వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/అనువాద మార్గదర్శకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల పేజీలనూ, ఇతర భాషా సంఘం నామవాచకాలనూ అనువదిస్తున్నప్పుడు, తెలుగుకీ ఇతర భాషలకీ మధ్య భేదాలు గమనించడమైంది. వాటిపై తెవికీకి మార్గదర్శకాలుంటే మంచిదనే ఉద్దేశమే ఈచర్చ పేజీ.

అంశాలు[మార్చు]

1. ఆంగ్లంలో t, d అక్షరాలు, వారి వ్యాకరణం ప్రకారం తెలుగు ట, డ లకు సమానం కాదు. తెలుగు అక్షరాలు మూర్ధన్యాలు. అంటే నాలుక మడతపెట్టి పలికేవి. ఆంగ్ల అక్షరాలు దంత్యమూలీయాలు. అంటే నాలుకను పైచిగురుకు తాకించి పలికేవి. మన 'త,ద' అక్షరాలు దంత్యాలు. అంటే పళ్ళతో పలికేవి. ఆంగ్ల అవగాహన తక్కువ ఉన్న కాలంలో t, dలకీ 'త,ద' లకీ సంబంధం అందుకే కనబడేది. David-దావీదు. ప్రస్తుతం భారతీయ యాసల్లో 't,d' లు ట,డలు గా పలకబడటాన్ని వారి వ్యాకరణవేత్తలు గుర్తించారు. మంట, కంఠం, బండ అనేవి మణ్ట, కణ్ఠం, బణ్డ అనే వాటికి అనుస్వార రూపాలు. తంతు, గొంది అనేవి తన్తు, గొన్ది అనే పదాలకు అనుస్వార రూపాలు. ఆంగ్ల వ్యాకరణం ప్రకారం bandలో 'n' 'న' ను సూచిస్తుంది (దంత్యమూలీయ 'న' కీ, దంత్య 'న' కి తేడా దాదాపుగా లేదు. కేవలం సాంకేతికమనుకోవచ్చు). ఇప్పుడు Indiaనీ ఇండ్య అని వ్రాయాలా లేక ఇన్డ్య అని వ్రాయాలా (వికీలో) లేక రెండూ ఆమోదించాలా ? ఇలాంటి పదాల్లో అనుస్వారం ఉపయోగం పై ఏకాభిప్రాయానికి రావలసి ఉంది.

2. సంస్కృత వ్యాకరణం ప్రకారం అనుస్వారం ఆ వర్గపు అనునాసికాన్ని సూచిస్తుంది. అంటే సంశయం అనేది సఞ్శయం అనే దానికి సంగ్రహ రూపం. కానీ తెలుగులో అనుస్వారం స్పర్శము కాని అక్షరాలు (శ,ష,స,హ,య,ర,ల,వ) ముందు వస్తే 'మ' గా పలుకుతున్నాం. సమ్శయంలా. హిందీ పదాల్లో మున్షీని ముంశీగా వ్రాస్తారు (ముఞ్శీ అని పలుకుతారు). ఇతర భాషల ప్రముఖుల పేర్లు తెలుగులో ఈ సందర్భంలో ఎలా వ్రాయాలి ? కొన్ని ఆంగ్ల పదాల దగ్గర కూడా ఈ సమస్య ఉంది. Install- ఇంస్టాల్, ఇన్‌స్టాల్. ఇన్స్టాల్ ? ఆంగ్ల పదాలను వ్రాయాల్సి వస్తే ఏ రూపానికి ప్రాధాన్యత ఇవ్వాలి ?

3. ఆంగ్లంలో ఞ లేదు. అంటే punch కాస్తా పంచ్ అవ్వదు. పన్చ్ అవుతుంది. ఇలా 'nch' ఉన్న ఆంగ్ల పదాలను తెలుగులో ఎలా వ్రాయాలి ?

4. ఆంగ్లంలో పదం చివర వచ్చే *le తెలుగులో ఌ అక్షరాన్ని సూచిస్తుంది. ఆంగ్ల పదం తెలుగులోకి వ్రాసేటప్పడు ఏం చేయాలి? shuttle అనే క్రీడ. షటిల్ అని వ్రాయాలా ? షటౢ అని వ్రాయాలా? ఎలా వ్రాసినా ఆమోదించాలా ? దీనికే మొదటి అంశంలోని సమస్య కలిస్తే ఎలా ఉంటుందో చూడగలరు. ఉదాహరణకు ప్రముఖ పుస్తక విక్రయ సంస్థ kindle—కిండిల్/ కిన్డౢ. ఆంగ్ల వ్యాకరణం ప్రకారం కిన్డౢ అని పలుకుతారు.

