Jump to content

హేమూ

వికీపీడియా నుండి
హేమూ
మహారాజా హేమచంద్ర విక్రమాదిత్య
హేమూ మరణానంతర చిత్రం
పాలన1556 అక్టోబరు 7 – నవంబరు 5
Coronation1556 అక్టోబరు 7
పూర్వాధికారిఆదిల్ షా సూరి
ఉత్తరాధికారిఅక్బర్
జననం1501
ఆల్వార్, రాజస్థాన్
మరణం1556 నవంబరు 5
పానిపట్, హర్యానా
Regnal name
విక్రమాదిత్య
తండ్రిరాయ్ పూరణ్ దాస్
మతంహిందూమతం

హేమూ (1501 - 1556 నవంబరు 5) ఒక భారతీయ రాజు. ఉత్తర భారతదేశం అంతటా అధికారం కోసం మొఘలులు, ఆఫ్ఘన్లు పోటీ పడుతున్న చారిత్రిక కాలంలో అతను సుర్ సామ్రాజ్యానికి చెందిన ఆదిల్ షా సూరికి సేనాధిపతిగా, వజీర్‌గా పనిచేశాడు. అతను పంజాబ్ నుండి బెంగాల్ వరకు ఉత్తర భారతదేశం అంతటా ఆఫ్ఘన్ తిరుగుబాటుదారుల తోటీ, ఆగ్రా, ఢిల్లీలో హుమాయున్ అక్బర్ లకు చెందిన మొఘల్ దళాలతోటీ పోరాడాడు. ఆదిల్ షా సూరి కోసం 22 యుద్ధాలు గెలిచాడు. అతన్ని హేమూ విక్రమాదిత్య అనీ హేమచంద్ర విక్రమాదిత్య అనీ కూడా అంటారు.

1556 అక్టోబరు 7న ఢిల్లీ యుద్ధంలో అక్బరుకు చెందిన మొఘల్ దళాలను ఓడించిన తర్వాత హేమూ రాజా హోదాను పొందాడు. గతంలో చాలా మంది భారతీయ రాజులు స్వీకరించిన విక్రమాదిత్య బిరుదును స్వీకరించాడు. ఒక నెల తరువాత, హేమూ రెండవ పానిపట్ యుద్ధంలో ఒక బాణం వలన గాయపడి అపస్మారక స్థితిలో బంధించబడ్డాడు. ఆ స్థితి లోనే ఉన్న హేమూను శిరచ్ఛేదం చేసి అక్బరు, ఘాజీ అనే బిరుదు పొందాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

హేమూ ప్రారంభ జీవితానికి సంబంధించిన సమకాలీన వృత్తాంతాలు అతని సాధారణమైన నేపథ్యం కారణంగా చెదురుమొదురుగానే లభిస్తున్నాయి. తరచుగా అవి పక్షపాత ధోరణితో ఉంటాయి. ఎందుకంటే అవి అక్బర్ ఆస్థానంలో పనిచేసిన బదయూని, అబుల్-ఫజల్ వంటి మొఘల్ చరిత్రకారులు రాసినవే. ఆధునిక చరిత్రకారులు అతని పూర్వీకుల ఇల్లు,[6] అతను పుట్టిన ప్రదేశం, పుట్టిన సంవత్సరం లపై విభేదిస్తున్నారు. సాధారణంగా అంగీకరించినది ఏమిటంటే, అతను పరిమిత సంపద కలిగిన హిందూ కుటుంబంలో జన్మించాడు. బాల్యాన్ని ఢిల్లీకి నైరుతి దిశలో ఉన్న రేవారి నగరంలో గడిపాడు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని మాచేరి గ్రామంలో సన్యాసిత్వం పొందిన తరువాత పురాణ్ దాస్ గా మారిన రాజస్థాన్‌కు చెందిన గౌర్ బ్రాహ్మణుడైన రాయ్ పురాణ్ భార్గవ్‌కు హేమూ జన్మించాడని ఆధునిక పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా, హేమూ చిన్న వయస్సులోనే వ్యాపారం ప్రారంభించాడు. [3] [1] [7]

