సైకిల్
సైకిలు (ఆంగ్లం Cycle) ఒక సాధారణమైన రవాణా సాధనము. ఇది మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. దీనిని 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు. ప్రపంచంలో ప్రస్తుతం చైనాలో సైకిలు ఉపయోగం ఎక్కువగా ఉంది. విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా[1] ఇవి మనుషులకు బొమ్మలు, వ్యాయామం లో, మిలటరీ, పోలీస్, సమాచార సరఫరా మొదలైన వివిధరకాలుగా ఉపయోగపడుతున్నాయి. సైక్లింగ్ ఒక రకమైన క్రీడ. రిక్షా ఒకరకమైన మూడు చక్రాల సైకిలు
చరిత్ర[మార్చు]
1813 లో ఒకరోజు మాన్ హీమ్ అనే జర్మనీ వీధుల్లో వింత వాహనంపై ఓ యువకుడు వెడుతున్నాడు. ఈ వాహనంలో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంటుంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలుంటాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు. ముంజేతులను ఇనుప కడ్డీలపై ఉంచాడు. ముందు చక్రానికి సంబంధించిన కొయ్య కడ్డీని చేతులతో తిప్పితే పోదలచుకున్న మార్గంలో అతడు వెళ్ళగలుగుతున్నాడు. వీధిలో పిల్లలు కేరింతలు పెడుతూ, వాహనం వెంట పరుగెడుతున్నారు. తోటి ప్రజలు పెనుబొబ్బలు పెడుతూ అట్టహాసం చేస్తున్నారు. వీటిని లెక్కపెట్టకుండ 28 ఏళ్ళ ఆ యువకుడు మాత్రం పిచ్చివాడిలా ముందుకు సాగిపోతున్నాడు. అతడు బేడన్ ప్రభుత్వం లోని ఒక పెద్ద అధికారి కొడుకు. తన కొడుకు ఆఫీసర్ కావాలని తండ్రి ఆశించాడు. కానీ ఎక్కువ బాధ్యతలు నెత్తిన వేసుకోవటం ఇష్టంలేక బేరన్ డ్రే మామూలు గుమస్తాగా చేరాడు. అతనికి కొత్త విషయాలు కనుక్కోవాలనే తపన ఎక్కువగా ఉండేది. చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాల్లో అభిరుచి, ఉత్సుకత ఉన్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు కావటం వల్ల యాంత్రిక శాస్త్రం చదవలేకపోయాడు. ఈ నిరాశ అతనిలో మొండి పట్టుదలను పెంచింది.
వీధుల్లో కొత్త వాహనాన్ని ప్రదర్శించటం మూలాన అతని ఉద్యోగం ఊడటమే కాకుండా అతని పట్ల అంతటా ఉపేక్ష, తిరస్కార భావం ఏర్పడ్డాయి. 16 గంటల్లో వెళ్ళే దూరాన్ని కొత్త వాహనం సహాయంతో 4 గంటల్లోనే వెళ్ళగలిగాడు. ఈ నమూనా వాహనాలను తయారుచేయటానికి బేడన్ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందాడు. కానీ ఎవరూ ఇతణ్ణి గురించి పట్టించుకోలేదు. సొంత ఊరిలో కూడా ఇంతే. 1851 లో దుర్భర దారిద్ర్యంలో అతడు మరణించేసరికి ఇతడు కనిపెట్టిన వాహనాన్ని రైలు పట్టాలపై వెళ్లి మరమ్మత్తులు చేయటానికి, కార్యకలాపాలు పర్యవేక్షించటానికీ, మాత్రమే ఉపయోగిస్తుండేవారు. అయితే ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పెద్ద అంగలు వేసుకుంటూ ఈ వాహనం చాలా ముందుకు సాగిపోయింది.
మనిషి నడిచేటప్పుడు తన బరువును ఒక కాలి నుంచి మరో కాలికి మార్చటంలో ఎక్కువ శక్తిని వినియోగిస్తాడు. ముందుకు వెళ్ళుతున్నపుడు శరీరాన్ని ఒకే స్థితిలో స్థిరంగా ఉంచగల సాధనం నిర్మించటానికి వీలవుతుందా అని అతడు తన్ను తాను ప్రశ్నించుకొన్నాడు. ఇలాంటి వాహనాన్ని తయారుచేయాలన్న ఆలోచనే ఇదివరకు తట్టినట్టు లేదు. నిటారుగా ఉండటం అసాధ్యమని అందరూ అనుకునేవాళ్ళు. నిటారుగా ఉంచడం అనుకున్న దానికంటే చాలా తేలిక అని అతడు నిరూపించాడు. ఈ కారణం గానే ఈ "వింత వాహనం" ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాల దృష్టిని ఆకర్షించింది.
