మంచుమనిషి
ఈట్జి | |
---|---|
జననం | సుమారు 3300 సా.శ.పూ. ఉత్తర ఇటలీలో ఉన్న ప్రస్తుత గ్రామం - ఫెల్డ్‌థర్స్న్ |
మరణం | (దాదాపు 45 ఏళ్ళ వయసు) ఆస్ట్రియా. ఇటలీ సరిహద్దులో హాస్‌లాబ్‌చో వద్ద గల ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో |
మరణ కారణం | భుజంలో అయిన బాణపు దెబ్బ[1] |
ఇతర పేర్లు | మంచుమనిషి ఈట్జి సిమిలువాన్ మనిషి "ఫ్రోజెన్ ఫ్రిట్జ్" హాస్‌లాబోచ్ మనిషి హాస్‌లాబోచ్ మమ్మీ ఫ్రోజెన్ మ్యాన్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రాగియుగపు ఐరోపా వ్యక్తి యొక్క, అత్యంత పురాతన, ప్రకృతి సహజ మమ్మీ |
ఎత్తు | 1.65 మీ. (5 అ. 5 అం.) |
వెబ్‌సైటు | South Tyrol Museum of Archaeology |
సామాన్య శక పూర్వం 3,359 - 3,105 సంవత్సరాల మధ్య నివసించిన పురుషుని మమ్మీ, మంచుమనిషి. ఇది ప్రకృతి సహజంగా తయారైన మమ్మీ. 1991 సెప్టెంబరులో, ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో, ఆస్ట్రియా, ఇటలీల సరిహద్దు వద్ద ఈ మమ్మీని కనుగొన్నారు. ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో లభించింది కాబట్టి ఈ మమ్మీని ఈట్జి అని కూడా పిలుస్తున్నారు. ఈ వ్యక్తి సా.శ.పూ 3,239 - 3,105 సంవత్సరాల మధ్య మరణించి ఉండేందుకు 66 శాతం అవకాశాలున్నాయి. ఇది ఐరోపాకు చెందిన, అత్యంత పురాతన, ప్రకృతి సహజ మమ్మీ. రాగియుగపు యూరపియన్ల గురించి పరిశోధకులకు అంతకుముందు తెలియని సమాచారం ఈ మమ్మీ ద్వారా లభించింది. అతడి దేహాన్ని, వస్తువులనూ ఇటలీ, దక్షిణ టైరోల్ లోని పురావస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.
వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు దేహంపై అనేక పరీక్షలు చేసి తాము కనుగొన్న విషయాలను విశ్లేషించారు. చనిపోయినపుడు ఆ వ్యక్తి వయసు, అతడి జీవన శైలి, వృత్తి, అతడి ఆహారపు అలవాట్లు, చనిపోయేముందు అతడు ఏమి తిన్నాడు, ఎన్ని గంటల ముందు తిన్నాడు వంటి అనేక అంశాలను వెలుగులోకి తెచ్చారు. అతడి మరణ కారణంపై శాస్త్రవేత్తలకు భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ, అతడిది హింసాత్మక మరణమనే విషయంపై స్థూలంగా ఏకాభిప్రాయం ఉంది.
