అరబిందో
శ్రీ అరబిందో | |
---|---|
అరబిందో ఘోష్ | |
జననం | అరబిందో ఘోష్ 15 ఆగస్టు 1872, కోల్‌కతా |
మరణం | 1950 డిసెంబరు 5 | (వయసు 78)
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | ఇతర పేర్లు |
విద్య | అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు |
వృత్తి | సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, , గురువు. |
పనిచేయు సంస్థ | |
తల్లిదండ్రులు | తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. |
పురస్కారాలు | సాధించిన పురస్కారాలు |
సంతకం | |
అరబిందో (ఆగస్టు 15, 1872–డిసెంబరు 5, 1950) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, ఆధ్యాత్మిక గురువు. ఈయన భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈయన ఆధ్యాత్మిక విలువలతో నాయకులని ప్రభావితం చేసారు. మానవ పురోగతి, ఆధ్యాత్మిక పరిణామాల పట్ల ఆయన భావనలు పరిచయం చేస్తూ రచనలు చేసారు. ఈయన వందేమాతర గేయన్ని ఆంగ్లభాష లోకి అనువదించారు.
బాల్యము
[మార్చు]అరబిందో ఆగస్టు 15, 1872 న కోల్‌కతాలో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె. డి. ఘోష్ వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు. అరవిందుల మాతామహులు సుప్రసిద్ధ బ్రహ్మ సామాజికులయిన రాజనారాయణబోసు. వీరు సంస్కృతాంగ్ల భాషలలో మహావిద్వాంసులు. వీరి కుమార్తె శ్రీమతి స్వర్ణలతాదేవి అరవిందుల తల్లి. అరవిందుల తండ్రి కృష్ణధనఘోష్. వీరు పూర్వులు బ్రహ్మ సమాజ విరోధులైనా వీరు మాత్రం బ్రహ్మసమాజంపట్ల అభిమానం చూపిస్తూ ఉండేవారట. కనుకనే వీరు బ్రహ్మసమాజ కన్యను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి మహర్షి దేవేంద్రనాధ్ ఠాకూర్ స్వయంగా పౌరోహిత్యం జరిపారట. వీరిద్దరికి 4 కుమారులు, ఒక కుమార్తె. వీరిలో మొదటి కుమారుని పేరు వినయభూషణుడు, రెండవవాడు మనోమోహనుడు, మూడవవాడు అరవిందులు, నాలగవది సరోజినిదేవి, చివరి వారు వారీంద్రుడు. ఈతడు వంగదేశంలో ప్రఖ్యాత విప్లవకారుడు. సరోజినీదేవి ఆజన్మ బ్రహ్మ చారిణి అయి ఆధ్యాత్మిక అన్వేషణా పరురాలుగా పేరుగాంచింది.
కృష్ణధనఘోషుకు ఆంగ్లవిద్యమీద అభిమానం ఎక్కువ. అందుచేత బాగా చిన్నతనంలో అరవిందుని డార్జిలింగు పంపించి అక్కడ సెయింట్ పాల్ స్కూల్ లో చదివించారు. అయినా తృప్తి చెందక ఇంగ్లండు వెళ్ళినారు. అక్కడే వీరి చిన్న కుమారుడు వారేంద్రుడు జన్మించారు. కాని అక్కడ వీరు కుమార్తె సరోజినీదేవి ఉన్మాదవ్యాధితో బాధపడుతుండడం వల్ల అక్కడనుండి భారతదేశం తిరిగి వచ్చేరు. అరవిందులు 7 ఏండ్లు ఇంగ్లాండులో తరువాత 5 ఏండ్లు మాంచెస్టరులో చదువుకున్నారు. ఈయన తన 18వ ఏటనే ఇ.పి.యస్ పరీక్షకు హాజరై గ్రీక్, లాటిన్ భాషలలో అత్యుత్తమ తరగతిలో ఉత్తీర్ణులయినారు.
