Jump to content

షిన్ మూడు చక్రాల సైకిల్

వికీపీడియా నుండి
(షిన్స్ ట్రైసైకిల్ నుండి దారిమార్పు చెందింది)

షిన్స్ ట్రైసైకిల్

పుస్తక రచయిత

తట్సుహరు కొడమ

చిత్రకారుడు

నొరియుకి ఆండో

అనువాదకుడు

కజుకో హొకుమెన్ జోన్స్

భాష

ఆంగ్లము

శైలి

బాలల సాహిత్యం

ప్రచురణకర్త

వాకర్ అండ్ కంపెనీ

విడుదల తేదీ

ఆగష్టు 1995

షిన్స్ ట్రైసైకిల్ తట్సుహరు (児玉辰春 Kodama Tatsuharu) కొడమ వ్రాసిన బాలల పుస్తకం. ఇది మొట్టమొదట జపాన్‌లో 1992 లో "షిన్-చాన్ నో-సాన్ రిన్ షా" (伸ちゃんのさんりんしゃ) గా ప్రచురింపబడింది. దీని ఆంగ్ల అనువాదం 1995 లో జరిగింది. ఇది జపాన్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హీరోషిమా పై ఆగష్టు 6, 1945 న జరిగిన బాంబు దాడిలో మరణించిన మూడేళ్ళ బాలుడు "షినిచి టెట్సుతాని" (鉄谷伸一 Tetsutani Shinichi) (Shin) యొక్క యదార్థ గాథను తెలియజేసే పుస్తకం.

పుస్తక పరిచయం

[మార్చు]

చదువుల ఉద్యమం (జనవాచక ఆందోళన) పేరుతో భారతీయ జ్ఞాన విజ్ఞాన సమితి, న్యూ ఢిల్లీ, జాతీయ సాక్షరతా మిషన్ సహాయంతో 60 పుస్తకాలకు పైగా ప్రచురించింది. వీటిల్లోంచి నాలుగు పుస్తకాలను 'ప్రపంచ శాంతి కోరుకుందాం' అన్న పేరుతో (ఆగష్టు 2003 లో) ప్రచురించారు. ఇప్పుడు ఆగష్టు 6 ను శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు. 1945 ఆగష్టు 6 న హీరోషీమాపై వేసిన అణుబాంబుకి సంబంధించిన నిజమైన కథలివి, ప్రాణమిచ్చిన ఏనుగులు, షిన్ మూడు చక్రాల సైకిలు [1] -shin's tricycle, సడాకో కాగితపు పక్షులు-sadako and the paper cranes."షిన్ మూడు చక్రాల సైకిల్" (shin's Tricycle - tatsuharu kadarma) ను తాత్సుహారు కోదామా వ్రాశాడు. దీనిని తెలుగులో కె.సురేష్, హిందీలో అరవింద గుప్తా అనువదించారు. ఈ పుస్తకం ఇప్పటివరకు జపాన్ లో పలు ముద్రణలు పొందింది. దీనిని తెలుగులో కె.సురేష్ అనువదించగా జనవిజ్ఞానవేదిక ప్రచురించింది.

రెండవ ప్రపంచయుద్ధం

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన విధ్వంసాలు ఎన్నో. కాని ఇది పిల్లల లో, పెద్దలలో యుద్ధం అంటే విముఖత కలిగించే కథ. యుద్ధంలో సైనికాధిపతులు, పెద్ద పెద్ద నాయకులు చనిపోరు. షిన్ వంటి మూడు సంవత్సరాల అమాయక బాలలు చనిపోతారు. హీరోషీమాపై అణుబాంబు వేసినప్పుడు షిన్ తన మూడు చక్రాల సైకిల్ తొక్కుతున్నాడు. యుద్ధం యొక్క విధ్వంసకతను ఎల్లప్పుడు గుర్తు చేసే కథ ఇది.

