సి.హెచ్.మోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.హెచ్.మోహనరావు
సి.హెచ్.మోహనరావు
జననంJanuary 19, 1954
హుజూరాబాద్,ఆంధ్రప్రదేశ్, భారత దేశము.
నివాసం India
జాతీయత Indian
రంగములుజీవ శాస్త్రము
వృత్తిసంస్థలుCenter for Cellular and Molecular Biology
చదువుకున్న సంస్థలుNational Eye Institute, University of Hyderabad, Kakatiya University

సీహెచ్‌.మోహనరావు ప్రముఖ జీవ వైద్య పరిశోధకుడు.[1] జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్తలకు సామాజిక బాధ్యత ఉండాలనే మోహన రావు జనవిజ్ఞాన వేదిక ద్వారా ఎన్నో గ్రామాల్లో పర్యటించి విద్యార్థుల్లో సైన్సు పట్ల అవగాహన కలిగిస్తున్నారు. మూఢనమ్మకాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్‌.[2] గా యున్నారు.

బాల్యం, విద్య[మార్చు]

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన ఈయన ఇంటర్ వరకూ అక్కడే చదువుకున్నారు.

జీవిత విశేషాలు[మార్చు]

స్కూళ్లలో ఎప్పుడు వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రథముడుగా ఉండేవారు. సైన్సు అంటే ఆసక్తి ఉందని... 6, 7, 8 తరగతుల్లో స్పష్టంగా తెలియడం, ఇంటి పరిస్థితులూ ఆయనను ప్రోత్సహించాయి. తన తండ్రి డాక్టర్‌ శేషగిరిరావు లైసెన్స్‌డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌. శస్త్రచికిత్సలూ చేసేవారు. వృత్తిరీత్యా పరీక్షలు చేయడానికి ఇంట్లోనే ప్రయోగశాల ఉండేది. అందులోంచి కొన్ని టెస్టుట్యూబులను వాడేవాడు.

తన మాటల్లో[మార్చు]

అప్పట్లో 'శాస్త్రజ్ఞులు అవుతారా?' అనే పుస్తకం చదివాడు. అందులో ఎందరో శాస్త్రవేత్తల చిన్నప్పటి విశేషాలూ; భాస్వరం, సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, విటమిన్లు... వంటివాటికి సంబంధించిన సమాచారమూ ఉంది. భాస్వరం గురించి చదువుతున్నప్పుడు దాని స్వభావం చిత్రంగా అనిపించింది. దాన్ని బయటపెడితే కాలిపోతుంది. నీటిలోనే ఉంచాలి. అందుకే భాస్వరాన్ని చూడాలనిపించి, స్కూల్‌ ల్యాబ్‌లో అడిగాను. లేదన్నారు. ఎక్కడ ఉంటుందాని ఆరాతీస్తే ఎముకల్లో కాల్షియం ఫాస్పేటుగా ఉంటుందని తెలిసింది.

ఎముకల కోసం వూరిబయట శ్మశానంలో వెతికా. వాటినుంచి భాస్వరం తీయాలంటే సల్ఫ్యూరిక్‌ ఆమ్లం కావాలి. 'గంధకం కాల్చినప్పుడు సల్ఫర్‌ డయాక్సైడ్‌ వస్తుంది. దాన్ని నీళ్లలో కరిగిస్తే సల్ఫ్యూరిక్‌ ఆమ్లం వస్తుంది' - ఇదీ మా పాఠ్యపుస్తకాల్లో చెప్పింది. ఆయుర్వేద మందులషాపుల్లో గంధకం అడిగి, కాల్చాను. ఈ వాయువును నీళ్లలో కరిగిస్తే సల్ఫ్యూరిక్‌ ఆమ్లం రాలేదు. ఎన్నిసార్లు చేసినా అంతే. నిజానికి సల్ఫర్‌ డయాక్సైడ్‌ని నీళ్లలో కరిగిస్తే సల్ఫ్యూరస్‌ ఆమ్లం వస్తుంది. సల్ఫ్యూరిక్‌ ఆమ్లం రావాలంటే వేరే పద్ధతి ఉంది. పుస్తకాల్లో తప్పుగా ఇచ్చారు. అప్పట్లో డైనవోలు, వోటార్లు చేయడం అంటే చాలా ఆసక్తి ఉండేది. వోటార్లకు విద్యుదయస్కాంతాలు కావాలి. వాటిని ఎలా చేయాలో పుస్తకాల్లో చదివి, అలాగే చేశా. నాకు షాక్‌కొట్టింది. మా ఇంట్లో ఫ్యూజు పోయింది. స్కూలు పుస్తకాల్లో ఇచ్చింది తప్పు అని తెలుసుకోవడానికీ, విద్యుదయస్కాంతం చేయడానికీ నాకు ఆరేడు నెలలు పట్టింది.