5. ఴ అక్షరం. తమిళ, మలయాళ ప్రాంత పేర్లూ ఇతర నామవాచకాలు ఎలా వ్రాయాలి ? తమిళ/తమిఴ/తమిళ(ఴ)/తమిఴ(ళ) ? లేక ఎలా వ్రాసినా ఒప్పేనా ?

6. వేరే భాషలో చేసిన వ్యాఖ్యలు. ఒక పుస్తకంపై ఆంగ్లంలో ప్రముఖ విమర్శకుడు అభిప్రాయం చెబుతాడు. అతని ఆంగ్ల వ్యాఖ్యను వ్రాసి దానికి తెలుగు అనువాదం కింద పేర్కోవాలా ? లేక నేరుగా తెలుగులోకి అనువదించాలా ?

7. అనువాదానికి అనువాదాలు. ఉదాహరణకు సుమేరు నాగరికత కావ్యాలు. ఆంగ్ల వికీలో వీటిని సుమేరు భాషలో ఇచ్చి, ప్రక్కన ఎవరో sumerologist చేసిన ఆంగ్ల అనువాదమిస్తారు. మనం తెలుగులోకి అనువదిస్తే, సహజంగా ఆంగ్ల అనువాదాన్ని అనువదిస్తాము. అప్పుడు ఫలానా చరిత్రాకారుని ఆంగ్ల అనువాదానికి వికీ సమర్పకుల తెలుగు అనువాదమని వ్రాయాలా ?

8. ఒడియా, బెంగాలీ భాషాపదాలను వ్రాయాలంటే 'బ' ని ఎలా వ్రాయాలి ? రబీంద్రనాథ్ ఠాగూర్/రవీంద్రనాథ్ ఠాగూర్ ?

కొన్ని అంశాలు కాస్త చాదస్తంగా అనిపించవచ్చు గానీ, అన్నిటి గురించీ మార్గదర్శకాలుంటేనే నాణ్యమైన శైలి తయారవుతుందని ఈ చర్చ మొదలుపెట్టాను. అభిప్రాయాలు తెలుపగలరు.Inquisitive creature (చర్చ)

అభిప్రాయాలు[మార్చు]

స్థూలంగా అభిప్రాయం[మార్చు]

వికీపీడియా సాధారణ నామం అన్న విధానాన్ని అనుసరించి పేర్లను నిర్ణయిస్తుంది. ఏ ప్రయోగమైనా వికీపీడియా బయట పత్రికలు, పరిశోధన పత్రాలు, పుస్తకాలు మొదలైన చోట్ల "సాధారణంగా" ఎలా ఉందో నిర్ణయించుకుని అనుసరించాలి. అందులో మంచి చెడులు ఒక స్థాయికి మించి ఇక్కడ చర్చించి నిర్ణయించుకోలేం. అంటే - వికీపీడియా పరిశోధనలకు, ప్రయోగాలకు చోటు కాదు. కాబట్టి, నేను కింద రాయబోయే అభిప్రాయాలన్నిటికీ ప్రాతిపదిక ఈ సాధారణ నామం పాలసీనే. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:43, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

  • చదువరి: నాకు భాషా సూత్రాలేమీ తెలియవు. అంచేత ప్రామాణిక సంప్రదాయాన్ని అనుసరిస్తాను. ఇక్కడి అభిప్రాయాలు కూడా దానిపై ఆధారపడే రాస్తున్నాను.
    • వికీపీడియా, కొత్త పదాలనూ కొత్త భాషా సూత్రాలనూ కనిపెట్టే భాషా ప్రయోగశాల కాదు. ఉన్న సూత్రాలనే వాడతాం, వాడాలి. సూత్రాలు లొనిచోట్ల గాని, లేదా సూత్రాలు పాతబడి, మార్పులు చెంది, ఆ మార్పులు ప్రామాణిక భాషలో రాయడం మామూలై పోయిన సందర్భాల్లో గానీ, ఆ వాడుకలో ఉన్న రూపాలనే వాడాలి.
    • ఎక్కడో అరుదైన చాలా చాలా కొద్ది మాటలను తప్ప (చిహ్నం లాంటివి), తెలుగులో "ఎలా పలుకుతామో అలాగే రాస్తాం, ఎలా రాస్తామో అలాగే పలుకుతాం."
    • ప్రామాణిక భాష అంటే ప్రముఖ పత్రికలు (ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్ర భూమి, ఆంధ్ర ప్రభ వగైరాలు) తమ ప్రధాన పేజీల్లో అనుసరిస్తున్న భాషా సంప్రదాయాలు.

