భూ సర్వే

వికీపీడియా నుండి
(ల్యాండ్ సర్వేయింగు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
A woman holding a notebook crouches next to a theodolite on a tripod. The instrument is set up on a bank in a forest.
టోటల్ స్టేషన్‌ను ఉపయోగిస్తున్న సర్వేయరు

సర్వేయింగ్ లేదా భూమి సర్వేయింగ్ అనేది భూమి ఉపరితలంపై ఉన్న వివిధ బిందువుల త్రిమితీయ స్థానాలను, వాటి మధ్య దూరాలను, కోణాలనూ నిర్ణయించే సాంకేతికత. అదొక వృత్తి, కళ. అదొక శాస్త్రం. సర్వే చేసే వారిని సర్వేయరు అంటారు. ఆస్తుల సరిహద్దులను, స్వంతదారులను నిర్ణయించేందుకు, ప్రభుత్వ, పౌర చట్టాల ద్వారా అవసరమయ్యే ఇతర ప్రయోజనాల కోసం, మ్యాపుల తయారీకీ సర్వే ఉపయోగపడుతుంది.

సర్వేలో భాగంగా జ్యామితి, త్రికోణమితి, రిగ్రెషన్ విశ్లేషణ, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్, మెట్రాలజీ, ప్రోగ్రామింగ్ భాషలు, చట్టం లోని అంశాలను వాడతారు. టోటల్ స్టేషన్లు, రోబోటిక్ టోటల్ స్టేషన్లు, థియోడోలైట్లు, GNSS రిసీవర్లు, రెట్రోరిఫ్లెక్టర్లు, 3D స్కానర్లు, రేడియోలు, ఇంక్లినోమీటర్లు, హ్యాండ్హెల్డ్ ట్యాబ్లెట్లు, డిజిటల్ లెవెల్‌లు, భూగర్భ లొకేటర్లు, డ్రోన్లు, GIS, సర్వేయింగ్ సాఫ్ట్వేర్ మొదలైనవి సర్వేయర్లు వాడే పరికరాల్లో కొన్ని.

చరిత్ర ప్రారంభం నుండి మానవ అభివృద్ధిలో సర్వేయింగ్ ఒక అంశంగా ఉంది. చాలా రకాల నిర్మాణాల రూపకల్పనకు, అమలు చేయడానికీ సర్వేయింగు అవసరం. రవాణా, సమాచార ప్రసారం, మ్యాపింగ్, భూమి యాజమాన్యం కోసం చట్టపరమైన సరిహద్దుల నిర్వచనంలో కూడా సర్వేయింగు ఉపయోగపడుతుంది. అనేక ఇతర శాస్త్రీయ విభాగాలలో పరిశోధన కోసం సర్వే ముఖ్యమైన సాధనం.

నిర్వచనం

[మార్చు]

సర్వేయింగ్ పనిని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సర్వేయర్స్ ఇలా నిర్వచించింది:[1]

సర్వేయరు, క్రింది కార్యకలాపాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని చేసేందుకు అవసరమైన విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యమూ కలిగిన వ్యక్తి;

  • భూమి, త్రిమితీయ వస్తువులు, పాయింట్-ఫీల్డ్‌లు, పథాలను నిర్ణయించడానికి, కొలవడానికి, సూచించడానికి;
  • భౌగోళిక సమాచారాన్ని సమీకరించటానికి, వివరించడానికి,
  • భూమి, సముద్రాలపై నిర్మాణాల రూపకల్పన, నిర్వహణ కోసం ఆ సమాచారాన్ని ఉపయోగించడం;
  • పై పద్ధతులపై పరిశోధనలు చేయడం, వాటిని అభివృద్ధి చేయడం.

చరిత్ర

[మార్చు]

పురాతన చరిత్ర

[మార్చు]
refer to caption
కాసెల్స్ కార్పెంట్రీ అండ్ జాయినరీ పుస్తకం నుండి ప్లంబ్ రూల్

మానవులు మొదటి పెద్ద పెద్ద నిర్మాణాలను నిర్మించినప్పటి నుండి సర్వే చేస్తూ వచ్చారు. పురాతన ఈజిప్టులో, నైలు నది వార్షిక వరదల తరువాత కట్టలను పునర్నిర్మించడానికి సాధారణ జ్యామితిని ఉపయోగించేవారు. గిజా లోని గ్రేట్ పిరమిడ్ దాదాపు కచ్చితమైన చతురస్రాకారంలో ఉండడం, కచ్చితంగా ఉత్తర-దక్షిణ ముఖంగా ఉండడం, క్రీ.పూ 2700 నాటి ఈజిప్షియన్ల సర్వే కుశలతను సూచిస్తున్నాయి. గ్రోమా పరికరం మెసొపొటేమియాలో (క్రీ.పూ 1 వ సహస్రాబ్ది ప్రారంభంలో) ఉద్భవించింది. స్టోన్‌హెంజ్‌లోని చరిత్రపూర్వ స్మారక చిహ్నం (క్రీ.పూ. 2500) చరిత్రపూర్వ సర్వేయర్లు పెగ్ - తాడు జ్యామితిని ఉపయోగించి ఏర్పాటు చేశారు.

రోమన్లు భూ సర్వేను ఒక వృత్తిగా గుర్తించారు. వారు రోమన్ సామ్రాజ్యాన్ని విభజించే ప్రాథమిక కొలతలను ఏర్పరచారు. అంటే స్వాధీనం చేసుకున్న భూముల పన్ను రిజిస్టర్ (సా.శ. 300).[2] రోమన్ సర్వేయర్లను గ్రోమాటిసి అని పిలిచేవారు.

మధ్యయుగ ఐరోపాలో, హద్దులు కొట్టడం అనే ప్రక్రియ ద్వారా గ్రామ సరిహద్దులను గుర్తించేవారు. సరిహద్దులను గుర్తుంచుకోవడం కోసం, ప్రజలను గుమి గూర్చి గ్రామం చుట్టూ తిరిగే పద్ధతి ఇది. జ్ఞాపకశక్తి సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉండేలా ఈ గుంపుల్లో చిన్న పిల్లలు ఉండేలా చూసేవారు.

ఇంగ్లాండ్‌లో, విలియం ది కాంకరర్ 1086 లో డోమ్స్‌డే పుస్తకాన్ని ప్రారంభించాడు. ఇది అన్ని భూ యజమానుల పేర్లు, వారికి ఉన్న భూమి విస్తీర్ణం, భూమి నాణ్యత, ఆ ప్రాంతం లోని కంటెంటు, నివాసుల నిర్దిష్ట సమాచారం మొదలైనవాటిని నమోదు చేసింది. కచ్చితమైన స్థానాలను చూపించే పటాలు లేవు.

