ఇంగువ కార్తికేయశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంగువ కార్తికేయశర్మ
ఇంగువ కార్తికేయశర్మ
జననంఅక్టోబరు 15 1937
నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు
మరణంనవంబరు 28 2013
జాతీయతభారతీయుడు
వృత్తిసాలార్‌జంగ్ మ్యూజియం డైరక్టర్

ఇంగువ కార్తికేయశర్మ ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త, శాసన పరిశోధకులు.ఆయన పురాతత్వ శాస్త్రంలోనే కాకుండా కళలు, ఆర్కిటెక్చర్, ప్రాచీన కట్టడాల పరిరక్షణ వంటి అంశాలలో ప్రసిద్ధులు. ఆంధ్ర ప్రదేశ్ లోని నాగార్జునకొండ (1956-57), గుడిమల్లం (1974-75), అమరావతి (1974-75), గుంటుపల్లి (1985-87), పెదవేగి (1985-87), రాజస్థాన్ లోని కాలీభంగం (1960-62 & 1964-66), తమిళనాడులోని పయ్యాంవల్లి (1968), మహారాష్ట్ర లోని పూణె (1969-70), గుజరాత్ లోని సుర్ కొర్తా (1970-71) ప్రాంతాలలో చేపట్టిన తవ్వకాలలో ప్రధాన పాత్ర పోషించారు.[1] ఆయన సాలార్‌జంగ్ మ్యూజియం డైరక్టర్ గా పనిచేసారు. ప్రతి శాఖకు ఎంతో సేవ చేసి ఆయా శాఖలకు సంబంధించి ఎన్నో ప్రజ్ఞాపూర్వకమైన వ్యాసాలు రచించారు. నాలుగు దశాబ్ధాలపాటు భారతీయ పురావస్తుశాఖలో వివిధ విభాగాల్లో అనేక హోదాల్లో పనిచేశారు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు గ్రామంలో అక్టోబరు 15 1937లో జన్మించారు. ఆయన ఎ.ఎస్.ఐ., న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీలో పి.జి.డిప్లొమా చేసారు.నాగపూర్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసారు.[[3] చిన్న వయసునుండే శాసన పరిశోధనలు అవిరామంగా చేసి, పి.హెచ్.డి పొందారు. నాగపూర్‌లోని తవ్వకాల విభాగంలో పనిచేస్తూ, ఆఫీసుకు వచ్చే ముందు ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ క్లాస్ లకు వెళ్లి ఎం.ఏలో గోల్డ్ మెడల్ సాధించారు.[4] ఆయన 1958 లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో టెక్నికల్ అసిస్టెంటుగా చేరారు. 1983 లో నాగపూరులోని ఆర్కియాలజిస్టు ఆఫ్ ద ఎక్స్‌కవేషన్ బ్రాంచికి సూపరింటెండెంట్ గా ఉన్నారు. అక్కడ ఒక దశాబ్దం పాటు విధులను నిర్వర్తించారు. 1993 నుండి 1997 వరకు సాలార్జంగ్ మ్యూజియంకు డైరక్టరుగా ఉన్నారు.[1]

పరిశోధనలు[మార్చు]

కేవలం పురాతన శాసన పరిశోధనలు, పురాతన పత్రాల సేకరణ, వారసత్వపు కట్టడాల గుర్తింపు, భద్రత కల్పించడం మొదలగు వాటితో సరిపెట్టుకోకుండా తవ్వకాల విషయంలో పలు నూతన విధానాలను ప్రవేశ పెట్టారు. చరిత్రకు కొత్త ఆధారాలను చూపాలనే తృష్ణ, దీక్షలతో పరిశోధన రంగంలో అప్రతిహతంగా దూసుకు పోయారు. హైదరాబాదు సర్కిల్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా, ఇన్ చార్జ్‌గా పనిచేసిన ఐ.కె. రాష్ట్రంలోని పురావస్తు స్థలాలన్ని టినీ సందర్శించారు. లేపాక్షి బసవయ్యకు వేదిక నిర్మించారు. దేశంలో తొలి శివాలయం గుడిమల్లంలో ఉందని నిర్ధారించి ఆలయానికి హద్దులు ఏర్పరచారు. ఏలూరు సమీపంలోని పెదవేగి, గుంటుపల్లి లోని బౌద్ధారామాలను వెలుగులోకి తెచ్చారు. రైతులతో సంప్రదించి భూమి తగాదాలను పరిష్కరించి పురావస్తు కేంద్రంగా పర్యాటక చిత్ర పటంలో చేర్చడంలో ఆయన శైలి అనన్యం.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనల నేపథ్యంలో నంది కొండ తదితర గ్రామాల్లో ముంపునకు గురికానున్న బౌద్ధ- వైదికమత శిల్పాలను దేశంలో తొలిసారి తరలించారు. నాగార్జునకొండలో ఆ శిల్పాలు సందర్శనీయాలు. దేశంలో తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘కూడలి’ సంగమేశ్వర ఆలయాన్ని ‘ట్రాన్స్‌ప్లాంట్’ చేశారు. ఈ రెండు అపూర్వ ఘట్టాలలోనూ ఆయన కృషి చేసారు.[4]