ఆవిష్కరణ
[మార్చు]1991 సెప్టెంబరు 19 న ఆల్ప్స్ పర్వతాల్లో 3,210 మీటర్ల ఎత్తున ఇద్దరు జర్మను యాత్రికులు హెల్ముట్ సైమన్, ఎరికా సైమన్‌లకు ఆస్ట్రియా-ఇటలీ సరిహద్దులోని ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో తూర్పు శిఖరం పైన ఈ మమ్మీ కనబడింది. ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో లభించింది కాబట్టి ఈ మమ్మీని ఈట్జి అని కూడా పిలుస్తున్నారు. వారు ఈ మమ్మీని చూసినపుడు, అది ఇటీవలే మరణించిన పర్వతారోహకుడి శవమై ఉంటుందని భావించారు.[2] మరుసటి రోజున ఒక పర్వత ప్రాంత పోలీసు, సమీపంలోని పర్వత విడిది కీపరు ఒకతనూ కలిసి, నడుం దాకా మంచులో దిగబడి ఉన్న ఆ దేహాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించారు. కానీ వాతావరణం అనుకూలించక మధ్యలోనే ఆపేసారు. సెప్టెంబరు 22, 23 తేదీల్లో ఆ దేహాన్ని వెలికితీసి, వైద్య పరీక్ష కోసం, దాంతో పాటు దొరికిన వస్తువులతో సహా ఇన్స్‌బ్రూక్‌కు తరలించారు. సెప్టెంబరు 24 న పురాతత్వవేత్త కాన్‌రాడ్ స్పిండ్లర్ ఆ దేహాన్ని, వస్తువులనూ పరీక్షించాడు. వస్తువుల్లోని గొడ్డలిని పరిశీలించాక, ఆ దేహం వయస్సు దాదాపు నాలుగువేల సంవత్సరాలు ఉంటుందని అతడు అంచనా వేసాడు.[3][4]
శాస్త్రీయ విశ్లేషణ
[మార్చు]ప్రదర్శనశాలలో దేహానికి విస్తృతంగా పరీక్షలు చేసారు. కణాలను, పేగుల్లోని అవశేషాలనూ సూక్ష్మంగా పరీక్షించారు. ఇదిలా ఉండగా, 1918 లో మరణించిన ముగ్గురు ఆస్ట్రో హంగేరియన్ సైనికుల ఘనీభవించిన శరీరాలను పుంటా శాన్ మాటియో పర్వతంపై 2004 ఆగస్టులో కనుగొన్నారు. వీటిలో ఒక దేహాన్ని ప్రదర్శనశాలకు పంపించారు. ఈట్జిపై పరిశోధనలో, మంచు మానవ శరీరాన్ని ఎలా పరిరక్షిస్తుందో తెలుసుకునేందుకు ఈ సైనికుడి దేహం పనికొస్తుందని భావించారు.[5]
దేహం
[మార్చు]ఇప్పటి అంచనాల ప్రకారం, చనిపోయేనాటికి ఈట్జి, సుమారు 1.65 మీ ఎత్తు,[6] 50 కిలోల బరువూ ఉన్న 45 ఏళ్ళ వ్యక్తి.[7] దేహాన్ని వెలికితీసిపుడు దాని బరువు 13.75 కిలోలు.[8] మరణించగానే, దేహం మంచుతో కప్పబడిపోయింది కాబట్టి, అది పాక్షికంగానే శిథిలమైంది. పుప్పొడి, దుమ్ము, పంటి పింగాణీలోని ఐసోటోపులనూ పరీక్షించాక, అతడు తన బాల్యాన్ని ఉత్తర ఇటలీ లోని బొల్జానో ప్రావిన్సుకు చెందిన ఫెల్డ్‌తర్న్‌స్ గ్రామానికి దగ్గర్లో గడిపాడని, తరువాతి కాలంలో అక్కడికి 50 కి.మీ ఉత్తరాన ఉన్న లోయల్లో నివసించేందుకు తరలి వెళ్ళి ఉంటాడనీ తెలుస్తోంది.[9]
ఈట్జి చిన్న ప్రేవుల్లోని అవశేషాలను పరీక్షించగా, రెండు భోజనాలు అందులో ఉన్నట్లు గమనించారు. (రెండవది, మరణించడానికి 8 గంటల ముందు తిన్నాడు). ఒకటి కొండగొర్రె మాంసం కాగా, రెండోదానిలో ఎర్ర జింక, హెర్బ్ బ్రెడ్ ఉన్నాయి. రెండూ కూడా ధాన్యం, దుంపలు, పండ్లతో తిన్నాడు. ధాన్యం గోధుమ నూకతో చేసినది. అది బ్రెడ్ రూపంలో తిని ఉంటాడు.[10] మరణానికి కొన్ని నెలల ముందు ఏమి తిన్నాడో అతడి వెంట్రుకలను విశ్లేషించి తెలుసుకున్నారు.
