హెలెన్ కెల్లర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెలెన్ కెల్లర్
అంధ, బధిర అమెరికన్ రచయిత్రి, ఉద్యమకర్త, ఉపన్యాసకురాలు.
జననం(1880-06-27)1880 జూన్ 27
టస్కంబియా, అలబామా, అమెరికా
మరణం1968 జూన్ 1(1968-06-01) (వయసు 87)
ఆర్కన్ రిడ్జ్, వెస్ట్‌పోర్ట్, కనెక్టికట్, అమెరికా
జులై 1888 లో కేప్ కాడ్ లో కెల్లెర్ , అన్నె సుల్లివన్ తో విహారయాత్రలో

హెలెన్ కెల్లర్ అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరొంది ఎందరెందరికో స్ఫూర్తినిచ్చారు. ఊహ బాగా అందీ అందక పూర్వమే పెద్ద జబ్బు చేసి, చూపు, వినికిడి, మాట పోగొట్టుకొని పూర్తి వికలాంగురాలై ఈమె ఈ ప్రపంచాన్ని చూసింది లేదు. ఏ శబ్దాన్ని విన్నదీ లేదు. అయినా అన్నీ అవయవాలు సలక్షణంగా ఉన్న వారందరి కంటే మహోన్నత స్థాయిలో జీవించారు. పట్టుదలతో సాధింపలేనిది ఏదీ లేదని తన జీవితం ద్వారా నిరూపించి ప్రపంచ పౌరులందరికీ ఆదర్శవంతమైన సార్థక సేవా విదుషీమణీగా వన్నెకెక్కారు."19 వ శతాబ్దం"లో అత్యంత శక్తిమంతులుగా ఆవిర్భవించిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు నెపోలియన్ అయితే రెండవవారు హెలెన్ కెల్లర్ అని ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వయిన్ కితాబునందుకున్న ఈమె వికలాంగుల కష్ట నిష్టూరాలు మీదనే కాక, మహిళల హక్కులను గూర్చి పుంఖానుపుంఖాలుగా పత్రికా రచనలు చేశారు. మహిళా హక్కుల సాధనకు స్వయంగా ఉద్యమాలు నడిపారు. "ది స్టోరీ ఆఫ్ మై లైఫ్" గ్రంథ రచనతో తన పుస్తక రచనలకు శ్రీకారం చుట్టి అనేక ప్రఖ్యాత రచనలను వెలువరించారు. వికలత్వానికి, అంధత్వానికీ మూలం పేదరికమనీ, అదిలేని సమాజ స్థాపన ద్వారా వికలాంగుల సమస్యల పరిష్కారం సాధ్యమనీ, అట్టిది సమ సమాజ స్థాపన ద్వారానే సాధ్యమనీ దృఢంగా విశ్వసించి వికలాంగుల ఉజ్వల భవిష్యత్తుకు విశేష కృషి చేశారు.

బాల్యం[మార్చు]

హెలెన్ ఆడమ్స్ కెల్లర్ (జూన్ 27, 1880 - జూన్ 1, 1968) అమెరికా లోని అలబామా రాష్ట్రంలోని టస్కాంబియా అనే బస్తీలో జన్మించింది. పుట్టుకతో అంగవికలురాలు కాదు. ఏడాదిన్నర గడిచిన తర్వాత పెద్ద జబ్బు చేసి, మెదడు తీవ్ర రుగ్మతకు గురై క్రమక్రమంగా చూపు, వినికిడి తర్వాత మాట్లాడేశక్తిని కోల్పోయారు. అయితే ఈమె లోని సాధారణ తెలివితేటలకు, ఇతర అవయవాల ఆరోగ్యానికి ఏ మాత్రం లోపం రాలేదు. మూడేళ్ళ వయసులో ఒకరోజు తన "ఏప్రస్"ను తడుపుకొని ఆరబెట్టుకొనేందుకు గది వెచ్చదనం కోసం ఉంచిన పొయ్యి దగ్గరకు చేరుకోవడంతో ఆమె బట్టలు అంటుకొని కనుబొమ్మలు, జుట్టు, నుదురు కాలాయి. ఈ సంఘటనతో చలించిపోయిన తల్లిదండ్రులు మరింత దిగులుపడ్డారు. వెంటనే బాల్టమోర్ పట్టణంలోని ప్రఖ్యాత నేత్ర వైద్యునితో సంప్రదించగా "చూపు వచ్చే అవకాశం లేదు గానీ, మెదడులోని నరాలన్నీ చాలా చురుకుగా ఉన్నాయి. వాషింగ్టన్ అలగ్జాండర్ గ్రాహంబెల్ వద్దకు తీసుకెళ్ళమని" సలహా అందింది.

