సంగంరెడ్డి సత్యనారాయణ
సంగంరెడ్డి సత్యనారాయణ | |||
![]() సంగంరెడ్డి సత్యనారాయణ | |||
పదవీ కాలం 1983- 1984 | |||
పదవీ కాలం 1983- 1984 | |||
ముందు | వి. వెంకటేశ్వర రావు | ||
---|---|---|---|
తరువాత | టి.హయగ్రీవాచారి | ||
నియోజకవర్గం | హన్మకొండ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముచ్చర్ల గ్రామం, హసన్‌పర్తి మండలం, వరంగల్ అర్బన్ జిల్లా తెలంగాణ రాష్ట్రం | 1933 జనవరి 1||
మరణం | 2016 అక్టోబరు 10 హైదరాబాద్ | (వయసు: 83)||
సంతానం | సంగంరెడ్డి బోజ్యరాజ్, యోగిరాజ్, పృథ్వీరాజ్, మాధవి | ||
మతం | హిందూ |
ముచ్చర్ల సత్యనారాయణ గా పిలువబడే సంగంరెడ్డి సత్యనారాయణ మాజీ మంత్రి, వాగ్గేయకారుడు[1], తెలంగాణ కోసం ఉద్యమించిన పోరాటయోధుడు.[2][3]
జననం-బాల్యం
[మార్చు]సత్యనారాయణ సొంత ఊరు హన్మకొండ పక్కన గల హసన్‌పర్తి మండలంలోని ముచ్చర్ల. తల్లిదండ్రులు నర్సమ్మ, నర్సయ్య 01 జనవరి 1933 లో జన్మించారు.[4] బాల్యం నుంచి చురుకుతనంతో ఆటపాటలందు ఆసక్తే కాకుండా శ్రీకృష్ణ తులాభారం, సత్యహరిశ్చంద్ర వంటి నాటకాలు వేసి బహుమతులు గెల్చుకున్నారు. ఇంటర్మీడియట్‌లో సహవిద్యార్థి అయిన జయశంకర్ ఆ నాటకాల్లో స్త్రీ పాత్రలు వేసేవారు.[5]
రాజకీయ ప్రవేశం
[మార్చు]1959లో పంచాయితీ రాజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత తొలుత ముచ్చర్ల గ్రామసర్పంచ్‌గా, ఉమ్మడిరాష్ట్రంలో రెండు సార్లు సమితి అధ్యక్షుడిగా, ఆ తర్వాత హన్మకొండ పంచాయితీ ప్రెసిడెంటుగా సేవలందించి.. తన ఊరిపేరైన ముచ్చర్లనే ఇంటిపేరుగా మారిపోయి ముచ్చర్ల సత్యనారాయణగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. 1983లో ఎన్టీరామారావు స్థాపించిన టీడీపీ తరఫున 1983లో హన్మకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన రాజకీయ గురువు, కాంగ్రెస్ సీనియర్ నేత తిరువరంగం టి.హయగ్రీవాచారి పై 21,415 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి 1983 నుంచి 85 వరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడిగా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు, కానీ స్వతంత్ర వ్యక్తిత్వం, తలవంచని నైజం కలిగిన సత్యనారాయణ రాజకీయాలకు దూరమై చాలా కాలం ఒంటరిగా ఉండిపోయారు. 2001న కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి మలిదశ ఉద్యమం ప్రారంభించినప్పుడు సత్యనారాయణ ఇచ్చిన సూచనలు ఉద్యమ నిర్మాణానికి ఎంతగానో తోడ్పడ్డాయి.[6]
ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో
[మార్చు]1952 నాటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్‌ముల్కి గోబ్యాక్ ఉద్యమాన్ని వరంగల్లులో మొదట ఆరం భించినవారు సంగంరెడ్డి. పోలీస్ యాక్షన్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు చేపట్టిన మిలిటరీ జనరల్ జయంతినాధ్ చౌదరి అధికార భాషలో చదివి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న సివిల్, పోలీస్ అధి కారులతో సహా దాదాపు 50 వేల పోస్టులను రద్దు చేసి వారి స్థానంలో ఆంగ్లం తెలిసిన నాన్ ముల్కిలైన ఆంధ్ర ప్రాంతం వారిని వివిధ పోస్టుల్లో నియమించటంతో ముల్కీ, నాన్ ముల్కీ సమస్య ఉత్పన్నమైంది.
