Jump to content

రెండవ పానిపట్టు యుద్ధం

వికీపీడియా నుండి
రెండవ పానిపట్టు యుద్ధం

హేమూ ఓటమి, 1590 ల నాటి చిత్రం -కంకడ్
తేదీ1556 నవంబరు 5
ప్రదేశంపానిపట్ (నేటి హర్యానా లో ఉంది)
29°23′41″N 76°55′34″E / 29.39472°N 76.92611°E / 29.39472; 76.92611
ఫలితంమొగలు విజయం
ప్రత్యర్థులు
Mughal Empireసూర్ సామ్రాజ్య
సేనాపతులు, నాయకులు
  • బరం ఖాన్
  • అక్బర్
  • సయ్యద్ మహమూద్ ఖాన్
  • అలీ కులీ ఖాన్
  • సికందర్ ఖాన్ ఉజ్బక్
  • అబ్దుల్లా ఖాన్ ఉజ్బక్
  • షా కులీ మహ్రామ్
  • హేమూ Executed
  • రామ్య
  • షాదీ ఖాన్ కక్కడ్ 
బలం
10,000 ఆశ్వికులు
200 ఏనుగులు[1]
30,000 ఆశ్వికులు
500 ఏనుగులు[1]
ప్రాణ నష్టం, నష్టాలు
Unknown5,000
రెండవ పానిపట్టు యుద్ధం is located in India
రెండవ పానిపట్టు యుద్ధం
Location within India

రెండవ పానిపట్టు యుద్ధం 1556 నవంబరు 5 న అక్బరుకూ ఢిల్లీ రాజు హేమూకూ మధ్య జరిగింది. అంతకు కొన్ని వారాల ముందే హేమూ, ఢిల్లీ యుద్ధంలో తార్డి బేగ్ ఖాన్ నేతృత్వంలోని మొఘల్ దళాలను ఓడించి, ఢిల్లీ, ఆగ్రాలను జయించాడు. ఢిల్లీలోని పురానా ఖిలా వద్ద రాజా విక్రమాదిత్యగా పట్టాభిషేకం చేసుకున్నాడు.

దీని గురించి తెలుసుకున్న అక్బర్, అతని సంరక్షకుడు బైరమ్ ఖాన్ ఆ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దండయాత్ర చేసారు. పానిపట్‌లో 1526 నాటి మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో రెండు సైన్యాలు తలపడ్డాయి. యుద్ధంలో హేమూ బాణం తగిలి స్పృహతప్పి పడిపోయాడు. తమ నాయకుడు దిగిపోవడం చూసి అతని సైన్యం భయాందోళనకు గురై చెదిరిపోయింది. అపస్మారక స్థితిలో, దాదాపు చనిపోయిన స్థితిలో ఉన్న హేమూ తలను నరికేందుకు అక్బర్ నిరాకరించడంతో, బైరామ్ ఖాన్ హేమూను బంధించి తదనంతరం శిరచ్ఛేదం చేయించాడు.

నేపథ్యం

[మార్చు]
1910 నాటి హేమూ చిత్రం

మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ వారసుడు హుమాయూన్‌ను 1540 లో సుర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన షేర్ షా సూరి భారతదేశం నుండి తరిమివేసినప్పుడు అతను వారసత్వ సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. ఢిల్లీ, ఆగ్రాలు షేర్ షా చేతికి చిక్కాయి. అయితే అతను 1545 లో కాలింజర్‌లో మరణించాడు. అతని తరువాత అతని చిన్న కుమారుడు ఇస్లాం షా సూరి సమర్థుడైన పాలకుడే గానీ, అతను 1554 లో మరణించాడు. అతని మరణంతో, సుర్ సామ్రాజ్యం వారసత్వ యుద్ధంలో చిక్కుకుని, తిరుగుబాట్లు, వేర్పాట్లతో సతమతమైంది. హుమాయున్, తాను కోల్పోయిన వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. 1555 జూలై 23 న మొఘలులు సికందర్ షా సూరిని ఓడించి, ఢిల్లీ, ఆగ్రాలపై తిరిగి నియంత్రణ పొందారు.[2]

