Jump to content

సిక్కుమతం

వికీపీడియా నుండి
(సిక్ఖు మతం నుండి దారిమార్పు చెందింది)
హర్ మందిర్ సాహెబ్, స్వర్ణ మందిరం పేరుతో. సిక్కుల పవిత్ర క్షేత్రం.

సిక్కు మతం (ఆంగ్లం : Sikhism) (పంజాబీ ਸਿੱਖੀ ), గురునానక్ ప్రబోధనల ఆధారంగా ఏర్పడిన మతం. ఏకేశ్వరోపాసన వీరి అభిమతం. సిక్కు మతంలో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహిబ్ లేదా ఆది గ్రంథం లేదా ఆది గ్రంథ్. వీరి పవిత్ర క్షేత్రం అమృత్ సర్ లోని స్వర్ణ మందిరం.ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు (భారతదేశం, పాకిస్తాన్) లలో నివసిస్తుంటారు., ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.[1]

చరిత్ర

[మార్చు]

శిక్కు మతం, కాలంలో చూస్తే చాలా చిన్నది. దీని వయస్సు లూధర్ మతానికున్న వయస్సు ఎంతో అంత. దీనిని పదిహేనవ శతాబ్దంలో గురునానక్ స్థాపించాడు. గురునానక్ తల్వాండి (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది) లో 1469 లో జన్మించాడు. గురునానక్ చిన్నప్పుడు నుండి ఎక్కడో చూస్తుండేవాడు. దేనిని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుండేవాడు. అందువల్ల పెరిగి పెద్దవాడయ్యాక గూడా అతడికి ఈ ప్రాపంచిన విషయాలు రుచింవ లేదు. అతడు 1539 లో చనిపోయాడు.

గురునానక్

[మార్చు]
శిక్కు మత స్థాపకుడు గురునానక్ యితడు 11 సిక్కుగురువులలో ఒకడు.11 వ గురువు గురుగ్రంథ సాహిబ్

అతడికి హిందూ, ఇస్లాం మతాల మధ్య పెద్ద తేడాలు కనిపించలేదు. పైగా రెండింటి మధ్య ఎంతో సామ్యాన్ని చూశాడు. అందుకని రెండు మతాలనూ ఒక తాటి క్రిందకు తేవాలనుకున్నాడు. కర్మ కాండకు, కుల వ్యవస్థకు, మత మౌడ్యానికీ వ్యతిరేకంగా బోధిస్తూ ఇండియా అంతటా తిరిగాడు. మక్కా - మదీనా ల దాకా యాత్రలు చేశాడు. "హిందువు లేడు, ముస్లిం లేడు - ఇద్దరూ వేరుకాదు అన్నాడు"

అయనికి ఎంతో మంది అనుచరులు ఏర్పడ్డారు. అంతిమంగా అందులో నుంచి అంగదుడనేవాడిని తన వారసుని గావించుకున్నాడు. అంగదుడు రెండవ గురువయ్యాడు. ఇతడు నానక్ రచనలన్నింటినీ ప్రోగుచేసి క్రమబద్ధం చేశాడు. నానక్ వలె ఇతడూ తన వారసుని ఎంపిక చేశాడు.

శిక్కుమత గుర్తింపుకు "అర్జున్" కృషి

[మార్చు]

నాలుగవ గురువు రామదాసు. అమృత్ సర్ దేవాలయానికి పునాదులు వేశాడు. అతని కొడుకు, వారసుడూ అయిన అర్జున్ ఈ దేవాలయానికి చాలా ప్రశస్తి కల్పించాడు. ఈనాడు శిక్కులకది ఎంత పవిత్రమైనదో, అంత పవిత్రత సంతరించుకోవడానికి అర్జునే కారకుడు

ఇతడు చేసిన మరో గొప్ప పని "గ్రంథసాహిబ్"ను నిర్మించటం. అంతకు ముందరి గురువులందరి రచనలను, హిందూ ముస్లిం రచనలను, వీటికి తోడు తన రచనలనూ కలిపి గ్రంథ సాహిబ్ ను కూర్చాడు. వారు హిందూ ముస్లిం లను అభిమనించినా, వారి గ్రంథాల కంటే, గ్రంథ సాహిబ్ వారికి పవిత్ర గ్రంథమైంది. ఇది తరువాత వారికి పూజా వస్తువు అయింది. అర్జున్ మరో రెండు దేవాలయాలు కూడా నిర్మించాడు కాని, వాటిని మొగల్ చక్రవర్తి జహంగీర్ నాశనం చేసాడు. అర్జున్ కు ముందు హిందూ, ఇస్లాం, శిక్కు మతాల మధ్య తేడాను పెద్దగా పట్టించుకొనె వారుకాదు శిక్కులు. కాని అర్జున్ ఈ మతాల మధ్య తేడాలని నొక్కి చెప్పి శిక్కు మతాన్ని వేరుగా గుర్తించేట్టు చేశాడు.