ఆధునిక యుగం

[మార్చు]
Printed image of surveying equipment.
టేబుల్ ఆఫ్ సర్వేయింగ్, 1728 సైక్లోపీడియా

1551 లో అబెల్ ఫౌలన్ తలాల పట్టిక ఒకదాన్ని వివరించాడు. అతని వివరణ అభివృద్ధి చెందిన పరికరానికి స్ంబంధించినది కావడంతో ఈ పరికరం అంతకుముందు నుండి వాడుకలో ఉందని భావిస్తున్నారు.

గుంటర్ గొలుసును 1620 లో ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు ఎడ్మండ్ గుంటర్ పరిచయం చేశాడు. ఇది చట్టబద్ధ, వాణిజ్య ప్రయోజనాల కోసం భూమిని కచ్చితంగా సర్వే చేయడానికి, ముక్కలుగా విభజించడానికీ వీలు కల్పించింది.

లియోనార్డ్ డిగ్గెస్ తన పుస్తకంలో సమాంతర కోణాలను కొలిచే థియోడోలైట్ గురించి పాంటోమెట్రియా అనే రేఖాగణిత అభ్యాసం (1571) అనే పుస్తకంలో వివరించాడు. జాషువా హబెర్మెల్ ( ఎరాస్మస్ హబెర్మెహ్ల్ ) 1576 లో దిక్సూచి, త్రిపాదితో థియోడోలైట్ను సృష్టించాడు. మొట్టమొదటి సారిగా థియోడోలైట్‌లో టెలిస్కోప్‌ను చేర్చినది 1725 లో జోనాథన్ సెషన్.

18 వ శతాబ్దంలో, సర్వేయింగ్ కోసం ఆధునిక పద్ధతులు, సాధనాలను ఉపయోగించడం ప్రారంభించారు. జెస్సీ రామ్స్‌డెన్ 1787 లో మొదటి కచ్చితమైన థియోడోలైట్‌ను ప్రవేశపెట్టాడు. క్షితిజ సమాంతర తలం, నిలువు తలం రెండిట్లోనూ కోణాలను కొలిచే పరికరం ఇది. అతను తానే స్వయంగా రూపొందించిన డివైడింగ్ ఇంజిన్ను ఉపయోగించి థియోడోలైట్‌ను సృష్టించాడు. ఈ థియోడోలైట్, పరికరాల కచ్చితత్వంలో గొప్ప ముందడుగు వేసింది. విలియం గ్యాస్కోయిన్ 1640 లో, టెలిస్కోప్‌ అమర్చిన క్రాస్‌హెయిర్‌ను లక్ష్య పరికరంగా ఉపయోగించాడు. జేమ్స్ వాట్ 1771 లో దూరాన్ని కొలవడానికి ఆప్టికల్ మీటర్‌ను అభివృద్ధి చేశాడు; ఇది పారలాక్టిక్ కోణాన్ని కొలుస్తుంది. దాని నుండి ఒక బిందువు దూరాన్ని నిర్ధారించవచ్చు.

డచ్ గణిత శాస్త్రజ్ఞుడు విల్లెబోర్డ్ స్నెలియస్ త్రిభుజం వాడకాన్ని ప్రవేశపెట్టాడు. 1615 లో అతను అల్క్‌మార్ నుండి బ్రేడా వరకు ఉన్న దూరాన్ని (సుమారు 116,1 కిలోమీటర్లు) కొలిచాడు. అతను ఈ దూరాన్ని 3.5% తక్కువగా అంచనా వేశాడు. ఈ సర్వే మొత్తం 33 త్రిభుజాలను కలిగి ఉన్న చతురస్రాకారాల గొలుసు. భూమి వక్రతను అనుమతించడానికి ప్లానార్ సూత్రాలను ఎలా సరిదిద్దవచ్చో స్నెల్ చూపించాడు. త్రిభుజం లోపల ఒక బిందువు ఉన్న స్థానాన్ని ఎలా కనుగొనాలో అతను చూపించాడు. ఈ పద్ధతిలో, దిక్సూచిపై ఆధారపడిన పద్ధతి కంటే వీటిని మరింత కచ్చితంగా కొలవవచ్చు.

1733 - 1740 మధ్య, జాక్వెస్ కాసిని, అతని కుమారుడు సీజర్ కలిసి, ఫ్రాన్స్ మొదటి త్రిభుజీకరణాన్ని చేపట్టారు. ఇందులో మెరిడియన్ ఆర్క్ పునఃపరిశీలన ఉంది. ఇది ఫ్రాన్స్ యొక్క మొదటి మ్యాపు. దీన్ని 1745 లో ప్రచురించారు.

Map of triangulation network covering India.
1870 లో తయారు చేసిన త్రికోణమితి సర్వేను చూపించే భారతదేశం మ్యాప్

18 వ శతాబ్దం చివరలో మాత్రమే వివరణాత్మకమైన త్రిభుజాకార నెట్‌వర్క్ సర్వేల ద్వారా మొత్తం దేశాలను మ్యాపింగు చేసారు. 1784 లో, జనరల్ విలియం రాయ్ నేతృత్వం లోని ఆర్డినెన్స్ సర్వే ఆఫ్ గ్రేట్ బ్రిటన్ బృందం బ్రిటన్ ప్రిన్సిపల్ ట్రయాంగ్యులేషన్‌ను ప్రారంభించింది. మొట్టమొదటి రామ్స్‌డెన్ థియోడోలైట్ నిర్మించినది ఈ సర్వే కోసమే. ఎట్టకేలకు 1853 లో సర్వే పూర్తయింది. భారతదేశ త్రికోణమితి సర్వే 1801 లో ప్రారంభమైంది. భారత సర్వే అపారమైన శాస్త్రీయ ప్రభావాన్ని చూపింది. ఇది రేఖాంశపు ఆర్క్ లోని విభాగాన్ని కచ్చితంగా కొలిచిన మొట్టమొదటి కొలతల్లో ఒకటి. ఇది ఎవరెస్ట్ పర్వతానికి, ఇతర హిమాలయ శిఖరాలకూ పేర్లు పెట్టి మ్యాపింగు చేసింది. 19 వ శతాబ్దం ప్రారంభంలో, పారిశ్రామిక విప్లవం ప్రారంభ మయ్యాక సర్వేయింగ్ అధిక డిమాండ్ ఉన్న వృత్తిగా మారింది. ఈ వృత్తి తన పనికి సహాయపడటానికి మరింత కచ్చితమైన సాధనాలను అభివృద్ధి చేసింది. పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కాలువలు, రోడ్లు, రైలు మార్గాలు వేయడానికి సర్వేయర్లను ఉపయోగించాయి.

నెపోలియన్ బోనపార్టే 1808 లో ఐరోపా లోని మొట్టమొదటి కాడాస్ట్రేను స్థాపించాడు. ఇది అనేక భూ ఖండికల సంఖ్య, వాటి విలువ, భూ వినియోగం, పేర్లు మొదలైన డేటాను సేకరించింది. త్వరలోనే ఈ వ్యవస్థ ఐరోపా అంతటా వ్యాపించింది.