ఉన్నత స్థితికి ఎదుగుదల

[మార్చు]

హేమూ ప్రారంభ కెరీర్ వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. దానిపై ఊహాగానాలు చాలా ఉన్నాయి. అతను పేలుడు పదార్థాల విక్రేతగా ప్రారంభించిన తరువాత, మార్కెట్‌లో వ్యాపారి లేదా తూకం వేసేవాడు. 1545 లో షేర్ షా సూరి మరణం తరువాత, అతని కుమారుడు ఇస్లాం షా సుర్ సామ్రాజ్యానికి పాలకుడు అయ్యాడు. ఆ కాలంలో, కొంత సైనిక అనుభవం గడించిన హేమూ ఢిల్లీలో మార్కెట్ సూపరింటెండెంట్‌గా ఎదిగాడు.[8] [5] హేమూ తదనంతరం గూఢచార శాఖాధిపతిగా, పోస్ట్ సూపరింటెండెంట్‌గా నియమితుడయ్యాడు.[5] అతను సుల్తాను వంటశాలల సర్వేయర్‌గా కూడా పనిచేసేవాడని కొన్ని వర్గాలిఉ చెబుతాయి.[3]

ఇస్లాం షా, ఆఫ్ఘన్ అధికారులతో పాటు హిందువులను కూడా తన సైన్యంలో ఉంచడానికి ఇష్టపడేవాడు. ఆవిధంగా వారు ఒకరిపై ఒకరు గూఢచర్యం చేసుకుంటారని అతని ఆలోచన. హేమూ సైనిక లక్షణాలను గుర్తించి, ఉన్నత స్థాయి అధికారికి సమానమైన బాధ్యతలను అతనికి అప్పగించాడు.[10] మాన్‌కోట్ పరిసరాల్లోని హుమాయూన్ సవతి సోదరుడు కమ్రాన్ మీర్జా కదలికలను పర్యవేక్షించడానికి హేమూను పంపించాడు.[5]

ఇస్లాం షా 1553 అక్టోబరు 30 న మరణించాడు.[11] అతని 12 ఏళ్ల కుమారుడు ఫిరోజ్ ఖాన్‌, అధికారానికి వచ్చిన మూడు రోజుల లోపే అతన్ని మేనమామ ఆదిల్ షా సూరి చంపేసాడు. అయితే ఈ కొత్త పాలకుడు రాజ్య వ్యవహారాల కంటే సుఖాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరిచాడు.[1] కానీ హేమూ ఆదిల్ షా పట్ల విధేయత చూపాడు. అతని సైనిక విజయాలు అతన్ని ముఖ్యమంత్రిగా, రాజ్య సాధారణ పర్యవేక్షకునిగా ఎదగడానికి దారితీశాయి.[3] అబుల్-ఫజల్ ప్రకారం, హేమూ షా కోర్టులో "అన్ని నియామకాలు, తొలగింపులనూ, న్యాయం పంపిణీనీ చేపట్టాడు".[5]

సైనిక వృత్తి

[మార్చు]
గ్వాలియర్ కోట, హేమూ యొక్క అనేక ప్రచారాలకు ఆధారం.

హేమూ, అత్యంత సమర్థుడైన పౌర అధికారి మాత్రమే కాదు, షేర్ షా సూరి మరణానంతరం ఆఫ్ఘన్ల వైపున ఉన్న అత్యుత్తమ సైనిక మేధస్సు కూడా.[1] అతను ఆదిల్ షా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా 22 యుద్ధాలు చేసి విజయం సాధించాడు.[8] వీటిలో చాలా యుద్ధాలు ఆదిల్ షాపై తిరుగుబాటు చేసిన ఆఫ్ఘన్‌ల పైనే చేసాడు. వీరిలో ఒకరు తాజ్ ఖాన్ కర్రానీ. అతను ఆదిల్ షాకు సేవ చేయడం కంటే, గ్వాలియర్ నుండి తూర్పు వైపు తన అనుచరులతో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. చిబ్రమౌ వద్ద హేమూ అతన్ని అడ్డుకుని ఓడించాడు. కానీ అతను ఎలాగోలా తప్పించుకుని, చునార్‌కు పారిపోయాడు. హేమూ మళ్లీ వెంబడించి, చునార్ వద్ద కర్రానితో పోరాడి, మళ్ళీ విజయం సాధించాడు. అయితే, చిబ్రమౌ వద్ద లాగానే, కర్రానీ మళ్లీ తప్పించుకున్నాడు. హేమూ తనతో పాటు వచ్చిన ఆదిల్ షాను చునార్‌లో ఉండమని చెప్పి, కర్రానీని బెంగాల్ వరకూ వెంబడించాడు.[12]