ప్రామాణిక గ్రంథ కర్తగా[మార్చు]

ఆయన పురావస్తు శాస్త్రానికి సంబంధించిన ఎన్నో ప్రామాణిక గ్రంథాలు రాసారు. వాటిలో ముఖ్యమైనవి.[5]

 • కాయినేజ్ ఆఫ్ ద శాతవాహన ఎంపైర్ (Coinage of the Satavahana Empire) (1980)
 • ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్: విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రదేశ (The Development of Early Śaiva Art and Architecture: With Special Reference to Āndhradēśa) (1982)
 • బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఆఫ్ చైనా అండ్ సౌత్ ఈస్ట్ ఇండియా: ఏన్ ఆర్కియాలజికల్ పెర్స్పెక్టివ్ (Buddhist Monuments of China and South-East India: An Archaeological Perspective) (1985)
 • రెలిజియన్ ఇన్ ఆర్ట్ అండ్ హిస్టారికల్ ఆర్కియాలజీ ఆఫ్ సౌత్ ఇండియా: కాంటాక్ట్స్ అండ్ కొరిలేషన్స్ (Religion in Art and Historical Archaeology of South India: Contacts and Correlations) (1987)
 • స్టడీస్ ఇన్ ఎర్లీ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అండ్ బ్రాహ్మీ ఇన్సక్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రదేశ (Studies in Early Buddhist Monuments and Brāhmī Inscriptions of Āndhradēśa) (1988)
 • టెంపుల్స్ ఆఫ్ గంగాస్ ఆఫ్ కర్నాటక (Temples of the Gaṅgas of Karṇāṭaka) (1992)
 • సౌత్ ఇండియన్ కాయినేజ్: ఎ రివ్యూ ఆఫ్ రీసెంట్ డిస్కవరీస్ (South Indian coinage: A review of recent discoveries) (1992)
 • పరశురామేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం (Paraśurāmēśvara Temple at Gudimallam: A probe into its origins) (1994)
 • ఎర్లీ బ్రాహ్మీ ఇన్సక్రిప్షన్స్ ఫ్రమ్‌ సన్నతి (Early Brāhmī Inscriptions from Sannati) (1993): దీనిని జె. వరప్రసాదరావుతో సంయుక్తంగా రచించారు.
 • న్యుమిస్‌మాటిక్ రీసెర్చ్‌స్: క్రిటికల్ స్టడీస్ ఫ్రమ్‌ ఎక్స్‌కవేటేడ్ కాంటెస్ట్ (Numismatic researches: Critical studies from excavated context) (2000)
 • రూట్స్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్: ఎస్సేస్ ఆన్ ప్రీ అండ్ ప్రోటోహిస్టారిక్ కల్చర్స్ (Roots of Indian civilization : essays on pre and protohistoric cultures) (2000)
 • ద ఏన్షియంట్ సిటీ ఆఫ్ వేంగిపుర: ఆర్కియాలజికల్ ఎక్స్‌కవేషన్స్ ఎట్ పెదవేగి (The Ancient City of Vengīpurā: Archaeological Excavations at Peddavegi) (2002)

ఎ.వి.నరసింహ మూర్తి, డి.వి. దేవరాజ్, రంగయ్య గోపాల్ తదితరులతో కలిపి పురావస్తు విషయాలపై నరసింహప్రియ (Narasiṁhapriyā) అనే వ్యాస సంపుటిని రచించారు.[6] అదేవిధంగా ఆర్. సుబ్రహ్మణ్యంచే రచించబడిన శ్రీ సుబ్రమణ్య స్మృతి (Śrī Subrahmaṇya Smr̥tī) అనే పురావస్తు విషయాలకు సంబంధించిన వ్యాస సంపుటికి బి. విద్యాధరరావుతో కలిపి సహా సంపాదకుడిగా ఉన్నారు.[7] వీటిలో ఆర్కియాలజీ, పురాతన శాసనాలు, నాణేలు, కళలు, వాస్తు నిర్మాణాలు, రేఖా చిత్రాలు, సాంస్కృతిక చరిత్రలకు సంబంధించిన వ్యాసాలున్నాయి.

