వెన్నా వల్లభరావు
వెన్నా వల్లభరావు | |
---|---|
జననం | కృష్ణా జిల్లా, బేతవోలు మండలం | 1956 మే 9
వృత్తి | అధ్యాపకుడు |
ఉద్యోగం | ఆంధ్ర లయోలా కళాశాల |
ప్రసిద్ధి | అనువాదకుడు, రచయిత |
మతం | హిందూ |
తండ్రి | వెన్నా హనుమంతరావు |
తల్లి | లక్ష్మీనాగేశ్వరమ్మ |
వెన్నా వల్లభరావు రచయిత, అనువాదకుడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత.[1][2]
జీవిత విశేషాలు
[మార్చు]వెన్నా వల్లభరావు కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, బేతవోలు గ్రామంలో వెన్నా హనుమంతరావు, లక్ష్మీనాగేశ్వరమ్మ దంపతులకు 1956 మే 9 న జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య బేతవోలు గ్రామంలో, కాలేజీ విద్య గుడివాడలో పూర్తి అయ్యింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., "భగవతీ చరణ్ వర్మాకే ఉపన్యాసోమే వ్యక్తి ఔర్ సమాజ్" అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి పట్టాలను అందుకున్నాడు.[3][4] ఇతడు తన ఉపాధ్యాయులు యార్లగడ్డ అంకినీడు, కొచ్చెర్లకోట వెంకట సుబ్బారావుల ప్రోత్సాహంతో హిందీ భాషపట్ల మక్కువ పెంచుకున్నాడు. కళాశాలలో చేరే సమయానికే హిందీ ప్రచారసభ వారి అన్ని పరీక్షలు పూర్తి చేశాడు. చదువు పూర్తి అయిన తర్వాత వల్లభరావు విజయవాడలోని సప్తగిరి కళాశాలలో జూనియర్ హిందీ లెక్చరర్ గా ఐదు సంవత్సరాల పాటు పని చేశాడు. తరువాత, 1985 నుండి 2014 వరకు 29 సంవత్సరాలు విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ లెక్చరరుగా,[5] డిపార్ట్మెంట్ హెడ్ (హిందీ)గా, వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేశాడు.[6]
ఆంధ్ర లయోలా కళాశాలలో పదవీకాలంలో వెన్న వల్లభ రావు పదేళ్లపాటు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కార్యక్రమ నిర్వహణ అధికారిగా పనిచేశాడు. పదేళ్లపాటు ఆంధ్ర లయోళా కాలేజ్ స్టాఫ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యదర్శిగా పనిచేశాడు.
రచనలు
[మార్చు]వెన్నా వల్లభ రావు హిందీ నుండి 125 కవితలను తెలుగు భాష లోకి అనువదించాడు, తెలుగు నుండి 75 కవితలను హిందీలోకి అనువదించాడు, అనేక రేడియో నాటకాలను తెలుగు నుండి హిందీలోకి అనువదించాడు, రేడియో ఫీచర్లను హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. విజయవాడ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కేంద్రంలో హిందీలో 50 కి పైగా పాఠాలను ప్రదర్శించారు రేడియో ప్రసంగాలు కూడా చేసాడు.[7][8]
ఇతడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజులలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, హిందీ విభాగాధిపతి ఆదేశ్వరరావుల ప్రోత్సాహంతో అనువాద రచనకు శ్రీకారం చుట్టాడు. మొదటగా త్రిపురనేని గోపీచంద్ కథల సంపుటి "తండ్రులు కొడుకులు"ను హిందీలోకి అనువదించాడు. అప్పటి నుండి సమకాలీనంగా వస్తున్న కథలు, కవితలను హిందీ నుండి తెలుగుకు, తెలుగు నుండి హిందీలోనికి అనువదించసాగాడు. ఇతడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం జాతీయస్థాయి నాటక పోటీలలో బహుమతులు పొందిన 40 నాటకాలను హిందీ నుండి తెలుగులోనికి అనువదించాడు. పంజాబీ రచయిత్రి అజిత్‌కౌర్ "ఖానా బదోష్" పేరుతో వ్రాసిన ఆత్మకథను "విరామమెరుగని పయనం" పేరుతో తెలుగులోనికి అనువదించాడు. ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. జి.వి.పూర్ణచందు వ్రాసిన తెలుగే ప్రాచీనం అనే పుస్తకాన్ని హిందీలో తెలుగు హీ ప్రాచీన్ హైపేరుతో అనువదించాడు. ఇతడు కేవలం అనువాదాలకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ భాషలలో స్వంతరచనలు కూడా చేశాడు. కవిరాజ్ త్రిపురనేని రామస్వామి చౌదరి, అక్షర సత్య్, ఇక్కీస్‌వీ శతాబ్దీకీ తెలుగు కవితా, ఆంధ్రప్రదేశ్‌కే సాంస్కృతిక్ పర్యటన్ క్షేత్ర్ ఔర్ లోక్ కలాయే, ఛోటే కుమార్, రాష్ట్రధ్వజ్‌కే నిర్మాతా పింగళి వెంకయ్య, తెలుగ్ భాషాసాంస్కృతిక చైతన్యయాత్రలు, సాహిత్య వారధి, కవితా భారతి, గురజాడ కథలు - నాటకరూపాలు మొదలైన స్వతంత్ర రచనలు పేర్కొనదగినవి.[5]