విద్యాభ్యాసం[మార్చు]

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ భార్యకు దారుణమైన చెముడు. ఆమెకు మాటలు నేర్పే పట్టుదల, అవిరామ ప్రయత్నాల ఫలితమే టెలిఫోన్ ఆవిష్కరణ. ఆయన సలహా మేరకు అంధులకు విద్య నేర్పే "పెర్కిన్స్ ఇనిస్టిట్యూట్" యానమాన్యాన్ని (బోస్టన్) కెల్లర్ తండ్రి అభ్యర్థించాడు.తన కూతురుకు విద్య నె ఒక్ర్పేఅ అధ్యాపకురాలిని ఒప్పించి తన ఇంటివద్దే విద్య నేర్పేందుకు పంపమన్నాడు. ఈ ఇన్‌స్టిట్యూట్ వారే మూగ, గుడ్డి వ్యక్తి మాట్లాడటం, రాయడం నేర్చిన ప్రపంచంలో ప్రథమ వ్యక్తి లారా బ్రిడ్జియన్ను తీర్చిదిద్దారు.

కెల్లర్ విద్యాబుద్ధులు నేర్పించడానికి అన్నే సలీవాన్ నియామకం జరిగింది.ఈమె పూర్తి పేరు అన్నె మాన్స్ ఫీల్డ్ సలీవాన్. పట్టుదలకు ప్రతిరూపం. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అంధుల సేవకు అంకితమైన సలీవాన్ అధ్యాపకురాలిగా నియమితమవడం ప్రపంచ వికలాంగుల చరిత్రలో పరమాద్భుత అధ్యాయానికి ప్రారంభం కాగలిగింది. దృష్టి లేదని జీవితం వృధా అని భావించే ఆశోపహతులకు కాంతికిరణం వెలువడింది. జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైన మూడూ లోపించిన కెల్లర్ కు విద్య నేర్పడాం ఊహలకు అందని విషయం. అయినా సాధ్యం చేసింది. తొలిరోజులో కెల్లర్ కు ఒక బొమ్మ అందించి అర చేతి మీద "డాల్" అని వ్రాసింది. సూక్ష్మ గ్రాహి అయిన కెల్లర్ వెంటనే ఆమె చేతిమీద "డాల్" (బొమ్మ) అని తిరిగి వ్రాశారు. కెల్లర్ తన జీవితంలో నెర్చుకున్న ప్రప్రథమ పాఠమూ, పదమూ కూడా ఇదే. ఎ.బి.సి.డి.లను చేతిమీద రాసి చూపడం ప్రారంభమైన తర్వాత కెల్లర్ అచంచలమైన ఆత్మ నిబ్బరంతో, అత్యద్భుత ధారణా శక్తితో టీచర్ బోధనలను బాగా ఆకళింపు చేసుకున్నారు. సాధన చేశారు. తల్లిదండ్రుల నుండి విడదీసి, దూరంగా ఒక ఔట్ హౌస్ లో విద్యా బోధన జరిగింది. టీచర్ కు కనబడిన ప్రతి వస్తువు పేరు కెల్లర్ అరచేత రాయడం, ఈమె ప్రతీదీ తడిమి చూసి అవగాహన చేసుకుని గుర్తించడం, రాయడం, గుర్తు పెట్టుకోవడంతో నిరంతర విద్యార్జన కొనసాగింది.