పైవి సాధారణ నియమాలు అని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 17:14, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

  • యర్రా రామారావు:నాకూ మరీ అంతలోతుగా పరిశీలించి, విశ్లేషించే పరిజ్ఞానం లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను.రచ్చబండ చర్చలో ప్రవేశపెట్టిన సూత్రాలను అధికసంఖ్య సభ్యులు ఆమోదంతో నిర్ణయించినప్పటికీ కొన్ని సూత్రాలు ఆచరణలో సరిగా పాటించుటలేదనేది నా అభిప్రాయం.అంటే మనం రాసుకున్నవి మనం పాటించాలని నా అభిప్రాయం.
యర్రా రామారావు (చర్చ) 13:47, 8 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి అంశం[మార్చు]

  • పూర్ణానుస్వరంతో తప్పించి మరొకలాగా రాసే అలవాటు తెలుగులో సాధారణంగా లేదు. కేవలం సంస్కృత భాషా కావ్యాలను ప్రచురించినప్పుడు కొందరు చన్ద్ర, చన్డి వగైరా పద్ధతుల్లో రాస్తారు. సాధారణ నామం విధానాన్ని అనుసరించి చూస్తే సాధారణంగా ఉపయోగించే "ఇండియా" వంటి వర్ణక్రమాన్నే వికీలో అనుసరించాలి. --పవన్ సంతోష్ (చర్చ) 16:46, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • "Indiaనీ ఇండ్య అని వ్రాయాలా లేక ఇన్డ్య అని వ్రాయాలా.." అనేదే ఇక్కడి చర్చ అయితే - ఇండియా అని రాయాలి. ఎందుకంటే దాన్ని ప్రామాణికమైన పత్రికల్లో, పుస్తకాల్లో అలాగే రాస్తారు కాబట్టి, ఇన్డియా అని రాయరు. ఇలాంటి సందేహాలు వచ్చినపుడు నాకు తెలిసి రెండు పద్ధతులు -1. భాషాశాస్త్ర పుస్తకాలు ఏం చెబుతాయో చూడాలి, 2. ప్రామాణికమైన పత్రికల్లో ఎలా రాస్తారో చూడాలి. __చదువరి (చర్చరచనలు) 17:14, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
    ప్రజాబాహళ్యంలో బాగా వాడుక ఉన్న పదాలు మాత్రమే వికీపీడియాలో వాడటం వికీ సాంప్రదాయం.ఒకవేళ వాటికి ప్రత్యామ్నాయంగా ఎవ్వరూ వాడని, తెలియని కొత్తపదాలను ప్రవేశపెట్టినా, వాటిని తెలుసుకుని ఆదరించుట చాలా కష్టం.ఇండియాకు బదులుగా ఇండ్య లేక ఇన్డ్య అని రాస్తే ఎక్కువమంది వాడుకరులు ఇదేంటి తప్పురాసారని, ఇండియా లేదా భారతదేశమని ఎక్కువమంది సవరించటానికి అవకాశముంది. యర్రా రామారావు (చర్చ) 13:50, 8 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రెండవ అంశం[మార్చు]

