Jump to content

పి.శంకరనారాయణ

వికీపీడియా నుండి
(శంకర నారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు నుండి దారిమార్పు చెందింది)
పి. శంకరనారాయణ

ఆచార్య పాలూరి శంకరనారాయణ భాషావేత్త, నైఘంటికుడు, సంస్కృతాంధ్ర పండితుడు, రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యుడు. శ్రీకాకుళంలో జన్మించారు.మున్సిపల్ హై స్కూల్ లో చదివి అక్కడే కొంతకాలం ఉపాద్యాయునిగా పనిచేశారు.శంకరనారాయణ మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో గణిత శాస్త్ర ఆచార్యుడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రధాన పరీక్షల అధికారిగా కూడా పనిచేశాడు. కొచ్చిన్ యువరాజులు, యుక్తవయసులో ఉన్న పిఠాపురం రాజా వంటి వారికి విద్యాబోధన చేశాడు. శంకరనారాయణ రచించిన తెలుగు-ఇంగ్లీషు, తమిళం-ఇంగ్లీషు నిఘంటువు చాలా ప్రసిద్ధిచెందినది. శంకర నారాయణగా పేరొందిన ఈయన పూర్తిపేరు పాలూరి శంకరనారాయణ శ్రేష్ఠి. ఈయన తొలి ఇంగ్లీషు తెలుగు నిఘంటువును తయారు చేశారు. దాని పేరే శంకరనారాయణ నిఘంటువు.

సొంతూరు నెల్లూరు., కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రి లాగానే దుబాసీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాల కోసం ఊరు వదలిన మహాసాహసి. రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి, ఇంగ్లీషు తెలుగు నిఘంటువుని తయారు చేశారు. అంతే కాదు, ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ నిఘంటువులను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు కూడా తయారు చేశారు.

ఆయన తయారుచేసిన తెలుగు నిఘంటువు 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ నిఘంటువు. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ నిఘంటువు. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ నిఘంటువుయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. 2004 అక్టోబరులో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.

కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన నిఘంటువు పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ నిఘంటువు అంటే ప్రామాణికమే.

నిఘంటువు పూర్వ పరిచయం

[మార్చు]

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....వాడి భాష మనకి రాదు...మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. నిఘంటువులు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు నిఘంటువు తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో నిఘంటువు 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్లు ముక్కస్యముక్కానువాదం చేసేవారు. అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మాటలు కాదు. ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది. అలాంటి వాడే మన నాయకుడు. ఆయన పేరు పాలూరి శంకరనారాయణ శ్రేష్ఠి

ఎస్.రామానుజం చెట్టియార్ ప్రోత్సాహముతో రూపొందిన ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువును మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడింది.[1] తరువాతి కాలంలో అంటే 1927 వరకు చివరిసారిగా ముద్రించారు.

దీనిని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్, వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 31 జనవరి, 1953లో ప్రచురించబడింది.

దీనిని "ఆసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్" వారు 2003 సంవత్సరంలో మద్రాసు, న్యూఢిల్లీ నుండి ప్రచురించారు.

మూలాలు

[మార్చు]