1860 లలో అరిజోనాలోని రస్సెల్ ట్యాంక్ వద్ద రైల్‌రోడ్ సర్వేయింగ్ పార్టీ

రాబర్ట్ టొరెన్స్ 1858 లో దక్షిణ ఆస్ట్రేలియాలో టొరెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. భూమి లావాదేవీలను సరళీకృతం చేయడానికి, ఓ కేంద్రీకృత రిజిస్టరు ద్వారా విశ్వసనీయమైన టైటిళ్ళను అందించడానికి టొరెన్స్ దీన్ని ఉద్దేశించాడు. టొరెన్స్ వ్యవస్థను ఆంగ్ల భాష మాట్లాడే ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో అనుసరించారు. 1800 లలో రైలుమార్గాలు రావడంతో సర్వేయింగ్ చాలా ముఖ్యమైన భూమిక పోషించింది. సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకమైన రైలుమార్గాలను ప్లాన్ చేయడానికి సర్వే అవసరం.

20 వ శతాబ్దం

[మార్చు]
Soldier standing next to a Telescopic instrument on a tripod.
మొదటి ప్రపంచ యుద్ధం, 1918 సమయంలో ఒక జర్మన్ ఇంజనీర్ సర్వే

20 వ శతాబ్దం ప్రారంభంలో సర్వేయర్లు పాత గొలుసులు, తాడులను మెరుగుపరిచారు. కాని ఇప్పటికీ చాలా దూరాలను కచ్చితంగా కొలవడంలో సమస్యను ఎదుర్కొన్నారు. డాక్టర్ ట్రెవర్ లాయిడ్ వాడ్లీ 1950 లలో టెల్యూరోమీటర్‌ను అభివృద్ధి చేశారు. ఇది రెండు మైక్రోవేవ్ ట్రాన్స్మిటర్ / రిసీవర్లను ఉపయోగించి ఎక్కువ దూరాన్ని కొలుస్తుంది.[3] 1950 ల చివరలో జియోడిమీటర్ ఎలక్ట్రానిక్ దూర కొలత (EDM) పరికరాలను ప్రవేశపెట్టింది.[4] EDM యూనిట్లు దూరాన్ని కనుగొనడానికి కాంతి తరంగాల బహుళ పౌనఃపున్య దశ మార్పును ఉపయోగిస్తాయి.[5] ఈ సాధనాలు కొన్ని కిలోమీటర్ల ఎడంలో ఉన్న పాయింట్ల మధ్య దూరాన్ని ఒక్క దెబ్బలో కొలవడం ద్వారా, రోజులూ వారాలూ పట్టే పనిలో ఎంతో సమయాన్ని ఆదా చేశాయి.

ఎలక్ట్రానిక్స్‌లో పురోగతి వలన EDM సూక్ష్మీకరణకు వీలు కలిగించింది. 1970 వ దశకంలో కోణ, దూరాల కొలతలను కలిపే మొదటి సాధనాలు వెలుగు చూసాయి. వీటిని టోటల్ స్టేషన్లుగా అని అన్నారు. తయారీదారులు వీటికి మరిన్ని పరికరాలను జోడిస్తూ, కచ్చితత్వాన్ని, కొలత వేగాన్ని పెంచుతూ పోయారు. వంపు పరిహారకాలు, డేటా రికార్డర్లు, ఆన్-బోర్డు లెక్కింపు కార్యక్రమాలూ వంటి మెరుగుదలలూ ఉన్నాయి.

మొదటి ఉపగ్రహ స్థాన వ్యవస్థ US నేవీ ట్రాన్సిట్ వ్యవస్థ . మొదటి విజయవంతమైన ప్రయోగం 1960 లో జరిగింది. ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం పొలారిస్ క్షిపణి కలిగిన జలాంతర్గాములకు స్థాన సమాచారాన్ని అందించడం. ఒక బిందువు స్థానాన్ని నిర్ణయించడానికి ఫీల్డ్ రిసీవర్లను ఉపయోగించవచ్చని సర్వేయర్లు కనుగొన్నారు. ఉపగ్రహాలు పరిశీలించే ప్రాంతం తక్కువగా ఉండడం, పరిశీలనల కోసం వాడే పరికరాలు చాలా పెద్దవిగా ఉండడం వలన ఈ పని శ్రమతో కూడుకున్నది గాను, తక్కువ కచ్చితత్వంతోనూ ఉండేది. సుదూర (రిమోట్) ప్రదేశాల్లో బెంచ్‌మార్కులను ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉపయోగం.

యుఎస్ వైమానిక దళం 1978 లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్) కు చెందిన మొదటి నమూనా ఉపగ్రహాలను ప్రయోగించింది. మరింత కచ్చితత్వాన్ని అందించడానికి GPS ఉపగ్రహాల యొక్క పెద్ద సమూహాన్ని, మెరుగైన సిగ్నల్ ట్రాన్స్మిషన్ను ఉపయోగించింది. సర్వే కచ్చితత్వ అవసరాలను చేరుకోవాలంటే, GPS వచ్చిన తొలినాళ్ళలో స్టాటిక్ రిసీవర్ ద్వారా చాలా గంటలు పరిశీలన అవసరం అయ్యేది. ఉపగ్రహాలు, రిసీవర్లు రెండింటికి ఇటీవల చేసిన మెరుగుదలల కారణంగా, రియల్ టైమ్ కైనమాటిక్ (RTK) సర్వేకు వీలు కలిగింది. RTK సర్వేలు స్థిరమైన బేస్ స్టేషన్, రెండవ రోవింగ్ యాంటెన్నాను ఉపయోగించడం ద్వారా అధిక-కచ్చితత్వ కొలతలను పొందుతాయి. రోవింగ్ యాంటెన్నా స్థానాన్ని ట్రాక్ చేయవచ్చు.

21 వ శతాబ్దం

[మార్చు]

థియోడోలైట్, టోటల్ స్టేషన్, RTK GPS సర్వేలు వాడుకలో ఉన్న ప్రాథమిక పద్ధతులు.

రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ చిత్రాలు మెరుగుపడటం, ధర తగ్గుతూండడం వలన వాటి వాడకం ఎక్కువైంది. ప్రముఖ కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో త్రిమితీయ (3 డి) స్కానింగ్, స్థలాకృతి సర్వేల కోసం లిడార్ వాడకాలు ఉన్నాయి. ఫోటోగ్రామెట్రిక్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో పాటు యుఎవి టెక్నాలజీ కూడా వాడుకలో ఉంది.

పరికరాలు

[మార్చు]

హార్డ్‌వేర్

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ప్రధాన సర్వేయింగ్ సాధనాలు థియోడోలైట్, కొలిచే టేప్, టోటల్ స్టేషన్, 3 డి స్కానర్లు, జిపిఎస్ / జిఎన్ఎస్ఎస్, లెవెల్, రాడ్. చాలా సాధనాలను ఉపయోగించేటపుడు త్రిపాదికి బిగిస్తారు. చిన్న దూరాలను టేపుతో కొలుస్తారు. 3 డి స్కానర్లు, వివిధ రకాల వైమానిక చిత్రాలను కూడా ఉపయోగిస్తారు.