కళాశాలాచార్య పదవి విడిచిన తరువాత అరవిందులు వందేమాతరం పత్రికాసంపాదకత్వం స్వీకరించారు. అంతకుపూర్వం వారపత్రికగా ప్రచురింపబడుతున్న ఈ ఆంగ్లపత్రిక అరవిందుల సంపాదకత్వంలో దినపత్రిక అయింది. ఈ పత్రిక మూలంగా జాతీయతత్వం వంగదేశాన్ని ఉర్రూతలూగించింది. క్రమంగా వీరి జాతీయ సందేశం భారతదేశం అంతటా అల్లుకోవడం మొదలుపెట్టింది. ఈ సమయంలో ఆంగ్లప్రభుత్వం వీరిని రాజద్రోహ నేరంమీద శిక్షించాలని ప్రయత్నించింది. కాని నేరం ఋజువు కాకపోవడంవల్ల ప్రభుత్వం వీరిని ఏమీచెయ్యలేకపోయింది. అరవిందులీ సమయంలోనే 1907 డిసెంబరులో జరిగిన సూరత్ కాంగ్రెస్ జాతీయపక్షనేతలుగా హాజరైనారు. అక్కడ మితవాదులకు జాతీయపక్ష నాయకులైన అరవింద ప్రభృత్యులకు మధ్య తీవ్ర విభేదాలు బయలుదేరాయి. జాతీయపక్షనేతలందరు అరవిందుల నాయకత్వంతో వేరుగా ఒక సమావేశం జరిపి దేశాభివృద్ధికరమైన మార్గం ఆదేశించారు. అటుతరువాత వీరిపై ఆలీపూరు బాంబుకేసు నడిచింది. అరవిందుల కనిష్ఠసోదరుడు వారీంద్రుడు విప్లవకారుడు కావడం వలన వీరిపై ప్రభుత్వం అపోహలు మోపారు. దీనిమూలంగా అరవిందులు జైలులో పలు కష్టాలు అనుభవించారు. ఈ ఆలీపూరు కేసులో చిత్తరంజన్ దాస్ వీరికి న్యాయవాదిగా పనిచేసారు.
జీవిత విషయాలు
[మార్చు]ఇంచుమించుగా 1893 వరకు ఈయన ఆంగ్లదేశంలోనే ఉండిపోయారు. అరవిందుల 20వఏట వీరి తండ్రిగారు మరణించడంతో భారతదేశం తిరిగి వచ్చి బరోడా మహారాజు పరిచయంతో అక్కడ ఆయనకు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసారు. ఆపిమ్మట కొంతకాలమే రెవెన్యూ శాఖలో పనిచేసి, చివరికి బరోడా ఆంగ్లకళాశాలలో ఉపాధ్యక్షులుగా కుదురుకున్నారు. 13 సంవత్సరాలపాటు ఈ ఉద్యోగం చేశారు. ఈ సమయంలోనే వీరు హిందీ, సంస్కృతం, గుజరాతీ, బెంగాలీ మొదలయిన భాషలలో అఖండ పాండిత్యం సంపాదించారు.
అరవిందులు బరోడాలో ఉన్నప్పుడే వీరు మృణాలినీదేవిని వివాహమాడినారు. అప్పటికి వీరి వయస్సు 28 ఏండ్లు. గృహస్థాశ్రమంలో ఉన్న స్వల్పకాలంలోనూ వీరు, తమ సహధర్మ చారిణిని దేశభక్తురాలినిగా ఆధ్యాత్మిక చింతా పరాయణురాలినిగా తీర్చిదిద్దు కున్నారు.శ్రీ అరవిందులు మృణాలినీదేవి గారికి వ్రాసిన లేఖలను బట్టి అప్పటికే వారిలో తీవ్రంగా మొలకలెత్తుతున్న ఆదర్శాంకుర ప్రభావం గ్రహింపవచ్చును. బరోడాలో ఉన్నప్పుడు అరవిందులకు ఆధ్యాత్మిక జిజ్ఞాస మిక్కుటముగా ఉండేది. ఈసమయంలో వీరు నర్మదా నదీ తీరంలో ఉన్న బ్రహ్మానందస్వామి, సుప్రసిద్ధ విష్ణుభాస్కర స్వామి సాంగత్యం కలిగింది. ఆపిమ్మట వీరు రాజకీయాలలో ప్రవేశించినా, లోలోపల వీరి ఆధ్యాత్మిక తృష్ణ అణిగిపోలేదు.
వంగదేశ విభజన వల్ల, వండేమాతరం ఉద్యమం వల్ల ఆరోజుల్లో అప్పుడే మొదలయిన పాశ్చాత్యుల జాతీయ కళాశాలకు అరవిందులు ప్రధానోపాధ్యాయులుగా నెలకు 25 రూపాయలకు చేరారు. అయితే వీరు ఈకళాశాల ప్రభుత్వ సంబంధం లేని పరిపుర్ణమైన జాతీయ కళాశాలగా ఉండాలని అభిప్రాయ పడ్డారు. దీనిని కళాశాల వ్యవస్థాపకులు వ్యతిరేకించడంతో ఈ ఉద్యోగంనుంచి అరవిందులు విరమించారు.
రాజకీయాల్లోంచి ఆధ్యాత్మికత వైపుకు
[మార్చు]అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలే ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనాడు. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన భగవద్గీత పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి.
ప్రభావం
[మార్చు]ఆయన ప్రభావం నలుదిక్కులా వ్యాపించింది. భారతదేశంలో ఎస్.కె మైత్ర, అనిల్బరన్ రోయ్, డి.పి.చటోపాధ్యాయ మొదలగువారు అరవిందుల వారి సాహిత్యాన్ని గురించి వ్యాఖ్యానించారు.