2009 లో దేహంపై ఒక క్యాట్ స్కాన్ నిర్వహించగా, అతడి కడుపు కొద్దిగా పైకి, ఊపిరితిత్తుల కింది భాగం వద్దకు జరిగిందని తెలిసింది. కడుపులో పాక్షికంగా జీర్ణమైన ఐబెక్స్ మాంసపు అవశేషాలు కనిపించాయి. మరణానికి రెండు గంటల ముందు అతడది తిన్నట్లుగా ఇది సూచిస్తోంది. గోధుమ దాణాలనూ గమనించారు.[11]
ఈట్జి వెంట్రుకల్లో అధిక స్థాయిలో రాగి కణాలు, ఆర్సెనిక్ కనిపించాయి. పైగా అతడి గొడ్డలి 99.7% స్వచ్ఛమైన రాగితో తయారు చెయ్యబడి ఉంది. వీటిని బట్టి అతడు రాగి శుద్ధిపరచే పని చేసేవాడని భావించారు.[12]
ఈట్జి ముంగాలి ఎముక, తొడ ఎముక, కటి భాగాల నిష్పత్తిని పరిశీలించాక, పర్వత ప్రాంతాల్లో బాగా నడవడం అతడి దినచర్యలో భాగంగా ఉండేదని నిర్ధారించారు. ఈ స్థాయిలో సంచరించడం ఇతర రాగియుగపు యూరపియన్ల జీవన శైలిలో భాగంగా ఉండేది కాదు. ఈట్జి ఎత్తైన ప్రదేశాల్లో నివసించిన గొర్రెల కాపరి అయి ఉండవచ్చని రఫ్ ప్రతిపాదించాడు.[13]
ఆధునిక 3-D సాంకేతికతను వాడి, ఈట్జి ముఖాన్ని పునఃసృష్టి చేసారు. గుంట కళ్ళతో, గడ్డంతో, ముడతలు పడ్డ మొహం, జారిన చెంపలతో, 45 ఏళ్ళ ఈట్జి తన వయసు కంటే పెద్దవాడిగా, అలసిపోయి ఉన్నట్లుగా కనిపించాడు.[14]
ఆరోగ్యం
[మార్చు]ఈట్జి చిన్న ప్రేవుల్లో సూక్ష్మ క్రిములు కనిపించాయి. మూణ్ణాలుగు కుడి పక్కటెముకలు విరిగినట్లుగా CT స్కాన్లలో గమనించారు. మరణించాక బోర్లా పడి ఉండటానగానీ, మంచు అతడి దేహాన్ని నొక్కివెయ్యడానగానీ ఇది జరిగి ఉండవచ్చు. అతడి గోళ్ళు రెండు దొరకగా, ఒకదానిపై మూడు బ్యూ లైన్లు కనిపించాయి. మరణానికి ఆర్నెల్ల ముందు మూడుసార్లు అతడు జబ్బు పడినట్లు అవి సూచిస్తున్నాయి. మరణానికి రెణ్ణెల్ల ముందు చివరిసారి జబ్బు పడగా అది రెండు వారాల పాటు అతణ్ణి బాధించింది.[15] అతడి చర్మపు పైపొర లేదు. మంచులో కూరుకుపోవడం వలన అది పోవడం సహజమే.[16] అతడి పళ్ళలో దంతక్షయం కనిపించింది. ధాన్యాలు, పిండిపదార్థాలు అధికంగా ఉండే ఆహారం దీనికి కారణమై ఉండవచ్చు.[17] 2012 ఫిబ్రవరిలో చేసిన DNA విశ్లేషణ, ఈట్జికి పాలు సరిపడేవి కావని వెల్లడించింది. వ్యవసాయం, పశుపోషణ బాగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఆ కాలానికి కూడా మానవుడికి పాలు సరిపడేవి కావు అనే సిద్ధాంతానికి ఈ విశ్లేషణ బలం చేకూర్చింది.[18]
బట్టలు బూట్లూ
