ఆలూరి బైరాగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలూరి బైరాగి
జననంఆలూరి బైరాగి
1925, నవంబర్ 5
తెనాలి తాలూకాలోని ఐతానగరం
మరణం1978
హైదరాబాదు
మరణ కారణముక్షయవ్యాధి
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుఆలూరి బైరాగి
వృత్తిప్రముఖ తెలుగు కవి,
కథా రచయిత,
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడు
ప్రసిద్ధికేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,
మానవతావాది.
మతంహిందూ
తండ్రిఆలూరి వెంకట్రాయుడు
తల్లిసరస్వతి,

ఆలూరి బైరాగి, ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది.

బైరాగి, తెనాలి తాలూకాలోని ఐతానగరంలో 1925, నవంబర్ 5వ తేదీన సరస్వతి, ఆలూరి వెంకట్రాయుడు దంపతులకు మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. బైరాగి రెండవ తరగతి వరకే తెలుగులో చదువుకున్నాడు. ఆయన తండ్రి హిందీ చదవమని ప్రోత్సహించడంతో 1935 ప్రాంతాల్లో యలమంచిలి వెంకటప్పయ్య స్థాపించిన హిందీ పాఠశాలలో చేరారు. పదమూడో ఏట హిందీలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆయన ఉత్తరాది వెళ్లారు. పదిహేనో ఏట ఆయన హిందీలో కవితలు రాసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. తన కవితా వ్యాసంగపు తొలినాళ్లలోనే పలాయన్ అనే పేరుతో హిందీ కవితా సంకలనం ప్రచురించారు. ఎం.ఎన్.రాయ్ నెలకొల్పిన ర్యాడికల్ డెమోక్రాటిక్ పార్టీకే అంకితమయ్యారు. స్వతహాగా ఇంగ్లీషు నేర్చుకొని ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1946లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడుగా చేరారు. తెలుగులో బైరాగి మొదటి కవితా సంకలనం చీకటి నీడలు ప్రచురించారు. బైరాగి పినతండ్రి, చందమామ వ్యవస్థాపకులలో ఒకరైన చక్రపాణి (ఆలూరు వెంకట సుబ్బారావు) హిందీ చందమామకు సంపాదకత్వం వహించమని కోరడంతో మకాం మద్రాసుకు మార్చారు. తొలినుంచీ స్వేచ్ఛాజీవి అయిన బైరాగి చందమామలో కొనసాగలేక బయటకు వెళ్లిపోయారు. నూతిలో గొంతుకలు, దివ్యభవనం కథా సంపుటిని ప్రచురించారు. బైరాగి రచనలలో కెల్లా నూతిలో గొంతుకలు ఆయన ఉత్కృష్ట రచన.

బైరాగి స్వతంత్ర భావాలుగల వ్యక్తి. ఆయన తన పంథా మార్చుకోవాలని ఎవరైనా సలహాలు ఇచ్చినా నవ్వి ఊరుకొనేవారే తప్ప తన భావాలను మార్చుకునేవారు కాదు. చాలా నిరాడంబరంగా జీవించారు. 1978లో క్షయవ్యాధికి గురయ్యారు. మిత్రులు ఎంత బతిమాలినా వైద్యంపట్ల ఆసక్తి చూపలేదు. చివరిరోజుల్లో ఆయన తన మకాం హైదరాబాదుకు మార్చారు. ఆంగ్లంలో ఒక మంచి నవల రాశారు. ఆయన నవల, నాటకం, కొన్ని అముద్రితాలుగానే మిగిలిపోయాయి. బెంగాలీ భాష కూడా నేర్చుకున్నారు. బెంగాలీలో జీవనానంద దాస్ అనే కవి ఆయనకి చాలా ఇష్టం. ఆజన్మ బ్రహ్మచారి అయిన బైరాగి 1978 సెప్టెంబరు 9న మరణించారు. బైరాగికి మరణానంతరం 1984లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు.[1]

  • బైరాగి - మబ్బుల్లో పసిపాపల నవ్వులను చూడగలిగారు. కొండలపై కులికే కిరణాలకు మురిసిపోగలిగారు. అడవులలో వికసించే నవ్వులకు పరవశించగలిగారు. బైరాగి ఒక క్లిష్టప్రశ్న. ఒక నిగూఢ ప్రహేళిక, ఒక దుర్భేద్య పద్మవ్యూహం -నార్ల వెంకటేశ్వరరావు

కవితలు[మార్చు]

ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య -ప్రేమలు పొసగవు; ఈ బండరాళ్ళపైన-ఏ మొక్కలూ ఎదగవు; జీవిత ప్రభంజనం-కలయిక సహించదు; ఉన్న గడువు కొద్ది - చీకటి నీడలు

రచనలు[మార్చు]

  1. చీకటి నీడలు
  2. ఆగమ గీతి (కేంద్ర సాహిత్య ఆకాడెమీ పురస్కారం)
  3. నూతిలో గొంతుకలు
  4. దివ్య భవనం (కథలు)

బయటి లంకెలు[మార్చు]

  • ఆలూరి బైరాగి రాసిన ఆగమ గీతి గ్రంథం
  • "Aluri Bairagi,ఆలూరి బైరాగి. - LastDaysofEminentPersons4". sites.google.com. Retrieved 2020-04-21.

మూలాలు[మార్చు]

  1. Encyclopaedia of Indian literature vol. 1 By Amaresh Datta, various పేజీ.328 [1]