తూర్పు భాగవతం

వికీపీడియా నుండి
(విలక్షణ వీథి భాగవతం ''తూర్పు భాగవతం'' నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కూచిపూడి నాట్య ఆద్యులు సిద్ధేంద్రయోగి

ఆంధ్ర దేశంలో ప్రఖ్యాతి వహించిన వీధి భాగవతాలలో కూచిపూడి వీథి భాగవతాలు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించు కున్నాయి. వీరే కాక గొల్ల భాగవతులూ, యానాది భాగవతులూ, మాల భాగవతులూ, చిందు భాగవతులూ మొదలైన వారూ భాగవతాలను ప్రదర్శించారు.

ఆనంద గజపతీ, ఆదిభట్లవారూ[మార్చు]

పైన చెప్పిన వారే కాక ఉత్తరాంధ్ర దేశంలో విశాఖపట్టణం, శ్రీకాకుళం, గంజాం, కోరా పుట్టి మొదలైన ప్రాంతాల్లో తూర్పు భాగవతమ" నే భాగవతం ప్రచారంలో ఉంది. ఇది సామాన్య ప్రజానీకాన్నే కాక, పండితుల్ని, విద్వాంసుల్నీ, కవుల్నీ, గాయకుల్నీ ఆకర్షించడమే కాక ఇది ఒక విశిష్ట నర్తన రీతిగానూ, సంగీత సాంప్రదాయంగానూ, మృదంగ బాణీగానూ ఈ నాటకం పోషింప బడుతూ ఉందని గరిమెళ్ళ రామ మూర్తి, డి.వై. సంపత్ కుమార్ లు తెలియ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో తిరునాళ్ళ లోనూ, అమ్మవారి జాతర్లలోనూ, ఈ భాగవాతాలు ప్రదర్శింప బడి ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. పండితులైన హరికథా పితామహుడు అజ్జాడ ఆది భట్ల నారాయణదాసు, ఆనంద గజపతి మహారాజు లాంటి కళా పోషకుల ఆదరాభిమానాల్ని చూరగొనడమే కాక ఎందరో ఉత్తమ భాగవత కళాకారులకు సింహతలాటాలను ఘంటా కంకణాలనూ కలియుగ సత్య భామ..... పండిత సత్య బామ... అభినయ సత్య భామ ... గాన కోకిల .... వసంత గాన కోకిల మొదలైన బిరుదులను గూడ ప్రసాదించారు.

భాగవత కథే భాగవతం[మార్చు]

భాగవతమంటే కృష్ణ సంబంధమైన కథలను కేళిక చేయడమే. ఇందులో కృష్ణా సత్యభామల ప్రణయ కలహం ముఖ్యమైనది. దీనినే కృష్ణ పారిజాతమనీ, భామా కలాపమనీ, వ్యవహరిస్తారు. ప్రారంభంలో సిద్ధేంద్ర యోగి భాగవత సంబంధమైన ఈ భామా కలాప రచన చేసి ప్రచారం చేశాడు. అయితే భామాకలాపాన్ని సిద్ధేంద్ర యోగి రచనను కూచి పూడి వీథి భాగవతులు అధిక ప్రచారంలోకి తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సిద్ధేంద్రుల వారి పారిజాతాపహరణానికి తూర్పు వారు ప్రదర్శించే భాగవతానికి వ్వత్యాసం ఉంది. కూచిపూడి భామాకలాపంలో కనిపించే దరువులు మొదలైనవి వీరి భాగవతాలలో తక్కువ కనిపిస్తాయి.

బలరామ భుక్త భాగవతం[మార్చు]

తూర్పు వారు ప్రదర్శించే పారిజాతాపహారణం ఆ ప్రాంతానికి చెందిన బలరామ భుక్త వ్రాసినది. కథ ఒకటే అయినా పాటలకు సంబంధించిన బాణీ, దరువులూ, నడిపే విధానం, మృదంగ వాయిద్య రీతుల్లోనూ, కూచిపూడి వారి బాణీకి, తూర్పు వీథి భాగవత బాణీకీ చాల తేడా ఉంది. బలరామ భుక్త తరువాత ఈ జిల్లాకు చెందిన నరసింగబల్లి వారు, కేశవ పురి వారు, బొబ్బిలి వారు, దువ్వవారు, నెల్లిమర్ల వారు ఇత్యాదులు ఎందరో ప్రసిద్ధ నాట్య శాస్త్ర వేత్తలు, ఈ తూర్పు వీథి భాగవత బాణీకీ కావలసిన కలాప రచనలను చేశారు. అయితే ఈ నాటికీ వంకాయల బలరామభుక్త వ్రాసిన గ్రంథమే ప్రస్తుతం ప్రచారంలో ఉందని చెపుతారు. ఈ సాంప్రదాయం కూచిపూడి వారి బాణీకి భామా కలాపానికి దగ్గరలో ఉన్నా.... పాట పాడే బాణీ, దరువు నడిపే విధానం, మృదంగం వాయించే రీతి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆహార్యాది వేష ధారణలో, అలంకారంలో కూడ ప్రత్యేకత కనిపిస్తుంది.

