Jump to content

నానీలు

వికీపీడియా నుండి
తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్యంలో నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే సూక్ష్మ కవితా పద్ధతిని నానీలు అంటారు. ఈ కవితా ప్రక్రియను ఆచార్య ఎన్. గోపి ప్రవేశపెట్టారు.[1]

నానీల సృష్టికర్త డాక్టర్‌ ఎన్. గోపి తన నానీలు కవితా సంపుటిలో అన్నట్లుగానే నాలుగు పాదాల నానీ కవితారూపం కాల కఠిన పరీక్షకు నిలిచి పదమూడు సంవత్సరాలుగా దూసుకుపోతోంది ప్రవాహంలా. 'నానీ' రెండక్షరాలే పాఠకలోకమంతా పరవశిస్తోంది ప్రతిభకలిగిన కవుల కలాల్లోంచి పువ్వుల్లా కవితా సుగంధాన్ని పంచుతున్నాయ్‌. వేలాది నానీలు ఈ రోజు అక్షరాలై చిగురిస్తున్నాయి.

తెలుగు కవిత్వంలో లఘురూపాల్లో కొత్త చరిత్రతో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఒఠ్ఠి మౌనంగా సహజ సుందరంగా ఎదిగి ఒక ఉన్నత స్థాయిలో వ్యాప్తి చెందాయి. సరదాకోసం రాయడం కాకుండా సమాజ చైతన్య దిశగా కొత్త లక్ష్యం దిశగా నానీ రూపు దిద్దుకుంది. సామాజిక, సాంస్కృతిక చైతన్య భానుడిగా నానీలు పరిణామం చెందాయి. నానీల రాష్ట్రస్థాయి సదస్సులు, సమాలోచనం, సాహిత్య సభలు ప్రతిఏటా జరుగుతూనే ఉన్నాయి. నానీలపై అవార్డులు కూడా వివిధ సంస్థలు, వ్యక్తులు ప్రకటిస్తూ నానీల కవులను ఆదరిస్తున్నారు. నానీలు వర్థమాన కవులే కాకుండా సీనియర్‌ కవులు కూడా రాయడం గమనించతగ్గ విషయం. కొత్తగా కవిత్వం వ్రాసే వారికి నానీ ఒక గురువుగా నిలిచి ఆ కవుల హృదయాల్లో ఒక గొప్పకవితా స్థానాన్ని పొందటం విశేషం. సామాజిక వస్తువులో కూడా మార్పులు వస్తున్నాయి. ఇంతటి గొప్ప నేపథ్యంలో నానీలపై ఎందరో పరిశోధనలు చేయడం గొప్ప విషయం. పరిశోధనల స్థాయికి ఎదగడం కూడా పరిశీలించవలసిన ముఖ్య విషయం.

లక్షణాలు

[మార్చు]

నానీలకు కొన్ని లక్షణాలు గోపి చెప్పారు. 20 -25 అక్షరాల సంఖ్యగా నాలుగు పాదాలు తప్పక ఉండాలి. రెండు యూనిట్ల పరస్పర సంబంధం. సాగదీయకుండా మరీ తగ్గించకుండా ఒక క్రమశిక్షణ. 5 అక్షరాల వెసులుబాటు కూడా కల్పించారు. లక్షణాలు తప్పకుండా నానీలో పాటిస్తే ఆ కవిత తప్పకుండా కాలపరీక్షకు నిలబడతాయి. భావావేశం ఉంటేగాని నానీ సాంద్రీకరణ చెందదు. అలాగే మంచి నానీ రాయటం కూడా చాలా కష్టం. కొత్తగా కలంపట్టిన యువకవులకు నానీ ఒక శక్తిగా అక్షరాల దేవతగా కనిపిస్తోంది. కవితా రూపంగా నానీలను అక్షరాలు అటూ ఇటూలో రాస్తున్నారు. భావం పండుగా ముగ్గినప్పుడే రుచి వస్తుంది. అలాగే మంచినానీగా జనం గుండెల్లో నిలుస్తుంది. గోపి కవిత పరిశీలించండి-

రైలు పట్టాలు/ తాము కలవ్వు గాని/ దూరాలనుకలుపుతాయి. ఇలాంటి మంచి నానీ హృదయాలను కలుపుతాయి. నానీలలోని సంక్షిప్తరూపం ఈనాటిది కాదు. వేమన, సుమతి వంటి శతకాల్లో ఎన్నో ఉన్నాయి. ఆరుద్ర కూనలమ్మపదాలు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి గజళ్లు, వంటివి ఎన్నో తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి. గణబంధాలు, మాత్రల బంధాలు, దేశఛందో గణనియమాలు లేక ఇది వచన కవిత్వమే. వచన కవిత్వం రూపంలోని విస్తృత రూపానికి సంక్షిప్త స్వరూపం. చిన్నభావం, అత్యల్ప సంవిధానం, ముక్తకం, కంఠస్థ యోగ్యం, కవితా సౌందర్యం నానీకి మరికొన్ని లక్షణాలు. నానీ కవితారూపం ఆత్మీయమైంది. అందుకే నానీల కవితా సంపుటాలు అనేకం ప్రతిఏటా ముద్రింప బడుతున్నాయి. వెల్లువలా రావడం గమనించతగ్గ విషయం.[2]

నామకరణం

[మార్చు]