[మార్చు]ఈట్జి దుస్తులు ఆడంబరంగా ఉన్నాయి. గడ్డితో నేసిన చొక్కా[19], ఒక కోటు, బెల్టు, పాంటు, మొలగుడ్డ, బూట్లూ ధరించి ఉన్నాడు. ఎలుగుబంటి చర్మంతో చేసిన టోపీ పెట్టుకుని గడ్డం చుట్టూ తాడుతో దాన్ని కట్టుకుని ఉన్నాడు. బూట్లు వెడల్పుగా, నీళ్ళు లోనికి పోలేని విధంగా, మంచులో నడిచేందుకు అనువుగా చేసినట్లు ఉన్నాయి. బూట్ల అడుగుభాగం ఎలుగుబంటి చర్మంతోటి, పైభాగం జింక చర్మంతోటీ, లేసులు చెట్టు బెరడు తోటీ చేసి ఉన్నాయి. బూట్ల లోపల, కాలి చుట్టూ మెత్తటి గడ్డి పేర్చి ఉంది, సాక్సు లాగా. కోటు, బెల్టు, పాంట్లు, మొలగుడ్డలను నిలువుగా చీరిన తోలు ముక్కలను, జంతువుల నరాలతో కుట్టి తయారుచేసారు. అతడి బెల్టుకు ఒక సంచీ ఉంది. అందులో అతడికి పనికివచ్చే స్క్రేపరు, డ్రిల్లు, ఎముకతో చేసిన ఆయుధం, ఎండబెట్టిన పుట్టగొడుగూ ఉన్నాయి.[20]
బూట్లను చెకొస్లొవేకియాకు చెందిన శాస్త్రవేత్త ఒకరు పునర్నిర్మించాడు. "బూట్లు చాలా సంక్లిష్టంగా ఉండటాన్ని బట్టి, ఆ కాలంలోనే ప్రజల కోసం బూట్లు తయారు చేసేందుకు చర్మకారులు ఉండేవారని నేను నమ్ముతున్నాను" అని ఆయన అన్నాడు. ఈ పునర్నిర్మించిన బూట్లు ఎంత బాగా ఉన్నాయంటే, అలాంటివాటిని తయారుచేసి అమ్మేందుకు హక్కులు కావాలని ఓ చెక్ కంపెనీ కోరింది[21]. అయితే, ఈ మధ్య ఓ బ్రిటిషు పురాతత్వవేత్త జాకీ ఉడ్ ప్రకారం ఈట్జి బూట్లు నిజానికి మంచుబూట్ల పైభాగం. ఆయన సిద్ధాంతం ప్రకారం దేన్నైతే బ్యాక్‌ప్యాక్‌లో భాగమని అనుకుంటున్నారో, అది ఒక మంచుబూటులోని భాగమైన చెక్క ఫ్రేము.[22]
పనిముట్లు
[మార్చు]ఈట్జి వద్ద లభించిన ఇతర వస్తువులు -యూ అనే చెట్టు కర్రతో చేసిన కర్ర కలిగిన రాగి గొడ్డలి, క్వార్ట్ రాతితో చేసిన చాకు, 14 బాణాలు, అమ్ములపొది. వీటిలో రెండు బాణాలు విరిగి ఉన్నాయి. ఇవి క్వార్ట్జ్ రాతి మొన కలిగి, వెనక చివర రెక్కలు కలిగి ఉన్నాయి. మిగతా 12 బాణాల తయారీ పూర్తి కాలేదు. వీటికి మొన లేదు. బాణాలు అమ్ములపొదిలో ఉన్నాయి. వాటితో పాటు వింటినారి లాంటిది కూడా ఉంది. గుర్తు తెలియని మరొక పనిముట్టు కూడా అందులో ఉంది, ఎముకతో చేసిన మరొక పనిముట్టు కూడా ఉంది, అది బహుశా బాణపు మొనకు సాన పెట్టేందుకు వాడి ఉండవచ్చు.[23] అక్కడ 1.82 మీ పొడవున్న ధనుస్సు కూడా దొరికింది. యూ కర్రతో చేసిన ఆ ధనుస్సు తయారీ ఇంకా పూర్తి కాలేదు.[24]
ఇవి కాకుండా ఈట్జి వద్ద బెర్రీలు, రెండు బిర్చ్ బార్క్ బుట్టలు, తోలు తీగలకు తగిలించి ఉన్న రెండు రకాల పోలిపోర్ పుట్టగొడుగులు కూడా లభించాయి. వీటిలో ఒకటైన బిర్చి పుట్టగొడుగుకు, దేహంలోని పరాన్న జీవులను నిర్మూలించే ఔషధ గుణాలున్నాయి. వీటిని బహుశా వైద్యం కోసం వాడుతూ ఉండి ఉండవచ్చు.[25] రెండోది, టిండెర్ ఫంగస్. ఇది నిప్పును తయారుచేసే ఇతర మొక్కలతో పాటు ఉంది. నిప్పును రగిల్చే క్వార్ట్జ్ రాయి, పైరైట్లు కూడా ఉన్నాయి.