థియోడోలైట్ కోణాలను కొలిచే పరికరం. ఇది సమాంతర తలంలోను, నిలువు తలంలోనూ కోణాలను కొలుస్తుంది. ట్రనియన్‌లపై అమర్చిన టెలిస్కోపును లక్ష్య వస్తువుతో నిలువుగా అలైను చేస్తారు. పై విభాగం మొత్తం క్షితిజ సమాంతర అలైనుమెంటు కోసం గుండ్రంగా తిరుగుతుంది. నిలువు వృత్తం టెలిస్కోప్ నిలువుకు వ్యతిరేకంగా చేసే కోణాన్ని కొలుస్తుంది. దీనిని జెనిత్ కోణం అంటారు. క్షితిజ సమాంతర వృత్తం ఎగువ, దిగువ పలకలను వాడుతుంది. సర్వేను ప్రారంభించినప్పుడు, సర్వేయర్ పరికరాన్ని తెలిసిన దిశలో (బేరింగ్) చూపిస్తాడు. దిగువ ప్లేట్‌ను బిగిస్తాడు. ఇక ఈ పరికరాన్ని ఇతర వస్తువుల బేరింగ్‌ను కొలవడానికి తిప్పవచ్చు. బేరింగ్ తెలియకపోతే లేదా డైరెక్ట్ యాంగిల్ కొలత కావాలనుకుంటే, ప్రారంభ దృష్టిలో పరికరాన్ని సున్నాకి సెట్ చేయవచ్చు. ఇది ప్రారంభ వస్తువుకు, థియోడోలైట్‌కు, టెలిస్కోప్‌తో సమలేఖనం చేసిన అంశానికీ మధ్య ఉన్న్న కోణాన్ని చదువుతుంది.

గైరోథియోడొలైట్ అనేది థియోడోలైట్ కే మరొక రూపం. ఇది రిఫరెన్స్ గుర్తులేమీ లేనప్పుడు తనను తాను ఓరియంట్ చేయడానికి గైరోస్కోప్‌ను ఉపయోగిస్తుంది. దీన్ని భూగర్భ కొలతల కోసం ఉపయోగిస్తారు.

టోటల్ స్టేషన్ దూరాన్ని కొలిచే ఎలక్ట్రానిక్ పరికరం (EDM) తో కూడిన థియోడోలైట్. క్షితిజ సమాంతర తలానికి సెట్ చేసినప్పుడు లెవలింగ్ కోసం టోటల్ స్టేషన్ ఉపయోగించవచ్చు. టోటల్ స్టేషన్ల రాకతో, ఆప్టికల్-మెకానికల్ పరికరాల నుండి సంపూర్ణ ఎలక్ట్రానిక్ పరికరాలకు సర్వేయింగు మారిపోయింది.  [ <span title="This claim needs references to reliable sources. (December 2013)">citation needed</span> ] ఆధునిక టోటల్ స్టేషన్లకు, దూరాలను కొలతల్లో వాడే కాంతి పల్సులను ప్రతిబింబించే రిఫ్లెక్టర్ గానీ ప్రిజం గానీ అవసరం లేదు. అవి పూర్తిగా రోబోటిక్ యంత్రాలు. పాయింట్ డేటాను రిమోట్ కంప్యూటర్‌కు ఇ-మెయిల్ చెయ్యగలవు కూడా. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వంటి ఉపగ్రహ స్థాన వ్యవస్థలకు కనెక్ట్ చేయగలవు. రియల్ టైమ్ కైనెమాటిక్ జిపిఎస్ వ్యవస్థల వలన సర్వే వేగం పెరిగింది. అయితే అవి ఇప్పటికీ క్షితిజ సమాంతరంగా 20 మి.మీ., నిలువుగా 30-40 మి.మీ. వరకు మాత్రమే కచ్చితమైనవి.

GPS సర్వేయింగు, అది వాడే పరికరాలు, అది ఉపయోగించే పద్ధతుల రీత్యా ఇతర GPS ఉపయోగాల కంటే భిన్నంగా ఉంటుంది. స్టాటిక్ GPS లో స్థానంలో చాలా సమయం పాటు ఉంచిన రెండు రిసీవర్లను ఉపయోగిస్తుంది. కక్ష్యలో చలిస్తూ ఉండే ఉపగ్రహాలు, ఈ దీర్ఘ కాలం వలన కొలతలను పోల్చే వీలు రిసీవరుకు కలుగుతుంది. RTK సర్వేయింగు ఒక స్టాటిక్ యాంటెన్నాను, ఒక రోవింగ్ యాంటెన్నానూ ఉపయోగిస్తుంది. స్టాటిక్ యాంటెన్నా ఉపగ్రహ స్థానాలను, వాతావరణ పరిస్థితులలో మార్పులనూ ట్రాక్ చేస్తుంది. సర్వేయరు సర్వే చెయ్యాల్సిన బిందువులను కొలవడానికి రోవింగ్ యాంటెన్నాను ఉపయోగిస్తాడు. రెండు యాంటెనాల మధ్య రేడియో లింకు ఉంటుంది. స్టాటిక్ యాంటెన్నా నుండి రోవింగ్ యాంటెన్నాకు అవసరమైన దిద్దుబాట్లను దీనిద్వారా పంపుతారు. రోవింగ్ యాంటెన్నా ఆ దిద్దుబాట్లను తాను అందుకుంటున్న GPS సంకేతాలకు వర్తింపజేస్తుంది. స్టాటిక్ పద్ధతుల కంటే RTK సర్వేయింగు తక్కువ దూరాలను కవరు చేస్తుంది.

వివిధ సర్వేయింగ్ సాధనాలు వివిధ ఉపయోగాలకు పనికివస్తాయి. థియోడోలైట్లు, లెవెల్‌లను మొదటి ప్రపంచ దేశాలలో సర్వేయర్ల కంటే భవన నిర్మాణ్ల్లోనే ఎక్కువ ఉపయోగిస్తూంటారు. కన్స్ట్రక్టర్ సాపేక్షంగా చౌకైన పరికరాలను ఉపయోగించి సాధారణ సర్వే పనులను చేయవచ్చు. టోటల్ స్టేషన్లు చాలా మంది ప్రొఫెషనల్ సర్వేయర్లకు నమ్మకబంట్ల వంటివి. ఎందుకంటే అవి అన్ని పరిస్థితులలోనూ బహుముఖమైనవి, ఆధారపడదగినవీను. పెద్ద ఎత్తున చేసే సర్వేలలో GPS వాడడం వలన ఉత్పాదకత పెరుగుతుంది. పెద్దపెద్ద మౌలిక సదుపాయాలు లేదా డేటా సేకరణ ప్రాజెక్టులలో ఈ పద్ధతిని వాడుతారు. రోబోటిక్-గైడెడ్ టోటల్ స్టేషన్లను వడి, ఒకే వ్యక్తి మరొకరి సాయం అవసరం లేకుండా సర్వే చేసుకుపోవచ్చు. పెద్ద ప్రాంతాలను కొలవడానికి వేగవంతమైన పద్ధతి హెలికాప్టర్‌. హెలికాప్టర్ యొక్క స్థానాన్ని రికార్డ్ చేయడానికి GPS వాడి, భూమిని కొలవడానికి లేజర్ స్కానర్‌ను ఉపయోగించడం ఈ సర్వే పద్ధతి. కచ్చితత్వాన్ని పెంచడం కోసం, భూమిపై బీకాన్లను ఉంచుతారు (సుమారు 20 కి.మీ. ఎడంతో). ఈ పద్ధతిలో 5-40 సెం.మీ. మధ్య కచ్చితత్వం ఉంటుంది (విమాన ఎత్తును బట్టి).