నానీలని ముద్దుగా పేరుపెట్టింది గోపి. నావీ నీవీ వెరసి మనవి అని, నానీలంటే చిన్నపిల్లలు. చిట్టి పద్యాలని వివరించారు. కవిలో ఎక్కువగా చెప్పాలనే భావ సందేశం, ఆవేశం, గుండె స్పందించాలనే తపన కవి, పాఠకుల హృదయాల్లో నిలవటానికి అవకాశం కల్గింది. నేతల ప్రతాప్‌కుమార్‌ నానీ పరిశీలిస్తే - 'ఓపూట గడిచింది/ అన్నదానంతో/ జీవితమే వెలిగింది/ రక్తదానంతో' 'అన్నదానం -రక్తదానం'లలో ఏది గొప్పదో కవి చక్కగా కవితలో ఆవిష్కరించారు. తెలుగు సాహిత్య రంగంలో అత్యాధునిక దేశీప్రక్రియ 'నానీ' 1997 లో ఆచార్య ఎన్‌.గోపి కలం నుండి కవితా రూపంగా పురుడుపోసుకున్నది. కాలంతో ప్రవహిస్తూ 13 సంవత్సరాలు తనదైన భావశైలితో, వస్తు నిర్మాణంతో, ధారాశక్తితో, గాఢత, సాంద్రతతో ఒక కెరటంలా ఎగిసిపడే ఉదాత్త గుణంతో 'నానీ' సూటిగా పాఠకుని హృదయాన్ని తాకుతోంది. ఈ నేపథ్యంలో వస్తువైవిధ్యంతో ఇప్పటి వరకూ వేలాది నానీల సంపుటాలు ప్రచురించబడ్డాయి. వీటిలో సమకాలీనత కనిపిస్తుంది. తొలినాట నానీల కవిత్వానికి స్ఫూర్తిని కల్గించిన వారిలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఒకరు. ఆయన నానీ పరిశీలించండి- చిన్నప్పటి/ ఉత్తుత్తి బువ్వలాటలు/ పెద్దయ్యాక/నిజమై పోయాయేమిటి- అంటూ బాల్య జ్ఞాపకానికి ప్రపంచం ఆకలిబాధను ముడివేసి చెప్పిన సామాజిక చైతన్యం కనిపిస్తుంది కవితలో కవి ప్రతిభకు గీటురాయి.

2001వ సంవత్సరం నుండి నేటివరకూ కోనసీమలో నానీలకు గుడికట్టిన కవి నల్లా నరసింహమూర్తి. ప్రకృతి అందాలను, సామాజిక అంశాలను తన నానీలలో ఆవిష్కరిస్తూ నానీల చైతన్యానికి తనవంతు కృషి చేస్తూ గోపి అభినందనలు పొందారు. 2009లో అమలాపురంలో 'నానీల శిక్షణా నిలయం' ఏర్పాటు చేసి ఎందరో యువకవులను నానీల కవులుగా తీర్చిదిద్దిన ఘనత నల్లా నరసింహమూర్తికి దక్కుతుంది. కోనసీమలో పది నానీల సదస్సులు నిర్వహించి నానీల వ్యాప్తికి ఎంతగానో కృషి చేస్తున్న కవి. నడక ఉద్యమంలో నానీల ద్వారా ఆరోగ్య సందేశాన్ని అందిస్తూ 'నడక నానీలు' సంపుటి ప్రచురించి పేరుపొందారు. ఇంకా 'నడక నడిస్తే..' 'నడక నడిచే వేళ..' నడక ఆరోగ్యం 'నడక నాతల్లి' వంటి అనేక నానీల నడక సంపుటాలు ప్రచురించారు.

పల్లె జీవన వాస్తవికతపై కలం స్పందన, ప్రపంచీకరణపై ప్రతిస్పందనలు, పేదరికంపై కనికరం, అవినీతిపై ఆగ్రహం, కంప్యూటర్‌ సంస్కృతిపై స్పందన, విద్యా, వైద్యరంగంలో కార్పొరేట్‌ సంస్కృతిపట్ల నిరసన, ప్రకృతి సౌందర్యంపట్ల ఆరాధన, ప్రకృతి విపత్తులు, రైతుల ఆత్మహత్యలపై సానుభూతి, దళితుల సమస్యలపై నానీలు, పంట విరామంపై ఆవేదన, ఉగ్రవాదం, నిరుద్యోగం, నడక, ధరల పెరుగుదల వంటి అనేక అంశాలపై, సమస్యలపై కవులు ప్రతిభావంతంగా చిత్రిస్తున్నారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు 'కాదేదీ కవిత కనర్హం' అంటూ 'కాదేదీ నానీల కనర్హం' అని నిరూపించారు.

'అబ్బే!/ ఏదో ఓటమి కాదు/ అది విజయానికి మరోమెట్టు'

గోపి తన నానీలో అన్నట్లు అంతా విజయమే ఓటమి లేదు. నానీకవులకు విజయమే నిజంగా. ఆచార్య నాగభైరవ కోటేశ్వరరావు చెప్పినట్లుగా 'ముత్యాల సరం గురజాడ మానసపుత్రిక అయితే, నానీ గోపి కవితా పుత్రిక' నిజం కూడా. ఆయన చెప్పింది అక్షర సత్యం నిశ్శబ్దంగా స్థిరపడిన ప్రక్రియ నానీ. ఒక ప్రక్రియగా నానీ సాధించిన విజయం అపూర్వం.[3]

మూలాలు

[మార్చు]
  1. "Naneelu turning point in Telugu literature". The Hans India. 28 February 2016.
  2. Ward, Jean Elizabeth (11 August 2008). Short Poems. Lulu.com. ISBN 9781435732353 – via Google Books.
  3. "Archived copy". Archived from the original on 10 August 2016. Retrieved 21 June 2016.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
"https://te.wikipedia.org/w/index.php?title=నానీలు&oldid=4136658" నుండి వెలికితీశారు