ముచ్చటైన కథా వస్తువు[మార్చు]

తూర్పు వీధి భాగవత కలాపంలో కథా వస్తువు ఒక ముచ్చటైన సంఘటన మాత్రమే.......... తన మందిరం నుంచి అలిగి వెళ్ళి పోయిన శ్రీ కృష్ణుని, సత్యభామ రాయబారం పంపించి...... మళ్ళీ తన ఇంటికి రప్పించుకున్న సంఘటనే ఈ కథా వృత్తంతం. కథ చిన్నదే అయినా ఇందులో అష్టవిధ నాయికల వర్ణనలూ, అవస్థలూ, విప్రలంభ శృంగారంతో నిండి ఇది ఒక పెద్ద ప్రబంధమై పోయి, వరుసగా ఈ భాగవతాన్ని తొమ్మిది రోజులు ప్రదర్శించే వారట ప్రారంభంలో. అటు వంటిది, కాలానుగుణంగా మూడు రాత్రులకు కుదించారు. అయితే ఈనాడు ఈ కథను ఒక్క రాత్రే పూర్తి చేస్తున్నారు. శాస్త్ర యుక్తంగా ప్రదర్శించే భామా కలాపం తరువాత, గొల్లకలాప ప్రదర్శనాన్ని కూడ జనరంజకంగా ప్రదర్శించే వారు. అయితే ఈ గొల్ల కలాపం, దేశీ సాంప్రదాయానికి సంబంధించిన కళా రూపంగా ప్రదర్శించే వారు.

తూర్పు బాణీ ప్రత్యేకత[మార్చు]

ఈ భాగవత ప్రదర్శనంలో దరువులూ, ద్విపదలూ, కంద పద్యాలూ, వృతాలూ, అర్థ చంద్రికలూ, ఏల పదాలూ, చూర్ణీకలూ మొదలైన దేశి సంగీత రచనలు వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ దరువులు ఈ ఆటల్లో ప్రాముఖ్యం వహిస్తూ ఉంటాయి. భరతుడు నాట్య శాస్త్రంలో ఉదహరించిన ప్రాచీన ధృవాగానం ఈ నాటికీ తూర్పు వీధి భాగవతులు ప్రదర్శిస్తున్నారు. రాగాలూ, తాళాలూ, నేటి కర్ణాటక సాంప్రదాయానికి చెందిన వైనా, రాగ సంచారం, తాళ ప్రసారం మొదలైన విధానాలు ప్రాచీన సంప్రదాయ పద్ధతిని అనుసరించే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు దేశపు కళారూపాలలో ఈ కళారూపం లోనూ అత్యంత ప్రాముఖ్యం వహించని మృదంగం ఈ తూర్పు వీధి భాగవతంలో అత్యధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా తూర్పు వీధి భాగవతానికి ఆయువు పట్టు మృదంగ విన్యాసమే.

మృదంగ ఘోషల్లో, ముత్యాల సరాలు[మార్చు]