వల్లభరావు 2007 లో అమెరికా లోని న్యూయార్క్లో జరిగిన 8 వ ప్రపంచ హిందీ సమావేశానికి హాజరయ్యాడు.[7] 2015 లో భోపాల్లో జరిగిన 10 వ ప్రపంచ హిందీ సమావేశానికి, 2018 లో జరిగిన 11 వ సమావేశానికీ హాజరయ్యాడు. 2016 నవంబరులో సింగపూరులో జరిగిన ఐదవ ప్రపంచ తెలుగు రచయితల సదస్సులో పాల్గొని తెలుగు రచనలు హిందీ అనువాదాలు: తెలుగు భాష పరివ్యాప్తి అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించాడు.
పురస్కారాలు
[మార్చు]- 2011లో "నల్లనివాడు" రేడియో నాటకానికి ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ పురస్కారం.
- దక్షిణభారత హిందీ ప్రచారసభ వారి సాహిత్యకార్ పురస్కారం.
- 2017లో "విరామమెరుగని పయనం" రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కారం[9].
- 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వారి ఉగాది పురస్కారం.
- ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ వారి నుండి "అనువాద సాహిత్య రత్న" బిరుదప్రదానం.
మూలాలు
[మార్చు]- ↑ "Sahitya Akademi Translation Winners List" (PDF). Sahitya Akademi. 21 December 2017.
- ↑ Interview with Writer Venna Vallabha Rao Over | Sahitya Akademi Award (in ఇంగ్లీష్), 22 December 2017, retrieved 2022-07-01
- ↑ "IndCat". indcat.inflibnet.ac.in. Retrieved 2022-06-30.
- ↑ Prakshan, Milind (2006). Bhagavati Charan Verma ke Upanyasom mein Vyaktti Aura Samaj (in హిందీ) (1st ed.). Hyderabad, India: Milind Prakashan. ISBN 81-7868-060-2.
- ↑ 5.0 5.1 కప్పగంతు రామకృష్ణ (1 January 2018). "అనువాదం ఆయన జీవననాదం". తెలుగు వెలుగు మాసపత్రిక. 6 (5): 104–105. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 12 May 2020.
- ↑ "Loyola Today 2010" (PDF). Andhra Loyola College Archives. 1 October 2010. Archived (PDF) from the original on 1 జూలై 2022. Retrieved 1 October 2010.
- ↑ 7.0 7.1 "Loyola Today 2010" (PDF). Andhra Loyola College Archives. 1 October 2010. Archived (PDF) from the original on 1 జూలై 2022. Retrieved 1 October 2010.
- ↑ "57th Loyola College Day Report 2010-2011". Andhra Loyola College. 31 December 2010. Archived from the original on 23 March 2023. Retrieved 10 July 2022. Alt URL
- ↑ విలేకరి (22 December 2017). "దేవిప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 1 నవంబరు 2020. Retrieved 12 May 2020.
- CS1 హిందీ-language sources (hi)
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1956 జననాలు
- హిందీ రచయితలు
- తెలుగు రచయితలు
- అనువాద రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీతలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు
- అధ్యాపకులు
- హిందీ నుండి తెలుగు లోకి అనువాదాలు చేసినవారు
- తెలుగు నుండి హిందీ లోకి అనువాదాలు చేసినవారు