ఇస్లాం షా వారసుడైన అతని 12 ఏళ్ల కుమారుడు, ఫిరోజ్ ఖాన్‌ను అతని మామ హత్య చేసి, ఆదిల్ షా సూరిగా సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే, కొత్త పాలకుడు తన రాజ్య వ్యవహారాల కంటే తన సుఖసంతోషాల పైననే ఎక్కువ ఆసక్తి చూపాడు. పరిపాలన అంతా ఎక్కువగా రేవారి కి చెందిన షేర్ షా సూరి హిందూ సహచరుడైన హేమూకి వదలిపెట్టాడు. హేమూ, సాధారణమైన పరిస్థితి నుండి ఆదిల్ షాకు ముఖ్యమంత్రి, సూరి సైన్యానికి సేనాధిపతి అయ్యాడు.[3] 1556 జనవరి 27న హుమాయూన్ మరణించినప్పుడు అతను బెంగాల్‌లో ఉన్నాడు. మొఘల్ చక్రవర్తి మరణంతో మొఘలులను ఓడించడానికీ, కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందేందుకూ హేమూకు ఆదర్శవంతమైన అవకాశం వచ్చింది.[4]

హేమూ బెంగాల్ నుండి వేగంగా కవాతు ప్రారంభించాడు. బయానా, ఇటావా, భర్తానా, బిధునా, లఖ్నా, సంభాల్, కల్పి, నార్నాల్ ల నుండి మొఘలులను తరిమికొట్టాడు.[4] హేమూ చేస్తున్న దండయాత్ర గురించి విని, ఆగ్రా లోని మొగలు ప్రతినిధి నగరాన్ని ఖాళీ చేసి, ఎటువంటి పోరాటం లేకుండా పారిపోయాడు.[5] అతన్ని వెంబడిస్తూ హేమూ, ఢిల్లీకి వెలుపల ఉన్న తుగ్లకాబాద్ అనే గ్రామాన్ని చేరుకున్నాడు. అక్కడ అతను ఢిల్లీ మొఘలు ప్రతినిధి అయిన తార్ది బేగ్ ఖాన్ సైన్యంలోకి చొచ్చుకెళ్లాడు. తుగ్లకాబాద్ యుద్ధంలో వారిని ఓడించాడు.[4] అతను 1556 అక్టోబరు 7 న[5] ఒక్క రోజు యుద్ధం చేసి, ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. విక్రమాదిత్య అనే బిరుదును స్వీకరించి పట్టాభిషేకం చేసుకున్నాడు.[6]

యుద్ధానికి ముందు

[మార్చు]

తుగ్లకాబాద్ నుండి వినాశకరమైన వార్త విన్న హుమాయూన్ వారసుడు, 13 ఏళ్ల అక్బర్, అతని సంరక్షకుడు బైరమ్ ఖాన్ లు వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. అదృష్టవశాత్తూ, 10,000 మంది ఉన్న ఆశ్విక దళంతో ముందే పంపిన అలీ కులీ ఖాన్ షైబానీ (తరువాత అతనే ఖాన్-ఇ-జమాన్) కి హేమూ ఫిరంగిదళం కనిపించింది. ఆ దళానికి కాపలా బలహీనంగా ఉంది. ఆ అవకాశాన్ని వాడుకున్న కులీ ఖాన్, మొత్తం ఫిరంగులన్నిటినీ పట్టుకున్నాడు. ఇది హేమూకి భారీ నష్టమని తేలింది. [1][7]