సర్వేయర్లు త్రిపాదులు, ఇన్స్ట్రుమెంట్ స్టాండ్ల వంటి అనుబంధ పరికరాలను కూడా ఉపయోగిస్తారు; దూరాన ఉన్న స్థానాలను గుర్తించేందుకు వాడే లైట్లు, బీకాన్లు; హెల్మెట్ల వంటి రక్షణ సామాగ్రి ; అడ్డుగా వచ్చే చెట్ల కొమ్మలను కొట్టేసే పరికరాలు; కాలక్రమలో కనిపించకుండా పోయే సర్వే గుర్తులను తవ్వి వెలికితీసే పనిముట్లు, వివిధ ఉపరితలాలు, నిర్మాణాలలో గుర్తులను దిగగొట్టేందుకు సుత్తులు; కమ్యూనికేషన్ కోసం పోర్టబుల్ రేడియోలు వగైరాలు సర్వేయింగులో వాడే ఇతర పనిముట్లు.

సాఫ్ట్‌వేరు

[మార్చు]

టోటల్ స్టేషన్, జిపిఎస్, 3 డి స్కానర్లు ఇతర కలెక్టర్ డేటాను ఉపయోగించే ల్యాండ్ సర్వేయర్లు, నిర్మాణ నిపుణులు, సివిల్ ఇంజనీర్లు తమ సామర్థ్యం, కచ్చితత్వం, ఉత్పాదకతను పెంచుకునేందుకు ల్యాండ్ సర్వేయింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. సమకాలీన భూ సర్వేలో సాఫ్ట్‌వేరు భూమిక చాలా ప్రధానమైనది.[6]

టెక్నిక్స్

[మార్చు]
A compass with extra sights for measuring bearings.
ఒక ప్రామాణిక బ్రంటన్ జియో దిక్సూచి. క్షేత్ర-ఆధారిత కొలతల కోసం భౌగోళిక శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సర్వేయర్లు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు

సర్వేయర్లు కోణాలు, దూరాలను కొలవడం ద్వారా వస్తువుల స్థానాన్ని నిర్ణయిస్తారు. వారి పరిశీలనల కచ్చితత్వాన్ని ప్రభావితం చేసే కారకాలను కూడా కొలుస్తారు. అప్పుడు వారు ఈ డేటాను వెక్టర్లు, బేరింగులు, కోఆర్డినేట్లు, ఎత్తులు, విస్తీర్ణాలు, ఘనపరిమాణాలు, ప్లాన్లు, మ్యాపులను సృష్టించడానికి ఉపయోగిస్తారు. గణన తేలిగ్గా ఉండేందుకు కొలతలను అడ్డు, నిలువు భాగాలుగా విభజిస్తారు. GPS, ఖగోళ కొలతలకు సమయం యొక్క కొలత కూడా అవసరం.

దూర కొలత

[మార్చు]
A Woman with a backpack holding a laser rangefinder, a handheld GPS and a Tablet computer.
సర్వేయింగ్ కోసం ఆధునిక పరికరాల ఉదాహరణ ( ఫీల్డ్-మ్యాప్ టెక్నాలజీ): జిపిఎస్, లేజర్ రేంజి పైండరు, ఫీల్డ్ కంప్యూటర్ల వలన సర్వేయింగ్‌తో పాటు కార్టోగ్రఫీ (రియల్ టైమ్‌లో మ్యాప్‌ను సృష్టించడం)లు, ఫీల్డ్ డేటా సేకరణకు వీలు కలుగుతుంది.

EDM పరికరాలు రాక ముందు, దూరాలను వివిధ పద్ధతుల్లో కొలిచేవారు. వీటిలో గుంటర్ గొలుసు లేదా ఉక్కు లేదా ఇన్వార్‌తో చేసిన కొలిచే టేపుల వంటి గొలుసులు ఉన్నాయి. క్షితిజ సమాంతర దూరాలను కొలవడానికి, ఈ గొలుసులు లేదా టేపులను వదులుగా వేలాడబడకుండా ఉండేలా లాగి పట్టుకునేవారు. వేడికి వ్యాకోచం చెందుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని దూరాన్ని సర్దుబాటు చేయాల్సి వచ్చేది. కొలిచే పరికరాన్ని క్షితిజ సమాంతరంగా ఉండేలా పట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. పెరాంబులేటర్లు అనే చక్రాలను ఎక్కువ దూరాలను కొలవడానికి ఉపయోగించేవారు. కాని కచ్చితత్వం తక్కువగా ఉండేది. టాకియోమెట్రీ అంటే తెలిసిన పరిమాణం గల ఒక వస్తువు యొక్క రెండు చివరల మధ్య కోణాన్ని కొలవడం ద్వారా దూరాలను కొలిచే పద్ధతి. EDM రాక ముందు, ఎగుడుదిగుడు నేలపై గొలుసు కొలత అసాధ్యమైన చోట్ల, ఈ పద్ధతిని వాడేవారు.

కోణ కొలత

[మార్చు]

చారిత్రికంగా, దిక్సూచిని ఉపయోగించి క్షితిజ సమాంతరంగా ఉండే కోణాలను కొలిచేవారు. తరువాత వచ్చిన మరింత కచ్చితమైన స్క్రైబ్డ్ డిస్క్‌లతో కోణీయ రిజల్యూషను మెరుగుపడింది. డిస్క్ పైన రెటికిల్స్‌తో టెలిస్కోపులను అమర్చడంతో మరింత కచ్చితంగా చూడ్డం సాధ్యపడింది ( థియోడోలైట్ చూడండి). లెవెల్‌లు, కాలిబ్రేటెడ్ వృత్తాలతో నిలువు కోణాల కొలతకు వీలైంది. వెర్నియర్స్ ద్వారా ఒక డిగ్రీ లోని కొంత భాగాన్ని కూడా కొలవడం సాధ్యపడింది.

ఎత్తులు కొలవడం (లెవెలింగ్)

[మార్చు]
A woman setting up an optical level on a tripod.
సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓషనోగ్రాఫిక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సిబ్బంది మైనేలోని రిచ్‌మండ్‌లోని యుఎస్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్లకు మద్దతుగా టైడ్ స్టేషన్ లెవలింగ్ నిర్వహిస్తున్నారు.