పురావస్తు శాస్త్రానికి సంబంధించి ఆయన రాసిన బ్రాహ్మినికల్ బ్రిక్ టెంపుల్స్ అండ్ కల్ట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్‌ కీసరగుట్ట (Brahminical Brick Temples and Cult objects from Keesaragutta) (1987), పురాతన-మధ్యయుగాల్లో కృత్రిమ నీటిసరఫరా విధానాలు (Artificial Water Systems in Ancient and Medieval India) వంటి ఎన్నో వ్యాసాలు ప్రామాణికతను సంతరించుకొన్నాయి.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మానవ పురుషాంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం అనే గ్రామంలో ఉంది. ఈ గుడి గురించి పరిశోధించిన విషయాలను ఆయన ‘పరశురామేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం’ ‘ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే పుస్తకాలలో వ్రాసారు.[8]

కట్టడాల మార్పిడి[మార్చు]

ప్రపంచంలో తొలి మార్పిడి ఈజిప్ట్‌ లోని అబుసింబల్. రెండవది మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపురం. ఈజిప్ట్ చక్రవర్తి రెండవ ఫారోస్ రామ్‌సేస్, అతని భార్య నెఫర్తరి క్రీ.పూ.13వ శతాబ్దంలో నిర్మించిన అబుసింబల్ కు నైలునదిపై ఆస్వాన్ డ్యాంతో ముంపు ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యునెస్కో ఆధ్వర్యంలో 50 దేశాల పురావస్తు బృందాలు 1960 లలో ఆ కట్టడాలను ట్రాన్స్ ప్లాంట్ చేశాయి. ఆ క్రమంలో పెద్ద శిల్పాలను పగులగొట్టి పునః నిర్మాణంలో స్టీల్ రాడ్లతో అతికించారు. భారీ యంత్రాలను వాడి 40 మిలి యన్ల డాలర్లు ఖర్చుపెట్టారు. అటువంటి ప్రమాదమే మహబూబ్‌నగర్ జిల్లా, ‘కూడలి’ గ్రామంలో సా.శ. 6వ శతాబ్దంలో మొదటి విక్రమాదిత్యుడు నిర్మించిన ఆల యానికి శ్రీశైలం జలవిద్యుద్కేంద్ర నిర్మాణ నేపథ్యంలో ఏర్పడింది. కృష్ణ-తుంగభద్ర సంగమస్థలి లోని కూడలి సంగమేశ్వరాలయం భారతదేశంలోని అన్ని శిల్పసంప్రదాయాల కూడలి. ఈ ఆలయాన్ని మార్పిడి చేయాలని పురావస్తుశాఖలో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న ఐ.కె. శర్మ, డెరైక్టర్ జనరల్ జగపతి జోషిని ఒప్పించారు. పరిసర గ్రామాల ప్రజల సహకారంతో, భారీ యంత్రాలేమీ వాడకుండా, రాయివెంట రాయిని సశాస్త్రీయంగా వెలికితీసి, ఎడ్లబండ్లపై తరలించి పునః నిర్మాణం చేయించారు. 14 శతాబ్దాల తర్వాత 1990 ఫిబ్రవరి 23న శివరాత్రి రోజున కూడలి సంగమేశ్వరుని పునః ప్రతిష్ఠ జరగడాన్ని స్థానికులు తాజా సంఘటనగా చెప్పుకుంటారు.[9]

అస్తమయం[మార్చు]

ఆయన 2013 నవంబరు 28 గురువారం నాడు మరణించారు.[10]

ఇతర లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Archaeologist I.K. Sarma passes away". SPECIAL CORRESPONDENT. హిందూ పత్రిక. 2013-11-29.
 2. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా ఎడిసన్[permanent dead link]
 3. "Doyen of archaeology I K Sarma no more". హన్స్ ఇండియా. 2013-11-29.
 4. 4.0 4.1 "ఇతిహాస పరిమళం 'ఇంగువ'". పున్నా కృష్ణమూర్తి. సాక్షి. 2013-12-01.
 5. "Inguva Karthikeya Sarma".
 6. "Narasiṁhapriyā". google books. Retrieved 28 September 2017.
 7. "Śrī Subrahmaṇya smr̥tī". google books. Retrieved 28 September 2017.
 8. పరశురామేశ్వరుడు కేరాఫ్ గుడిమల్లం
 9. tranplant of kudali samgameswara temple and some agamic principles by i.k.sarma
 10. Doyen of archaeology I K Sarma no more