వైద్యుల చంద్రశేఖరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైద్యుల చంద్రశేఖరం
జననంనవంబర్ 10, 1904
నెల్లూరు
మరణంమే 29, 1996
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు
సుపరిచితుడుఫన్‌ డాక్టర్
జీవిత భాగస్వాములుశకుంతలాబాయి
పిల్లలురామప్రసాద్
తల్లిదండ్రులువైద్యుల సుబ్బారావు, సీతాబాయి
బంధువులుఎస్.జానకి

వైద్యుల చంద్రశేఖరం ప్రముఖ రంగస్థల నటుడు. ఇతడు ఏకపాత్రాభినయ ప్రక్రియలో ఎన్నో ప్రయోగాలు చేశాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు 1904, నవంబరు 10న నెల్లూరులో వైద్యుల సుబ్బారావు, సీతాబాయి దంపతులకు జన్మించాడు[1]. ఇతడు నెల్లూరులోని వి.ఆర్.పాఠశాలలో చదువుతున్నప్పుడు పి.ఎన్.రామస్వామి అయ్యర్ అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు షేక్‌స్పియర్ సాహిత్యాన్ని ఆ పాత్రలలో ఒదిగిపోయి అభినయిస్తూ బోధించే తీరు ఇతడిని బాగా ఆకట్టుకుంది. ఆ ఉపాధ్యాయుని ప్రభావంతో ఇతడు నటనారంగం వైపు ఆకర్షితుడైనాడు. ఇతని భార్య పేరు శకుంతలాబాయి. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్.జానకి ఇతని పెద్ద కోడలు.

నాటకరంగం[మార్చు]

తొలి దశ[మార్చు]

ఇతడు 1924లో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నెల్లూరులోని ఔత్సాహిక నాటక కళాకారుల బృందంతో కలిసి పౌరాణిక నాటకాలు ప్రదర్శించాడు. ఈ నాటకాలలో ఇతడు ధరించిన పాత్రలన్నీ స్త్రీ పాత్రలు. తరువాత తన మిత్రులతో కలిసి సాంఘిక ఇతివృత్తాలున్న చిన్న చిన్న నాటికలను ప్రదర్శించేవాడు. పౌరాణిక నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించిన నేపథ్యంలో ఇతనికి షేక్‌స్పియర్ నాటకాలలో కూడా స్త్రీపాత్రలు ధరించే అవకాశం లభించింది. కింగ్ లియర్, మర్చెంట్ ఆఫ్ వెనీస్, మాక్‌బెత్, ఒథెల్లో నాటకాలలో ఇతడు నటించాడు. ఇతని వాచకం ఇంగ్లీష్ జాతీయుల ఉచ్చారణతో పోటీ పడేది.

ఏకపాత్రలు, బహువేషధారణ[మార్చు]

ఒకవైపు ఇతడు నాటకాలలో నటిస్తూనే ఏకపాత్ర ప్రక్రియవైపు దృష్టిని సారించాడు. ఇది ఇతని రంగస్థల జీవితంలో పెద్ద మార్పు. ఈ ప్రక్రియనుండి ఇతడు బహురూపధారణ అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. దాదాపు 90 రూపాలను ఒకే ప్రదర్శనలో ఒకే వేదికపై ప్రదర్శించేవాడు. కొత్త వేషం కోసం తెరవెనుకకు వెళ్లేవాడు కాదు. వేదిక మీదే ఏర్పాటు చేసుకున్న టేబుల్ ఇతని గ్రీన్‌రూమ్‌ అయిపోతుంది. దాని మీదే మేకప్ సామాగ్రి ఉంచుకునే వాడు. అప్పటికే ఉన్న వేషం తాలూకు మేకప్‌ను కొద్దిగా మార్చుకుని కేవలం మూడు నిమిషాలలో ఐదారు రూపాలను ప్రదర్శించేవాడు. ఇతడు వేసుకునే వేషాలన్నీ ప్రపంచ ప్రఖ్యాతులైన వారివే. ఇతడు వేసిన వేషాలలో జవహర్‌లాల్ నెహ్రూ, బి.డి.జెట్టి, మహాత్మా గాంధీ, ఒమర్ ముఖ్తార్, టంగుటూరి ప్రకాశం, అడాల్ఫ్ హిట్లర్, ఇందిరా గాంధీ, అబుల్ కలాం ఆజాద్, అరవింద్ ఘోష్, రామకృష్ణ పరమహంస, చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతి, రమణ మహర్షి, త్యాగరాజు, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, అబ్రహాం లింకన్, లెనిన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, రవీంద్రనాథ్ టాగూర్, షేక్‌స్పియర్, జార్జి బెర్నార్డ్ షా, మదర్ థెరెసా వంటివి ఎన్నో ఉన్నాయి.

రచనలు[మార్చు]

ఇతడు నటన, రంగస్థల నిర్వహణ, ఆహార్యం వంటి అంశాల మీద పుస్తకాలు వ్రాశాడు. వాటికి "నాటక భగవద్గీత", "నాటక గీతాంజలి", "నాటకోపనిషత్" వంటి పేర్లను పెట్టాడు. రంగజ్యోతి అనే పేరుతో 15 సంవత్సరాలు ఒక పత్రికను నడిపాడు.

గుర్తింపు[మార్చు]

1953, 1967 సంవత్సరాలలో చైనా, రష్యాలలో పర్యటించిన భారత కళాకారుల బృందానికి భారత సాంస్కృతిక రాయబారి హోదాలో నాయకత్వం వహించాడు.

మరణం[మార్చు]

ఇతడు 1996, మే 29వ తేదీన మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. గోపరాజు, నారాయణరావు (3 December 2017). "ధృవతారలు - బహు 'ముఖ' ప్రజ్ఞ". సాక్షి ఫన్‌డే. Retrieved 3 December 2017.