ఈట్జి వద్ద ఉన్న రాగి గొడ్డలి ఆసక్తికరంగా ఉంది. దాని కర్ర 60 సెం.మీ పొడవుతో యూ చెట్టు కర్ర నుండి తయారుచేసి ఉంది. చివరన లంబకోణంలో వంపు తిరిగి ఉంది. గొడ్డలి కర్రు 9.5 సెం.మీ పొడవుతో స్వచ్ఛమైన రాగితో తయారై ఉంది. పోతపోసి, ఫోర్జింగుతో మలచి, మెరుగుపెట్టి, పదును పెట్టీ దాన్ని తయారుచేసారు. ఆ మొనను కర్ర యొక్క లంబకోణపు వంపులోకి దూర్చి, బిర్చి తాడుతోటి, తోలుతోటీ గట్టిగా కట్టారు. ఈ కట్టులోంచి పొడుచుకువచ్చిన గొడ్డలి అంచుమీద దాన్ని వాడిన గుర్తులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ కాలంలో గొడ్డలి ఒక ముఖ్యమైన పనిముట్టు అయి ఉంటుంది. దాన్ని కలిగి ఉండటం ఒక హోదాకు సూచిక కూడా అయి ఉండవచ్చు.[26]
జన్యు విశ్లేషణ
[మార్చు]ఈట్జి పూర్తి జన్యురాశిని క్రమీకరణ చేసి, నివేదికను 2012 ఫిబ్రవరి 28 న ప్రకటించారు.[27] .
టోసోమల్ DNA ప్రకారం ఈట్జికి దక్షిణ యూరపియన్లతో బాగా దగ్గర సంబంధాలున్నాయి. ముఖ్యంగా భౌగోళికంగా విడిగా ఉన్న కార్సికన్లకు, సార్డీనియన్లకు సంబంధాలు కనిపిస్తున్నాయి.[28][29][30][31]
పాలియో ఆంత్రోపాలజిస్టు జాన్ హాకిన్స్ 2012 లో ప్రచురించిన పత్రంలో ఈట్జిలో ఆధునిక యూరపియన్ల కంటే నియండర్తల్ మానవుని వారసత్వం ఎక్కువగా కనిపిస్తోందని చెప్పాడు.[32]
2013 అక్టోబరు 2013 లో, 19 మంది ఆధునిక టైరోలియాన్ పురుషులు ఈట్జి సంబంధీకులని తెలిసింది. ఇన్‌స్‌బ్రూక్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, 3700 మంది పురుష రక్తదాతల DNA పై చేసిన పరిశోధనలో 19 మందిలో మంచుమనిషికే చెందిన ఒక జన్యు మ్యుటేషన్ ఉందని కనుక్కున్నారు.[33]
రక్తం
[మార్చు]ఈట్జి శరీరంలో రక్తకణాలు ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయని 2012 మేలో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటి వరకు కనుగొన్న మానవ రక్తకణాల్లో ఇవే అత్యంత పురాతనమైనవి. ఇంత పురాతన దేహాల్లో రక్తకణాలు కుచించుకుపోయి గానీ, శిథిలమై అవశేషాలుగా గానీ ఉంటాయి. కానీ ఈట్జి రక్తకణాలు సజీవ రక్తకణాల పరిమాణంలో ఉన్నాయి. అవి ఆధునిక కాలంనాటి రక్త నమూనాలాగే ఉన్నాయి.[34][35]