తూర్పు వీధి భాగవత బాణీలో మృదంగం అధిక ప్రాముఖ్యాన్ని వహిస్తుంది. వారి వాయిద్యం ఉధృత తాండవంగా ఉంటుంది. ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తుంది. ఉద్వేగ పరుస్తుంది. మార్థంగికులు తమ వాయిద్యంలో సముద్రం ఘోషించి నట్లూ, పిడుగులు పడినట్లూ, ఉరుములు ఉరిమినట్లూ, మేఘాలు గర్జించినట్లూ, భేరీలు ,. నగరాలు మ్ర్రోగి నట్లూ ప్రళయంగా ఉన్నట్లు చూపుతారు. ఆ దరువులను బట్టే నృత్యం కూడా అంత ఉద్వేగంగానూ ఉంటుంది. వారి మృదంగ వాయిద్యంలో ఎంతటి గంభీర నాదాలుంటాయో, అంతటి సున్నితమైన, మృదుమధుర మైన కోయిల స్వరాలూ, చిలుక పలుకులూ మొదలైన వాటిని మృదంగం మీద పలికిస్తూ ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచేస్తారు. ఈ విశిష్ట వాయిద్యంలో నిష్టాతులు బాజ్ఞాతి ఆస్థాన విద్వాంసు లైన బుగత రామయ్య, ఆయన కుమారుడు గోపన్న. ఆ తరం తరువాత, కింతాడ అప్పన్న, ముట్నూరి సంగమేశ్వర శాస్త్రి, ధూపం సూర్య లింగం, ఆగూరు కంచరాం, గ్రామ వాస్తవ్యులు, ప్రముఖ భాగవత శిఖామణి యైన దూడల శంకరయ్య కుమారుడు, గోవిందరావు లాంటి వారు ప్రముఖులు. ఈ బాణీలో సుప్రసిద్ధ మార్థంగికులు., అనేక బిరుదులు పొంది, అనేక మంది భాగవత మార్థంగికులను తయారు చేసిన ప్రఖ్యాతి అభినవ నంది కేశ్వరునిగా పేరు తెచ్చుకున్న కీ.శే. కోరు కొండ సత్యం కే దక్కుతుంది.

ముందు వెనుకల మృదంగ వాయిద్యం[మార్చు]

ఈ భాగవత కళలో మృదంగ వాయిద్యం ఒక ప్రతేక బాణీలో ప్రాముఖ్యం వహించింది. ఇది ఈ బాణీకి జీవమని ముందే తెలుసుకున్నాం. ఇతర కళా రూపాలలో, వాయిద్యకారులు కూర్చుని మృదంగం వాయిస్తూ ఉంటే ఈ ప్రదర్శనంలో రెండు మృదంగాల్ని ముందు వెనుక నడుముకు కట్టుకుని గంటల తరబడి.............. ప్రదర్శనం జరిగి నంత కాలం, తెల్ల వార్లూ పాత్రల అభినయంతో పాటు నిలబడి వాయించటం చెప్పుకో తగిన విషయం. ఇది ఎంతో అబ్బురంగా ఉంటుంది. ఇది సంపూర్ణ ద్విపద రీతి. బొబ్బిలి ఆస్థానంలో నంది భరతం అనే మృదంగ జతుల గ్రంథం సృష్టించ బడింది. ఒకే తాళంలో, సప్త తాళాలు ఇమిడి ఉండేరీతిలో, శబ్దాలను కూర్చి ఆడించటం ఈ కళాకారుల ప్రతిభను వెల్లడిస్తోంది.

అమ్మవారి జాతర, అయ్యగార్ల ప్రదర్శన[మార్చు]

విశాఖ, శ్రీకాకుళం జిల్లా లలో ఎక్కడ అమ్మవారి జాతర జరుగుతుందో అక్కడ ఈ తూర్పు వీధి భాగవతం విధిగా ప్రదర్శించటం ఇప్పటికీ అచారంగా వస్తూంది. ముఖ్యంగా జాతర్లలో గ్రామ ప్రజలు ఎంతో ఆప్యాయితతో తెల్ల వార్లూ ఈ కళారూపాన్ని చూచి ఆనందిస్తారు. ఈ కళాకారులు ఒకే రాగంలో దరువు ప్రారంభించి గంటల తరబడి గంతులు వేస్తూ, హెచ్చు శృతిలో దీర్ఘకాలం దమ్ము పట్టి ఆలాపన చేయటం వలన, ఈ భాగవతాన్ని నక్కల భాగవతం అని జానపదులలో వాడుకై పోయింది.