తుగ్లకాబాద్ యుద్ధానికి ముందు హేమూ స్వాధీనం చేసుకున్న ఆగ్రా కోట .

1555 జూలై 23 న ఆదిల్ షా బావమరిది సికందర్ షా సూరిపై హుమాయూన్ విజయం సాధించిన తరువాత, మొఘలులు మళ్ళీ ఢిల్లీ, ఆగ్రాలను సాధించుకున్నారు. 1556 జనవరి 26న హుమాయూన్ మరణించినప్పుడు హేమూ బెంగాల్‌లో ఉన్నాడు. అతని మరణం హేమూకు మొఘలులను ఓడించడానికి చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. అతను బెంగాల్ నుండి వేగంగా వస్తూ బయానా, ఇటావా, సంభాల్, కల్పి, నార్నాల్ నుండి మొఘలులను తరిమికొట్టాడు.[4] హేమూ దండయాత్ర గురించి విన్న ఆగ్రా లోని ప్రతినిధి నగరాన్ని ఖాళీ చేసి, యుద్ధం చేయకుండా పారిపోయాడు. [13]

ఆ తరుబ్వాత కొంతకాలానికి హేమూ, తన విజయాల్లోకెల్లా అత్యంత ముఖ్యమైన దాన్ని తుగ్లకాబాద్‌లో మొఘలులపై సాధించాడు.

తుగ్లకాబాద్ యుద్ధం

[మార్చు]

ఢిల్లీలో అక్బరుకు ప్రతినిధిగా ఉన్న తార్ది బేగ్ ఖాన్, జలంధర్‌లో విడిది చేసిన తన యజమానులకు, హేమూ ఆగ్రాను స్వాధీనం చేసుకున్నాడనీ, రాజధాని ఢిల్లీపై దాడి చేయాలని భావిస్తున్నాడనీ, మరిన్ని బలగాలను పంపించకపోతే ఢిల్లీని రక్షించుకోలేమని రాశాడు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అక్బర్ రాజప్రతినిధి బైరమ్ ఖాన్, సికందర్ షా సూరి నుండి ఉన్న భయం కారణంగా ప్రధాన సైన్యాన్ని పంపించలేక పోయినప్పటికీ, తనవద్ద అత్యంత సమర్థుడైన సేనాధిపతి పీర్ ముహమ్మద్ షర్వానీని ఢిల్లీకి పంపాడు. ఇంతలో, తార్డి బేగ్ ఖాన్ సమీపంలోని మొఘల్ ప్రభువులందరినీ ఢిల్లీలో తమ బలగాలను సమకూర్చుకోవాలని ఆదేశించాడు. ఒక యుద్ధ మండలిని ఏర్పాటు చేసి, మొఘలులు నిలబడి హేమూతో పోరాడాలని నిర్ణయించి, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు.[14]

ఆగ్రాను గెలుచుకున్న తర్వాత, నగర గవర్నర్‌ను వెంబడిస్తూ బయలుదేరిన హేమూ, ఢిల్లీకి వెలుపల ఉన్న తుగ్లకాబాద్ అనే గ్రామానికి చేరుకున్నాడు, అక్కడ అతను తార్డి బేగ్ ఖాన్ సైన్యంలోకి ప్రవేశించాడు. మొఘలులు సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ, 1000 యుద్ధ ఏనుగులు, 50,000 అశ్వికదళాలు, 51 ఫిరంగులు, 500 ఫాల్కోనెట్‌లు ఉన్న హేమూ సైన్యాన్ని దీటుగా ఎదుర్కొందని బదయూని అన్నాడు.[4][13] జదునాథ్ సర్కార్ ఈ యుద్ధాన్ని ఇలా వివరించాడు: [13]

