సంఘర్షణ (2011 సినిమా)
సంఘర్షణ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సముద్రఖని |
---|---|
నిర్మాణం | వేదరాజ్ టింబర్, అమ్మిరాజు, కె. ఎల్. దామోదర్ ప్రసాద్ |
తారాగణం | అల్లరి నరేష్, శశికుమార్, స్వాతి, నివేదా థామస్ |
సంగీతం | సుందర్ సి.బాబు |
గీతరచన | వెన్నెలకంటి, చంద్రబోస్ |
భాష | తెలుగు |
సంఘర్షణ 2011లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. సముద్రఖని దర్శకత్వంలో అదే సంవత్సరం వెలువడిన పొరాలి అనే తమిళ సినిమా దీనికి మూలం. ఇదే సినిమా కన్నడ భాషలో పునీత్ రాజ్‌కుమార్, యోగేశ్, భావనలు ప్రధాన పాత్రధారులుగా యారే కూగాడలి అనే పేరుతో పునర్మించబడింది.
నటీనటులు
[మార్చు]- శశికుమార్
- నరేశ్
- స్వాతి
- నివేదా థామస్
- వసుంధర కశ్యప్
- సూరి
- గంజ కరుప్పు
- జయప్రకాష్
- జి.జ్ఞానసంబంధం
- బడవా గోపి
- కల్పనాశ్రీ
- నమో నారాయణ
- జ్ఞానవేల్
- సునీల్ సుఖంద
- దిలీపన్
- నాదోదిగల్ గోపాల్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: సముద్రఖని
- నిర్మాతలు: వేదరాజ్ టింబర్, అమ్మిరాజు, కె. ఎల్. దామోదర్ ప్రసాద్
- ఛాయాగ్రహణం: ఎస్.ఆర్.ఖాతిర్
- కూర్పు: ఎ.ఎల్.రమేష్
- సంగీతం: సుందర్ సి.బాబు
కథ
[మార్చు]ఇద్దరు యువకులు (శశికుమార్, నరేశ్) ఓ చోటు నుండి పారి పోతారు. వారు పారిపోవటం గమనించి ఓ వ్యక్తి వెంబడిస్తాడు. అతన్ని చావగొట్టి మొత్తానికి హైదరాబాద్ సిటీకి చేరతారు. నరేశ్ స్నేహితుడు గంజ కరుప్పు ఉండే ఇంటిలో తలదాచు కుంటారు. ఆ ఇంటి ఆవరణలో ఉన్న ప్రతి పోర్షన్లోనూ ఓ సమస్య. ఓ ఇంట్లో తండ్రీ కొడుకులకు పడదు, మరొక దాంట్లో భార్యభర్తలకు పడదు. ఇంకో ఇంట్లో ముగ్గురు అనాథ మహిళలు ఏ ఆసరా లేకుండా నిస్తేజమైన జీవితం గడుపుతుంటారు. మంచితనం మనసంతా నిండిపోయి, తాగుబోతుగా మారిపోయిన వాడు మరొకడు. ఈ ఇద్దరు కుర్రాళ్ళు ఆ కాంపౌండ్లోకి వచ్చాక అక్కడి వారిలో ప్రేమానురాగాలు, కొత్త ఆశలు చిగురిస్తాయి. చిల్లిగవ్వ కూడా లేకుండా వచ్చిన వీరిద్దరూ పెట్రోల్ బంకులో పనిచేస్తూ, దానితో పాటు స్వశక్తితో ఓ డోర్ డెలివరీ సెంటర్ను నడుపుతూ తమతో పాటు మరో పదిమందికి ఆశ్రయం కూడా ఇచ్చేస్థాయికి చేరతారు. ఈ క్రమంలో సరేశ్ తనతో పాటు బంక్ లో పనిచేసే నివేదతోనూ, శశికుమార్ తమ పోర్షన్ ఎదురుగా ఉండే గ్రూప్ డాన్సర్ స్వాతితోనూ ప్రేమలో పడతారు. వీరి జీవితం గతుకుల రోడ్డు నుండి తారురోడ్డు మీదకు చేరుతుండగా ఓ పెద్ద ట్విస్ట్. వీరిని వెతుక్కుంటూ ఓ ముఠా వస్తుంది. ఈ ఇద్దరూ పిచ్చివాళ్ళని, మెంటల్ హాస్పటల్ నుండి పారిపోయి వచ్చారని, మనుషుల్ని చంపే హంతకులనీ ఆ ముఠా నాయకుడు చెబుతాడు. ఎవరిది నిజం? ఏది నిజం??