ఎత్తును కొలవడానికి సరళమైన పద్ధతి - ఆల్టిమీటర్‌తో, గాలి పీడనాన్ని ఉపయోగించి కొలవడం. మరింత కచ్చితమైన కొలతలు అవసరమైనప్పుడు, కచ్చితమైన లెవెల్‌ల (అవకలన లెవలింగ్ అని కూడా పిలుస్తారు) వంటివి వాడతారు. కచ్చితమైన లెవలింగ్ చేసినప్పుడు, పరికరాన్ని, కొలిచే రాడ్‌నూ ఉపయోగించి రెండు పాయింట్ల మధ్య అనేక కొలతలు తీసుకుంటారు. రెండు ఎండ్ పాయింట్ల మధ్య ఎత్తులో నికర వ్యత్యాసాన్ని పొందడానికి ఎత్తు కొలతల్లో తేడాలు కలపడం తీసివేయడం చేస్తారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్) పద్ధతిలో, ఎలివేషన్‌ను ఉపగ్రహ రిసీవర్లతో కొలవవచ్చు. సాధారణంగా GPS సాంప్రదాయిక లెవలింగ్ కంటే కొంత తక్కువ కచ్చితమైనది. కానీ ఎక్కువ దూరాలను కొలిచేటపుడు అవి రెండూ సమానంగా ఉండవచ్చు.

స్థానాన్ని నిశ్చయించడం

[మార్చు]

తెలిసిన స్థానాలు సమీపంలో లేనప్పుడు భూమి యొక్క ఉపరితలంపై ఒక స్థానాన్ని నిర్ణయించే ప్రాథమిక మార్గం ఖగోళ పరిశీలనలు. నావిగేషనల్ టెక్నిక్‌లను ఉపయోగించి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల పరిశీలనలు చేయవచ్చు. పరికరం స్థానంలో నక్షత్రానికి బేరింగ్ నిర్ణయించిన తర్వాత, బేరింగును భూమిపై బిందువుకు బదిలీ చేస్తారు. ఈ బిందువును ఇతర పరిశీలనలకు స్థావరంగా ఉపయోగించవచ్చు. కచ్చితమైన ఖగోళ స్థానాలను పరిశీలించడం, లెక్కించడం చాలా కష్టం. GPS ద్వారా భూమిపై కావలసినన్ని స్థానాలను నిర్ణయించుకోవచ్చు కాబట్టి, GPS వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఖగోళ పరిశీలనల ద్వారా సర్వే చెయ్యడం అరుదై పోయింది.

రిఫరెన్స్ నెట్‌వర్క్‌లు

[మార్చు]
A diagram of survey markers running along a shoreline.
నీలం రంగులో చూపించిన తీరప్రాంతపు స్థానాన్ని గుర్తించేందుకు, ట్రావర్స్, ఆఫ్‌సెట్ కొలతలను ఉపయోగించి చేసిన సర్వే. నలుపు రంగు లోని డాష్డ్ లైన్లు రిఫరెన్స్ పాయింట్ల (బ్లాక్ సర్కిల్స్) మధ్య ప్రయాణ కొలతలు. ఎరుపు గీతలు అడ్డంగా ఉండే రేఖలకు లంబ కోణంలో కొలుస్తారు.

నేరుగా మొదటి సూత్రాల నుండే సర్వే పాయింట్లను కొలవడం బాగా అరుదు. గతంలో కొలిచిన బిందువులతో పోల్చి కొత్త బిందువులను కొలుస్తారు. ఈ రకంగా ఒక సర్వే లేదా నియంత్రణ నెట్‌వర్కు రూపొందుతుంది. కొత్త సర్వేను ప్రారంభించేటప్పుడు వారి స్వంత స్థానాన్ని నిర్ణయించడానికి ఈ నెట్‌వర్కు లోని బిందువును ఉపయోగించుకుంటారు.

సర్వే పాయింట్లకు గుర్తులుగా చిన్న చిన్న మేకుల నుండి పెద్ద బీకన్ల వరకు వాడతారు. బీకన్లు చాలా దూరం వరకూ కనబడుతూ ఉంటాయి. సర్వేయర్లు ఈ స్థానంలో వారి పరికరాలను పెట్టుకుని, సమీపంలోని వస్తువులను కొలుస్తారు. కొన్నిసార్లు ఎత్తైన స్టీపుల్ లేదా రేడియో ఏరియల్ వంటి దాని స్థానాన్ని కొలిచి పెట్టుకుంటారు. దీన్ని రిఫరెన్సుగా తీసుకుని సర్వే చేపడతారు.

చిన్న చిన్న ప్రాంతాలను సర్వే చేయడానికి <i id="mwATE">ట్రావెర్సింగ్</i> అనే పద్ధతిని వాడుతారు. సర్వేయరు పాత రిఫరెన్స్ గుర్తు లేదా తెలిసిన స్థానం నుండి మొదలు పెట్టి, సర్వే చేసే ప్రాంతంలో రిఫరెన్స్ గుర్తుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. అప్పుడు వారు బేరింగ్లు, రిఫరెన్స్ మార్కులకు లక్ష్యుత స్థానాలకు మధ్య దూరాలను కొలుస్తారు. చాలా ట్రావెర్స్‌లు రెండు ముందస్తు రిఫరెన్స్ మార్కుల మధ్య లూప్‌ను ఏర్పరుస్తాయి కాబట్టి సర్వేయర్లు తమ కొలతలను సరిచూసుకోవచ్చు.

డేటమ్, నిర్దేశాంక వ్యవస్థలు

[మార్చు]

చాలా సర్వేలు భూమి ఉపరితలంపై స్థానాలను లెక్కించవు, వస్తువుల సాపేక్ష స్థానాలను కొలుస్తాయి. అయితే, సర్వే చేసిన అంశాలను సరిహద్దు రేఖలు లేదా గతంలో చేసిన సర్వేల వంటి బయటి డేటాతో పోల్చి చూడాల్సి ఉంటుంది. ఒక స్థానాన్ని వివరించే పురాతన పద్ధతి అక్షాంశ రేఖాంశాలు, సముద్ర మట్టం నుండి ఉన్న ఎత్తు. సర్వేయింగు శాస్త్రం పెరిగేకొద్దీ చిన్నచిన్న భూ భాగాలపై సర్వేల కోసం గణితాన్ని సరళీకృతం చేయడానికి కార్టెసియన్ కోఆర్డినేట్ వ్యవస్థలను సృష్టించారు. సరళమైన సర్వే వ్యవస్థలు భూమి చదునుగా ఉందని భావిస్తాయి. ఏదో ఒక బిందువు నుండి కొలత వేస్తారు. దీనిని 'డేటమ్' (డేటా యొక్క ఏక రూపం) అని పిలుస్తారు. నిర్దేశాంక (కోఆర్డినేట్) వ్యవస్థల్లో చిన్నచిన్న ప్రదేశాల్లో వస్తువుల మధ్య దూరాలు, దిశలను సులభంగా లెక్కించ వీలౌతుంది. భూమి వంపు కారణంగా పెద్ద ప్రాంతాలు వక్రీకరణకు గురౌతాయి.