హాజీ ఖాన్ ఆధ్వర్యంలో అల్వార్ నుండి తాజా బలగాలు సకాలంలో రావడంతో హేమూకు మరింత ఊపు వచ్చింది.[14] అంతకు ముందు గెలిచి వెంటాడుతూ వెళ్ళిన మొఘల్ అగ్రభాగం, ఎడమ పార్శ్వం వెనక్కి తిరిగి వచ్చాక, ఆ రోజు ఓడిపోయామని గ్రహించారు, పోరాడకుండా చెదిరిపోయారు. 1556 అక్టోబరు 7 న జరిగిన ఒక రోజు యుద్ధం తర్వాత హేమూ ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు.[13]

రాజా విక్రమాదిత్యగా

[మార్చు]
సుమారు 1910s హేమూ విక్రమాదిత్య పాత్ర

ఢిల్లీని తన ఆధీనంలోకి తీసుకున్న తరువాత, హేమూ రాజా హోదాను పొంది,[15] విక్రమాదిత్య (లేదా బిక్రమ్‌జిత్ ) అనే బిరుదును స్వీకరించాడు. భారతదేశంలో ప్రాచీన హిందూ రాజులు అనేకమంది స్వీకరించిన బిరుదది. అయితే, చరిత్రకారులలో దీనిపట్ల భిన్నాభిప్రాయాలున్నాయి.

హేమూ తనను తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడని సతీష్ చంద్ర వంటి చరిత్రకారులు కొందరు నమ్మరు. ఆ కాలంలోని మొఘల్ రచయితలు ఎవరూ తమ రచనలలో స్పష్టంగా చెప్పలేదని అతను వాదించాడు. తుగ్లకాబాద్‌లో హేమూ విజయం సాధించిన తర్వాత, అతనిలో "సార్వభౌమత్వ కాంక్ష" రెచ్చిపోయిందని అక్బర్‌నామాలో, అబుల్-ఫజల్ వ్రాశాడు. బదయూని ప్రకారం, హేమూ హిందుస్తాన్ లోని గొప్ప మహారాజు వలె బిక్రమ్‌జిత్ బిరుదును పొందాడు. నిజాముద్దీన్ అహ్మద్ అనే మరో సమకాలీన చరిత్రకారుడు హేమూ ఆ బిరుదును తీసుకున్నాడని మాత్రం పేర్కొని, అంతకుమించి మరేమీ చెప్పడం మానేశాడు. రెండవది, హేమూ సైనిక దళం దాదాపు పూర్తిగా ఆఫ్ఘన్‌లతో కూడి ఉన్నందున ఇది అనాలోచిత చర్యగా ఉండేది. బదాయూని ప్రకారం, "అతని దోపిడీకి జబ్బుపడిన … అతని పతనం కోసం ప్రార్థించిన" ఆఫ్ఘన్‌లలో హేమూపై కొన్ని గొణుగుడు కూడా ఉన్నాయి. [8]

ఇతర చరిత్రకారులు ఆదిల్ షా అధికారం నుండి విడివడి,[16] స్వతంత్ర రాజుగా తనను తాను స్థాపించుకునే హేమూ ప్రయత్నంగా వర్ణించారు.[17] అబ్రహాం ఎరాలీ, అహ్మద్ యాద్గార్‌ను [18] ఉటంకిస్తూ తన ఆఫ్ఘన్‌ల చరిత్రలో హేమూ "తనపై రాజరిక ఛత్రాన్ని స్థాపించుకున్నాడు, తన పేరు మీద నాణెం వేయమని ఆదేశించాడు" అని పేర్కొన్నాడు. అతను యుద్ధాల ద్వారా లభించిన సంపదను ఆఫ్ఘన్‌లతో ఉదారంగా పంచుకుని, వారిని కలుపుకుని ఇది చేసాడు. కానీ హేమూ తన ధర్మ వృత్తులతో ఆదిల్ షాకు తన విధేయతను చూపించుకుంటూనే ఉన్నాడని ఎరాలీ పేర్కొన్నాడు.[19]