నేను పదోతరగతికి వచ్చేసరికే వోటార్లు, దీపావళి రాకెట్లు, భాస్వరం, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం (బట్టలకు రంగులు వేయడానికి ఉపయోగిస్తారు)... ఇవన్నీ తయారుచేసేశాను. అదే టర్నింగ్‌పాయింట్‌.. ఇంటర్‌... నా జీవితంలో టర్నింగ్‌పాయింట్‌. వూళ్లో మాదే వెుదటి బ్యాచ్‌. అందువల్ల హైస్కూలునే కాలేజీగా మార్చారు. స్కూలు టీచర్లే ఇంటర్‌లో లెక్చరర్లు! మా స్కూలుకు దగ్గర్లో బేసిక్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ ఉండేది. అది టీచర్లకు శిక్షణ కోసం ఏర్పాటుచేసింది. దాన్నే మాకు ల్యాబ్‌గా ఇచ్చారు. ఎద్దులబండ్లలో ఎంతో జాగ్రత్తగా పరికరాలను తీసుకెళ్లాం. నేను చేసిన ప్రయోగాల గురించి తెలిసి, ల్యాబ్‌ బాధ్యత నాకే అప్పగించారు. దాంతో... ఆ రెండేళ్లూ నేను చేయాలనుకున్న ప్రయోగాలన్నీ చేశాను.

ఓసారి పుస్తకంలోని బొమ్మ ప్రకారం అన్నీ అమర్చాం. కానీ, ఆ బొమ్మ తప్పుగా ఉంది. మాకు తెలియలేదు. దాంతో ల్యాబ్‌లోని సెటప్‌లన్నీ పేలిపోయాయి. తరువాత కారణాలు తెలుసుకుని కరెక్ట్‌గా చేశాం. అలా చాలాసార్లు మా ల్యాబ్‌లో చిన్నసైజు పేలుళ్లు జరిగాయి. ఫస్టియర్‌లో నేనే కాలేజీ ఫస్ట్‌. కానీ, రెండో ఏడాది థర్డ్‌క్లాస్‌ వచ్చింది. 1969-71లో తెలంగాణ ఉద్యమం జోరుమీద ఉండేది. నేను టెన్త్‌లో ఉన్నప్పుడే అది ప్రారంభమయింది. స్కూలుకు సెలవులిచ్చినా ఎలాగోలా చదివి పాసయ్యా. ఇంటర్‌ ఫస్టియర్‌లో బాగా చదివా. ఉద్యమంవల్ల రెండో ఏడాది క్లాసులు సరిగ్గా జరగలేదు. ఎంతోమంది చూసిరాత రాశారు. కానీ నాకు మనసొప్పలేదు.

డిగ్రీ అంతా అధ్యయనమే--ఇంటర్‌ తరువాత వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీలో ఆలస్యంగా చేరాను. డిగ్రీలో అన్ని విద్యార్థి సంఘాల్లోనూ ఉండేవాణ్ణి. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొని పోలీసులాఠీల దెబ్బలు తిన్నాను. నాకు ప్రాచీన విజ్ఞానం అంటే ఎంతో ఇష్టమూ గౌరవమూ. బీఎస్సీలో ల్యాబ్‌లో ప్రయోగాలు తక్కువ. చదవడమే ఎక్కువ. ఖాళీ దొరికితే వరంగల్‌లోని సెంట్రల్‌ లైబ్రరీలో పుస్తకాల ముందు కూర్చునేవాణ్ణి. డిగ్రీలో రెండోభాషగా సంస్కృతం తీసుకున్నా. అందులో భాగంగా ప్రాచీన భారత చరిత్ర చదివా. దాన్ని వోడ్రన్‌ సైన్స్‌తో అనుసంధానించేవాణ్ణి. ఆయుర్వేదం, సంఖ్యాశాస్త్రం, ప్రాచీన రసాయనశాస్త్రం... ఇలా ఎన్నో అంశాలపై అధ్యయనం చేశా.

