సత్య నాదెళ్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యనారాయణ నాదెళ్ల
లెవెబ్ 2013 లో సత్య నాదెళ్ల
జననం1967 (age 53–54)
హైదరాబాదు
నివాసంఅమెరికా
జాతీయతప్రవాస భారతీయుడు
చదువుకున్న సంస్థలు

'సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ 'సత్య నాదెళ్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు.[1] సత్య నాదెళ్ల హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రవాస భారతీయుడు. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా ఇతను నియమితులయ్యే అవకాశముందని వార్తలు రావడంతో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు.[2] అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ఇటుంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఈ సంస్థ సీఈఓగా స్టీవ్ బామర్ సుదీర్ఘ కాలం పనిచేశారు.

నేపధ్యం[మార్చు]

ఆయనది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. ఆయన తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు.[3].

విద్యాభ్యాసం[మార్చు]

సత్య ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో చురుగ్గా మెలిగేవాడు.[4] క్రికెట్ అంటే మహా ఇష్టం. స్కూల్ క్రికెట్ జట్టులో సత్య కూడా సభ్యుడే. బృందంతో సమన్వయంగా వ్యవహరించడం, నాయకత్వ లక్షణాలను క్రికెట్ నుంచే నేర్చుకున్నట్లు ఆయన ఇప్పటికీ చెబుతుంటారు. హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 2013 లో జరిగిన పాఠశాల 90వ వార్షికోత్సవంలో కూడా సత్య పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ సహకారంతో ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల కోసం ఓ ప్రాజెక్టును కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ పూర్తి చేశారు.

అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి ఐదేళ్లలోనే కంపెనీ వ్యాపారాన్ని దాదాపు రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 31 వేల కోట్లకు చేర్చారు. కొత్త సవాళ్లను స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తూ ఆ తర్వాత పదేళ్లలోనే కంపెనీలో ఉన్నత స్థానాలను చేరుకున్నారు.

ఆల్ రౌండర్, నిజాయతీపరుడు, సహాయకారి, సాంకేతిక నిపుణుడు, ఆలోచనాపరుడు, దార్శనికుడు, ఆత్మవిశ్వాసం గల నాయకుడు. అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఆయన దిట్ట. సాదాసీదాగా ఉంటారు. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఈ స్వభావాలే ఆయన్ని అందలానికి చేర్చాయంటారు సన్నిహితులు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

తండ్రికి తెలిసిన మరో ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కూతురు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే చదివిన అనుపమను సత్య పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. వాషింగ్టన్లో స్థిర నివాసం. పుస్తకాలు చదవడం, ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేయడంపై సత్య ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే గొప్ప పనులు చేయలేమన్నది ఆయన విశ్వాసం. తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో పాఠశాల పెట్టారు.

కవితలన్నా, క్రికెటన్నా సత్య నాదెళ్లకు చాలా ఇష్టం. క్రికెట్ వల్లే బృంద నాయకత్వం, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని సీఈవోగా తన నియామకం ఖరారైన అనంతరం ఆయన చెప్పారు. అత్యంత సుదీర్ఘంగా సాగే టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ఆసక్తికరమైన మలుపులు తిరిగే ఆటను చూస్తుంటే రష్యన్ నవల చదువుతున్నట్లుగా ఉంటుందని చెప్పారాయన. కవితలైతే రహస్య సంకేతాల్లా అనిపిస్తాయన్నారు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన సాధనాలను మైక్రోసాఫ్ట్ అందిస్తోందని, అది చూశాకే ఆ కంపెనీలో చేరానని చెప్పారాయన. నేను నిర్మించడాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతా. ఇప్పటికీ తరచు బోలెడన్ని ఆన్‌లైన్ కోర్సులు చేస్తుంటా. అప్పట్లో మాస్టర్స్ డిగ్రీ చదివేటప్పుడు ప్రతి శుక్రవారం రాత్రి షికాగోకి వెళ్లేవాణ్ణి. శనివారాలు క్లాసులకు హాజరయ్యి మళ్లీ సోమవారానికల్లా రెడ్‌మండ్ (మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉన్న చోటు)కి వచ్చేసేవాణ్ని. దాదాపు రెండున్నరేళ్లు పట్టింది కానీ మొత్తానికి మాస్టర్స్ డిగ్రీ అలా పూర్తి చేసేశా. కొత్తవి నేర్చుకోవటం ఆపేస్తే మనం ఉపయోగకరమైన పనులు చేయడం మానేసినట్లేనన్నది నా ఉద్దేశం

మైక్రోసాఫ్ట్ ప్రస్థానం[మార్చు]

సత్య 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. రెండావ సీఈవో స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. స్వతంత్ర డెరైక్టర్ జాన్ థాంప్సన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు బిల్ గేట్స్ టెక్నాలజీ సలహాదారుడుగా వ్యవహరిస్తారు. సంస్థ ఉత్పత్తులు, టెక్నాలజీల రూపకల్పనకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెడతారు. ఒకవైపు విండోస్, ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండటం మరోవైపు డివైజ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొంగొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ విస్తరిస్తున్న తరుణంలో సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నాటికి సంస్థ మార్కెట్ విలువ 31,400 కోట్ల డాలర్లు.

మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్‌నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకూ ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 20 బిలియన్ డాలర్ల వ్యాపారమైన సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్‌లైన్ సర్వీసెస్ డివిజన్, బిజినెస్ డివిజన్‌లలో ఆయన గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 38 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన బిల్‌గేట్స్, స్టీవ్ బామర్‌లే ఇంతవరకూ సీఈవోలుగా పనిచేశారు. ఇప్పుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈవో.

మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో .. సంస్థను ముందుంచి నడిపేందుకు సత్యను మించి మరొకరు లేరంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, అందర్నీ ఏకతాటిపైకి తేగలిగే సత్తా గల నాయకుడిగా సత్య తన సామర్థ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటూనే ఉన్నారంటూ గేట్స్ ప్రశంసించారు. మరోవైపు, మైక్రోసాఫ్ట్‌కి సరైన సారథి సత్య అని స్టీవ్ బామర్ పేర్కొన్నారు. ఆయనతో 20 ఏళ్లకుపైగా కలసి పనిచేశానని, మైక్రోసాఫ్ట్‌కి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారన్నారు.

సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌లో సత్య.. అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి.. అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి అంటూ ప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్‌వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజ్‌ల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థా సాధికారత సాధించగలిగేలా చూడగలగడం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నాడు. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అంది పుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరిం తగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కి సీఈవో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా.. నవకల్పనలకే పెద్దపీట దక్కుతుందని సత్య చెప్పారు.

ప్రవాస భారతీయుల స్పందన[మార్చు]

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రథసారథిగా తెలుగుబిడ్డ సత్య నాదెళ్ల ఎంపికకావడం తెలుగువారందరికీ గర్వకారణం అని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, పూర్వ అధ్యక్షులు జయరాం కోమటి, తానా డిట్రాయిట్ మహాసభల కన్వీనర్ గంగాధర్ నాదెళ్ల, తానా కార్యదర్శి సతీష్ వేమన హర్షం వ్యక్తం చేశారు.

మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓ ఎంపిక నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సత్య నాదెళ్ల సామర్థ్యం గురించి, దార్శనికత గురించీ చేసిన వ్యాఖ్యలు ప్రతి తెలుగువాడికీ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయని వారు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో చేరి కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పటినుంచి సత్య నాదెళ్ల సాఫ్ట్‌వేర్ రంగంలోని తెలుగువారందరికీ పరోక్షంగా చిరపరిచితులేనని వారు ప్రశంసించారు. సాంకేతిక ఉన్నత చదువులు చదివిన సత్య ఎంబీఏ కూడా చదవడం మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా ఎదగడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సర్వర్ టూల్స్ నుంచి క్లౌడ్ టెక్నాలజీస్ వైపు మరలుతున్న ఈ చారిత్రక దశలో సత్య నాదెళ్ల వినూత్న ఆవిష్కరణలతో భవిష్యత్ సాంకేతిక నిపుణులకు మరింత ఆదర్శప్రాయునిగా నిలవగలరన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.

జీతభత్యాలు[మార్చు]

మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవోగా ఎంపికైన తెలుగు తేజం సత్య నాదెళ్ల ఏడాదికి జీతంగా 112 కోట్లు నిర్ణయించారు. బోనస్, స్టాక్ అవార్డులు, అన్నీ కలిపి ఈ మొత్తం ఆయనకు అందుతుంది. అయితే బమూల వేతనం రూపంలో మాత్రం ఆయనకు అందేది ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయలు మాత్రమే. మైక్రోసాఫ్ట్ లో 22 ఏళ్లుగా పనిచేస్తున్న సత్య నాదెళ్ల (46)కు 0-300 శాతం వరకు బోనస్ కూడా అందుతుంది. దీంతోపాటు ఈయనకు స్టాక్ పురస్కారాలు కూడా అందుతాయి. ఇవన్నీ కలిపితే ఆయనకు మొత్తం 112 కోట్ల రూపాయలు ఏడాదికి అందుతాయి.