అందరూ ఆదరించిన కళ[మార్చు]

ముఖ్యంగా ఈ భాగవతాలను ప్రదర్శించే వారు కూచిపూడి బ్రాహ్మణుల మాదిరి ఒక తెగకు చెందిన వారు కారు. కానీ ఈ తూర్పు భాగవతం లో అన్ని కులాలకూ, వర్గాలకూ చెందిన వారున్నారు. బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, కొప్పు వెలమలు, దాసర్లు, పంచములలో కూడ ఈ కళాకారులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన అప్పలస్వామి, అనే భాగవత కళాకారుడు పంచమ కులానికి చెందిన వాడు, ఈ భాగవతాలలో పాత్రలు ధరించే వారందరూ పురుషులే. అయినా ఏభై సంవత్సరాల క్రితం, ఒకే ఒక స్త్రీ, భామ వేషం ధరించి, ఆనాటి ప్రజానీకాన్ని ఆశ్చర్యపర్చిందట. ఆమె తెర్లాం గ్రామానికి చెందిన కాలిగుంటి వెంకట స్వామి అనే భాగవత కళాకారుని కుమార్తె. గ్రామాలలో సహజంగా ఉండే నమ్మకాలను బట్టి ఆమె పేరు పొయ్యిబుగ్గి. ఎనభై సంవత్సరాల వయస్సులో తినటానికి తిండి లేని దీనావస్థలో కాలం గడిపింది.

ఎందరో కళాకారులు, ఎన్నో ప్రదర్శనలు[మార్చు]

ఈనాడు విశాఖ జిల్లా శృంగవరపు కోట తాలూకా, ఖాసా పేట గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణుడు కొచ్చెర్ల బ్రహ్మం భాగతవ కళాకారుడు తన కుమార్తె అంజలికి ఈ విద్యను నేర్పి, అనేక ప్రదర్శనలను ఇప్పిస్తున్నాడు. అలాగే బొంతలకోటి జగన్నాథం, దూడల శంకరయ్య, బొంతలకోటి రామ మూర్తు, దూర్వాసుల మాణిక్యం, కురుమోజ రామమూర్తి ఆచారి ... హిమదిబోడిదాసు. భడితోక సత్యనారాయణ ఆచారి.... చందక వెంకటప్పారావు.... దూడల లింగ మూర్తి.... తంపెట్ల సత్యం...... కాలిగుంటం అప్పల స్వామి ...... కొచ్చర్ల బ్రహ్మం ..... చామర్తి సత్యం, కోనేటి అప్పారావు .... యర్రా సూర్యనారాయణ, అనకంసెట్టి నరసింగారావు .... యర్రా సింహాచలం, వానపల్లి పరదేశి .... మీసాలఅప్పలనాయుడు, మీసాల ఎరుకు నాయుడు .....సుక్క పోలి నాయుడు. గొర్లి పేట రాముడు .... వైష్ణవ అప్పల స్వామి, దొమ్మి అప్పల స్వామి .... రంగు ముద్ర అప్పల స్వామి, ముసిది అవతారం .... బురడ గవరయ్య .... ధర్మవరపు గురువులు .... వరదా లక్ష్మణ రావు, పిన్నింటి రాము నాయుడు, ఆర్ సింహాచల శర్మ, గిరిజాల సత్య నారాయణ, కల్లూరి సూర్య నారాయణ, శంబన సత్యనారాయణ, గురువిల్లి స్వామి నాయుడు, ఎం. సిమ్మప్పడు, పులఖండం నారాయణ మూర్తి శర్మ, కుందుం సాంబ మూర్తి, పేరూరు వరహాలు మొదలైన ఎందరో సుప్రసిద్ధ కళాకారులు ఈ నాటికీ, ఈ తూర్పు భాగవత కళను ఆరాధిస్తున్నారు. గమనించ వలసిన విషయ మేమంటే, ఈ కళాకారు లందరూ అరవై సంవత్సరాలకు పైబడిన వారే, అంటే ఈ తరం అంతరిస్తే తరువాత తరం వారు ఈ కళను ఆరాధించ గలరా? అన్నది సందేహం.

ఈ నాటికీ అరవై మేళాలు[మార్చు]