అతను స్వతంత్ర రాజుగా తనను తాను స్థాపించుకున్నాడో లేదో గానీ, హేమూ విక్రమాదిత్య పాలన మాత్రం స్వల్పకాలికమైనదే. ఎందుకంటే అతను ఒక నెల తర్వాత మళ్లీ మొఘలులతో ఘర్షణ పడ్డాడు. ఈసారి యుద్ధభూమి పానిపట్‌లో, అక్బర్ తాత బాబర్ 30 సంవత్సరాల క్రితం లోడీపై విజయం సాధించిన ప్రదేశానికి ఎంతో దూరంలో లేదు.

రెండవ పానిపట్టు యుద్ధం

[మార్చు]
హేమూ ఓటమి, అక్బర్నామా నుండి కంకర్ వేసిన పెయింటింగ్. ఇందులో హేమూ గానీ, అక్బర్ గానీ లేరు. దీన్నిబట్టి ఇది రెండు పేజీల చిత్రంలో ఇది ఒక భాగమేనని అనుకోవచ్చు. [20]

తుగ్లకాబాద్ నుండి వినాశకరమైన వార్త విన్న అక్బర్ వెంటనే ఢిల్లీకి బయలుదేరాడు. అదృష్టవశాత్తూ, 10,000 మంది ఉన్న ఆశ్విక దళంతో ముందే పంపిన అలీ కులీ ఖాన్ షైబానీ (తరువాత అతనే ఖాన్-ఇ-జమాన్) కి హేమూ ఫిరంగిదళం కనిపించింది. ఆ దళానికి కాపలా బలహీనంగా ఉంది. ఆ అవకాశాన్ని వాడుకున్న కులీ ఖాన్, మొత్తం ఫిరంగులన్నిటినీ పట్టుకున్నాడు. ఇది హేమూకి భారీ నష్టమని తేలింది.[21][22]

1556 నవంబరు 5 న మొఘల్ సైన్యం పానిపట్టు వద్ద ఉన్న చారిత్రిక యుద్ధభూమిలో హేమూ సైన్యాన్ని ఎదుర్కొంది. అక్బర్, బైరామ్ ఖాన్‌లు యుద్ధభూమికి ఎనిమిది మైళ్ల దూరంలో వెనుక భాగంలో ఉన్నారు.[23] మొఘల్ సైన్యానికి మధ్యలో అలీ కులీ ఖాన్ షైబానీ తన 10,000 అశ్వికదళంతోను, సికందర్ ఖాన్ ఉజ్బాక్ కుడివైపున, అబ్దుల్లా ఖాన్ ఉజ్బాక్ ఎడమవైపునా నడిపించారు. సైన్యానికి అగ్రభాగాన హుస్సేన్ కులీ బేగ్, షా కులీ మహరామ్ నాయకత్వం వహించారు.[21]

హవాయి అనే ఏనుగుపై హేమూ తన సైన్యాన్ని స్వయంగా యుద్ధానికి నడిపించాడు.[24] అతని ఎడమ వైపున అతని సోదరి కుమారుడు రమ్య, కుడి వైపున షాదీ ఖాన్ కక్కర్ లు నాయకత్వం వహించారు. అతని సైన్యానికి అనుభవం, ఆత్మవిశ్వాసం ఉంది. హేమూ ఈ సమయానికి బెంగాల్ నుండి పంజాబ్ వరకు జరిగిన 22 యుద్ధాలలో విజయం సాధించి ఉన్నాడు. అయితే ఈ యుద్ధంలో హేమూ వద్ద ఫిరంగులు లేవు.[25]