ఆయన వార్షిక వేతనాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం (ఈఐపీ) నిర్ణయిస్తుంది. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయనకు వార్షిక ఈఐపీ స్టాక్ పురస్కారం అందుతుందని నాదెళ్లకు మైక్రోసాఫ్ట్ నుంచి అందిన నియామక పత్రంలో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద అందిన జీతానికి గరిష్ఠంగా మూడు రెట్లు.. అంటే 300 శాతాన్ని వార్షిక నగదు పురస్కారంగా అందిస్తారు. అయితే, ఆయన పనితీరును బట్టి ఎంత శాతం ఇవ్వాలనే విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుందని నియామక పత్రంలో తెలిపారు. ఈ లేఖ నకలుని అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీకి కూడా పంపారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత నాదెళ్ల సత్యనారాయణ ఈ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో అయ్యారు. 2013 సంవత్సరం నాదెళ్లకు దాదాపు పది కోట్ల రూపాయలు నగదు బోనస్ లభించింది.[5][6]

2014 వార్షిక వేతనం[మార్చు]

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 2014 దాదాపు రూ. 505 కోట్ల (84.3 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీ ఆర్జించారు. దీంతో టెక్నాలజీ రంగంలో అత్యధిక జీతభత్యాలు అందుకుంటున్న వారిలో ఒకరిగా నిల్చారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి మైక్రోసాఫ్ట్ సమర్పించిన వివరాల ప్రకారం 2013 ఆర్థిక సంవత్సరంలో ఆయన 7.66 మిలియన్ డాలర్లు. కొత్తగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి సీఈవోగా ప్రమోట్ అయ్యాక ఇది ఏకంగా పది రెట్లు పైగా ఎగిసింది.

తాజాగా ఆయన 9,18,917 డాలర్ల జీతం, 3.6 మిలియన్ డాలర్ల బోనస్‌ను ఆర్జించారు. అలాగే కీలక సమయంలో కంపెనీలోనే కొనసాగుతూ సీఈవోగా ప్రమోట్ అయిన నేపథ్యంలో 79.77 మిలియన్ డాల ర్లు విలువ చేసే స్టాక్స్ ఆర్జించారు. దీర్ఘకాలిక పనితీరు ఆధారంగా ఇందులో 59.2 మిలియన్ డాలర్ల స్టాక్స్ లభిస్తాయి. అయితే, 2019లోగా మాత్రం నాదెళ్ల వీటిని అందుకునే వీలు ఉండదు[7].

మరిన్ని వివరాలు[మార్చు]

 • పెళ్లయిన ఏడాదే మైక్రోసాఫ్ట్‌లో చేరారు.
 • విండోస్ ఎన్‌టీ ఆపరేటింగ్ సిస్టం ప్రాజెక్టులో పనిచేశారు
 • సంస్థకు అత్యధిక లాభాలనిచ్చే సర్వర్ టూల్ బిజినెస్, అత్యధిక నష్టాలనిచ్చే బింగ్ బిజినెస్ రెండింటి బాధ్యతలూ నిర్వహించడం విశేషం.
 • భవిష్యత్తు ప్రపంచ టెక్నాలజీగా భావిస్తున్న 'క్లౌడ్' (ప్రత్యేకంగా 'అజూర్')పై పూర్తి పట్టుంది.
 • టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు ఇష్టంగా చూస్తారు.
 • సత్య తల్లి పేరు ప్రభావతి. తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే ఉంటారు. సత్య కుటుంబం ఏడాదికోసారి హైదరాబాద్ వస్తుంది.
 • సత్య, మరో ఇద్దరు రచయితలతో కలిసి హిట్ రిఫ్రెష్ అనే పుస్తకాన్ని రచించాడు
 • సత్యను 'ఫార్చ్యూ' 2019 ఏడాదికి మేటి వ్యాపార వేత్తగా ప్రకటించి సన్మానించింది.#ఈనాడు ఆదివారం 2019 డిసెంబరు 29.

బయటి లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు[మార్చు]

 1. http://online.wsj.com/news/articles/SB10001424052702304851104579362603637152172
 2. http://www.microsoft.com/en-us/news/press/2014/feb14/02-04newspr.aspx
 3. "'Studious, hardworking boy has achieved his goal,' says Satya Nadella's dad". TimesOfIndia. February 5, 2014 - 07:35 IST. Retrieved February 05, 2014. Check date values in: |accessdate= and |date= (help)CS1 maint: discouraged parameter (link)
 4. "Satya Nadella's story to inspire youngsters with humble backgrounds". daijiworld.com. February 5, 2014 - 07:35 IST. Retrieved February 05, 2014. Check date values in: |accessdate= and |date= (help)CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
 5. "Microsoft's new CEO Satya Nadella to get $1.2 mn salary; total package at $18 mn". NDTV.com. February 05, 2014 16:55 IST. Retrieved February 05, 2014 16:55 IST. Check date values in: |accessdate= and |date= (help)CS1 maint: discouraged parameter (link)
 6. "Satya Nadella's base salary 70% more than Ballmer's". TimesOfIndia. February 05, 2014 16:55 IST. Retrieved February 05, 2014 16:55 IST. Check date values in: |accessdate= and |date= (help)CS1 maint: discouraged parameter (link)
 7. http://www.computerworld.com/article/2836459/nadellas-2014-comp-package-tops-84m.html