Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 49వ వారం

వికీపీడియా నుండి

ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె అయిన ఇందిరాగాంధీ నవంబరు 19, 1917న జన్మించింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాష్ట్రపతిచేత ఎన్నిక చేయబడింది. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది. ఉన్నత రాజకీయ కుటుంబంలో సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) (ప్రస్తుతపు ఉత్తర ప్రదేశ్)లోని మొఘల్ సరాయ్ లో జన్మించిన ఇందిర సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. 4 విడతలుగా మొత్తం సుమారు 16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానిగా ఈమె హయంలో రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ 1975 నాటి అత్యవసర పరిస్థితి, స్వర్ణ దేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు అక్టోబరు 31, 1984న బలైంది.

1966 జనవరిలో తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇందిర 1977 వరకు పదవిలో కొనసాగినది. అత్యవసరపరిస్థితి అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో పాటు తను స్వయంగా రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ఓడిపోయింది. 1980లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయపథంవఇపు నడిపించి మూడేళ్ళ విరామానంతరం మళ్ళీ ప్రధానమంత్రి పదవిని చేపట్టింది.

ఇందిర తరువాత కూడా ఆమె కుటుంబ సభ్యులు రాజకీయంగా ప్రముఖ పదవులు అలంకరించారు. ఇందిరాగాంధీ మరణం వెంటనే ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. రాజీవ్ గాంధీ హత్యానంతరం రాజీవ్ భార్య సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవిని పొంది ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగుతోంది. సోనియాతో పాటు సోనియా కుమారుడు రాహుల్ గాంధీ, ఇందిర మరో కోడలు మేనకాగాంధీ, మేనక కుమారుడు వరుణ్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి