మనిషికో చరిత్ర
మనిషికో చరిత్ర (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఎల్.వి.ప్రసాద్ |
---|---|
నిర్మాణం | ఎస్. గోపాలరెడ్డి |
కథ | విసు |
తారాగణం | మురళీమోహన్, సుహాసిని, చంద్రమోహన్, ప్రభ, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, పూర్ణిమ, హేమసుందర్ |
సంగీతం | కె.చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి, రాజశ్రీ |
సంభాషణలు | గణేష్ పాత్రో |
నిర్మాణ సంస్థ | భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మనిషికో చరిత్ర నాలుగిళ్ళ లోగిలిలో కాపురముండే నాలుగు మధ్య తరగతి కుటుంబాల సమస్యల చుట్టూ తిరిగే కథాంశంతో రూపుదిద్దుకొన్న తెలుగు సినిమా. ఇది మంచి విజయం సాధించింది. ఇందులో గణేష్ పాత్రో రచన, టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంతో పాటు గొల్లపూడి మారుతీరావు నటన, సంభాషణలు మంచి ప్రజాదరణ పొందాయి. ఫార్ములా కథలకు భిన్నంగా ఉన్న ఈ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది.
సంక్షిప్త కథ
[మార్చు]నాలుగిళ్ళ నడవాలో నాలుగు కుటుంబాలు కాపురముంటాయి. అందులో ఒక జంట (మురళీ మోహన్, సుహాసిని) చాలీచాలని సంపాదనతో సతమతమవుతుంటారు. మురళీమోహన్‌కు సంపాదన తక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. భార్యతో ఉద్యోగం చేయించడం, ఆమె పుట్టింటి నుండి సహాయం అందుకోవడం అతనికి ఇష్టం ఉండదు. ఒక చిన్నగదిలో ఉండే బడిపంతులు (హేమసుందర్?) కాపురమంతా భార్యకు ఉత్తరాలు వ్రాయడానికే పరిమితం. అతనొక చోట, అతని భార్య మరొక చోట ఉద్యోగాలు చేస్తుంటారు. ఎవరో ఒకరికి బదిలీ కావాలని అతను ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరొక జంట (చంద్ర మోహన్, ప్రభ) ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో అక్కడ వారే కాస్త స్థితిమంతులు. ఉద్యోగం మానేసి చక్కగా పిల్లలను పెంచుకొంటూ సంసారం చేయాలని ప్రభ కోరిక. భార్య తెచ్చే సంపాదన విలువ తెలిసిన చంద్రమోహన్ అందుకు ఒప్పుకోడు. ధారాళంగా వరండాలో కూర్చుని భార్య జాకెట్టుకు హుక్కులు కుట్టడం అతనికి చిన్నతనం అనిపించదు.
ఇక నాలుగో కుటుంబం ఈ కథలో కేంద్రస్థానం ఆక్రమిస్తుంది. గెద్దముక్కు పంతులు (లేదా మరో పేరు - సరి చూడాలి)గా గొల్లపూడి మారుతీరావు, అతని భార్యగా అన్నపూర్ణ నటించారు. ఇంట్లో ఒక్కో సామాను అమ్మేస్తూ అన్నపూర్ణ సంసారం నెట్టుకొస్తుంటుంది. గొల్లపూడి మారుతీరావు పనీపాటా లేకుండా పొద్దస్తమానం వార్తా పత్రికలు తిరగేస్తూ ప్రపంచంలోని సకల వ్యవహారాలనూ పరిశిలించి చర్చిస్తుంటాడు. తన మెలిక సంభాషణలతో అందరి తలలూ తింటుంటాడు. వారి కొడుకు కూడా పనీపాటా లేకుండా తన అభిమాన హీరో ఫంక్షనుల కోసం పొద్దస్తమానం ఖాళీలేకుండా తిరుగుతుంటాడు. ఇంట్లో బిందెలమ్మేసి హీరో ఫంక్షనులకు డబ్బు సమకూర్చుకొంటుంటాడు. వారి కూతురు దుర్గ (పూర్ణిమ) షుమారు పద్ధెనిమిదేళ్ళ పిల్ల. ఇంట్లో పరిస్థితులను అర్ధం చేసుకొంటుంది.