గురునానక్, అర్జున్ ల తరువాత శిక్కుమతాన్ని అత్యంతంగా ప్రభావితం చేసినవాడు గురుగోవింద సింగ్. ఇతడు పదవ గురువూ, గురువులలో చివరివాడు. ఇస్లాం మతం స్వీకరించనందుకు ఇతని తండ్రిని ఒక మొగలాయి చక్రవర్తి చంపించాడు. గోవింద సింగ్ శిక్కులను సైనిక శక్తిగా పరివర్తితం చేయాలనుకున్నాడు. అతడు వ్యక్తిగతంగా పెద్ద వీరుడు కాక పోయినా, మొత్తం మీద శిక్కులను వీర సైనికులుగా మార్చడంలో సఫలుడయ్యాడు. తన అనుచరులందరిని "ఇంటి పేరులు" వదిలివేసి, పేరు చివర "సింగ్" (సింహం) తగిలుంచుకోమన్నాడు. స్త్రీలను తమ చివరి పేరుగా కార్ (రాకుమారి) తగిలించుకోమన్నాడు. చాలా మంది హిందూ వీరులకు కూడా ఇంటిపేరు "సింగ్" ఉంది. అందుకని ఇంటి పేర్లును ఎత్తి వేయించాడు. ప్రతి శిక్కూ సింగే కాని, ప్రతి సింగూ సిక్కు కాడని గమనించాలి.

పంచ "క" కారాలు

[మార్చు]

ఇతడు పంచ "క" కారాలను శిక్కులకు ఆవశ్యం చేశాడు. మొదటి "క" కారం కేశాలకు సంబంధించింది. తలపై కాని, గడ్డం పై గాని కేశ ముండన క్రియ జరపరాదు. రెండవది "కంఘ" ధారణ. అంటే జుట్టులో ఎప్పుడూ దువ్వెన ఉంచుకోవాలి. మూడవది రెండు "కభాల"ను ధరించాలి. అభాలంటే పొట్టిలాగులు - డ్రాయర్లు. ఇలా ధరిస్తే తేలికగా కదలడానికి వీలవుతుంది. నాలుగవది కుడి మణి కట్టుకు "కడా" లేదా "కరా"ను (ఉక్కు కడియాన్ని) ధరించాలి. ఇది బలం కోసం, ఆత్మ నిగ్రహం కోసం, ఐదవది "కృపాణ" ధారణ. ఇది ఆత్మ రక్షణ కోసం. ఇంకా ఇతడు ధూమ, మదిరపానాలను నిషేధించాడు. ఈ విధంగా ఇతడు శిక్కులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా మలచాడు. తలపాగా, గడ్డంలో వారికి ఒక ప్రత్యేకతను - చూడగానే శిక్కులని తెలిసేట్టు - కల్పించాడు.

ఇతర గురువులు

[మార్చు]

గురుగోవింద సింగ్ ఇంతా చేసి, తన తరువాత వారసుడెవడో చెప్పలేదు. "ఇక ఇక్కడి నుండి గురువులెవరూ ఉండరు. పవిత్ర గ్రంథం దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది." అన్నాడు. అతడు తన రచనలను అందులో చేర్చలేదు. అతని రచనలను "దశమ గ్రంథ్" అన్నారు. "గ్రంథ సాహిబ్" లాగ దీనిని పవిత్ర గ్రంథంగా చూడరు గాని, బాగా ఆదరిస్తారు. అంతిమంగా, అతడు ముస్లిం ల చేతిలో మరణించాడు. కాని అతడి ప్రభావం శిక్కుమతం మీద అంత ఇంత కాదు.

శిక్కు మతానికి మొత్తం పది మంది గురువులున్నారు. గురునానక్, గురు అంగదేవ్, గురు అమర్దాన్, గురువు రామదాసు, గురు అర్జున్‌దేవ్, గురు హర్గోవింద్, గురు హర్‌రాయ్, హరికిషన్, గురు తెజ్ బహదూర్, గురు గోవింద సింగ్ లు.