బీఎస్సీలో ఉన్నప్పుడే ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్‌లో చేరా. వరంగల్‌లోని మామనూరులో బ్రిటిష్‌ వాళ్లు ఏర్పాటుచేసిన ఓ ఎయిర్‌ఫీల్డ్‌లో పవర్‌గ్త్లెడింగ్‌ చేసేవాళ్లం. అప్పుడు ఫ్లయింగ్‌ ఫిజిక్స్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నా. బీఎస్సీ థర్డ్‌ ఇయర్‌లో జగన్మోహన్‌రెడ్డిగారు వైస్‌చాన్సలర్‌ అయ్యాక చాలా మార్పులొచ్చాయి. హాజరు తప్పనిసరి చేశారు. మాస్‌కాపీయింగ్‌ పనికిరాదన్నారు. దాంతో విద్యార్థులు పరీక్షలు రాయమన్నారు. అప్పుడాయన ఓ అవకాశం ఇచ్చారు. 'చదివి రెడీగా ఉన్నవాళ్లు ఇప్పుడే పరీక్షలు రాయెచ్చు. చదవనివాళ్లు హాల్‌టిక్కెట్లు ఇచ్చేయండి. ఆరునెలల తరువాత పరీక్షలు పెడతాం' అని రేడియోవార్తల్లో చెప్పారు. మిగతావాళ్లంతా పరీక్షలు బాయ్‌కాట్‌ చేద్దాం అన్నారు. నేనూ మరికొందరు స్నేహితులూ మాత్రం పరీక్ష రాయడానికి వెళ్లాం. తరువాత మిగతావాళ్లూ వచ్చారు. బీఎస్సీలో నేనే కాలేజ్‌ ఫస్ట్‌. ఎమ్మెస్సీలో ఫిజికల్‌ కెమిస్ట్రీ చేసి, తరువాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశాను. క్లోరోక్విన్‌ మందు ఇచ్చినప్పుడు మలేరియా ఎలా తగ్గుతుంది అనే అంశంపై పరిశోధనలు చేసి, ఓ పేపర్‌ ప్రచురించాను. నా మొట్టమొదటి బయాలజీ పేపర్‌ అది. దాన్ని 'సైన్స్‌'లో ప్రచురించారు. అదో గొప్ప విజయం. దాంతో నాకు మంచి అవకాశాలొచ్చాయి.

ఇజ్రాయెల్‌ మాజీ అధ్యక్షుడు కచాల్‌స్కి ఓసారి మనదేశ పర్యటనకు వచ్చినప్పుడు సీసీఎంబీని సందర్శించారు. ఆయన రాజకీయ నాయకుడేకాదు, గొప్ప శాస్త్రవేత్త కూడా. అధ్యక్షుడయ్యాక పరిశోధనలు చేయలేకపోయారు. 'పరిశోధనలు ఎందుకు వదిలేశారు సార్‌. ఇంకా ప్రయోగాలు చేస్తే నోబెల్‌ బహుమతి వచ్చేది కదా' అన్నాన్నేను. అప్పుడాయన 'పరిశోధనైనా పదవైనా దేశం కోసమే కదా. ల్యాబ్‌కి దూరమైనందుకు నాకేం బాధలేదు' అన్నారు. పరిశోధనలూ సైన్సుకు సామాజిక బాధ్యతా లాంటి విషయాలపై మేం చాలాసేపు చర్చించుకున్నాం. నిజమే... శాస్త్రవేత్తలకు సామాజిక బాధ్యత ఉండాలి. ప్రతి శాస్త్రవేత్తా ప్రకృతిని శోధించి, అవగాహన చేసుకోవాలి. ఆ విజ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగపడేలా కృషిచేయాలి. శాస్త్రవేత్త అంటే... ఓ గొప్ప హోదా, గౌరవం.

అనుభవాలు, పరిశోధనలు[మార్చు]

పీహెచ్‌డీ చేశాక అమెరికా, ఫ్రాన్స్‌ వంటి దేశాలకు వెళ్లి, పోస్ట్‌డాక్టరల్‌ వర్క్‌ చేస్తారందరు. నాకూ అమెరికాలో ఆఫర్లు వచ్చాయి. వెళ్దామనుకునేలోపే సీసీఎంబీలో ఉద్యోగావకాశం వచ్చింది. 'నువ్వు తయారుచేసిన పరిజ్ఞానాన్ని ఇక్కడే అభివృద్ధి చేద్దాం. మనదేశానికి ఉపయోగపడుతుంది' అని సీసీఎంబీ అధికారులు చెప్పారు. అప్పట్లో సీసీఎంబీలో సౌకర్యాలూ అవీ లేకపోయినా నేను ఇక్కడ ఉండిపోవడానికే నిర్ణయించుకున్నాను.