తాత్విక , ఆధ్యాత్మిక రచనలు
[మార్చు]పుదుచ్చేరిలో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవాడు.
అరవిందులు ఏకాంతంగా ఎక్కడో ఎవరికీ కనబడకుండా ముక్కు మూసుకొని కూర్చొని ప్రపంచంతో సంబంధంలేని యోగి అని సామాన్యదృష్టికి తోచవచ్చును. కాని కొంచెం నిశితంగా వీరి ఆధ్యాత్మిక దృక్పధము, దర్శన తత్వము పరిశీలిస్తే ఇది నిజం కాదని తేలిపోతుంది. ప్రస్తుత జీవితదుఃఖాలలో నుంచి తప్పించుకొని పరబ్రహ్మలో విలీనమైపోవడం వీరి ఆదర్శం కాదు. ఈ విషయంలో వీరికీ శంకరభగవత్పాదులచే ప్రవర్తితమైన అద్వైతానికీ చాలా భేదాలు కనిపిస్తాయి.
అరవిందుల దర్శనంలో మాయా ప్రమేయమే లేదు. అద్వైతవాదంలో బ్రహ్మపై జగత్తు అధ్యాసితమై వివర్తంగా భాసిస్తుంది. అరవిందులు అద్వైతులు ప్రతిపాదించే నిర్గుణ పరబ్రహ్మ ఆధ్యాత్మికాన్వేషకుని సాధనలో ఒకమెట్టు మాత్రమే అనీ, దీనికి పైన అతిమానసిక భూమికలు క్రమక్రమంగా అనేకం ఉన్నాయని, అన్నింటికి పైన విజ్ఞాన భూమిక (Supra mental Plane) ఉన్నదనీ చెబుతున్నారు. ఆ భూమికల కన్నింటికీ దిగువ సైకో అనాలిసిస్ చెప్పే (Sub conscious) అవ్యక్త మనస్సు కూడా ఉన్నదని అంగీకరిస్తారు. ఈ రెండు భూమికలకు మధ్యన ఇంకా అనేకమైన భూమికలున్నవని ప్రతిపాదించి అరవిందులు ఆయన భూమికల గురించి సవిస్తరంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ భూమికలన్నిటిలోను దివ్య చైతన్యం అంతర్గతమై ఉన్నదని, క్రమంగా ఊర్ధ్వంగా అధిరోహించినకొలదీ ఈ చైతన్యం స్వయంప్రకాశమాన మవుతున్నదని అరవిందుల అభిప్రాయము.
అరవ నవంబరు 24 న తన వద్దనున్నశిష్యులతో నిన్నటి దినము కృష్ణచైతన్యము తిరిగిభూమి మీద అవతరించింది అని బోధించి అప్పటినుండి మరణము వచ్చు వరకు మౌనంగా ఉండిపోయారు. ఇంతవరకు ప్రపంచంలో పదార్ధము (Matter), ప్రాణశక్తి (Vital Force), మనస్సులు (Mind) మాత్రమే ఆవర్భవించాయని వీటితో ఆధ్యాత్మిక పరిణామం నిలిచిపోలేదని క్రమంగా మనస్సుకు పైబడిన ఉన్నత భూమికలు కూడా పృధ్వి పై అవతరించగలవని ఇదే ఆధ్యాత్మిక పరిణామంలో అంతర్ధానమని అరవిందులు ప్రవచించారు.
అరవిందులు తమ సిద్ధాంతాలన్నీ దివ్యజీవనము (The Life Divine) అనే తాత్విక గ్రంథంలో వివరించారు. వీరురచించిన గీతవ్యాసాలు (Essays on Gita) కూడా పలుప్రాచుర్యం పొందిన గ్రంథము. వీరు వ్రాసిన కవితలు Mystic Poetry, Love and Death, Six Poems Savitri చదవవలసినవి, పేరుగాంచినవి.
రచనల జాబితా (కొన్ని)
[మార్చు]- బేసెస్ ఆఫ్ యోగ
- భగవద్గీత అండ్ ఇట్స్ మెసేజ్
- ఎస్సయస్ ఆన్ గీత
- ది లైఫ్ డివైన్
- సావిత్రి
- ది హ్యుమన్ సైకిల్
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using religion
- Infobox person using residence
- Infobox person using home town
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- స్వాతంత్ర్య సమర యోధులు
- ఆధ్యాత్మిక గురువులు
- 1872 జననాలు
- 1950 మరణాలు
- భారత స్వాతంత్ర్య సమర యోధులు
- పశ్చిమ బెంగాల్ వ్యక్తులు
- కవులు