పుండు మీద కారంలా అప్పటి వరంగల్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేసిన సెటిలర్ పార్థసారథి ఏకపక్షంగా 180 మంది స్థానిక ఉపాధ్యాయులను దూరప్రాంతా లకు బదిలీ చేసి వారి స్థానంలో ఆంధ్రప్రాంతం వారిని నియమించడంతో వరంగల్‌లో ఆందోళన మొదలైంది. ఆ ఆందోళనలో ముందుభాగాన నిల్చిన సత్యనారాయణ విద్యార్థి యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు.
1953 డిసెంబరులో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నాటి ఒరిస్సా గవర్నర్ సయ్యద్ ఫజల్ ఆలీ చైర్మన్‌గా స్టేట్ రీ ఆర్గనైజింగ్ కమిటీని యేర్పాటు చేసినప్పుడు రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించిన సత్యనారాయణ ‘తెలంగాణ సోదరా తెలుసుకోరానీరా మోస పోకురా, గోస పడుతవురా’ అంటూ జరిగే మోసాన్ని ముందుగానే ఊహించి హెచ్చరించారు. తాను ఊహించి నట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దమ నుషుల ఒప్పందాన్ని, రక్షణ సూత్రాలను యధేచ్చగా ఉల్లంఘిం చడంతో సంజీవరెడ్డి మామ.. సంజీవరెడ్డి మామ... చోడోజీ తెలంగాణ.. చేలే జావో రాయలసీమ అంటూ పాట ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వెల్లు వెత్తిన 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఈ పాట రణన్నినాదమైంది. టి పురుషోత్తమరావుతో కలిసి తెలం గాణ రక్షణల ఉద్యమ సమితిని స్థాపించి తెలంగాణ జిల్లాలన్నీ తిరిగి అనేక బహిరంగ సభలను నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. ఆ సమయంలోనే స్థానికు లకు పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్ స్టేష న్‌లో ఉద్యోగ నియామకాల విషయంలో స్థానికులకు జరి గిన అన్యాయం ఉద్యమ రూపం దాల్చి 1969 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి అంకురా ర్పణ చేసింది. దాంట్లో భాగంగా 1969 జనవరి 8న ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాధ్ అనే విద్యార్థి తెలం గాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన సందర్భంగా తన మాటపాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు[7].
1969 ఉద్యమంలో
[మార్చు]రాజకీయ నాయకత్వం లేకుండా ఉద్యమం గెలుపొందదని గ్రహించి, ఉద్యమానికి దూరంగా ఉన్న మర్రి చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ ‘రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైన రావేమీ వెర్రి చెన్నారెడ్డి’ అంటూ పాట ద్వారా పిలుపునిచ్చాడు. కానీ ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర పాలకులు తుపాకి కాల్పులతో అణిచివేశారు. అయినా తెలంగాణ ఆకాంక్ష చావని సత్యనారాయణ జై తెలంగాణ పత్రిక స్థాపించి తెలంగాణ భావజాల ప్రచారం చేపట్టారు.
ఓ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వూ
[మార్చు](తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఇంటర్వు ఇది.) నలభై మూడేళ్ళ క్రితం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన నేతల్లో సంగంరెడ్డి సత్యన్నారాయణ ఒకరు. ఆనాటి ఉద్యమ సభల్లో- "రావోయి రావోయి చెన్నారెడ్డి.. రావేమి వెర్రి చెన్నారెడ్డి, తెలంగాణ సోదరా.. తెల్సుకో నీ బతుకు అని ఆయన పాడిన పాటలు పెద్ద హిట్. పంచాయితీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన సత్యన్నారాయణ ఎన్టీఆర్ కేబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఈ మధ్య వరకూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో, గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన మార్పుల గురించి సత్యన్నారాయణతో ముఖాముఖి..
మీరు 1950ల తర్వాత జరిగిన ఉద్యమాలను చాలా దగ్గరగా చూశారు కదా.. అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడాలు ఉన్నాయి? స్వాతంత్య్రం ముందు తెలంగాణ ప్రాంతమంతా నిజాం పరిపాలనలో ఉండేది. ఆయన పాలనలో ప్రజలందరూ బానిసలే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిజాం పాలన పోయింది. పేరుకు ప్రజాస్వామ్యం వచ్చింది. తెల్లదొరలు పోయి నల్లదొరల పాలన వచ్చింది. తెలంగాణాలో మెజారిటీ ప్రజలైన దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి రాజకీయం తెలియదు.