శశి, నరేశ్ నిజంగానే పిచ్చివాళ్ళా? వారి పిచ్చితనానికి కారణంఏమిటి? మరి ఆ ఇద్దరు పిచ్చివాళ్ళు, తమ చుట్టుఉన్న వారందరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేయగలిగారు? ఎందుకు ప్రభావితం చేశారు??? అన్నదే మిగతా కథ.
నిజానికి ఇది శశికుమార్ కథ. ఓ గ్రామంలో జరిగే కథ. బహుభార్యత్వం, ఆస్తితగాదాల కారణంగా ఉమ్మడి కుటుంబంలో జరిగిన కుట్రలు కుతంత్రాల వల్ల బాల్యంలోనే శశి జీవితం గాడి తప్పుతుంది. అతని పేరున్న ఆస్తిపాస్తుల్ని దోచుకోవాలని మానసికరోగిని చేస్తారు. యుక్తవయసు వచ్చాక ఆ విషయం గ్రహించి శశి వారిపై ఎదురు తిరిగి పోరాటం చేస్తాడు. అడ్డు వచ్చిన వారిని ఆవేశంతో చంపేస్తాడు. దాంతో సొంత తండ్రి, మారుటి తల్లి, ఆమె తరఫు బంధువులు అతనిపై పిచ్చివాడనే ముద్రవేసి, ఆస్పత్రికి తరలిస్తారు. శశికి అక్కడే నరేశ్ పరిచయం అవుతాడు. నరేశ్‌కున్న ఫిట్స్‌ను సరిగా గుర్తించకుండా మానసిక రోగి కింద జమకట్టేసి ఇంట్లోవాళ్ళు ఆస్పత్రికి పంపేస్తారు. వీరిద్దరూ అక్కడ నుండి పారిపోవడంతో సినిమా మొదలవుతుంది. ఆస్తి కోసం తనని వెతుక్కుంటూ, చంపడానికి వచ్చిన బంధువులకు శశి ఎలాంటి బుద్ధి చెప్పాడన్నదే పతాకం సన్నివేశం.[1]
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ప్రముఖ వీణావిద్వాంసుడు చిట్టిబాబు గారి కుమారుడు సుందర్ సి.బాబు సంగీతం సమకూర్చాడు. వెన్నెలకంటి, చంద్రబోస్‌లు సాహిత్యం అందించారు.
సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "గమ్ గమ్ గణపతి" | వెన్నెలకంటి | ఖుషీ మురళి | 2:11 |
2. | "తొడగొట్టి లేవరా" | చంద్రబోస్ | హనుమాన్, ఎం.ఎం.శ్రీలేఖ | 3:35 |
3. | "ఎవ్వరో ఎవరితడో" (మగ) | చంద్రబోస్ | శంకర్ మహదేవన్ | 5:03 |
4. | "ఎవ్వరో ఎవరితోడో" (ఆడ) | చంద్రబోస్ | బిన్ని కృష్ణకుమార్ | 4:38 |
5. | "ఎవరితడో" | చంద్రబోస్ | బిన్ని కృష్ణకుమార్ | 1:32 |
6. | "సంఘర్షణ థీమ్" (ఇన్‌స్ట్రుమెంటల్) | 2:28 | ||
మొత్తం నిడివి: | 19:27 |
స్పందన
[మార్చు]- "ఎంచుకున్న కథాంశం మంచిదే అయినా, దానిని వెండితెరపై ఆవిష్కరించిన తీరులో స్పష్టత లేకపోవడంవల్ల ప్రేక్షకుల్ని రంజింపలేకపోయింది. అన్ని శారీరక రోగాల వంటిదే మానసిక రోగం కూడా. అయితే మానసిక రోగులను సమాజం దూరంగా పెడుతుంది. వాళ్ళకు అందించాల్సిన కనీస ప్రేమనురాగాలను అందించదు. అందువల్ల ఆ రోగం మరింతగా పెరిగిపోతుంది. దీనిని నివారించాలని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ అంశాన్ని ఆకట్టుకునే విధంగా చూపించలేక పోయాడు. శశికుమార్ నేపథ్యం, అతనిపై కుటుంబ సభ్యులు చేసిన కుట్రలు ఈ కథను వేరొక మలుపు తిప్పాయి. చూసే ప్రేక్షకులలో ఉత్కంఠకు బదులు అయోమయం, అసహనం ఏర్పడేలా చేశాయి. వైవిధ్యమైన సినిమాను అందించామన్న తృప్తి మాత్రమే నిరాతలకు దక్కింది." - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ (ఫిలిం జర్నలిస్ట్) [1]