మొఘల్ సైన్యపు రెండు పార్శ్వాలను వెనక్కి తరిమివేసాడు. హేమూ తన యుద్ధ ఏనుగులు, అశ్విక దళాలను మొగలు సైన్యపు కేంద్రాన్ని అణిచివేసేందుకు ముందుకు నడిపించాడు. ఈ సమయంలో హేమూ బహుశా విజయపు అంచున ఉన్నాడు. ఇంతలో మొఘలుల బాణం ఒకటి అతని కంటికి తగిలి స్పృహతప్పి పడిపోయాడు. అతను క్రిందికి పడడం చూసిన అతని సైన్యంలో భయాందోళనలు తలెత్తాయి. సైన్యం విచ్ఛిన్నమై పారిపోయింది.[26][27] యుద్ధం ముగిసింది. 5,000 మంది యుద్ధ మైదానంలో చనిపోగా, చాలా మందిని పారిపోతూండగా చంపేసారు.[23]

మరణం

[మార్చు]

అపస్మారక స్థితిలో, దాదాపు చనిపోయిన స్థితిలో ఉన్న హేమూని మోసుకెళ్ళే ఏనుగు యుద్ధం ముగిసిన అనేక గంటల తర్వాత పట్టుబడింది. హేమూ తల నరికి వేయమని బైరామ్ ఖాన్, 13 ఏళ్ల అక్బర్‌ను కోరాడు. తర్వాతి కాలంలో అక్బర్ దర్బారులో చేరిన అబూల్-ఫజల్ ఇబ్న్ ముబారక్ ప్రకారం, చనిపోయిన వ్యక్తిని చంపడానికి అక్బరు నిరాకరించాడు. అయితే, దీనిని సమకాలీన రచయిత ముహమ్మద్ ఆరిఫ్ ఖంధారీ (తారిఖ్ ఇ అక్బరీ కర్త) ధృవీకరించలేదు. బైరామ్ ఖాన్ సలహా మేరకు అక్బరు, హేమూ తల నరికి ఘాజీ బిరుదును తీసుకున్నాడని అతడు రాసాడు. హేమూని చంపడానికి అక్బర్ నిరాకరించిన వృత్తాంతం బహుశా తరువాతి కాలంలో అతని దర్బారు సభ్యులు సృష్టించిన కథయై ఉండవచ్చు[28][29][30][27] హేమూ తలను ఢిల్లీ దర్వాజా వెలుపల ఉరితీయడానికి కాబూల్‌కు పంపి, అతని మొండేన్ని ఢిల్లీలోని పురానా క్విలాలోని గేటుపై, అక్టోబరు 6 న అతను పట్టాభిషేకం చేసుకున్న చోట తగిలించారు.[26] అనేక మంది హేమూ మద్దతుదారులు, బంధువుల శిరచ్ఛేదం చేసి, వాటిపై ఒక మినార్ నిర్మించారు.[27]

అనంతర పరిణామాలు

[మార్చు]
అక్బర్నామా మాన్యుస్క్రిప్ట్ నుండి మొఘల్ సూక్ష్మ పెయింటింగు. హేమూ సైనికులు, మద్దతుదారుల అవశేషాలతో నిర్మించిన పుర్రెల మీనార్ ఇది. 1590 నాటి చిత్రం

ఆల్వార్ సమీపంలోని మాచారిలో ఉన్న హేమూ కుటుంబాన్ని పానిపట్టు వద్ద పోరాడిన మొఘల్ అధికారి పీర్ ముహమ్మద్ బంధించాడు. ఇస్లాం మతంలోకి మారితే హేమూ తండ్రి ప్రాణాలను విడిచిపెడతానని పీర్ ముహమ్మద్ ప్రతిపాదించాడు. ఆ వృద్ధుడు అందుకు అతన్ని నిరాకరించడంతో ఉరితీశారు.[32] అయితే, హేమూ భార్య తప్పించుకోగలిగింది.[27][33]