H. pylori విశ్లేషణ
[మార్చు]ఈట్జి ప్రేవుల్లో లభించిన హెలికోబాక్టర్ పైలోరి మూలాలను తెలుసుకొనేందుకు గాను జీర్ణాశయం, అన్నవాహికల నుండి సేకరించిన 12 నమూనాలపై చేసిన పరిశీలనల ఫలితాలను 2016 లో ప్రకటించారు.[36] అతడి అన్నవాహికలో దొరికిన H. pylori స్ట్రెయిన్ దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రజల్లో ఉంటుంది, యూరపియన్లలో ఇది చాలా చాలా అరుదుగా ఉంటుంది.[36] ఈ స్ట్రెయిన్‌కు భారతదేశంలో లభించే మూడు hpAsia2 జెనోమ్‌లతో అత్యంత దగ్గరి పోలికలున్నాయి[36]
మరణ కారణం
[మార్చు]ఈట్జి మంచు తుపానులో చిక్కుకుని మరణించి ఉంటాడని తొలుత భావించారు. తరువాత, బహుశా అతడు తన తెగకు నాయకుడు కావడాన, సాంప్రదాయిక కర్మకాండలో భాగంగా అతణ్ణి బలి ఇచ్చి ఉండవచ్చని ఊహించారు.[37] ఇలా అనుకోవడానికి కారణం.. ఊబిలోంచి వెలికితీసిన టోలండ్స్ మ్యాన్, లిన్‌డో మ్యాన్ వంటి సా.శ.పూ. మొదటి సహస్రాబ్ది నాటి శవాలు.[38]
2001 లో తీసిన ఎక్స్-రేలు, సిటీ స్కానుల్లో ఈట్జి చనిపోయేటప్పుడు ఎడమ భుజంలో బాణపు ములుకు దిగబడి ఉందనీ,[39] దానికి సరిపోలే చిరుగు అతడి కోటుకు ఉందనీ తేలింది.[40] ఈ బాణపు ములుకు చేసిన గాయం నుండి రక్తం కారిపోయి ఈట్జి మరణించి ఉంటాడని పరిశోధకులు భావించారు. ఆధునిక వైద్య సదుపాయాలున్నా సరే, ఆ దెబ్బ తాకిడికి అతడు మరణించి ఉండేవాడు.[41] మరింత పరిశోధనలో, మరణానికి ముందు బాణపు కర్రను లాగేసినట్లు తేలింది. దేహంపై చేసిన సూక్ష్మ పరిశోధనలో గాట్లు, చేతులకు, మణికట్లకు, ఛాతీపైన గాయాలూ కనిపించాయి. మెదడుపై కూడా గాయం ఉంది. తలకు బాగా దెబ్బ తగిలినట్లు అది సూచిస్తోంది. బొటనవేలు మొదట్లో ఒక గాటు ఉంది. అది లోతుగా, ఎముక వరకూ ఉంది. ఆ గాయం మానే లోపే అతడు మరణించాడు. తలకు తగిలిన దెబ్బ కారణంగా అతడు మరణించి ఉండొచ్చని ఇప్పుడు భావిస్తున్నా, ఆ దెబ్బ ఎలా తగిలి ఉండొచ్చనేది పరిశోధకులకు ఇదమిత్థంగా తెలీలేదు.[42]