షిన్ మూడు చక్రాల సైకిలు (shin's Tricycle - tatsuharu kadarma)

[మార్చు]

ప్రతి సంవత్సరం ఆగస్టు నెల వచ్చిందంటే నన్ను అలనాటి జ్ఞాపకాలు పీడిస్తాయి. నా కొడుకు షిన్ కళ్ళముందు కదలాడుతుంటాడు. అతడు ఎర్రని మూడు చక్రాల సైకిలు తొక్కుతున్నట్లుగా అనిపిస్తుంది. తన పుట్టినరోజుకి ఇటువంటి సైకిలు కావాలని అతడు కలలు కన్నాడు. సంతోషభరితమైన ఈ చిత్రం వెంటనే పొగ, బూడిద మేఘాలలో కనుమరుగవుతుంది. ఆగష్టు నెలలో ఆ రోజు మా కలలన్నీ కల్లలయ్యాయి, నా హృదయం మీద నల్లటి మబ్బు శాశ్వతంగా కమ్ముకుంది.

యాభై సంవత్సారాల క్రితం షిన్ కి మూడేళ్ళ వయస్సు. మేము జపాన్ లోని హీరోషిమా నగరంలో నది ఒడ్డున ఒక చిన్న ఇంటిలో ఉండేవాళ్ళం. షిన్ కి ఇద్దరు అక్కలు మిచికో, యోకో, కాని కిమీ అతని ప్రియనేస్తం. ఆమె పక్క ఇంటి అమ్మాయి. ఇద్దరూ రోజంతా చెక్కముక్కలతో ఇళ్ళు కట్టేవారు. లేదా బొమ్మల పుస్తకాలు తిరగేసేవారు. మూడు చక్రాల సైకిలు బొమ్మ ఉన్న ఒక పుస్తకాన్ని ప్రత్యేకించి ఎక్కువగా చూసేవారు. అటువంటి సైకిలు కావాలని షిన్ కు ఉండేది. అతడి ఈ కల ఎప్పటికీ తీరేది కాదని అతడికి తెలుసు.

ఆ రోజులలో జపాన్ లో మూడు చక్రాల సైకిలు దొరకటం చాలా కష్టం. 1941లో అమెరికా, మరికొన్ని దేశాలతో జపాన్ యుద్ధానికి దిగింది. నాలుగు సంవత్సరాల యుద్ధంలో అన్ని సైకిళ్ళను, గుడి గంటలను, వంటింటి పాత్రలను కరిగించి వాటితో యుద్ధ ట్యాంకులు, తుపాకులు తయారుచేశారు. పిల్లలకు ఆటవస్తువులు దొరకటం చాలా కష్టంగా ఉండేది.

కాని షిన్ మాత్రం సైకిలు కావాలి అని పట్టుపట్టాడు. సైకిలు ఇవ్వలేదన్న కోపంతో ఒక రోజు అన్నం కూడా తినలేదు. అతడు నా దగ్గరకు వచ్చి "నాన్నా, నాకు సైకిలు తీసుకు వస్తావు కదూ? మరిచిపోకుండా తప్పకుండా తీసుకురా" అంటూ అడిగాడు.

షిన్ వాళ్ళ అమ్మ అతడి భుజం మీద నెమ్మదిగా చేయి ఉంచి ఇలా అంది: " షిన్, మమ్మల్ని క్షమించు, నువ్వు ఓపిక పట్టాలి. మనకి అవసరం ఉన్న ఎన్నో వస్తువులు ప్రస్తుతం దొరకని పరిస్థితిలో ఉన్నాం. అవి లేకుండానే బతకడం అలవరచుకోవాలి."