హేమూ మరణంతో, ఆదిల్ షా అదృష్టం కూడా తిరగబడింది. అతను 1557 ఏప్రిల్‌లో బెంగాల్‌కు చెందిన ముహమ్మద్ షా కుమారుడు ఖిజర్ ఖాన్ చేతిలో ఓడిపోయి, హతుడయ్యాడు [27] [33]

పానిపట్టు వద్ద జరిగిన యుద్ధంలో మొగలులకు ముట్టిన సంపదలో హేమూ యుద్ధ ఏనుగులు 120 ఉన్నాయి. వాటి విధ్వంసక యుద్ధాలు మొఘల్‌లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ జంతువులు త్వరలోనే వారి సైనిక వ్యూహాలలో అంతర్భాగంగా మారాయి.[34]

వారసత్వం

[మార్చు]
ఆధునిక హర్యానాలోని పానిపట్‌లో హేమూ విగ్రహం

హేమూ రేవారిలో తన సాధారణమైన స్థాయి నుండి ఎదిగి మహారాజా విక్రమాదిత్య బిరుదును స్వీకరించడం చరిత్రలో చెప్పుకోదగ్గ మలుపుగా పరిగణిస్తారు. ఒకానొక యుద్ధంలో చివ్వున దూస్కొచ్చిన ఒకానొక బాణం దారితప్పి ఉంటే, శతాబ్దాలుగా ముస్లిం పాలనలో ఉన్న ప్రాంతంలో హేమూ విక్రమాదిత్య "సంస్కృత రాచరిక సంప్రదాయాన్ని" పునరుద్ధరించి ఉండేవాడు.[15] అయితే, హేమూ సైనిక, పరిపాలనా పునాదుల్లో సుర్ రాజవంశానికి విధేయులైన ఆఫ్ఘన్‌లు ఉన్నందున, అతను తన రాచరిక హోదాను నిలుపుకోగలిగేవాడా అనేది ప్రశ్నార్థకమైంది. హేమూ సైనిక దళం దాదాపు పూర్తిగా ఆఫ్ఘన్‌లతో కూడి ఉండటం వలన ఇది అనాలోచిత చర్యగా ఉండేది. బదయూని ప్రకారం, హేమూపై ఆఫ్ఘన్‌లలో కొన్ని సణుగుడు ఉండేది. వాళ్ళు "అతని పట్టాభిషేకం పట్ల కుపితులై … అతని పతనం కోసం ప్రార్థించారు" అని అతను రాసాడు.[8]

హేమూ శత్రువులకు కూడా అతని పట్ల ద్వేషంతో కూడిన ఆరాధన ఉంటుంది. అబుల్-ఫజల్ అతని ఉన్నతమైన స్ఫూర్తిని, ధైర్యాన్నీ కొనియాడుతూ, అక్బరు గానీ, లేదా అతని దర్బారు లోని తెలివైన సభ్యులెవరైనా గానీ హేమూని ఉరితీయకుండా ఖైదీగా ఉంచాలని కోరుకున్నాడు. అతను మొగలుల సేవలో చేరితే, ఖచ్చితంగా తనకంటూ ప్రత్యేకతను చాటుకునేవాడని అబుల్ ఫజల్ అనుకున్నాడు.[27]