సీసీఎంబీలో వివిధ స్థాయిల్లో పనిచేశాను. యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో, ఒసాకా యూనివర్సిటీలకు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వెళ్లాను. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌, గాల్వెస్టన్‌లోని మెడికల్‌ సైన్సెస్‌కు విజిటింగ్‌ సైంటిస్ట్‌గా వెళ్లాను. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, ఐ ఇన్‌స్టిట్యూట్‌లలో విజిటింగ్‌ అసోసియేట్‌గా పర్యటించి, అక్కడి శాస్త్రవేత్తలతో కలసి అనేక పరిశోధనల్లో పాలుపంచుకున్నాను.

మొదట్లో ఫిజికల్‌ కెమిస్ట్రీకే పరిమితమైన నేను తరువాత్తరువాత కంప్యూటర్స్‌, నానో టెక్నాలజీ, వైద్యశాస్త్రం... ఇలా అనేక రంగాల్లో పనిచేశాను, ఇప్పటికీ చేస్తున్నాను. 'శాంతిస్వరూప్‌ భట్నాగర్‌' అవార్డు[3] నాకు 'మెడికల్‌ సైన్స్‌'లోనే వచ్చింది.

క్యాటరాక్ట్‌ పరిశోధనలు[మార్చు]

మిగతాదేశాలతో పోలిస్తే మనదేశంలోనే క్యాటరాక్ట్‌ సమస్య ఎక్కువ. ఇందుకు మూడు కారణాలున్నాయి. మనదేశంలో చిన్నపిల్లలకు డయేరియా ఎక్కువగా వస్తుంది. దానివల్ల కళ్లపైనా ప్రభావం పడుతుంది. రెండోది సూర్యకాంతి. ఇతర దేశాలతో పోలిస్తే మనకు సూర్యకాంతి చాలా ఎక్కువ. మనం కళ్లజోళ్లూ టోపీలూ పెట్టుకోం. అందువల్ల కాంతి నేరుగా కంట్లోకి వెళ్లి త్వరగా క్యాటరాక్ట్‌ వస్తుంది. పల్లెటూళ్లలో కట్టెలనుంచి వచ్చే పొగవల్ల కూడా ఇది వస్తుంది. క్యాటరాక్ట్‌కి శస్త్రచికిత్స మాత్రమే ఉంది. మందులు కనిపెట్టలేదు. మనలాంటి దేశాల్లో అందరికీ శస్త్రచికిత్స చేయించుకునే స్తోమత ఉండదు. అందుకే చుక్కలమందు కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. కళ్లమీద పరిశోధనలు చేస్తున్నప్పుడు కంట్లో ఉండే ప్రొటీన్ల గురించీ తెలుసుకున్నాం. అవి చెడిపోయినప్పుడు క్యాటరాక్ట్‌ వస్తుంది. చెడిపోకుండా ఉంచగలిగితే క్యాటరాక్ట్‌ రాకుండా చేయెచ్చు కదా అనుకున్నాం. అయితే అవే ప్రొటీన్లు గుండె, కండరాలూ, మూత్రపిండాల్లోనూ ఉంటాయి. అవి చెడిపోతే మూత్రపిండాలు చెడిపోతాయి, గుండెపోటు వస్తుంది. అవి చెడిపోకుండా ఏం చేయగలమా అని ఆలోచించాం. అణుజీవశాస్త్రంలోని ఓ టెక్నిక్‌ ఉపయోగించి, ఒక బయోమాలిక్యూల్‌ తయారుచేశాం. అది మామూలు అణువుకంటే చురుగ్గా ఉంటుంది. పాడైన కణాలనూ బాగుచేస్తుంది. దీనికి పేటెంట్‌ కూడా తీసుకున్నాం. కానీ, దాన్ని ఎలా ఉపయోగించాలో ఇంకా తెలియదు. ప్రొటీన్లు తింటే జీర్ణం అయిపోతాయి. పాలు, గుడ్డులోని తెల్లసొన, పాము విషం... ఇవన్నీ ప్రొటీన్లే. నేరుగా తింటే ఏమీకాదు. కానీ, ఇంజెక్ట్‌ చేస్తే చాలా ప్రమాదం. అందుకే మా బయోమాలిక్యూల్‌ని నానోటెక్నాలజీ ద్వారా పంపాలని ప్రయత్నాలు చేస్తున్నాం.