షిన్ కి ఈ మాటలు నచ్చలేదు కాని అమ్మ చెపుతున్నది నిజమేనని అతనికి కూడా తెలుసు. తరువాత ఒక రోజు షిన్ ని చూడటానికి వాళ్ళ బాబాయి వచ్చాడు. బాబాయి జపాన్ నావికాదళంలో పనిచేస్తున్నాడు. "షిన్ ఇటురా," అతడన్నాడు, "నీ కోసం ఏం తెచ్చానో చూడు." "ఏం తెచ్చావు?" అతడు ఉత్సాహం నిండిన స్వరంతో అడిగాడు. పెద్ద పెద్ద కళ్ళతో బాబాయి చేతిలోని పార్సిల్ ని చూస్తున్నాడు. "నువ్వు కనుక్కో" బాబాయి అన్నాడు. "దీంట్లో నువ్వు ఎంతో కోరుకుంటున్న వస్తువు ఉంది." ఇలా అంటూ బాబాయి పార్సిల్ ని తన వెనక దాచేశాడు. షిన్ సంతోషంతో ఎగురుతూ దానిని అందుకోటానికి ప్రయత్నిస్తున్నాడు. కాని బాబాయి నవ్వుతూ అది అతడికి అందనంత ఎత్తులో పట్టుకున్నాడు. అప్పుడు షిన్ కి పార్సిల్ నుంచి బయటికి వచ్చిన ఒక ఎర్రటి హాండిల్ కనబడింది. "దీంట్లో మూడు చక్రాల సైకిలు ఉంది" అతడు పెద్దగా అరిచాడు. ఆతను తన కళ్ళను తను నమ్మలేక పోతున్నాడు. పార్సిల్ విప్పుతుండగా అతడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "బాబాయ్! నువ్వు చాలా చాలా మంచివాడివి. నీకు ఈ సైకిలు ఎక్కడ దొరికింది?" "ఈ సైకిలు నా గదిలోని అలమరాలో దొరికింది" బాబాయ్ బదులిచ్చాడు. "నేను నీ పుట్టిన రోజుకంటే ముందే తిరిగి వెళ్ళిపోవాలి. దీనిని నీకు ఇచ్చి వెడదామని వచ్చాను." షిన్ ఎగిరి తన ఎర్ర సైకిలు మీద కూర్చున్నాడు. నా వంక గర్వంగా చూస్తూ, " చూడు నాన్నా, నాకు సైకిలు దొరికింది" అన్నాడు.

ఆగష్టు 6 చాలా అందంగా ఉంది. చెట్లనుంచి కీచురాళ్ళ రొద వినపడుతోంది. ఉదయపు శాంతి సైరన్ కూతలతో భంగమయ్యింది. అమెరికా దాడులకు హెచ్చరిక అది. సైరన్ కూత ఆగటంతోనే షిన్, కిమీ వెనుకవైపు దొడ్డిలోకి వెళ్ళి నవ్వుకుంటూ సైకిలు తొక్కుకోసాగారు. నేను కూడా నవ్వుతూ ఇంటిలోపలికి వెళ్ళాను. మేం కలలో కూడా ఊహించలేనిది అప్పుడు జరిగింది. గుండెను కుదిపివేసే ఒక పెద్ద శబ్దం, ఆ తరువాత కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక పెద్ద మెరుపు. నాకు ప్రపంచం అంతం అయిపోయినట్లు అనిపించింది. ఉన్నట్లుండి ఆ ఉదయపు ఆకాశంలో చీకటి కమ్ముకుంది.

నాకు తిరిగి స్పృహ వచ్చేసరికి నా చుట్టూ కటిక చీకటి అలుముకుని ఉంది. నేను కదలలేకపోతున్నాను, మెదలలేకపోతున్నాను. ఎక్కడో చిక్కుకు పోయినట్లు ఉంది . కాని ఎక్కడ?

ఇంటి కప్పులోని ఒక కన్నం నుంచి కొద్దిగా వెలుతురు రావటం కనబడింది. నా చేతులతో మెల్లగా నాపై పడిన దూలాలను తొలగించటానికి ప్రయత్నించాను. లేచి నిలబడిన నాచేతికి నున్నటి వస్తువు తగిలింది. అది నా ఇంటి కప్పు! మొత్తం ఇల్లు కుప్పకూలి నాపై పడింది. మెల్లమెల్లగా నేను కాంతివస్తున్న వైపుకి నడచి, ఇంటికప్పు మీదకి చేరుకున్నాను. నాలుగువైపులా వళ్ళు గగుర్పొడిచే నల్లటి ధూళి మేఘాలు కమ్ముకున్నాయి. ముందు నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. అంతా నాశనమైపోయింది. కిమీ వాళ్ళ ఇల్లు, గుడి, బజారు, హీరోషిమా మొత్తం నేలమట్టం అయింది. గాలులు వేగంగా వీస్తున్నాయి, "ఎవరైనా ఉన్నారా?" పెద్దగా అరిచాను. "ఇక్కడ ఉన్నాను," షిన్ వాళ్ళ అమ్మ గొంతు వినపడింది, "నోటు, ఇటురా." కూలిన ఇంటినుంచి నేను బయటికి వచ్చాను. అక్కడ షిన్ వాళ్ళ అమ్మ కూలిన ఇంటి వాసాలను తొలగిస్తూ కనబడింది. ఒక పెద్ద దూలం కింద షిన్ ఉన్నాడు.