పెద్ద ప్రాంతాల కోసం, ఎలిప్సోయిడ్ లేదా జియోయిడ్ ఉపయోగించి భూమి ఆకారాన్ని నమూనా చేయడం అవసరం. చాలా దేశాలు తమ భూభాగంలో వక్రత లోపాన్ని తగ్గించడానికి తమవైన కోఆర్డినేట్-గ్రిడ్లను సృష్టించుకున్నాయి.

రకాలు

[మార్చు]

రెగ్యులేటరీ బాడీలు సర్వే నైపుణ్యాలను వివిధ పద్ధతుల్లో వర్గీకరించాయి. విస్తృత సమూహాలు:

  • నిర్మించిన తరువాత చేసే సర్వే (యాస్-బిల్ట్ సర్వే): నిర్మాణ ప్రాజెక్టులో ఇటీవల నిర్మించిన వాటిని డాక్యుమెంట్ చేసే సర్వే ఇది. రికార్డు కోసం, పూర్తయిన పనిని మూల్యాంకనం చేసేందుకు, చెల్లింపులు చేసేందుకూ ఈ సర్వేలు జరుగుతాయి. ఈ సర్వేను 'వర్క్స్ యాజ్ ఎగ్జిక్యూటెడ్ సర్వే' అని కూడా అంటారు. నిర్మించిన తరువాత చేసే సర్వేలను ఎరుపు రంగులో లేదా ఎరుపు గీతలో చూపిస్తారు. డిజైన్‌ను, నిర్మాణాన్నీ పోల్చడానికి ఇప్పటికే ఉన్న ప్రణాళికలపై ఈ సర్వేలను పెట్టి పరిశీలిస్తారు
  • కాడాస్ట్రాల్ లేదా సరిహద్దు సర్వేయింగ్: చట్టపరమైన వివరణను ఉపయోగించి భూమి సరిహద్దులను గుర్తించే సర్వే ఇది. మూలల్లో సరిహద్దు గుర్తులను అమర్చడం ఇందులో భాగం. గుర్తులుగా ఇనుప రాడ్లు, పైపులు పాతడం, కాంక్రీట్ దిమ్మలు పెట్టి వాటిలో మేకులు దిగ గొట్టడం వంటివి చేస్తారు. ఇందులో సరిహద్దు సర్వే, తనఖా సర్వే, టోపోగ్రాఫిక్ సర్వేలు భాగాలు.
  • నియంత్రణ సర్వేయింగ్: భవిష్యత్తులో చెయ్యబోయే సర్వేల కోసం ప్రారంభ స్థానాలుగా ఉపయోగించే రిఫరెన్సు స్థానాలను నిర్ధారించేందుకు నియంత్రణ సర్వేలు వాడుతారు.
  • నిర్మాణ సర్వేయింగ్: వివిధ నిర్మాణాలు డిజైను, డ్రాయింగుల ప్రకారమే జరుగుతున్నాయో లేదో పరిశీలించే సర్వే. నిర్మాణ సమయంలో నిరంతరం ఒక నిర్ణీత కాలావధిలో, నిర్ణీత నిర్మాణ మైలు రాళ్ళవదా ఈ సర్వే చేస్తారు
  • వైకల్య సర్వే : ఒక నిర్మాణం లేదా వస్తువు కాలక్రమంలో ఆకారం మారుతోందా లేదా కదులుతోందా అనేది నిర్ధారించడానికి ఈ సర్వే చేస్తారు. మొదట ఒక వస్తువుపై బిందువుల స్థానాలని గుర్తిస్తారు. కొంత కాలం గడిచాక, ఆ స్థానాలను తిరిగి కొలుస్తారు. ఈ రెండు సెట్ల స్థానాలను పోల్చి ఆ వస్తువులో ఏమైనా వైకల్యం కలుగుతోందా అనేది తెలుసుకుంటారు.
  • డైమెన్షనల్ కంట్రోల్ సర్వే : సమతలంగా లేని ఉపరితలాలపై ఈ రకమైన సర్వే చేస్తారు. చమురు, గ్యాస్ పరిశ్రమలో పాత, దెబ్బతిన్న పైపులను ఈ సర్వే ప్రాతిపదికనే మారుస్తూంటారు. ఈ సర్వే ప్రయోజనం ఏమిటంటే, సర్వేను నిర్వహించడానికి ఉపయోగించే పరికరం సమతలంపై ఉండాల్సిన అవసరం లేదు. సముద్రంపై ప్లాట్‌ఫారమ్‌లు స్థిరంగా ఉండవు కాబట్టి, ఆఫ్-షోర్ పరిశ్రమలో ఇది మరీ ఉపయోగం.
  • ఇంజనీరింగ్ సర్వేయింగ్ : టోపోగ్రాఫిక్, లేఅవుట్, ఇంజనీరింగ్ డిజైన్‌తో సంబంధమున్న అంతర్నిర్మిత సర్వేలు.
  • ఫౌండేషన్ సర్వే : పునాది పోసాక, అది క్యూరు అయ్యాక చేసే సర్వే ఇది. పునాది సరైన చోటనే, సరైన ఎత్తులో, ప్లాట్ ప్లాన్, సైట్ ప్లాన్ లేదా సబ్ డివిజన్ ప్లాన్‌లో చూపిన విధంగానే పోసారని నిర్ధారించేందుకు ఈ సర్వే చేస్తారు.
  • హైడ్రోగ్రాఫిక్ సర్వే: జలవనరు తీరం మ్యాపింగ్ చేసే ఉద్దేశంతో నిర్వహించే సర్వే. నావిగేషన్, ఇంజనీరింగ్ లేదా వనరుల నిర్వహణ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
  • లెవలింగ్ : ఓ బిందువు ఎత్తును కనుగొనే సర్వే.
  • లోమా సర్వే : బేస్ వరద మార్గాన్ని మార్చడానికి సర్వే, SFHA ప్రత్యేక వరద ప్రమాద ప్రాంతం నుండి ఆస్తిని తొలగించడం.
  • కొలిచిన సర్వే: భవన ప్రణాళికలను రూపొందించడానికి చేసే భవన సర్వే. పునర్నిర్మాణ పనుల ముందు, వాణిజ్య ప్రయోజనం కోసం లేదా నిర్మాణ ప్రక్రియ ముగింపులో ఈ సర్వే చేస్తారు.
  • మైనింగ్ సర్వేయింగ్ : మైనింగ్ సర్వేయింగ్‌లో గని షాఫ్ట్‌లు, గ్యాలరీలను త్రవ్వడం, రాతి పరిమాణాన్ని లెక్కించడం వంటివి ఉంటాయి.
  • తనఖా సర్వే: తనఖా సర్వే లేదా భౌతిక సర్వే అనేది భూమి సరిహద్దులను, భవన నిర్మాణ ప్రదేశాలను వివరించే ఒక సాధారణ సర్వే. ఇది ఆక్రమణలను, సెట్‌బ్యాక్‌లను గమనించేందుకు ఈ సర్వే చేస్తారు. ఋణాలు ఇచ్చే సందర్భాల్లో ఈ తనఖా సర్వే ఒక ఆవశ్యక అంశం.
  • ఫోటోగ్రాఫిక్ నియంత్రణ సర్వే: గాల్లోంచి ఫోటోలు తీసేటపుడు, స్థానాలు సరిగా కనిపించేందుకు ఈ సర్వే చేసి అంత ఎత్తు నుండి చూసినా కనబడేలా గుర్తులు అమర్చుతారు.
  • లేఅవుట్ లేదా సెట్అవుట్ సర్వే: ఇది అనేక రకాల సర్వేల్లో భాగం. ఒక వస్తువు ప్రతిపాదిత స్థానాన్ని భూమిపై గుర్తించడం ఈ సర్వే ధ్యేయం. ఇంజనీరింగ్, కాడాస్ట్రాల్ సర్వేయింగుల్లో ఇది ఒక ముఖ్యమైన భాగం.
  • నిర్మణాల సర్వే : భవనాల, నిర్మాణాల భౌతిక స్థితిని, నిర్మాణ స్థిరత్వాన్నీ నివేదించే ఒక వివరణాత్మక తనిఖీ సర్వే. నిర్మాణానికి ఏమైనా రిపేర్లు అవసరమా అనేది ఈ సర్వేలో తేలుతుంది.
  • ఉపవిభాగం : ఒక ఆస్తిని చిన్న విభాగాలుగా విభజించే సరిహద్దు సర్వే.
  • టోపోగ్రాఫిక్ సర్వే : భూమిపై ఉన్న స్థానాల ఎత్తును కొలిచే ఒక సర్వే.