1556 నవంబరు 5 న మొఘల్ సైన్యం పానిపట్ వద్ద ఉన్న చారిత్రిక యుద్ధభూమిలో హేమూ సైన్యాన్ని ఎదుర్కొంది. అక్బర్, బైరామ్ ఖాన్‌లు యుద్ధభూమికి ఎనిమిది మైళ్ల దూరంలో వెనుక భాగంలో ఉన్నారు.[8]

నిర్మాణం

[మార్చు]

మొఘల్ సైన్యానికి మధ్యలో అలీ కులీ ఖాన్ షైబానీ తన 10,000 అశ్వికదళంతోను, సికందర్ ఖాన్ ఉజ్బాక్ కుడివైపున, అబ్దుల్లా ఖాన్ ఉజ్బాక్ ఎడమవైపునా నడిపించారు. సైన్యానికి అగ్రభాగాన హుస్సేన్ కులీ బేగ్, షా కులీ మహరామ్ నాయకత్వం వహించారు.[1]

హేమూ సైన్యంలో 30,000 ఆఫ్ఘన్ గుర్రాలతో కూడిన ఆశ్విక దళం, 500 ఏనుగులున్న దళం ఉన్నాయి. ప్రతి యుద్ధ ఏనుగుకూ కవచ రక్షణ ఉంది. వాటిపై తుపాకీలు చేపట్టిన సైనికులు, ధానుష్కులు ఎక్కి ఉన్నారు. హవాయి అనే ఏనుగుపై హేమూ తన సైన్యాన్ని స్వయంగా యుద్ధానికి నడిపించాడు.[9] అతని ఎడమ వైపున అతని సోదరి కుమారుడు రమ్య, కుడి వైపున షాదీ ఖాన్ కక్కర్ లు నాయకత్వం వహించారు. అతని సైన్యానికి అనుభవం, ఆత్మవిశ్వాసం ఉంది. హేమూ ఈ సమయానికి బెంగాల్ నుండి పంజాబ్ వరకు జరిగిన 22 యుద్ధాలలో విజయం సాధించి ఉన్నాడు. అయితే ఈ యుద్ధంలో హేమూ వద్ద ఫిరంగులు లేవు.[11]

యుద్ధం

[మార్చు]

రెండు సైన్యాలూ ఢీకొంటే
నీటి లోంచి నిప్పు పుట్టింది;
ఎరుపెక్కిన కత్తులతో గాలి నిండిపోయింది
ఆ ఉక్కు కత్తులు రక్తంతో ఎర్రబారాయి.

అక్బరునామా[12]

హేమూ స్వయంగా దాడిని ప్రారంభించి, మొఘలు సైన్యపు కుడి, ఎడమ పార్శ్వాలపై తన ఏనుగులను వదిలాడు. విధ్వంసం నుండి తప్పించుకోగలిగిన ఆ సైనికులు, వెనుకకు వెళ్ళకుండా, పక్కలకు వెళ్లి హేమూ అశ్వికదళ పార్శ్వాలపై దాడి చేసి, తమ విలువిద్యా నైపుణ్యంతో వారిని బాధించారు. మొఘల్ సైన్యం కూడా ముందుకు సాగింది. హేమూ ఏనుగుల, గుర్రాల విభాగాలు తమ ప్రత్యర్థులను చేరుకోవడానికి మొఘలుసైన్యపు అగాధాన్ని దాటలేకపోయాయి. ఇంతలో, వారి మొఘల్ అశ్విక దళం, తమ వేగవంతమైన గుర్రాలపై పార్శ్వాల నుండి, వెనుక నుండీ ఆఫ్ఘన్ ర్యాంకుల్లోకి ప్రవేశించి, ఏనుగులను లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. ఏనుగుల కాళ్ళను నరికివేయడం లేదా వాటిపై ఉన్నవారిని కిందికి లాగడం ప్రారంభించింది. హేమూ తన ఏనుగులను వెనక్కి రప్పించి, ఆఫ్ఘన్లు దాడిని విరమించుకున్నారు.[13]