బోధలు

[మార్చు]

శిక్కులకు దేవుడు అమూర్తి సత్యసూత్రం. దీనినే వారు విశ్వసిస్తారు. " ఇది అనేకం కాదు ఒక్కటే" విశ్వాంతర్యామి. పుట్టదు. గిట్టదు. తిరిగి పుట్టడానికి ఇదే వారి ప్రార్థన. మూడవ గురువు ఇలా అన్నాడు

అపూర్వ దేవతలను పూజించావారి
జీవితాలు, నివాసాలు అభిశప్తాలవుతాయి
వారి అన్నం - ప్రతిముద్ద - విషపూరితమవుతుంది
వారి దుస్తులు విషమయాలవుతాయి
వారిజీవితాలు కడగండ్ల పాలవుతాయి
తదనంతర జీవితం నరకం

ఇస్లాం లోని దైవాధీనతా వాదాన్ని బహిరంగంగానే వీరు నిరసించారు. "మీ జాతకాలను నిర్దేసించేది దేవుడు కాదు. మీ భవిష్యత్తును మీరే మలచుకోండి" అన్నాడు గురునానక్. శిక్కు మతం పునర్జన్మలను, కర్మవాదాన్ని అంగీకరిస్తుంది. కాని ఒకడు పునర్జన్మ శృంఖలాలనుంచి బయటపడాలంటే, ముక్తి పొందాలంటే, అతడు మానవుడు కావాలి. మనిషి అయితే (మానవత్వం ఉన్న) మోక్షం లభిస్తుంది. ఒకరు 8,400,000 జీవరూపాలను ఎత్తిన (జైన మతం ప్రకారం) తరువాత మోక్షం లభిస్తుందా. లెక తన వెలుగు దేవుని వెలుగులో మిళితం చేయడంతో ముక్తి లభిస్తుందా అనే విషయం అతడి జీవితం (మానవ జీవితం) నిర్ణయిస్తుంది.

మంత్ర పఠనం చేస్తూ "సత్ నాం, వహ్ గురు" (నిజమైన నామం అద్భుత గురువు) ను జపించడానికి శిక్కుమాంలో మంచి ప్రాముఖ్యం ఉంది. కాని గురువులు కేవలం మానవులు పదవ గురువు ఇలా అన్నాడు.

నేనొక మతాన్ని స్థాపించి, దాని నియమాల
నేర్పరుప నియుక్తుడయ్యాను
నన్నెవడైనా దేవునిగా భావిస్తే
అతడు అశక్తుడవుతాడు, వినాశమవుతాడు

వారి మతంలో మానవ పూజ లేదు., ఏదైనా పూజింపబడితే అది ఒక పుస్తకం. "గ్రంథ సాహిబ్". ప్రత్యేక సమయాలలో దీనిని అట్ట నుంచి అట్ట వరకు చదువుతారు. కొన్ని గృహాలలో నిత్యం ఈ గ్రంథ భాగాలు పారాయణం చేయబడతాయి.

స్వర్ణ దేవాలయం

[మార్చు]
మహారాజా రంజిత్ సింగ్

శిక్కుల పరమ పవిత్రమైన బంగారు దేవాలయం ఒక నలు చదరపు మడుగు మధ్య ఉంది. చుట్టూ భవన పరివేష్టితమైన విశాల ప్రాంగణం ఉంది. నీరు గుడి గోడలను తాకి వుంటుంది. గుడిని చేరటానికి థరనం ఉంది. ఈ థరణం పొడవు 2000 అడుగులు.