ఈమధ్య కాలంలో చేసిన DNA విశ్లేషణల ప్రకారం, అతడి వస్తువులపై కనీసం మరో నలుగురు వ్యక్తుల రక్తపు మరకలు ఉన్నట్లుగా తేలింది. అతడి కత్తిపైన ఒకటి, ఒక బాణపు ములుకుపైన ఇద్దరివి, కోటుపై నాలుగోదీ ఉన్నాయి.[43][44] ఈ వివరాలను బట్టి ఇలా ఊహించారు: ఈట్జి ఒకే బాణంతో ఇద్దరిని చంపాడు, రెండు సందర్భాల్లోనూ వాళ్ళ శరీరాల్లోంచి బాణాన్ని బయటికి లాగేసాడు. తన మిత్రుడొకడు గాయపడగా అతణ్ణి మోసుకెళ్ళి ఉంటాడు, అప్పుడా వ్యక్తి రక్తం ఈట్జి కోటుకు అంటి ఉంటుంది.[40] మరణించినపుడు ఈట్జి పడి ఉన్న స్థితి చూస్తే (గడ్డకట్టిన దేహం బోర్లా పడి, ఎడమ చేయి ఛాతీకి అడ్డంగా మడిచి ఉంది) మరణానికి ముందు, మంచు కారణంగా రిగర్ మార్టిస్ మొదలవడానికి ముందు, శరీరంలో దిగిన బాణాన్ని లాగేసే ప్రయత్నంలో అతడు బోర్లా పడుకుని ఉంటాడు అని భావించవచ్చు.[45]
ఈట్జి పర్వతాలపై దిగువ ప్రాంతాల్లోనే మరణించి ఉండొచ్చనీ, తరువాత అతణ్ణి ఎగువ ప్రాంతాల్లో ఖననం చేసి ఉండొచ్చనీ 2010 లో పురాతత్వవేత్త అలస్సాంద్రో వాంజెట్టి, అతడి సహోద్యోగులూ ప్రతిపాదించారు.[46] ఈట్జి దొరికిన పరిసరాల్లోను, ఇతర ప్రదేశాల్లోనూ వాళ్ళు చేసిన పరిశోధనలను అనుసరించి, ఈట్జిని ఒక ఖనన వేదికపై ఉంచి ఉండవచ్చునని, తదనంతరం వివిధ వాతావరణ పరిస్థితుల్లో మంచు కరిగి, అది కిందకు జారి తిరిగి గడ్డకట్టి ఉండవచ్చుననీ వాళ్ళు ప్రతిపాదించారు.[47] క్లాస్ ఈగ్గి అనే ఆర్కియోబొటానిస్టు, మంచు కరిగి, శవం కిందకు జారే సిద్ధాంతాన్ని అంగీకరించినప్పటికీ, అక్కడ దొరికిన రాళ్ళ ముక్కలు ఖనన వేదికవేనని నిరూపించే ఆధారాలేమీ అలస్సాంద్రో పరిశోధనా పత్రం చూపించలేదు అని చెప్పాడు.[47] పైగా, బయొలాజికల్ ఆంత్రోపాలజిస్ట్ ఆలబర్ట్ జింక్ వాదన ప్రకారం, ఈట్జి శరీరం కొండలపై నుండి జారి ఉంటే, ఎముకలకు దెబ్బలు తగిలి అవి విరిగి ఉండాలి, కానీ అటువంటి దెబ్బలేమీ అతడి శరీరంలో కనిపించలేదు. బాణపు దెబ్బ వద్ద రక్తపు మరకలు చెక్కు చెదరలేదు. శరీరం ఎత్తుల నుండి పడిపోయి ఉంటే ఆ మరకలు చెదిరిపోయి ఉండేవి[47] . ఏదేమైనప్పటికీ, ఈ ఖనన సిద్ధాంతం, ఈట్జిది హింసాత్మక మరణం అనే సంభావ్యతను మాత్రం ఖండించలేదు.