ఈ నాటికీ ఆ ప్రాంతంలో అరవై భాగవత మేళాల వరకూ ఉన్నాయి. ప్రతి మేళానికి పదిమంది సభ్యులకు తక్కువ ఉండరు. ఆ విధంగా ఆరు వందలకు పైగా సంగీత నృత్య కళాకారులు, సుమారు నూరు మంది, మృదంగ వాద్యకులూ ఉన్నారు. ఒక బాణీకి చెందిన ఇన్ని మేళాలు, ఇంత మంది కళాకారులు భారత దేశంలో ఏ ఒక్క కళా రూపంలోనూ లేరంటారు సంపత్ కుమార్. మామూలుగా ఈ తూర్పు బాణీలో ఉన్న ప్రత్యేకత ఏమంటే ఒకే రాగంలో దరువు ప్రారంభించి, గతులనూ, సంగతులనూ మారుస్తూ గంటల తరబడి గానం చేస్తారు. ఇంతకు ముందు ఆటా, పాటా సమపాళ్ళలో నడిపించినా, ఇటీవలి కాలంలో, భామా పాత్రభినయానికి ప్రాముఖ్యం పెరగటం వల్ల, ఆటకు సంబంధించిన నృత్యాభినయం తగ్గి పోయి పాటకు ప్రాముఖ్యం పెరిగిందంటారు. భామ పాత్రధారి ఎంత గొప్పగా గానం చేస్తే, అంత గొప్పగా ప్రజలు ఆదరిస్తారట. ఆయనను గొప్ప కళాకారుడుగా గుర్తిస్తారట. అందువల్ల భాగవాతాల్లో కళాకారుడు దీర్ఘగానాలు ప్రవేశ పెట్టి ప్రేక్షకులను ఆనంద పరుస్తాడట.

ఆదరణ లేక అంతరిస్తున్న కళ[మార్చు]

తూర్పు భాగవతంగా శతాబ్దాల తరబడి ప్రసిద్ధి చెంది, ప్రజలను అలరించిన, ఈ బాణీ, ఈ నాడు అన్ని జానపద కళా రూపాలు ఎలా శిధిలావస్థలో ఉన్నాయో ఇదీ అలాగే క్షీణదశలో ఉంది. నాటి ఆదరణ ఈనాడు లేదు. ఒకప్పుడు విజయనగరం, బొబ్బిలి, మాడుగుల, కళింకోట, మందసా, చోడవరం, చీకటి కోట, ధారాకోట, సాలూరు, పార్వతీపురం మొదలైన సంస్థానాలు, జమీందారులూ, ధనవంతులూ, పండితులూ, మహా విద్వాంసులూ, ఈ కళను ఎంతగానో ఆదరించి పోషించారు. ప్రజలు ఆదరించారు హర్షించారు, పోషించారు.

నాటి ఆదరణ ఈనాడు లేదు[మార్చు]

ఈ కళా రూపానికి, నాటి పోషణ ఈ నాడు లేదు. మహా విద్వాంసు లైన భామ వేషధారులూ, మహా విద్వాంసులైన మార్దంగికులు, కొద్ది మంది మాత్రమే కొన వూపిరితో ఉన్నారు. ఇలాగే కొంతకాలం జాగు చేస్తే ఈ కళారూపం నామ మాత్రం కూడ లేకుండా పోతుంది. అక్కడక్కడ మిగిలి ఉన్న ఆయా విద్వాంసుల బాణీని రికార్డు చేయాలి, డాక్యు మెంటరీలు తీయాలి. వేష, భూషణ అలంకారాలను భద్ర పరచాలి. అక్కడక్కడ మిగిలి ఉన్న వృద్ధ కళాకారుల ద్వారా ఈ నాటి యువతరానికి గురుకుల పద్ధతిలో ఈ బాణీని అభ్యసింప చేయాలి.

ఆసక్తి లేక అంతరిస్తున్న కళ[మార్చు]

అయితే ఈనాటి యువతరం ఈ కళను నేర్చుకోవాలనే ఆసక్తిని చూపడం లేదు. అందుకు ముఖ్య కారణం............ ఈ విద్యను నేర్చుకోవడం అతి కష్టమైనది కావడమే. అంతే కాక వారికి ఈకళ ద్వారా జీవించ గలమనే నమ్మకం లేక పోవడం వల్ల తరతరాలుగా వస్తున్న ఈ పారంపర్య కళను వదలి, నేటి యువతరం ఇతర జీవన విధానాలను వివిధ వృత్తులనూ అవలంబిస్తున్నారు. అందువల్ల ఈ కళను ప్రభుత్వం తప్ప మరెవరూ పోషించే అవకాశం లేదు. మన కళలు జాతికి జీవనాడులు లాంటివి. పరిపూర్ణ కళాస్వరూపమై, జాన పదులకు అత్యంత సన్నిహితమై, రసాను భూతినీ, ఆత్మానందాన్ని కలిగిస్తున్న ఈ తూర్పు భాగవత బాణీని క్షీణించ కుండా చూడ వలసిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఎంతైనా ఉందంటారు డి.వై. సంపత్ కుమార్.

మూలాలు[మార్చు]

  • డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వ్రాసిన తెలుగువారి జానపద కళారూపాలు

ఇతర లింకులు[మార్చు]