సమతల సర్వేయింగ్, జియోడెటిక్ సర్వేయింగ్

[మార్చు]

భూమి వాస్తవ ఆకారంపై ఆధారపడి, సర్వేయింగును రెండు రకాలుగా వర్గీకరించారు.

సమతల సర్వేయింగు అనేది, భూమి బల్లపరుపుగా ఉంటుందని భావించి చేసే సర్వేయింగు. భూమి వక్రతను, గోళాకార ఆకారాన్ని ఈ సర్వే పట్టించుకోదు. ఈ రకమైన సర్వేలో సర్వే లైన్ల ద్వారా ఏర్పడే త్రిభుజాలను సమతల త్రిభుజాలుగానే పరిగణిస్తారు. చిన్న చిన్న ఆకృతుల కోసం దీన్ని వాడ్తారు. తక్కువ వైశాల్యాల్లో భూమి గోళాకారం కారణంగా తలెత్తే లోపాలు చాలా తక్కువగా ఉంటాయి.[7]

జియోడెటిక్ సర్వేలో ఎత్తులు, కోణాలు, బేరింగ్లు, దూరాలను లెక్కించేటపుడు భూమి వక్రతను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సర్వేయింగును సాధారణంగా పెద్ద పెద్ద సర్వే పనుల కోసం ఉపయోగిస్తారు. సర్వే 260 చదరపు కిలోమీటర్ల వరకూ విస్తీర్ణం ఉండే ప్రదేశాలను సమతలంగానే పరిగణిస్తారు. అంతకు మించిన వైశాల్యం ఉన్నవాటిని జియోడెటిక్‌గా పరిగణిస్తారు.[8] జియోడెటిక్ సర్వేయింగ్‌లో చేసిన పరిశీలనలకు అవసరమైన దిద్దుబాట్లను వర్తింపజేస్తారు.[7]

వృత్తి

[మార్చు]
Head and shoulders portrait of Nain Singh Rawat.
పండిట్ కార్టోగ్రాఫర్ నైన్ సింగ్ రావత్ (19 వ శతాబ్దం) బ్రిటిష్ వారి కోసం హిమాలయాలను అన్వేషించడంలో చేసిన కృషికి 1876 లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ బంగారు పతకాన్ని అందుకున్నారు.
Four women pose with a theodolite, a plane table and two levelling staves.
ఇడాహో, 1918 లో ఒక మహిళా సర్వేయింగ్ సిబ్బంది

కాలక్రమంలో సర్వేయింగ్ ప్రాథమిక సూత్రాలు పెద్దగా మారిందేమీ లేదు గానీ, సర్వేయర్లు ఉపయోగించే పరికరాలు మాత్రం అభివృద్ధి చెందాయి.

రోడ్లు, రైల్వేలు, జలాశయాలు, ఆనకట్టలు, పైపులైన్లు, నిలబెట్టుకునే గోడలు, వంతెనలు, భవనాలు మొదలైన వాటి స్థానాలను సరిగ్గా నిర్ణయించడంలో సర్వేయర్లు సహాయ పడతారు. వారు చట్టపరమైన వివరణలకూ, రాజకీయ విభజనలకూ సరిహద్దులను గుర్తిస్తారు. భూమి లక్షణాలను, సరిహద్దులనూ రికార్డు చేసే భౌగోళిక సమాచార వ్యవస్థల (జిఐఎస్) కోసం వారు డేటాను అందిస్తారు, సలహాలూ ఇస్తారు.

సర్వేయర్లకు బీజగణితం, ప్రాథమిక కాలిక్యులస్, జ్యామితి, త్రికోణమితిపై సమగ్ర పరిజ్ఞానం ఉండాలి. సర్వేలు, ఆస్తులు, ఒప్పందాలతో వ్యవహరించే చట్టాలు కూడా వారికి తెలిసి ఉండాలి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

సర్వే ఆఫ్ ఇండియా

మూలాలు

[మార్చు]
  1. "Definition".
  2. Lewis, M. J. T. (23 April 2001). Surveying Instruments of Greece and Rome. Cambridge University Press. ISBN 9780521792974. Retrieved 30 August 2012.
  3. "The History of the Tellurometer" (PDF). International Federation of Surveyors. Retrieved 20 July 2014.
  4. "Geodimeter-The First Name in EDM". Retrieved 20 July 2014.
  5. "Electronic Distance Measurement". Archived from the original on 29 జూలై 2014. Retrieved 20 July 2014.
  6. "View DigitalGlobe Imagery Solutions @ Geospatial Forum". 4 June 2010.
  7. 7.0 7.1 BC Punmia (2005). Surveying by BC Punmia. p. 2. ISBN 9788170088530. Retrieved 9 December 2014.
  8. N N Basak (2014). Surveying and Levelling. p. 542. ISBN 9789332901537. Retrieved 28 July 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=భూ_సర్వే&oldid=3506009" నుండి వెలికితీశారు