హాబీ గుర్రాలు లేదా డాండీ గుర్రాలు అని పిలువబడే వాహనాలు పారిస్ నగర వీధుల్లోనూ, లండన్ హైడ్ పార్క్ లోనూ అసంఖ్యాకంగా తిరగటం మొదలైంది. తీరిక సమయాల్లో యువకులు, స్త్రీలు వీటిని వాడసాగారు. యువరాజు కూడా ప్రత్యేక వాహనాన్ని తయారుచేయించుకొని బహిరంగంగా దానిపై విహరించ సాగాడు. చూస్తుండగానే ఈ వాహనాల తయారీ గొప్ప పరిశ్రమగా రూపొందింది. ఇంగ్లండ్, అమెరికా పట్టణాల్లో ఈ కొత్త ఆట కోసం ప్రత్యేకంగా మందిరాలు నిర్మించారు. ప్రజలకు దీనిపట్ల మోజు విపరీతంగా పెరిగింది. దీన్ని గురించి హాస్య రచయితలు వ్యాసాలు రాశారు. కార్టూనిష్టులు బొమ్మలు గీశారు. అంత జరిగినా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే కొత్త రవాణా సాధనంగా దీన్ని మలిచే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
మాక్మిలన్ ఆవిష్కరణ[మార్చు]
20 సంవత్పరాల తరువాత మాక్మిలన్ అనే కమ్మరి యువకుడు "డ్రే ఈ" నమూనాను మెరుగుపరచటానికి ప్రయత్నించాడు. వెనకచక్రం ఇరుసుకి రెండు కాంక్ లను అమర్చి, వాటిని రెండు పొడుగాటి తులాదండాలకు కలిపాడు. వీటిని కాళ్ళతో తోసినపుడు వాహనం ముందుకు కదులుతుంది. మాక్మిలన్ ఈ వాహనం పై డంఫ్రీన్ నుంచి గ్లాస్కో వరకు 40 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణానికి అతనికి రెండు రోజులు పట్టింది. ఈ దశలో కూడా ఇది వ్యాపారవేత్తల దృష్టికి రాలేదు. పదేళ్ళ తరువాత జర్మనీకి చెందిన ఫిలిప్ హెనిరిక్ ఫిషర్ అనే మెకానిక్ మరికొన్ని మార్పులు చేశాడు. ముందు చక్రానికి రెండు వైపులా పెడల్ లను అమర్చటం వల్ల కాళ్ళను నేలపై నెట్టినప్పటి లాగా కుదుపుల చలనం కాకుండా వాహనం నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా చలిస్తుంది. కానీ చలిస్తున్నంత వరకూ వాహనాలు పడిపోకుండా ఎలా ఉండగలుగుతున్నాయో మాక్మిలన్ గానీ, ఫిషర్ కానీ చెప్పలేకపోయారు. కారణమేమిటంటే, చక్రాలు తిరుగుతున్నపుడు జైరోస్కోవ్ లాంటి ప్రభావం ఉంటుంది. వాహన వేగం ఎక్కువయ్యే కొద్దీ దాని స్థిరత్వం పెరుగుతుంది.
మొదటి సైకిలు కర్మాగారం[మార్చు]
ఎర్నస్ట్ మికాక్స్ అనే ఫ్రాన్స్ దేశీయుడు మొదటి సైకిలు కర్మాగారాన్ని నెలకొల్పి ఫిషర్ నమూనా ప్రకారం సైకిళ్ళను తయారుచేశాడు. ఇంగ్లండులో కూడా ఇలాంటివి తయారయ్యాయి. వీటిలో వెనక చక్రం కాస్త చిన్నదిగా ఉండేది. 1870 ప్రాంతంలో ఈ నమూనా బహుళ ప్రజాదరణ పొందింది. రాను రాను క్రీడాకారులకు దీనిపట్ల మోజు పెరిగింది. వాహన వేగం ముందు చక్రం తిరగటం పై ఆధారపడటం వల్ల దాని పరిమాణాన్ని ఎక్కువ చేసి, వెనుక చక్రం పరిమాణాన్ని బాగా తగ్గించారు. ఈ వాహనాన్ని ఎక్కడం, దిగడం ఒక సర్కస్ లాగా ఉండేది. ఇలా ఉన్నప్పటికీ ఈ వాహనాలు మంచి వేగంతో పోగలుగుతుండేవి.