నేను వెంటనే వెళ్ళి దూలాన్ని పైకి లేపాను. షిన్ వాళ్ళ అమ్మ అతడిని బయటికి లాగింది. అతడి ముఖం వాచిపోయి రక్తం కారుతూ ఉంది. అతడి నోటి నుంచి మాటలు రావటం లేదు. కానీ అతడు చేతిలో మూడు చక్రాల సైకిలు హ్యాండిల్ గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కిమీ అక్కడెక్కడా కనపడలేదు. కూలిన ఇంటికింద ఎక్కడ ఉందో?

అప్పుడు ఇంటికప్పు కిందనుంచి రెండు గుడ్డముక్కలు కనపడ్డాయి. ఇంటిలో ఒక మూల మంటలు రేగాయి. మంటలు ఒకవైపున గోడలా ఏర్పడ్డాయి. "మిచికో! యోకో! నేను వస్తున్నాను" అంటూ అరిచాను.

నా శక్తినంతటినీ ఉపయోగించి ఇంటిపెద్ద దూలాన్ని తొలగించడానికి ప్రయత్నించాను. కాని నా వల్లకాలేదు. మంటలు ఇప్పుడు నా దగ్గరకల్లా వచ్చేశాయి. ఆ వేడిమికి నా బట్టలు అంటుకునేలా ఉన్నాయి. మిచికో, యోకోల మీద పడిన దూలాన్ని మంటలు అలుముకుంటున్నాయి. "మిచికో! యోకో!" వణుకుతున్న స్వరంతోనే అరిచాను. నేను చేష్టలుడిగి నిలుచుండిపోయాను. నా పిల్లల్ని కాపాడుకోలేని అసమర్థుడినయ్యాను. అయితే షిన్ బతికే అవకాశం ఉంది. రగులుతున్న మంటల నుంచి తప్పించుకోవడానికి వాడిని తీసుకుని వాళ్ళమ్మ నదివైపుకి పరుగులు తీసింది.

బతికి బయటపడిన వాళ్ళందరూ నది దగ్గరే గుమికూడారు. ఆ భయంకర దృశ్యం చూడలేక పోయారు. చాలామంది కాలిపోయి ఉన్నారు. బిక్కు బిక్కు మంటూ ఏడుస్తూ నీళ్ళకోసం పరితపిస్తున్నారు.

"నీళ్ళు, నీళ్ళు కావాలి" షిన్ మెల్లగా మూలుగుతున్నాడు. అతనికి సహాయం చెయ్యాలని ఉంది. కానీ నా చుట్టుపక్కల వాళ్ళు మంచినీళ్ళు తాగి చనిపోతున్నారు. అందుకే షిన్ కి మంచినీళ్ళు ఇవ్వటానికి నాకు ధైర్యం చాలలేదు. "నాన్నా " షిన్ వినపడనంత మెల్లగా గొణుగుతున్నట్లు అంటున్నాడు, "నా...నా...సైకిలు...!" ఇప్పటికి సైకిలు హ్యాండిల్ ప్లాస్టిక్ దొప్ప పట్టుకున్న అతని చేతిని పట్టుకున్నాను. "షిన్, సైకిలు హ్యాండిల్ ఇప్పటికీ నీ చేతిలోనే ఉంది." నేను బదులిచ్చాను. వాచిన అతని ముఖంలో ఉన్నట్లుండి కాంతి ప్రసరించింది. సన్నటి చిరునవ్వు మెరిసింది. కానీ ఆ రాత్రే షిన్ చనిపోయాడు. మరో పదిరోజులకు అతడి పుట్టినరోజు వస్తుంది. మరునాడు నేను మా ఇంటికి తిరిగి వచ్చాను. అక్కడ ఒక చోట నాకు మిచికో, యోకోల ఎముకలు కనబడ్డాయి. "నన్ను క్షమించండి, నా ప్రియమైన పిల్లలూ నన్ను క్షమించండి." నేను కుమిలి కుమిలి ఏడ్చాను. వాళ్ళని పాతిపెట్టిన తరువాత చాలా సేపటివరకు నేను ఏడుస్తూ ఉండిపోయాను. నిన్నటివరకు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అని అనుకోసాగాను.

