ఆదిత్య 369

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిత్య 369
(1991 తెలుగు సినిమా)
Aditya 369.jpg
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం అనితాకృష్ణ
కథ జంధ్యాల
తారాగణం నందమూరి బాలకృష్ణ,
మాస్టర్ తరుణ్,
సుత్తి వేలు,
మోహిని,
అమ్రీష్ పురి,
సిల్క్ స్మిత,
టినూ అనంద్,
గొల్లపూడి మారుతీరావు,
చంద్రమోహన్
సంగీతం ఇళయరాజా
గీతరచన వేటూరి సుందరరామమూర్తి,
సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం పి.సి. శ్రీరామ్,
వి.ఎస్.ఆర్. స్వామి,
కబీర్ లాల్
నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్
విడుదల తేదీ 18 ఆగష్టు 1991
భాష తెలుగు

ఆదిత్య 369, 1991లో విడుదలైన తెలుగు సినిమా.[1] బాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది.[2]

చిత్రకథ[మార్చు]

కృష్ణ మోహన్ (బాలకృష్ణ) కు టి.వి.లు తయారు చేసే కంపెనీ ఉంది. అతను హేమ (మోహిని) ను ప్రేమిస్తాడు. హేమ తండ్రి ప్రొఫెసర్ రామదాస్ (టిన్నూ ఆనంద్) ఒక సైంటిస్టు. అతను కాలయంత్రాన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. రాజావర్మ (అమ్రిష్ పురి) అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. వయొలిన్ ను వయలెన్స్ ను సమంగా ప్రేమిస్తాడు. సాలార్ జంగ్ మ్యూజియంలో విలువైన పురాతన వస్తువుకోసం మనుషుల్ని పంపుతాడు. వారిని మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన ఓ కుర్రాడు (మాస్టర్ తరుణ్) చూస్తాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కృష్ణమోహన్ కాపాడతాడు.

హేమ ఇంట్లో ఒకసారి ప్రయోగ దశలో ఉన్న కాలయంత్రంలో కృష్ణ మోహన్, హేమ, ఒక పోలీసు ఎక్కి గడిచిపోయిన కాలానికి (కృష్ణదేవరాయ కాలానికి హంపి విజయనగర ప్రాంతానికి) వెళ్ళి పోతారు. కృష్ణదేవరాయలి కొలువు అక్కడ రాజనర్తకితో పోటీ, వజ్రం అపహరణ వంటి సంఘటనల తరువాత కృష్ణదేవరాయల సహకారంతో మళ్ళీ కాలయంత్రంలో ఎక్కి, ప్రస్తుత కాలానికి కాక భవిష్యత్ లోనికి వెళ్ళిపోతారు. భవిష్యత్తులో అణుయుద్ధం తరువఅత కలుషితపూరితమైన దేశం వారికి కనిపిస్తుంది. అక్కడినుండి మళ్ళీ వర్తమానంలోనికి రావడం, రాజావర్మతో తలపడటం మిగతాకథ.

ఈ సినిమాలో భూతకాలం, భవిష్యత్కాలం, వర్తమానకాలం - ఈ మూడింటిలోనూ కనిపించేది ఒక వజ్రం.

నిర్మాణం, అభివృద్ధి[మార్చు]

ప్రముఖ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గరున్న టైం ట్రావెల్ (కాలంలో ప్రయాణం) గురించిన కథ చెప్పాడు. అది విన్న కృష్ణప్రసాద్ వెంటనే ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కృష్ణదేవరాయల కాలం అనగానే ఆయనకు కథానాయకుడు బాలకృష్ణ గుర్తొచ్చాడు. బాలకృష్ణకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట్లో ఈ సినిమాకు పి. సి. శ్రీరాం ఛాయాగ్రాహకుడు. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను వి. ఎస్. ఆర్. స్వామి, కబీల్ లాల్ కి అప్పగించారు.

మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా అయింది. చిత్రీకరణలో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ అదనపు సొమ్మును వెచ్చించడానికి ముందుకు వచ్చారు. దీంతో సినిమాకు కోటి 52 లక్షలు ఖర్చు అయింది. మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నారు. తర్వాత ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలు చేర్చారు. జులై 18, 1991 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రజాదరణకు నోచుకుంది.[1]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఇళయరాజా.

విశేషాలు[మార్చు]

  • తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని ఈ విధమైన క్లిష్టతతో కూడుకొన్న కథను తెరకెక్కించి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రతిభ కనిపిస్తుంది. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, ఇళయరాజా సంగీతం, శ్రీరామ్, స్వామిల ఫొటోగ్రఫీ ఈ చిత్ర విజయానికి బాగా దోహదం చేశాయి.
  • విజయనగర రాజ్యంకాలంలో కృష్ణమోహన్ అనే (తరువాతి కాలంనుండి వచ్చిన) యువకునిగానూ, కృష్ణదేవరాయలుగానూ కూడా బాలకృష్ణ నటించాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "పాతికేళ్ల 'ఆదిత్య 369'". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 16 October 2017. CS1 maint: discouraged parameter (link)
  2. ఐడిల్ బ్రెయిన్‌లో వ్యాసం Archived 2009-02-19 at the Wayback Machine - రచన: గుడిపూడి శ్రీహరి

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆదిత్య_369&oldid=3117454" నుండి వెలికితీశారు