవుల పోషణలోన విశేషభక్తియే
సర్వము చిత్రశిల్పముల సంపదకెల్లను హేతుభూతమౌ
గర్వము తెల్గుజాతికది కారణమౌను త్రిలింగభారతీ!
(త్రిలింగ భారతి నుండి)

ఆకారమై త్రిగుణ సాకారమై కన, ని
రాకారమై నిలిచి శ్రీకారమై వినని
హుంకారమై కడలి భాంకారమై వెలయ
టంకారమై వెడలి ఢంకారమై తెలియ
హంకారమై కలభ ఘీంకారమై యళుల
ఝంకారమై కేకి క్రీంకారమై సిరుల
ప్రాకారమై కలికి హ్రీకారమై చెలగు
ణాకారమై లలిత క్లీకారమై వెలుగు
అంకారమై రసాలంకారమై పలికి
శంకారమై నిత్యమోంకారమై కులికి
              ఆడెనమ్మా! కృష్ణుడు
              పాడెనమ్మా! విష్ణువు
(శ్రీకృష్ణతాండవము - గోపికాలాస్యము నుండి)

మరణం

[మార్చు]

ఇతడు 2010, జూన్ 15 వ తేదీన తన 83వ యేట మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. కల్లూరు, అహోబలరావు (1977). రాయలసీమరచయితల చరిత్ర - రెండవ సంపుటి (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. pp. 143–149.
  2. మైనంపాటి, వేంకటసుబ్రహ్మణ్యము. "మైనంపాటి వంశము - చరిత్రాంశము" (PDF). Mynampati. M. Lakshmi Narayana. Archived from the original (PDF) on 5 మార్చి 2016. Retrieved 14 January 2015.
  3. మైనంపాటి, వేంకటసుబ్రహ్మణ్యము (1975). శ్రీకృష్ణతాండవము - గోపికాలాస్యము (1 ed.). బుడుగుంటపల్లె: మైనంపాటి సరోజాదేవి. p. 177. Retrieved 14 January 2015.
  4. SPECIAL CORRESPONDENT (June 16, 2010). "Creator of Brown portrait dead". THE HINDU. Retrieved 13 January 2015.