మరునాడు షిన్ ని పాతిపెట్టడానికి పెరడులో గొయ్యి తవ్వాను. అదే సమయంలో కిమీ మృతశరీరాన్ని తీసుకుని వాళ్ళ అమ్మ వచ్చింది. "వాళ్ళిద్దరూ ఎంతచక్కగా ఆడుకునేవారు." ఆమె దుఃఖం నిండిన స్వరంతో అంది. "నోబు, మనం వీళ్ళిద్దరినీ కలిపి పాతిపెడదాం." షిన్, కిమీలు చేతులు పట్టుకుని ఉన్నట్లుగా పెట్టి వాళ్ళను పూడ్చిపెట్టాం. కూలిన ఇంటి చెత్తలో దొరికిన షిన్ ఎర్రటి, మూడు చక్రాల సైకిలును కూడా వాళ్ళతో పాటు పాతిపెట్టాం.

ఆ తరువాత రోజు సాయంత్రం నది ఒడ్డుకు వెళ్ళి మా పిల్లల్ని పిలుస్తూ ఉండేవాళ్ళం "షిన్ మిచికో! యోకో! "

ఆ అణుబాంబు హీరోషీమాను ఒక ఎడారిగా మార్చివేసింది. ఆ దుర్ఘటన జరిగి నలభై సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో నగరం మళ్ళీ ప్రజలతో నిండిపోయింది. ఇప్పుడు ఇక్కడ జీవితంలో కొత్త ఆశలు రేగుతున్నాయి. ఇక్కడ మట్టిలో మళ్ళీ మొక్క అంటూ మొలవదని మొదట్లో అనుకున్నాను. కాని ఇప్పుడు నేల అంతటా గడ్డి ఉంది. చెట్లు పూలతో నిండుగా ఉన్నాయి. పార్కులో పిల్లలు నవ్వుతూ ఆడుకుంటున్నారు.

ముగింపు

[మార్చు]

నా పిల్లల నవ్వులు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను బాధ పెడుతుంటాయి. యుద్ధం ఎప్పుడూ దుఃఖదాయకమే. యుద్ధం ఎవరు మొదలుపెట్టారన్న దానితో సంబంధంలేదు. యుద్ధంలో ఎప్పుడూ నిర్దోషులు - షిన్ లాంటి పిల్లలు చనిపోతుంటారు.

నా కళ్ళనిండా నీళ్ళు. నేను నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకుని షిన్ సైకిలును బయటికి తీశాను. పిల్లలు ఇంతటి దారుణానికి మరెన్నడూ గురి కాకూడదనుకున్నాను. "షిన్ సైకిలు ను చాలా మంది చూడగలిగితే శాంతియుత ప్రపంచం యొక్క ప్రాముఖ్యత, వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ పిల్లలు నవ్వుతూ, ఆడుతూ ఉండే ప్రపంచం గురించి ఆలోచిస్తారు" అనుకున్నాను.

మరుసటి రోజు నేను షిన్ సైకిలును హిరోషిమా లోని శాంతి సంగ్రహాలయానికి తీసుకెళ్ళాను. ప్రపంచవ్యాప్తంగా బాలలకు షిన్ సైకిలు శాంతి సందేశమవుతుంది.

బయటి లింకులు

[మార్చు]
  1. [1].

మూలాలు, వనరులు

[మార్చు]