బ్రెయిలీ లో విద్యార్జన[మార్చు]

వినికిడి శక్తి వున్న అంధులు సులభ రీతిలో రాసే పద్ధతి ఫ్రెంచ్ దేశస్థుడు, పుట్టు గ్రుడ్డి అయిన లూయీ బ్రెయిలీ కృషి ఫలితంగా ఏర్పడి, ప్రపంచ వ్యాప్తంగా అమలుకు వచ్చిన పద్ధతి "బ్రెయిలీ లిపి". వినికిడి, మాట కూడా లేని కెల్లర్ కు ఈ పద్ధతిలో రాయటం, నేర్చడం అత్యంత కష్ట భరితమే కాకుండా, ఎంతో సహనం, మెళుకువ, నేర్పు కూడా అవసరం. అయినప్పటికీ సలీవాన్ కు సాధ్యమైంది. ప్రతి భావాన్ని అంశాన్నీ అరచేతిలో రాయడం, దానిని గ్రహించే "ఆకళింపు శక్తి"ని పెంచుకున్న కెల్లర్ పట్టుదలగా నేర్చుకోవడంతో అనతి కాలంలోనే బ్రెయిలీ లిపిలో అనాటికి ఉన్న పుస్తకాలన్నీ జీర్ణించుకున్నారు. సీవాన్ అధ్యాపకురాలుగా చేరిన (1887) మూడేళ్లలోనె బ్రెయిలీ లిపిని ఆపోసన పట్టిన కెల్లర్ ద్విగుణీకృత ఉత్సాహంతో 1900 లో కాలేజిలో అడుగు పెట్టి బి.ఎ పట్టాను పుచ్చుకున్నారు. కాలేజీలో కూడా తన తరగతులన్నిటికీ తన టీచర్ ను వెంటబెట్టుకెళ్ళేవారు. అనితర సాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి విద్యాభ్యాసం ముగించారు.

ప్రపంచ పర్యటనలు[మార్చు]

తండ్రి మరణంతో ఆర్థిక సంక్షోభం ప్రారంభమవగా, స్వశక్తితో జీవన యానం ప్రారంభించారు. జ్ఞాన సముపార్జన కోసం అనేక గ్రంథాలను వడపోశారు. భాషాంతర తర్జుమాల ద్వారా స్వంత రచనలు చేసి సంపాదనకు ఉపక్రమించారు. జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు నేర్చుకున్నారు. 1914 నుంచి ప్రపంచ దేశాల పర్యటనలు ప్రారంభించారు.మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో క్షతగాత్రులైన సైనికుల పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అవిరళ కృషి జరిపారు. యుద్ధాలలో మృతి చెందిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రరంభానికి ఆయా దేశాల పాలకులను, స్వచ్ఛంద సేవా సంస్థలను అభ్యర్తిస్తూ పర్యటనలు జరిపి, గణనీయమైన స్పందనను సాధించారు. 1968 నాటికి ఈమె మొత్తం 39 దేశాలలో పర్యటనలు జరిపారు.

మహా వక్తగా[మార్చు]

ప్రతి ఒక్క అంశం నేర్చుకోవాలన్న తపన ఈమెలో వయసు పెరుగుతున్న కొద్దీ పెరిగింది. తన శారీరక మానసిక శక్తులన్నిటినీ కేంద్రీకరైంచి, చేతి వేళ్ళ సాయంతో తన మనోభావాలను ఎదుటి వారికి అర్థం కాగల రీతిలో చెప్పడంతోనే తృప్తి చెందలేదు. పట్టుదల సాధించి పెట్టిన విజయానికి సంతృప్తి పడని కెల్లర్ ఒకరోజు "నార్వేలో ఒక మూగ మహిళ మాట్లాడటం నేర్చుకోగలిగింది." అనే వార్త తెలిసిన కెల్లర్ తానూ మాట్లాడటం నేర్చుకోవాలని కఠోర శ్రమ చేశారు. నార్వే మహిళ మూగదైనా, చూపు చక్కగా ఉన్నదనీ, ఇతరులు మాట్లాడేటప్పుడు పెదాల కదలికలను అనుకరించి నిత్య సాధనతో సాధించిందనీ, మరి చూపు లేనప్పుడు సాధ్యపడదని టీచర్ వారించినా, సమాధానపడలేదు. మాట్లాడటం నేర్పే టీచర్ ను నియమించుకుని, ఆమె మాట్లాడుతుంటే ఆమె ముఖం, పెదాలు, నాలుక, గొంతు నాళాలు ఏ విధంగా కదులుతున్నాయో, తన వేళ్ళతో తడిమి తెలుసుకొని తానూ ఆ విధంగా అనుకరించి విపరీత శ్రమతో సాధన చేశారు. ప్రారంభంలో కెల్లర్ మాటలు సలీవంకు, ఈ కొత్త టీచర్ (పుల్లర్) కు మాత్రమే అర్థమయ్యేవి. మొత్తం మీద నిరంతర కఠోర పరిశ్రమతో రానురాను ఈమె స్పరపేటిక చలించి, స్వరంలో స్పష్టత చేకూరింది. మరి కొద్ది కాలానికి మహా వక్త కాగలిగింది.