ఆఫ్ఘన్ దాడి మందగించడం చూసి, అలీ కులీ ఖాన్ తన అశ్వికదళాన్ని బయటకు నడిపించాడు. చుట్టూ తిరుగుతూ వెనుక నుండి ఆఫ్ఘన్ కేంద్రంపై పడ్డాడు. హవాయిపై నుండి యుద్ధభూమిని పర్యవేక్షిస్తూ ఉన్న హేమూ, వెంటనే ఈ దీన్ని ఎదుర్కోవడానికి తొందరపడ్డాడు. షాదీ ఖాన్ కక్కర్, అతని మరొక లెఫ్టినెంట్ భగవాన్ దాస్ దిగిపోవడాన్ని చూసిన తర్వాత కూడా, అతను మొఘల్‌లపై ఎదురుదాడికి నాయకత్వాన్ని కొనసాగించాడు. తన ఏనుగులను సవాలు చేసిన వారిని ఓడించాడు. యుద్ధం హేమూకు అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది.[14] మొఘల్ సైన్యపు రెండు పార్శ్వాలను వెనక్కి తరిమివేసాడు. హేమూ తన యుద్ధ ఏనుగులు, అశ్విక దళాలను మొగలు సైన్యపు కేంద్రాన్ని అణిచివేసేందుకు ముందుకు నడిపించాడు. ఈ సమయంలో హేమూ బహుశా విజయపు అంచున ఉన్నాడు. ఇంతలో మొఘలుల బాణం ఒకటి అతని కంటికి తగిలి స్పృహతప్పి పడిపోయాడు. అతను క్రిందికి పడడం చూసిన అతని సైన్యంలో భయాందోళనలు తలెత్తాయి. సైన్యం విచ్ఛిన్నమై పారిపోయింది.[15][16] యుద్ధం ముగిసింది. 5,000 మంది యుద్ధ మైదానంలో చనిపోగా, చాలా మందిని పారిపోతూండగా చంపేసారు.[8]

అనంతర పరిణామాలు

[మార్చు]

అపస్మారక స్థితిలో, దాదాపు చనిపోయిన స్థితిలో ఉన్న హేమూని మోసుకెళ్ళే ఏనుగు యుద్ధం ముగిసిన అనేక గంటల తర్వాత పట్టుబడింది. హేమూ తల నరికి వేయమని బైరామ్ ఖాన్, 13 ఏళ్ల అక్బర్‌ను కోరాడు. తర్వాతి కాలంలో అక్బర్ దర్బారులో చేరిన అబూల్-ఫజల్ ఇబ్న్ ముబారక్ ప్రకారం, చనిపోయిన వ్యక్తిని చంపడానికి అక్బరు నిరాకరించాడు. అయితే, దీనిని సమకాలీన రచయిత ముహమ్మద్ ఆరిఫ్ ఖంధారీ (తారిఖ్ ఇ అక్బరీ కర్త) ధృవీకరించలేదు. బైరామ్ ఖాన్ సలహా మేరకు అక్బరు, హేమూ తల నరికి ఘాజీ బిరుదును తీసుకున్నాడని అతడు రాసాడు. హేమూని చంపడానికి అక్బర్ నిరాకరించిన వృత్తాంతం బహుశా తరువాతి కాలంలో అతని దర్బారు సభ్యులు సృష్టించిన కథయై ఉండవచ్చు[17][18][19][16] హేమూ తలను ఢిల్లీ దర్వాజా వెలుపల ఉరితీయడానికి కాబూల్‌కు పంపారు, అయితే అతని మొండేన్ని ఢిల్లీలోని పురానా క్విలాలోని గేటుపై, అక్టోబరు 6 న అతను పట్టాభిషేకం చేసుకున్న చోట తగిలించారు.[15] అనేక మంది హేమూ మద్దతుదారులు, బంధువుల శిరచ్ఛేదం చేసారు. ఒక మినార్ [16] తరువాత నిర్మించబడింది. ఈ మినార్ పెయింటింగ్ అక్బర్‌నామా కాపీలో అక్బర్ జీవితంలోని ప్రముఖ 56 చిత్రాలలో ఒకటి. పానిపట్‌లో హేమూ శిరచ్ఛేదం జరిగిన ప్రదేశంలో అతనికి ఒక స్మారక చిహ్నం నిర్మించారు. దీనిని ఇప్పుడు హేమూ సమాధి స్థల్ అని పిలుస్తారు.[20][21]