అధికారపు రుచి తెలియదు. అధికారంతో సాధికారత కూడా వస్తుందని తెలియదు. తెలంగాణలో వెలమలు, రెడ్లు అగ్రవర్ణాల వారు. వెనకబడిన తరగతుల వారు అమాయకులు కావటంతో అగ్రవర్ణాల వారు అధికారంలోకి వచ్చారు. అయితే వారు కూడా ఆంధ్రప్రాంతంలో ఉన్న అగ్రవర్ణాల వారికి సలామ్ చేసేవారు. 1958 నాటికే తెలంగాణ ప్రజలకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే అభివృద్ధి చెందగలమని గ్రహించారు. ఆంధ్రనాయకులు చేస్తున్న రాజకీయాలను అర్థం చేసుకున్నారు.
ఆ సమయంలో సంజీవరెడ్డి మీద నేను రాసిన- 'సంజీవరెడ్డి మామ.. అయ్యో రామరామ' అనే పాట పెద్ద హిట్. ఏ సభకు వెళ్లినా అడిగి మళ్లీ మళ్లీ పాడించుకొనేవారు. ఈ పరిస్థితి బాగా ముదిరి 1969నాటికి ఉవ్వెత్తున ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎన్‌జీఓలు. ఇది పట్టణాల్లో బాగా పాకింది. ఆ సమయంలో మేమందరం పోరాడాం.
కాని తెలంగాణ ప్రజలను చెన్నారెడ్డి వంటి నాయకులు నమ్మించి మోసం చేశారు. కాని ప్రజల్లో మాత్రం ప్రత్యేక తెలంగాణ భావన బలంగా నాటుకుపోయింది. ఇక ప్రస్తుత ఉద్యమం విషయానికి వస్తే- ఇది అన్ని వర్గాల్లోకి బాగా పాకింది. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు. విద్యార్థులు, ఇతర వృత్తుల వారు, కులసంఘాల వారు కూడా పాల్గొనటం మొదలుపెట్టారు. నా ఉద్దేశంలో ఈ సారి ఉద్యమాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఇంత బలమైన ఉద్యమం గతంలో జరగలేదు.
మీ ఉద్దేశంలో ఆ నాటి ఉద్యమాలు చల్లారిపోవటానికి కారణాలేమిటి? అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవా? ఇప్పుడు ఉన్నంత చైతన్యం ఆ సమయంలో అంటే 1969లో లేదు. ఆ సమయంలో ఉద్యమాలు పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు పల్లెపల్లెకు పాకాయి. జెండాలు, అజెండాలు ఉన్నా లేకపోయినా- తెలంగాణ కావాలనే భావన బలంగా ఉంది. ఉదాహరణకు వరంగల్ ప్రాంతంలో ఉన్న ముచెర్ల మా ఊరు. ఆ గ్రామ ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నారు. కాని మీకు ఆ గ్రామంలో ఒక్క పార్టీ జెండా కూడా కనిపించదు. అంటే పార్టీ రహితంగా, నేతల ప్రమేయం లేకుండా ఉద్యమం పాదుకుపోయింది.
దీనికి ఒక ప్రధానమైన కారణం సాహిత్యం. ఇప్పుడు అనేక మంది కవులు, కళాకారులు గళాలెత్తి పాడుతున్నారు. రచయితలు తమ రచనల ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గతంలో ఇంత మంది కవులు, రచయితలు, కళాకారులు లేరు. దీనితో పాటు హైదరాబాద్ ప్రాధాన్యాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే- గత ఉద్యమాలలో పాల్గొన్న ప్రజలకు హైదరాబాద్‌కు ఉన్న 'అధికార శక్తి' తెలియదు. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్నవారికి హైదరాబాద్ ఎంత అవసరమో తెలుసు. వీటన్నింటితో పాటుగా ఈ సారి ఉద్యమంలో కులసంఘాలు చురుకుగా పాల్గొంటున్నాయి.