వేగంగా పోయే సైకిలు[మార్చు]
సైకిలుని మరింత చిన్నగానూ, వేగంగా పోయే లాగానూ చేయటంలో లాసన్ అనే ఇంగ్లండు దేశీయుడు కృతకృత్యుడయ్యాడు. రెండు చక్రాల నడుమ క్రాంక్ నీ, ఫెడల్ నీ తొలిసారిగా అమర్చింది ఇతడే. ఫెడల్ ని తొక్కినప్పుడు తొక్కేవాడి కాళ్ళ శక్తిని ఫెడల్ లకు అమర్చిన గేర్ చక్రం నుంచి వెనక ఇరుసు వద్ద ఉన్న చిన్న గేర్ చక్రానికి అందించటం కోసం స్వీడన్ కి చెందిన హాన్స్ రెనాల్డ్ ఒక గొలుసును వాడాడు. క్రమంగా చక్రాలకు స్ఫోక్ లు, బాల్ బేరింగులు, గేర్ లు, కూర్చోవడానికి స్ప్రింగ్ సీటు కనుక్కోబడ్డాయి. 1890 లో పెద్ద ఎత్తున సైకిళ్ళను తయారుచేయటం మొదలయ్యే సరికి అవి ఇంచుమించు ప్రస్తుతం వాడుతున్న నమూనా ప్రకారమే ఉండేవి. అయితే వాటికి అప్పట్లో టైర్లు మాత్రం లేవు.
డన్లప్ టైర్లు అభివృద్ధి[మార్చు]
టైర్లను కనుగొన్న కీర్తి బెల్ ఫాస్ట్ లో స్థిరపడ్డ స్కాట్లండ్ పశువైద్యుడు జాన్ బాయిడ్ డన్లప్ యొక్క పదేళ్ళ కుమారునికి దక్కింది. మూడు చక్రాల సైకిలు పందెంలో తనని ఎలాగైనా గెలిచేలా చేయాలని కొడుకు తండ్రి వద్ద మారాం చేశాడు. అప్పట్లో సైకిలు చక్రాలకు దళసరి రబ్బరు టైర్లను ఉపయోగించేవారు. వీటివల్ల కుదుపులు తగ్గడమంటూ జరగలేదు. చెట్లకు నీళ్ళు పట్టడానికి ఉపయోగించే హోసు గొట్టాన్ని (Hose pipe) డాక్టర్ డన్లప్ రెండు భాగాలుగా చేసి, వాటిని వెనక వుండే రెండు చక్రాలకు అతికించి, పంపు సహాయంతో గొట్టాల్లో గాలి నింపాడు. అబ్బాయి పందెంలో గెలవటమే కాకుండా, అదే సైకిలుతోనే హాయిగా ఊరంతా తిరుగుతూ ఉండిపోయాడు. ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరం లోపుగానే దీన్ని గురించి వార్తా పత్రికల్లో వ్రాయటం, ఒక ఐర్లండ్ పారిశ్రామికునితో కలిసి జాన్ డన్లప్ గాలి టైర్లను తయారు చేయటం జరిగింది.