వారికి పాలుపోసే అమ్మాయి (జయమాలిని?) తెలివైనది, మంచిది. ఆమె గేదె సినిమా పోస్టరులు తింటూ పాలిస్తుంది. ముఖ్యంగా ఎన్.టి. రామారావు సినిమా పోస్టరులైతే దానికిష్టం. ఎన్టీబాబు సినిమాలు తగ్గిపోయాక దాని పాలు తగ్గిపోతున్నాయి గనుక క్రొత్త హీరోలను అభిమానించడం నేర్చుకోమని ఆ గేదెకు ఆమె హితవు చెబుతుంటుంది. ఆ పాలమ్మాయి సహాయంతో, తన తల్లిదండ్రులకు తెలియకుండా, దుర్గ ఒక ఇంట్లో పనికి కుదురుతుంది. అజ్ఞాతంగా తన జీతం నెలనెలా తల్లిదండ్రులకు మనియార్డరు చేస్తుంటుంది. చివరికి ఆ డబ్బు పంపపేది దుర్గేనని తెలిసికొని ఆమెతండ్రి ఆమెను నిలదీస్తాడు. అవినీతికి పాల్పడకుండా ఒక ఆడపిల్ల అంతడబ్బు ఎలా సంపాదిస్తుందో జవాబు కావాలని తండ్రిగా ఆమెను శాసిస్తాడు. అందుకు దుర్గ చెప్పిన జవాబు - "నా తండ్రి అని చెప్పుకొనే హక్కు నీకెక్కడుంది? పిల్లలకోసం ఏమైనా చేశావా? కేవలం పిల్లలను పుట్టించడమే నీ అర్హత అయితే నీ గొప్పతనాలు నీ భార్య దగ్గఱ చెప్పుకో కాని పిల్లలను నిలదీసే అధికారం లేదు. మా మీద నీకు హక్కు లేని అధికారం చెలాయించవద్దు." దానితో దిమ్మతిరిగి ఆ తండ్రి మనసు మారుతుంది. ఒక కలిగిన వారింట్లో రోగిష్టి ఆడమనిషికి సేవ చేయడమే దుర్గ చేసే ఉద్యోగం అని పాలమనిషి వారికి వివరిస్తుంది.
ఇలా ఆ లోగిలిలో నాలుగు కుటుంబాలలోనూ కొన్ని మార్పులు వస్తాయి. గొల్లపూడి మారుతీరావు పునుగులు, వడలు అమ్మడం మొదలు పెడతాడు. అతని కొడుకు సినిమా పోస్టరులు అంటించే ని చేసుకొంటూ కొంత సంపాదనలో పడతాడు. ఇక తన భార్య ఉద్యోగం చేయడానికి మురళీమోహన్ ఒప్పుకొంటాడు. తన భార్య ఉద్యోగం మానేయడానికి చంద్రమోహన్ ఒప్పుకొంటాడు. బడి మాష్టరుకు అతని భార్య ఉండే వూరికి బదిలీ లభిస్తుంది కాని అతని భార్యకు ఈ వూరికి బదిలీ అవుతుంది. వారు రైలు మారే సమయంలో రైల్వేస్టేషనులో కలుసుకోవాలని ఆశిస్తారు.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- గొల్లపూడి మారుతీరావు - పంచముఖాగ్నిహోత్రావధాని
- అన్నపూర్ణ - వెంకటలక్ష్మి, అవధాని భార్య
- మురళీమోహన్ - రాంబాబు
- సుహాసిని - సీత, రాంబాబు భార్య
- చంద్రమోహన్ - చిట్టిబాబు
- ప్రభ - శారద, చిట్టిబాబు భార్య
- పూర్ణిమ - అవధాని కుమార్తె
- హేమసుందర్ - ఆనందరావు
- రాంజీ - రాజా
- జయమాలిని
- రావి కొండలరావు - గురవయ్య
- విజ్జిబాబు
- హేమసుందర్
- మోదుకూరి సత్యం
- బాలకృష్ణ
- గణేష్
- టి.ఆర్.జయదేవ్
- సుబ్బారావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- నరసింహం
- గణేష్ పాత్రో
- మీనా
- సుత్తి వీరభద్రరావు
పాటలు
[మార్చు]- మనిషి మనిషికీ ఒక చరిత్ర ప్రతి మనిషిది, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- శనివారం మేము పనివారం ఆదివారం మేము ఆడవారం, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
- మనిషి మనిషికీ ఓ చరిత్ర మనిషి మనసులో, రచన: రాజశ్రీ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- సిరులిచ్చే శ్రీలక్ష్మి చదువిచ్చే సరస్వతి పసుపు కుంకుమలిచ్చే, రచన: వేటూరి, గానం.పి.సుశీల.
విశేషాలు
[మార్చు]మూలాలు
[మార్చు]1 ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.