రాక్షస గూళ్లు

వికీపీడియా నుండి
(రాకాసి గుళ్ళు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తూర్పు గోదావరి జిల్లాలోని ఒక రాక్షస గుడి

కొత్త రాతియుగంలో మనిషి గుంపులు గుంపులుగా సంచారం జీవనం సాగించేవాడట.. ఆ ఆదిమ తెగలు తమలో ఎవరైన చనిపోతే తమకు పునర్జన్మ ఉంటుందని భావించి చనిపోయిన శవాన్ని పెద్ద మట్టి కుంట తయారు చేసి అందులో పెట్టి ఆకులు, నారలతో చుట్టి దాన్ని భూమిలో పాతి పెట్టేవారు. ఆ తరువాత ఆ శవాన్ని ఏదీ పీక్క తినకుండా పెద్ద పెద్ద రాళ్లను చుట్టూ పెట్టేవారట. వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు పాండవ గుళ్లు లేదా రాక్షస గూళ్ళు గా వ్యవహరిస్తారు. రాక్షస గూళ్లు బయల్పడటం, ఆయా ప్రాంతంలో పురాతన మానవ ఆవాసానికి ఆనవాళ్ళు. చనిపోయినవారిని సమాధి చేసి పెద్దపెద్ద ప్రాకారాలు నిర్మించేవారు. ఆ సమాధుల్ని రాక్షస గుళ్లు అంటారు. ఈ భారీ అంత్యక్రియకు సంబంధించిన కట్టడాలు శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రకాశం జిల్లా [మణికేశ్వరం గ్రామం]లో తక్కువగా, మిగిలిన చోట్ల ఎక్కువగా ఉండేవి. రాయలసీమలో వీటిని నేటికీ పాండవ గుళ్లు అంటారు. కర్నూలు జిల్లా శంఖవరంలో గొర్రె ఆకారంలో, నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో విశేష నిర్మాణాలు బయల్పడినవి. పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించిన ఈ సమాధులు క్రీ.పూ.2000 నుండి క్రీ.పూ.500 సంవత్సరాల మధ్య కాలం నాటివిగా చరిత్రకారులు పేర్కొన్నారు.[1].ఈ సమాధులలో మృతుల అస్థికలు గాని, మృతదేహాన్ని గాని ఉంచి వారికి సంబంధించిన వస్తువులను కూడా పూడ్చడం నాడు ఆచారంగా ఉండేది. పురాతత్వ శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి ఈ సమాధులలో బంగారు ఆభరణాలు, వేణువులు, ఇతర వస్తు సముదాయాలను బయల్పరిచారు. మృతి చెందిన వారితో పాటు వారి వస్తువులను కూడా సమాధులలో ఉంచితే అతని ఆత్మకు శాంతి కలుగుతుందని నాటి ప్రజల విశ్వాసం. సమాధుల చెంత స్మృతి చిహ్నాలుగా శిలాస్తంభాలు ఉంచేవారు. ఇక్ష్వాకు వంశీయుల నాటి ఛాయా స్తంభాలు నాగార్జున కొండ వద్ద తవ్వకాలలో బయల్పరిచారు.

ఈ సమాధుల్లోనూ రకాలు ఉన్నాయి. అవి 1. డాల్మెన్‌లు, 2. సిస్త్‌లు ఈ రెండు రకాల సమాధులు తెలుగు నేల మీద వేల సంఖ్యలో ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రెండు రకాల సమాధులకు పై కప్పు బండలకు రంధ్రములు ఏర్పరిచి ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా ప్రేతాత్మ సమాధి నుండి బయటికి వచ్చి సంచరించి, తిరిగి సమాధులలోకి పోతుందని ఆనాటి ప్రజల విశ్వాసం.

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస సమీపంలోని దన్నన్నపేట వద్ద మెగాలిథిక్ రాక్షస గుడి

డాల్మెన్‌లు

[మార్చు]

రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచెడి లోహ యుగం నాటి సమాధులను డాల్మెన్‌లు అంటారు. రాతి పలకకు ఒకవైపు పెద్ద రంధ్రం ఏర్పాటు చేస్తారు. ఈ రాతి పెట్టెను భూమి ఉపరి భాగంలో ఉంచి, శవంతో పాటు, మృతుడు వాడిన వస్తువులను అందులో ఉంచి పైన రాతి పలకను ఉంచెడివారు.

డాల్మెన్ సమాధి ప్రాంతాలు

[మార్చు]
  1. వాడవల్లి
  2. శిరిపురం
  3. వెల్లటూరు [-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-]
  4. చిట్యాల
  5. సురగొండయ్య గుట్ట, దామెర్‌వాయి, తాడ్వాయి మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
  6. గాలిగుట్ట, తాటికొండ గ్రామం (ఘనపూర్ మం, జనగామ జిల్ల)
  7. ధర్మసాగర్ (వరంగల్ అర్బన్)
  8. బోడగుట్ట, రామచంద్రపూర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా
  9. మంచం గుట్ట, రఘునాథ్ పల్లి మండలం, జనగామ
  10. బలపాల గుట్ట, అశ్వారావుపల్లి, ఈ రఘునాథపల్లి మండలం, జనగామ
  11. గుండాల మండల కేంద్రం, జనగామ జిల్లా
  12. దొడ్డుగుట్ట, రఘునాథ్ పల్లి మండల కేంద్రం, జనగామ
  13. మల్లన్నగుట్ట, తొర్రూరు, పాలకుర్తి మండలం, జనగామ

సిస్త్‌లు

[మార్చు]

పెద్ద గోయి తీసి రాతి పలకలతో సిద్ధపరచిన పెట్టెను శవంతో పాటు భూస్థాపితం చేసి, చుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతిగుండ్లను పేర్చి సురక్షితమొనర్చిన సమాధులను సిస్త్‌లు అని అంటారు.

సిస్త్ సమాధి ప్రాంతాలు

[మార్చు]

మట్టపల్లి, తిప్పర్తి, నల్లగొండ, ఏలేశ్వరం, వలిగొండ, మౌలాలి, రాయగిరి, తుమ్మల గూడెం, పొడిచేడు, సింగాపురం, దేవరుప్పల, నడింపల్లి, కదంబాపూర్, పెద్ద మరూర్, చిన మిడిసిలేరు, కలివేరు

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 39