సామాన్య ప్రజల వినియోగం[మార్చు]
గాలి టైర్ల సౌలభ్యం ఏర్పడిన తరువాత సామాన్య ప్రజలు సైకిలుని విస్తృతంగా వాడటం మొదలు పెట్టారు. 1888 లో ప్రపంచం లోని మొత్తం సైకిళ్ళ సంఖ్య 3,00,000 అయితే 1975 నాటికి ఈ సంఖ్య 7.5 కోట్లకు పెరిగింది. ఒక్క బ్రిటన్ లోనే 1.2 కోట్ల సైకిళ్లు ఉన్నాయి. హాలెండ్, డెన్మార్క్ దేశాల్లో సగటు సైకిళ్ళ సంఖ్య జనాభాలో దాదాపు సగం ఉంటుంది. ఏ మాత్రం శబ్దం చేయకుండా ఇది ప్రయాణం చేయగలదు. దాని బరువు కంటే డజను రెట్ల బరువును మోసుకెళ్ళగలదు. మామూలుగా మనిషి పరుగెత్తే వేగం కంటే ఆరు రెట్ల వేగంతో ఇది ప్రయాణం చేయగలదు. అన్ని రకాల రోడ్లపై వెళ్ళటం, ఎక్కడైనా సరే ఆపడానికి వీలుండటం దీని సౌలభ్యాలు. అందువల్లనే అనేక దేశాల్లో సామాన్య మానవునికి అందుబాటులో ఉండే ప్రముఖ రవాణా సాధనంగా సైకిలు పరిగణించబడుతోంది.
సైకిలుకు 312 ఏళ్ళు[మార్చు]
ప్రముఖ చిత్రకారుడు లియొనార్డొ డావిన్సీ సైకిలును పోలిన రఫ్ స్కెచ్ లు కొన్ని గీశాడు. 1690 లో ఫ్రాన్సు జాతీయుడు దిసివ్రాక్ సైకిలులాంటి వాహనాన్ని తొలిసారిగా రూపొందించాడు. దాన్ని "హాబీ హార్స్" అని పిల్చేవారు. దానికి పెడల్స్ లేవు. 1840 లో స్కాట్లాండు జాతీయుడైన కిర్క్ పాట్రిక్ మాక్మిలన్ పెడల్స్ ను జతచేసి నిజమైన సైకిలు రూపును కల్పించాడు. తర్వాత కొన్ని మార్పులకు గురిఅయి 1900 సంవత్సరంలో ఆధునికమైన సైకిలు తయారైంది. ఇది ఇప్పటి సైకిలు మాదిరే ఉండేది.
చట్టం ప్రకారం[మార్చు]
ఐక్యరాజ్య సమితి లోని వియన్నా కన్వెన్షన్, 1968 ప్రకారం సైకిలును ఒక వాహనంగా, నడిపేవానిని చాలకునిగా గుర్తించారు. చాలా దేశాలలో దీని ప్రకారం లైసెన్సులు కూడా అమలులో ఉన్నాయి. చీకటిలో రహదారి మీద వెళ్ళేటప్పుడు ముందు, వెనక డైనమో సహాయంతో వెలిగే దీపాలు ఉండాలి. కొన్ని దేశాలలో పాదచారులు, బండ్లు, ఇతర వాహనాల కోసం గంట కూడా తప్పనిసరి.
ఇతర విషయాలు[మార్చు]
- సైకిలు బొమ్మను ఒక ఎన్నికల గుర్తుగా భారతదేశంలో ఎన్నికల సంఘం వాడుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్ వాది పార్టీ లకు ఎన్నికల గుర్తుగా సైకిలు బొమ్మ ఇవ్వబడింది.
- ప్రపంచ సైకిల్ దినోత్సవం : ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.[2][3]
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ DidYouKnow.cd. ప్రపంచంలో బిలియను సైకిళ్ళు ఉన్నాయని మీకు తెలుసా.[permanent dead link] Retrieved 30 July 2006.
- ↑ "World Bicycle Day, 3 June". www.un.org (in ఇంగ్లీష్). Retrieved 3 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (27 May 2020). "జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం". www.sakshieducation.com. Archived from the original on 4 జూన్ 2020. Retrieved 4 June 2020.
ఇతర లింకులు[మార్చు]
Find more about సైకిల్ at Wikipedia's sister projects | |
![]() |
Definitions and translations from Wiktionary |
![]() |
Media from Commons |
![]() |
Quotations from Wikiquote |
![]() |
Source texts from Wikisource |
![]() |
Textbooks from Wikibooks |
![]() |
Travel guide from Wikivoyage |
![]() |
Learning resources from Wikiversity |

- Pedaling History Museum The world's largest bicycle museum
- A range of Traffic Advisory Leaflets Archived 2010-01-13 at the Wayback Machine produced by the UK Department for Transport covering cycling.
- A History of Bicycles and Other Cycles at the Canada Science and Technology Museum