ఇటీవలి కాలంలో హేమూ మద్దతుదారులు పానిపట్‌లో హేమూ సమాధి స్థల్ అనే పేరుతో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు.[35][36]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Sarkar 1960, p. 66.
  2. Majumdar 1984, pp. 94, 97.
  3. 3.0 3.1 3.2 3.3 Tripathi 1960, p. 158.
  4. 4.0 4.1 4.2 Chandra 2004, p. 91.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 Qanungo 1965, p. 448.
  6. Richards 1995, p. 13: Richards states that Hemu was a Vaishya. Others name him a Gaur Brahmin,[1] a Dhūsar Bhargav[2] a Dhusar who "are supposed to be a sub-division of Gaur Brahmins",[3] a "Dhusar or Bhargava, who claim to be Gaur Brahmins",[4] a Dhusar, a "caste of the Vaish or Baniyas, who now claim to be Bharagava Brahmins",[5] etc.
  7. Majumdar 1984, p. 94.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 Chandra 2004, p. 92.
  9. Myer 1995, p. 48.
  10. Qanungo 1965, p. 448: Qanungo states that Islam Shah raised Hemu to the position that Brahmjit Gaur held under Sher Shah Suri. Brahmjit Gaur has been described as a "fort general".[9]
  11. Tripathi 1960, p. 170.
  12. Tripathi 1960, p. 159.
  13. 13.0 13.1 13.2 13.3 Sarkar 1960, p. 67.
  14. 14.0 14.1 Tripathi 1960, p. 174.
  15. 15.0 15.1 Richards 1995.
  16. Wink 2012.
  17. Roy 2004, p. 73.
  18. Hadi 1994: Modern critical scholarship however believes Yadgar's book to be of questionable authenticity.
  19. Eraly 2000, p. 120.
  20. "Mughal Painting Under Akbar: the Melbourne Hamza-nama and Akbar-nama paintings". www.ngv.vic.gov.au. Retrieved 18 July 2016.
  21. 21.0 21.1 Sarkar 1960, p. 68.
  22. Tripathi 1960, p. 175.
  23. 23.0 23.1 Sarkar 1960, p. 69.
  24. Roy 2004, p. 76.
  25. Sarkar 1960, p. 68: Chandra names Hemu's nephew as Ramaiyya.[8]
  26. 26.0 26.1 Tripathi 1960, p. 176.
  27. 27.0 27.1 27.2 27.3 27.4 27.5 Chandra 2004, p. 93.
  28. Ashirbadi Lal Srivastava (1962). Akbar the Great (in English). Shiva Lal Agarwala. p. 10. OCLC 837892. Bairam Khan asked his royal ward to earn the title of ghazi by slaying the infidel Hemu, with his own hands. We are told by a contemporary writer, Muhammad Arif Qandh that he complied with the request and severed Hemu's head from his body. Abul Fazl's statement that he refused to kill a dying man is obviously wrong{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  29. Kishori Saran Lal (1999). Theory and Practice of Muslim State in India (in ఇంగ్లీష్). Aditya Prakashan. p. 67. ISBN 978-81-86471-72-2. It may be recalled that as an adolescent, Akbar had earned the title of Ghazi by beheading the defenseless infidel Himu
  30. S. Roy (1974). "AKBAR". In R.C. Majumdar (ed.). The History and Culture of the Indian People: The Mughal empire (in ఇంగ్లీష్). Bharatiya Vidya Bhavan. p. 106. Bairam Khan begged him to slay Himu with his own hands in order to gain the reward of Jihad (crusade against infidels) and the title of Ghazi (hero combating infiedels). Akbar accordingly struck Himu with his sword. The story of Akbar's magnanimity and refusal to kill a fallen foe seems to be a later courtly invention
  31. Abu'l-Fazl. "Vol II, Chapter XI". Akbarnama. Archived from the original on 15 August 2016. Retrieved 8 July 2016.
  32. Tripathi 1960, p. 177: Tripathi quotes from the Akbarnama:[31]

    The place was strong and there was much fighting, and the father of Hemū was captured and brought alive before the Nāṣir-al-mulk. The latter called upon him to change his religion. The old man answered, "for eighty years I've worshipped my God, according to this religion. Why should I change it at this time, and why should I, merely from fear of my life, and without understanding it come into your way of worship." Pir Muḥammad treated his words as if he heard them not, and answered him with the tongue of the sword.

  33. 33.0 33.1 Tripathi 1960, p. 177.
  34. Roy 2013, p. 47.
  35. "Hemu's Samadhi Sthal". Haryana Tourism. Retrieved 13 July 2016.
  36. "Places Of Interest / Hemu's Samadhi Sthal". panipat.gov.in. Archived from the original on 28 June 2016. Retrieved 13 July 2016.

సూచనలు

[మార్చు]

 

"https://te.wikipedia.org/w/index.php?title=హేమూ&oldid=4318799" నుండి వెలికితీశారు