విశేష మానసిక శక్తులు[మార్చు]

మనోబలం, దీక్షలనే ఆక్సిజన్ గా ఉపయోగించుకుంటూ, కాలక్రమేణా అందరి మాదిరి గానే చెస్ ఆడటం, గుర్రపు స్వారీ చేయటం, సైక్లింగ్ మొదలైన రంగాలలో చొరబడ్డారు. సంగీత కచేరీలు, సారస్వత గోష్టులతో పాల్గొనడమంటే మహా ఉత్సాహం చూపేవారు. బధిరత్వాన్ని జయించే అద్భుతమైన శక్తిని కూడా అందుకున్నారు. ఈమె శరీరం శబ్ద తరంగాలలోనే సునిశిత తారతమ్యాన్ని, గాలిలో వచ్చే అతి సూక్ష్మ మార్పులను (తరంగ ధ్వనులు) కూడా గ్రహించగలిగినంత సుకుమారంగా, సునిశితంగా రూపొందడం అత్యంత విశేషం. ఈమెను పరిచయం చేసుకుంటూ కరచాలనం చేస్తే ఆ స్పర్శ ద్వారా ఆ వ్యక్తిని చాలా కాలం తరువాత కూడా ఇట్టే పసికట్టి ఫలానా అని చెప్పగలిగేవారు. మన దేశం వచ్చిన సందర్భంలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గళంలోని సంగీత మాధుర్యాన్ని, ఈమె తన చేతి వేళ్ళద్వారా ఆమె గొంతును తాకుతూనే నిర్థారించ గలిగారు. అంతే కాదు. మనిషి నడుస్తున్నప్పుడు సహజంగా ఏర్పడే భూప్రకంపనాల తారతమ్యాలను అనుసరించి ఆ వ్యక్తి సహజ స్వభావాన్ని అంచనా వేసేవారు. ఈ తరహాలో అనేక అద్భుత మానసిక శక్తులతో ప్రపంచ దేశాలన్నిటినీ ఆకట్టుకొని, వికలాంగుల సేవా కేంద్రాలను ఎల్లెడలా నెలకొల్పడానికి పురికొల్పారు.

అంధుల సేవ[మార్చు]

తన జీవితాన్ని అంధుల సేవకు స్వచ్ఛందంగా అర్పించుకొని, అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థను స్థాపించి, దాని నిధి సేకరణకు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. సమావేశాలు, సదస్సులను నిర్వహించాడు. భారీ స్థాయిలో నిధులు సేకరించి వికలాంగుల ఉద్ధరణకు వ్యయం చేశారు. ఆ సందర్భంలోనే 1955 లో భారతదేశ పర్యటన జరిపారు. రాజధాని ఢిల్లీలో ప్రధాని నెహ్రూ అధ్యక్షతన బ్రహ్మాండమైన బహిరంగసభ జరిగింది. తరువాత బొంబాయిలో కూడా అప్పటి ముఖ్యమంత్రి, గవర్నర్ అధ్వర్యంలో సభ జరిగింది.

1955 భారత దేశ పర్యటన చేస్తూ ఢిల్లీలో ప్రధాని నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటయిన సభలో పాల్గొన్న సందర్భంలో చిన్న ఆశా భావాన్ని వ్యక్తపరిచారు.
నెహ్రూను ఒకసారి తాకి చూడాలన్నారు. నెహ్రూ కూడా ఆమోదించారు.
కెల్లర్ నెహ్రూ ను ఒకసారి స్పర్శించి ఆ తర్వాత నెహ్రూ మోమును చేతులను స్పర్శించి ఆ తర్వాత
నెహ్రూ ఒక కళా ఖండమని, శాంత స్వరూపుడని, విశాల హృదయుడని, సాధారణ పాలకుడని అభివర్ణిస్తూ అంచనా వెలిబుచ్చారు.

