Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 19వ వారం

వికీపీడియా నుండి

ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.

ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ హైస్కూల్ లో , తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి ' కి సంపాదకుడిగా ఉన్నాడు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి వేలువిడిచిన మేనల్లుడు. ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.

1946 లో చెన్నై వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం" తో పల్లవించని సాహితీ శాఖలేదు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు , గేయ నాటికలు , కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన..... ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.

తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. త్వమేవాహం , సినీవాలి , కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల- వేసవి , దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ , కాటమరాజు కథ వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ట. వేమన వేదం , మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. రాముడికి సీత ఏమౌతుంది?,గుడిలో సెక్స్ వంటి రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దంపడతాయి. సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగం పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత.

పూర్తివ్యాసం పాతవి