బొగ్గుకార్మికులు, ప్రభుత్వ సిబ్బంది, కులసంఘాలు, విద్యార్థులు- అందరూ కలిసి ఒక లక్ష్యం కోసం ఉద్యమం చేయటం ఇప్పటి దాకా జరగలేదు. గతంలో జరిగిన ఉద్యమాలలో కొన్ని వర్గాలు పాల్గొన్నాయి. కొన్ని పాల్గొనలేదు. అందువల్ల ఆ ఉద్యమాలు త్వరగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
గతంలో జరిగిన ఉద్యమాలలో యువకులు ఆత్మహత్యలు చేసుకోలేదు. ప్రస్తుత ఉద్యమంలో జరుగుతున్నాయి. వీటిని దేనికి సంకేతంగా భావించాలి? ఉద్యమం ఎంత కాలం జరుగుతుంది? తెలంగాణ వస్తుందా?రాదా? అనే విషయానికి సంబంధించి ప్రజల్లో ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. నాయకులు ప్రజలకు సమాచారాన్ని స్వేచ్ఛగా అందించకపోవటం వల్ల ఉద్యమాలు జరిగే సమయంలో అనేక అపోహలు, అనుమానాలు ఏర్పడతాయి. వీటి వల్ల మన పరిస్థితిలో మార్పు రాదేమోననే భయం ఏర్పడుతుంది.
సున్నితమనస్కులు, ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేని వారు ఆత్మహత్యలు చేసుకుంటారు. విద్యార్థుల విషయంలో ఇదే జరిగింది. గతంలో ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో కాల్పులు జరిపేవారు. వాటిలో ప్రజలు మరణించేవారు. కాని ప్రస్తుత ఉద్యమంలో- తెలంగాణ ఎటువంటి పరిస్థితుల్లోనైనా వస్తుంది.. మీరు భయపడకండి అని భరోసా లేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఊ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులపై మీ విశ్లేషణ ఏమిటి? తెలంగాణా ఇవ్వటం తప్ప మరో మార్గం లేదు. కాని తెలంగాణా రాకుండా అడ్డుపడటానికి అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సారి ఉద్యమం పల్లెపల్లెకు పాకింది కాబట్టి తెలంగాణ వస్తుందనే నమ్మకం నాకు ఉంది. కాని మాట్లాడదాం.. చర్చిద్దాం.. అన్నప్పుడల్లా తెలంగాణ ఇక రాదేమోనని కొందరు భయపడటం సహజం. కాని ప్రజల ఆకాంక్షలను ఎవరూ అణిచివేయలేరనే నమ్మకం నాకు ఉంది. (తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఇంటవ్వు ఇది.)[8]
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతో
[మార్చు]తెలంగాణ వస్తుందనే నమ్మకం ఉంది అనే సత్యనారాయణ తెలంగాణరాష్ట్రం ఏర్పాటుతో చాలా సంతోషించాడు
మృతి
[మార్చు]ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తొలి తరం నాయకుల్లో ముందువరుసన నిలిచిన సంగంరెడ్డి సత్యనారాయణ 2016 అక్టోబరు 10 న హైదరాబాద్‌లోమరణించారు. ఆయన వయస్సు 86 ఏళ్లు.
ధిక్కార కెరటం
[మార్చు]తొలి తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు, మాజీ మంత్రి దివంగత సంగంరెడ్డి (ముచ్చర్ల) సత్యనారాయణ జీవిత చరిత్రపై రచయిత పి.చంద్ రాసిన ‘ధిక్కార కెరటం’ పుస్తకావిష్కరణ సభ హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని డాక్టర్ నేరళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో 09-11-2017 నాడు నిర్వహించారు[9].
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983) 270
మూలాలు
[మార్చు]- ↑ https://www.sakshi.com/news/family/sakshi-literature-poetry-942020
- ↑ Andrajyothy (9 October 2021). "తెలంగాణ వేదన, సాధనల సాక్షి". Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.
- ↑ "ప్రజాతంత్ర తెలంగాణతోనే సంగంరెడ్డికి నివాళి". Andhrajyothy. 21 January 2025. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
- ↑ "తెలంగాణ వైతాళికుడు సంగంరెడ్డి సత్యనారాయణ". V6 Velugu. 21 January 2025. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
- ↑ "తొలితరం ఉద్యమ నేత..!". Sakshi. 20 October 2016. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
- ↑ "సునోజి మేరగాన – కహాతా రహే తెలంగాణ." 21 January 2025. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
- ↑ https://www.youtube.com/watch?v=R5vobyyVzRI
- ↑ "'భౌగోళిక తెలంగాణ' చాలదన్న దార్శనికుడు". Andhrajyothy. 10 October 2023. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-19. Retrieved 2017-10-19.