  • సంశయాన్ని సంస్కృతంలో ఎలా రాస్తారు, పలుకుతారు అన్నది సంస్కృతానికి సంబంధించిన అంశం. తెలుగులో రాసే పద్ధతి సంశయం అనే. కనుక మనం రాసేది కూడా సంశయం అనే. మున్షీ అన్న పేరును తెలుగులో సాధారణంగా అలానే రాస్తారు. కాబట్టి మనం అదే అనుసరిస్తాం. ఇలానే, ఏ పేరునైనా సాధారణంగా ఎలా రాస్తారో అలాగే అనుసరించాలి. ఒకవేళ కొత్తగా తెలుగు వికీపీడియాలోనే మొదటిసారి రాయాల్సివస్తే దాన్ని గురించి అప్పుడు చర్చించి నిర్ణయించాలి. ఇన్‌స్టాల్ అని రాయడమే వాడుక. కనుక అది కొనసాగించడమే సరి. ఇదంతా కూడా సాధారణ నామం అన్న విధానాన్ని అనుసరించి చెప్తున్నవే. --పవన్ సంతోష్ (చర్చ) 16:49, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇన్‌స్టాల్ అని రాయాలి. ఇక్కడ కూడా అదే సూత్రం - భాషాశాస్త్ర పుస్తకాలు, ప్రామాణికమైన పత్రికల్లో ఎలా రాస్తారో అలాగే రాయాలి. __చదువరి (చర్చరచనలు) 17:14, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • @Pavan santhosh.s and Chaduvari: మీ స్పందనలకు ధన్యవాదాలు. ఐతే ఇంకొక్క విషయం. ఫలానా మున్షి హిందీలో ఫలానా పుస్తకాన్ని వ్రాసాడనుకుందాం. ఆ పుస్తకపు అట్ట మీద ఆయన పేరు దేవనాగరి లిపిలో ముంశీ అని వ్రాస్తే అప్పుడు ఆ పుస్తకాన్ని గురించిన తెవికీ వ్యాసంలో ఎలా ముందుకెళ్ళాలి ? మీరన్నట్లు ఆయన తెలుగు వారికి చిరపరిచితుడైతే ప్రమాణిక పత్రికలు ఆయన పేరు వ్రాసే ఉంటాయి. ఒకవేళ కాని వ్యక్తి పేరు వ్రాయాల్సి వస్తే ? వారి అట్ట మీదో లెదా ఆయన ఏ దర్శకుడో ఐతే చిత్రంలో పేర్లలో ఉన్నట్లో (పరభాషా లిపిలో) ఉన్నదాన్ని ఉన్నదున్నట్లుగా దించాలా ? లేక ఆ పేరు ఉన్న ఇతరులను సాధారణంగా తెలుగులో ఎలా వ్రాస్తామో అలాగే వీళ్ళది కూడా వ్రాయాలా ? ఇది ఒక వైపు. రెండో అంశం: en:Juris Zarins అనే sumerologist విషయంలో నాకు ఎదురైనది. ఆంగ్లానికంటే పలికినట్లు వ్రాయాలనే పట్టింపు లేదు కనుక సరే. ఈయన పేరు జురిస్ జరిఞ్శ్. తెలుగులో ఇలా వ్రాస్తే అందరూ చదవలేరు. జురిస్ జరింశ్ అనుస్వార సూత్రాల ప్రకారం సరైనదే. కానీ దాన్ని జురిస్ జరిమ్శ్‌గా పలుకుతారు తెలుగువాళ్ళు. సహజత్వం కోసం రెండో పేరు (జరింశ్) వాడాను (z ఉచ్చారణ వేరే విషయం. ప్రస్తుతం తెలుగులో ఉన్న శబ్దాలకే పరిమితమయ్యి ఈ చర్చ మొదలు పెట్టాను). ఇలాంటి వాళ్ళు కూడా తెలుగువారికి తెలిసిన విదేశీయులైతే మళ్ళీ మన ప్రమాణిక పత్రికలు మీరన్నట్లే సహాయపడతాయి. కానీ అలా కాని పక్షంలో ఎలా ముందుకెళితే బాగుంటుందనే విషయంపై కూడా వీలైతే మీ అభిప్రాయం పంచుకోగలరు. Inquisitive creature (చర్చ) 08:58, 8 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
    డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్, పాప్అప్, ఇలాంటి పదాలు తెలుగులో ఎలా రాస్తామో అలానే రాయాలి.కొన్నిటికి తెలుగులో అనువాద పదాలు అంత పొందికగా ఉండవు.గందరగోళానికి గురికాకుండా ఉండాలంటే తప్పదని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 11:59, 11 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మూడో అంశం[మార్చు]

పంచ్ అనే రాయాలి. నకు వత్తుగా ల (అవోన్లా అనే ఊరి పేరు) వంటివి వచ్చినపుడు మాత్రమే అనుస్వారం రాదు. అంచేత ఇలాంటివి రాసేటపుడు పంచ్, లంచ్, మంచ్, లాంచ్.. అనే రాయాలి. "ఉమాకాన్తం" (అనే వ్యక్తి పేరు) వంటి అరుదైన మినహాయింపులు ఉన్నాయి.__చదువరి (చర్చరచనలు) 17:14, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను యర్రా రామారావు (చర్చ) 06:16, 12 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నాలుగో అంశం[మార్చు]

