ఖమ్మం ఖిల్లా
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉన్నది కాకతీయుల పాలనకాలం క్రీ.శ. 950లో ఖమ్మం ఖిల్లా (అనగా కోట) నిర్మాణానికి పునాదులు పడినాయి. తరువాత రెడ్డిరాజులు, వెలమరాజులు ఈ కోటను ఇంకా మెరుగుపరిచినారు. . ఆ తరువాత వచ్చిన కుతుబ్ షాహీ వంశస్తులు (1531) కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించినారు.
కాకతీయుల కాలంలో ముగ్గురు సోదరులు - రంగారెడ్డి, లక్నారెడ్డి, వేమారెడ్డి 950లో కోటను కట్టడం ప్రారంభించారు. తొలుత అది మట్టికోట. 997లో గజపతులతో పాటు ఖమ్మం వచ్చిన, కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి ఈ కోటను కట్టడం కొనసాగించారు. 1000లో కోట కట్టడం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన తర్వాత ౩౦౦యేళ్ల పాటు రెడ్డి వంశాల పాలనలో ఉన్నది. ఆ తరువాత వెలమరాజుల చేజిక్కించుకొన్నారు. ఆ తరువాత నందపాని, కాళ్లూరు, గుడ్లూరు వంశాల చేతులు మారింది. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. అప్పటి నుండి ఈ దుర్గం కుతుబ్‌షాహీల పాలనలో ఉన్నది. 17వ శతాబ్దంలో తక్కిన తెలంగాణ లాగ అసఫ్‌జాహీల పాలనలోకి వచ్చింది.
గ్రానైటు రాళ్లతో నిర్మించిన ఈ పఠిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. కోటకు పది ద్వారాలున్నాయి. పశ్చిమం వైపున్న దిగువకోట ప్రధానద్వారం. తూర్పు వైపున్న ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మొహరించే వీలుకలదు. కోటలోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు మరియు మహలు ఉన్నవి. అరవై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ బౌలీ అనే బావి కూడా ఉన్నది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగం కూడా ఉన్నది. వర్షపు నీటిని నిలువ చేసుకోవటానికి నీటి కాలువలు కూడా ఉన్నవి.