సరికొత్త వరి వంగడాలు, డయాగ్నస్టిక్‌ చిప్‌, డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌, డీఎన్‌ఏ బేస్డ్‌ ఐ డయాగ్నస్టిక్‌ మైక్రోచిప్‌... ఇవన్నీ సీసీఎంబీ పరిశోధనల ద్వారానే వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణకూ ప్రయోగాలు చేస్తున్నాం. ఇంకా ఎన్నో ఆలోచనలున్నాయి. మా ప్రయత్నమంతా విజ్ఞానాన్ని అందరికీ అందించాలనే. ప్రయాణాలు ఇష్టం నాకు ప్రకృతిలో విహరించడం చాలా ఇష్టం. ఎక్కువగా అడవులకు వెళ్తుంటాను. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనా వంటి ఎన్నో దేశాల్లో పర్యటించాను. కొత్త ప్రదేశాలకు వెళ్తే కొత్త వ్యక్తులు పరిచయమౌతారు. వాళ్ల సంస్కృతి, అనేక కొత్త విషయాలూ తెలుసుకోవచ్చు.

ఇతర విశేషాలు[మార్చు]

  • ఫొటోగ్రఫీ కూడా నా హాబీ. చాలా కెమెరాలతో ప్రయోగాలూ చేస్తుంటాను. *కాలేజీ రోజుల్లో కారల్‌మార్క్స్‌, లెనిన్‌, మహాత్మాగాంధీ 'మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌', నెహ్రూ 'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా' లాంటి పుస్తకాలు చాలా చదివాను.
  • మా ఆవిడ కంప్యూటర్‌ ఇంజినీర్‌. ఎమ్‌టెక్‌ చేసింది. ఇన్ఫోసిస్‌లో దాదాపు 14 ఏళ్లు ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత 'తేజస్వీ విద్యారణ్య స్కూలు'లో భాగస్వామిగా చేరింది. చిన్నారులకు మంచి విద్యనూ, విలువలనూ నేర్పించాలన్నది ఈ స్కూలు లక్ష్యం.
  • మాకు ఇద్దరు అబ్బాయిలు. చిన్నబ్బాయి స్కూల్లో... పెద్దవాడు ఐఐటీ కాన్పూర్‌లో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చదువుతున్నారు. సైన్సు గ్రూపులు తీసుకునేలా... జనవిజ్ఞానవేదికలో సుమారు 15 ఏళ్లుగా క్రియాశీలక సభ్యుణ్ణి. గత ఆరేళ్ల నుంచీ గౌరవ అధ్యక్షుడిని. వేదిక తరఫున కొన్నివందల పల్లెటూళ్లలోని స్కూళ్లూ, కాలేజీల్లో ఎన్నో ప్రయోగాలు చేశాం. విద్యార్థుల్లో చైతన్యం తెచ్చాం. ఇందుకు మా వేదికకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డును అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం నుంచి అందుకున్నాం.
  • నేను ఆంధ్రప్రదేశ్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌కు గౌరవ కార్యదర్శిని. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా సైన్సు గ్రూపులు తీసుకునే విద్యార్థులు తగ్గిపోతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో చాలా సమస్యలోస్తాయి. అందుకే విద్యార్థులను సైన్సు గ్రూపులు తీసుకునేలా చైతన్యపరుస్తున్నాం. సీసీఎంబీ ద్వారా బీఎస్సీ, ఎమ్మెస్సీ విద్యార్థులకు వేసవి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రెండు నెలలు వాళ్లు మా దగ్గర ఉచితంగా అన్నీ నేర్చుకోవచ్చు.

సూచికలు[మార్చు]

  1. "Andhra Pradesh / Hyderabad News : Mohan Rao is new CCMB director". The Hindu. 2009-11-13. Archived from the original on 2009-11-17. Retrieved 2012-08-22.
  2. "Dr. Ch. Mohan Rao" (PDF). bioasia.in. 2010. Archived from the original (PDF) on 2015-12-22. Retrieved 2012-08-22.
  3. "Dr. Ch. Mohan Rao" (PDF). ccmb.res.in. January 2011. Archived from the original (PDF) on 2012-06-02. Retrieved 2012-08-22.
  • మహ్మద్‌ హసన్‌అలీ, న్యూస్‌టుడే, హైదరాబాద్‌ వారి సహకారం