వికలాంగులను దయాదాక్షిణ్యాలతో పోషించటం కాదు వదాన్యుల కర్తవ్యం. వారి స్వశక్తితో వారు నిలబడే అవకాశాల కల్పన ద్వారా వారిలో ఆత్మస్థయిర్యం, మనో నిబ్బరం కల్పించడమే ఈ సమస్యకు సముచిత పరిష్కారమని కెల్లర్ ప్రగాఢంగా విశ్వసించి, ఆదర్శవంతమైన సార్థక సేవా దృక్పధానికీ బీజం వేశారు.అమెరికా, ఇంగ్లాండ్, స్వీడన్ వంటి అనేకానేక దేశాలలో ఈమె పేరు మీద సేవా కేంద్రాలు నెలకొల్పబడి ఈ నాటికీ కొనసాగుతున్నాయి. 1902 లో ప్రారంభించిన రచనా వ్యాసాంగాన్ని, జీవిత పర్యంతర కొనసాగించారు. "ద స్టోరీ ఆఫ్ ద డార్క్‌నెస్" అనంతరం మై రెలిజియన్, ద వరల్డ్ ఐ లివ్ ఇన్, అవుట్ ఆఫ్ ద డార్క్‌నెస్, ద ఓపెన్ డోర్, లెట్ ఆజ్ హావ్ ఫెయింగ్, ద సాంగ్ ఆఫ్ ద స్టోరీ వెల్ మొదలైన గ్రంథరచనలను వెలువరించారు. ఈమె జీవిత కథను ఆధారం చేసుకుని పలువురు డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందిచారు. ఆస్కార్ అవార్డు (1955) కూడా లభించింది.

అవార్డులు - రివార్డులు[మార్చు]

  • అమెరికా దేశపు అత్యున్నత అవార్డ్ "ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్" అవార్డు
  • పిలిప్పీన్స్ దేశపు " గోల్డెన్ హార్ట్ " అవార్డు
  • లెబనాన్ దేశపు "ఆర్డర్ ఆఫ్ క్రాస్" అవార్డు
  • జపాన్ ప్రభుత్వం వారి "సీక్రెట్ ట్రిషర్" అవార్డు.
  • బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు.
  • ప్రపంచంలో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలలో డాక్టరేట్లు
  • ప్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలు.

ముగింపు[మార్చు]

1887, మార్చి 7 న విద్యార్జన ప్రారంభించి, 1900 లో కళాశాలలో చేరి గ్రాడ్యుయేషన్ చేసి, రచయితగా వికలాంగుల సమస్యలను, స్త్రీ హక్కులను గూర్చి పత్రికలలో పరంపరగా వ్యాసాలు రాసి, అంధులకు, బధిరులకు, మూగ వారికి ఏకైక ప్రతినిధిగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టిన కెల్లర్ 1968 జూన్ 1 న మరణించారు. వికలాంగుల మనో ప్రపంచంలో శక్తి వంతమైన వెలుగుగా ప్రవేశించి వారికి ఆశా జ్యోతిగా, ఆత్మ బంధువుగా మనోనిబ్బరాన్ని కల్పించిన కెల్లర్ మహిమాన్వితురాలు.

సూచికలు[మార్చు]

యివి చదవండి[మార్చు]

  • Keller, Helen with Anne Sullivan and John A. Macy (1903) The Story of My Life. New York, NY: Doubleday, Page & Co.
  • Lash, Joseph P. (1980) Helen and Teacher: The Story of Helen Keller and Anne Sullivan Macy . New York, NY: Delacorte Press. ISBN 978-0-440-03654-8
  • Herrmann, Dorothy (1998) Helen Keller: A Life. New York, NY: Knopf. ISBN 978-0-679-44354-4
  • "Keller, Helen Adams | World Encyclopedia. Philip's, 2008. Oxford Reference Online. Oxford University Press. University of Edinburgh. February 10, 2012".

యితర లింకులు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.