శిక్కులు కులం వ్యవస్థను గర్హించారు. భోజనానికి సంబంధించిన కుల ఆంక్షలను తీవ్రంగా నిరసించారు. ఈ విషయంలో గురువులు సఫలులు కాలేదు. ప్రస్తుతం శిక్కులలో ఉన్న కుల వ్యవస్థ వారిని మూడు వర్గాలుగా విభజిస్తుంది. (1) వ్యవసాయదారులు (జాట్‌లు) (2) వ్యవసాయదారులు కానివారు (3) హరిజనులు. నేటికీ హరిజనులను తేడాగానే చూస్తున్నారు. ఈ మతం ఎక్కువగా పంజాబ్ లో ఉంది. హిందువులతో కలిసి వుండటం వల్ల, ఆ ప్రభావం వీరిపై పడింది. ఆ ప్రాంతాలలో హిందువులు గురువులను గౌరవ భారంతో చూస్తారు. తరువాతవారి బిడ్డలలో ఒకరిద్ధరిని శిక్కులుగా పెంచుతారు. ఇంకా వీరికి ఇచ్చి పుచ్చుకోవడాలు ఉన్నాయి. బహుశా ఈ రకమైన హిందూ శిక్కు వివాహాలు, "కులం' శిక్కు మతంలోకి తిరిగి ప్రవేశించటానికి కారనమై ఉండవచ్చు. గోమాంస భక్షణం పై నిషేధం ఈ కారనంగానే తిరిగి ప్రవేశించి ఉండవచ్చు. ఇదే కారణంగా హిందూ ఆచారాలు, కర్మకాండ శిక్కు మతంలో ప్రవేశించాయి. ఉదాహరణకు 1839 లో రంజిత్ సింగ్ అనే పాలకుడు చనిపోయినపుడు అతని రాణులను అతని శవంతో దహనం చేశారు. ఇది "సతీ సహగమనం" ఆచారం, హిందువులది. చిత్రమేమిటంటే అతని పాలనలో అతడెప్పుడూ ఎవరికీ మరణ శిక్ష విధించలేదు. అతడు చనిపోయిన తరువాత హిందూ ఆచారం అతని రాణులకు ఈ విధంగా మరణ శిక్ష విధించింది.

నమ్మకాలు

[మార్చు]

సిక్కులు విగ్రహారాధన చెయ్యరు. వారు ఏక్ ఓంకార్ (ఏకైక దైవం) ని నమ్ముతారు. సిక్కులు తమ గురువుల్ని దేవుని సందేశహరులుగా భావిస్తారు. సిక్కుల గురువులు తమ మతం హిందూ మతం తరహా మతం అని చెప్పుకున్నారు కానీ సిక్కు మతానికి, హిందూ మతానికి మధ్య చాలా తేడా ఉంది. సిక్కులు స్వర్గ నరకాలని నమ్మరు. స్వర్గ నరకాలు లేకపొతే కర్మ సిధ్ధాంతాలని నమ్మడం కూడా కష్టమే. సిక్కులు మీరు చేసిన ప్రతి కర్మకు (ప్రతిపనికీ) అది మంచి అయినా చెడు అయినా దాని ఫలితం మీరే అనుభవించాల్సి వుంటుంది అని దాని నుంచి తప్పించుకోవడం అసాథ్యం అని నమ్ముతారు. వీరి కర్మ సిద్దాంతంలో అయోమయంలేని ఎంతో లోతైన అవగాహన కనిపిస్తుంది.

సిక్కుగురువులు

[మార్చు]
# పేరు పుట్టిన తేదీ గురువుగా స్వీకారం స్వర్గస్థులైన తేదీ వయస్సు
1 గురునానక్ 15 ఏప్రిల్ 1469 20 ఆగష్టు 1507 22 సెప్టెంబర్ 1539 69
2 గురు అంగద్ 31 మార్చి 1504 7 సెప్టెంబర్ 1539 29 మార్చి 1552 48
3 గురు అమర్ దాస్ 5 మే 1479 26 మార్చి 1552 1 సెప్టెంబర్ 1574 95
4 గురు రామదాస్ 24 సెప్టెంబర్ 1534 1 సెప్టెంబర్ 1574 1 సెప్టెంబర్ 1581 46
5 గురు అర్జన్ 15 ఏప్రిల్ 1563 1 సెప్టెంబర్ 1581 30 మే 1606 43
6 గురు హరగోవింద్ 19 జూన్ 1595 25 మే 1606 28 ఫిబ్రవరి 1644 48
7 గురు హరరాయ్ 16 జనవరి 1630 3 మార్చి 1644 6 అక్టోబర్ 1661 31
8 గురు హరక్రిష్ణ 7 జులై 1656 6 అక్టోబర్ 1661 30 మార్చి 1664 7
9 గురు టెగ్ బహాదూర్ 1 ఏప్రిల్ 1621 20 మార్చి 1665 11 నవంబర్ 1675 54
10 గురు గోవింద సింగ్ 22 డిసెంబర్ 1666 11 నవంబర్ 1675 7 అక్టోబర్ 1708 41
11 గురు గ్రంధ సాహిబ్ తెలియదు 7 అక్టోబర్ 1708 తెలియదు తెలియదు

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Adherents.com. "Religions by adherents". Archived from the original (PHP) on 2011-12-29. Retrieved 2007-02-09.

బయటి లింకులు

[మార్చు]