ఐదో అంశం[మార్చు]

అరో అంశం[మార్చు]

  • ఆ వ్యాఖ్యకు ఇప్పటికే తెలుగులో ఎవరైనా ఏదైనా నమ్మదగ్గ మూలంలో అనువదిస్తే అది వాడడం విధాయకం. అలా లేని పక్షంలో అనువదించి వ్యాసంలో ఉంచి నోట్స్‌లో ఒరిజినల్ చేర్చడం మంచిదని నా అభిప్రాయం. అప్పటికీ మౌలిక పరిశోధన వద్దు అన్న విధానానికి ఎంతో కొంత దెబ్బ తగులుతుంది. అయితే, ఉన్నంతలో ఇలా చేయడం మెరుగని నా ఆలోచన. ఖచ్చితమైన అభిప్రాయం కాదిది. --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేరుగా తెలుగు అనువాదమే రాయాలి. ఇంగ్లీషు మూలాన్ని రాయనక్కరలేదు. మూలపాఠ్యాన్ని కూడా రాస్తే, పాఠకులకు ఏదైనా ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుందనుకుంటే మూలపాఠ్యాన్ని చూపవచ్చు, లేదంటే అక్కర్లేదు. ఒకవేళ ఇంగ్లీషు మూలాన్ని రాసినా దాన్ని తెలుగు లిపిలోనే రాయాలి. __చదువరి (చర్చరచనలు) 17:14, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
    పై అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను యర్రా రామారావు (చర్చ) 06:17, 12 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఏడో అంశం[మార్చు]

ఎనిమిదో అంశం[మార్చు]

  • వాడుకలో ఎలా రాస్తున్నామో అలాగే రాయాలి. ఒకవేళ ఇప్పటి వరకూ అసలు వాడుకలోనే లేని/అంతగా వాడుకలో లేని పేరైతే మూలంలో స్పెల్లింగు ఎలా ఉందో అలాగే రాయాలి (ఎందుకంటే తెలుగులో కొన్ని పేర్లకు కారం, మరి కొన్నిటికి కారం రెండూ వాడుతూంటాం కాబట్టి). "రవీంద్రనాథ ఠాగూరు" అని రాయాలి, "రబీ రే" అని రాయాలి. "ప్రణబ్ ముఖర్జీ" అనాలి. బెంగాలీ ఒడియా పేర్లనే కాదు ఏ భాషకు చెందిన పేర్లైనా సరే వాడుకలో ఎలా ఉందో అలాగే రాయాలి. "నిళల్‌గళ్ రవి" అనే రాయాలి. "పిరుబాగరన్" అని వాళ్ళు రాసుకుంటే రాసుకోవచ్చు.., కానీ, మనకు ఆ ఎల్టీటియ్యీ పులి పేరు "ప్రభాకరన్" అనే తెలుసు, అదే రాయాలి. ఇతర పేర్లను వ్యాసం ప్రవేశికలో ఉదహరించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 17:14, 5 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • నాదీ పై అభిప్రాయమే. తెలుగు మూలాల్లో ఎలా సాధారణంగా రాస్తున్నారో అలాగే కొనసాగించాలి. ఉదాహరణకు తెలుగు పత్రికల్లో, ఇతర మాధ్యమాల్లో కూడా కొన్ని సంవత్సరాల వరకూ నరేంద్ర మోడీ అని ఉండేది. అప్పుడు తెలుగు వికీపీడియాలో వ్యాసం అలానే ఉండేది. ఎప్పుడైతే తెలుగు పత్రికల్లో ముఖ్యమైనవి పేరును మోదీ అని దిద్ది వాడడం ప్రారంభించాయో, ఆ ట్రెండ్ ఊపందుకుని ప్రాచుర్యం చెందాకా తెలుగు వికీపీడియాలో నరేంద్ర మోదీ అని వ్యాసం పేరు, అందులో వాడుక మారింది. ఇదే మనకు అనుసరణీయం. --పవన్ సంతోష్ (చర్చ) 10:31, 7 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
    పై అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను యర్రా రామారావు (చర్చ) 06:17, 12 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]