హేమూ మరణంతో, ఆదిల్ షా పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అతను 1557 ఏప్రిల్‌లో బెంగాల్‌కు చెందిన ముహమ్మద్ ఖాన్ సుర్ కుమారుడు ఖిజర్ ఖాన్ చేతిలో ఓడిపోయి, హతుడయ్యాడు.[16][22] పానిపట్ వద్ద జరిగిన యుద్ధంలో మొగలులకు ముట్టిన సంపదలో హేమూ యుద్ధ ఏనుగులు 120 ఉన్నాయి. వాటి విధ్వంసక యుద్ధాలు మొఘల్‌లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ జంతువులు త్వరలోనే వారి సైనిక వ్యూహాలలో అంతర్భాగంగా మారాయి.[23]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Sarkar 1960, p. 68.
  2. Sarkar 1960, p. 66.
  3. Qanungo 1965, p. 448.
  4. 4.0 4.1 4.2 Chandra 2004, p. 91.
  5. 5.0 5.1 Sarkar 1960, p. 67.
  6. Richards 1995.
  7. Tripathi 1960, p. 175.
  8. 8.0 8.1 Sarkar 1960, p. 69.
  9. Roy 2004, p. 76.
  10. Chandra 2004, p. 92.
  11. Sarkar 1960, p. 68: Chandra names Hemu's nephew as Ramaiyya.[10]
  12. Abu'l-Fazl. "Vol II, Chapter XI". Akbarnama. Retrieved 8 July 2016.
  13. Sarkar 1960, pp. 68–69.
  14. Sarkar 1960, p. 69: According to Sarkar, the battle was still evenly matched when the random arrow found Hemu.
  15. 15.0 15.1 Tripathi 1960, p. 176.
  16. 16.0 16.1 16.2 16.3 Chandra 2004, p. 93.
  17. Ashirbadi Lal Srivastava (1962). Akbar the Great (in English). Shiva Lal Agarwala. p. 10. OCLC 837892. Bairam Khan asked his royal ward to earn the title of ghazi by slaying the infidel Hemu, with his own hands. We are told by a contemporary writer, Muhammad Arif Qandh that he complied with the request and severed Hemu's head from his body. Abul Fazl's statement that he refused to kill a dying man is obviously wrong{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  18. Kishori Saran Lal (1999). Theory and Practice of Muslim State in India (in ఇంగ్లీష్). Aditya Prakashan. p. 67. ISBN 978-81-86471-72-2. It may be recalled that as an adolescent, Akbar had earned the title of Ghazi by beheading the defenseless infidel Himu
  19. S. Roy (1974). "AKBAR". In R.C. Majumdar (ed.). The History and Culture of the Indian People: The Mughal empire (in ఇంగ్లీష్). Bharatiya Vidya Bhavan. p. 106. Bairam Khan begged him to slay Himu with his own hands in order to gain the reward of Jihad (crusade against infidels) and the title of Ghazi (hero combating infiedels). Akbar accordingly struck Himu with his sword. The story of Akbar's magnanimity and refusal to kill a fallen foe seems to be a later courtly invention
  20. "Hemu's Samadhi Sthal". Haryana Tourism. Retrieved 13 July 2016.
  21. "Places Of Interest / Hemu's Samadhi Sthal". panipat.gov.in. Retrieved 13 July 2016.
  22. Tripathi 1960, p. 177.
  23. Roy 2013, p. 47.

వనరులు

[మార్చు]