డీవీఎస్‌గా ప్రసిద్ధి చెందిన డి.వి.సదానంద గౌడ మార్చి 18, 1953న[1] కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మండెకోలులో[2] జన్మించాడు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 1983 నుంచి 1988 వరకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. 1989లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి పరాజయం పొందినాడు. 1994లో తొలిసారి పుత్తూరు నుంచి విజయం సాధించి కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యాడు. 1999లో రెండో సారి కూడా అదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికై శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా వ్యవహరించాడు. 2003లో పబ్లిక్ అక్క్కౌంట్స్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశాడు. 2004లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నుకయ్యాడు. 2009లో ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి రెండవసారి లోకసభకు ఎన్నికైనాడు.[3] బి.ఎస్.యడ్యూరప్పను లోకాయుక్త తప్పుపట్టడంతో పార్టీలో వివాదరహితుడైన[4] సదానందగౌడకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. ఆగష్టు 4, 2011న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.