కోర్టు వివాదం
[మార్చు]మంచుమనిషిని కనుక్కున్న సైమన్లకు ఇటలీ చట్టం ప్రకారం, దక్షిణ టైరోలియన్ ప్రభుత్వం నుండి ఆవిష్కరణ ఫీజు వస్తుంది. అది ఈట్జి విలువలో 25% ఉంటుంది.1994 లో వారు సైమన్లకు కోటి లీరాల (5,200 యూరోలు) బహుమతి ప్రకటించగా, దాన్ని వాళ్ళు తిరస్కరించారు[48] 2003 లో సైమన్లు తమను అధికారిక ఆవిష్కర్తలుగా ప్రకటించాలని బొల్జానో కోర్టులో కేసు వేసారు. 2003 నవంబరులో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తాము 3 లక్షల డాలర్లు ఫీజుగా ఆశిస్తున్నట్లు డిసెంబరులో సైమన్లు ప్రకటించారు. స్థానిక ప్రభుత్వం పైకోర్టుకు అప్పీలుకు వెళ్ళాలని నిర్ణయించింది.[49]
వీళ్ళు కాక మరో ఇద్దరు మహిళలు మగ్దలీనా మోహర్ జార్క్, శాండ్రా నెమెత్ లు ఈట్జిని కనుక్కున్న పర్వతారోహకుల బృందంలో తామూ ఉన్నామని ప్రకటించారు.[50][51]
వీళ్ళిద్దరిలో ఎవరూ ఆరోజున లేరని ఎరికా సైమన్ చెప్పింది.[51]
2004 లో హెల్ముట్ సైమన్ మరణించాడు. రెండేళ్ళ తరువాత, 2006 జూన్‌లో సైమన్లే అసలైన ఆవిష్కర్తలని, వారు ఆవిష్కరణ ఫీజుకు అర్హులని అప్పీలు కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తరువాత ఎరికా సైమన్ తన ఫీజును 1,50,000. యూరోలకు తగ్గించింది. 2008 సెప్టెంబరు 29 న ప్రభుత్వం, ఎరికా సైమన్ ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా ప్రకటన వెలువడింది. ఆ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ఎరికాకు 1,50,000 యూరోలు చెల్లిస్తుంది.[52][53]
"ఈట్జి శాపం"
[మార్చు]ఈట్జి ఒక దుశ్శకునమని, దానితో సంబంధం ఉన్నవారు శాపగ్రస్తులౌతారనీ ఒక వదంతి వ్యాపించింది. ఈట్జితో సంబంధం ఉన్న కొంతమంది మరణించడం ఈ వదంతికి మూలం. వాళ్ళు అంతుచిక్కని కారణాలతో మరణించారనే ప్రచారం జరిగింది. మరణించినవారిలో ఈట్జిని కనుక్కున్న హెల్ముట్ సైమన్[54], మమ్మీని మొదటగా పరీక్షించిన కాన్‌రాడ్ స్పిండ్లర్ ఉన్నారు.[55] ఇప్పటివరకూ సంభవించిన ఏడు మరణాల్లోను, నాలుగు ప్రమాదాల కారణంగా జరిగాయి. ఈ మరణాలను శాపానికి ఆపాదించారు. వాస్తవానికి ఈట్జికి సంబంధించిన పనుల్లో వందలాది మంది పాల్గొన్నారు, ఇంకా పనిచేస్తున్నారు కూడా. వారిలో అతికొద్ది శాతం మంది మరణించడం అంత చెప్పుకోదగ్గ విషయమేమీ కాదు.[56][57]
ఇవి కూడా చూడండి
[మార్చు]మరింత సమాచారం కోసం
[మార్చు]వ్యాసాలు
[మార్చు]- డిక్సన్, జేమ్స్ హోమ్స్ (28 June 2005), ప్లాంట్స్ అండ్ ఐస్మెన్: ఈట్జీస్ లాస్ట్ జర్నీ, డివిజన్ ఆఫ్ ఎన్వైరాన్మెంటల్ అండ్ ఇవల్యూషనరీ బయాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ అండ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, retrieved 17 March 2007.
- ఫౌలర్, బ్రెండా (November 2002), ది ఐస్మాన్స్ లాస్ట్ మీల్, నోవా (టీవీ సీరీస్) ఆన్లైన్, పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్, retrieved 17 March 2007.
- కెల్లర్, ఆండ్రియాస్ (28 February 2012), న్యూ ఇన్సైట్స్ ఇంటు ది టైలోరియన్ ఐస్మాన్స్ ఆరిజిన్ అండ్ ఫెనోటైప్ యాస్ ఇన్ఫర్డ్ బై హోల్-జినోమ్ సీక్వెన్సింగ్ (PDF), nature.com, retrieved 25 April 2012.
- కెన్నెడీ, ఫ్రాన్సెస్ (26 July 2001), "ఈట్జి ది నియోలిథిక్ ఐస్మాన్ వస్ కిల్డ్ బై ఎన్ యారో, సే సైంటిస్ట్స్", ది ఇండిపెండెంట్, archived from the original on 21 నవంబరు 2008, retrieved 27 సెప్టెంబరు 2016.
- మాకింటైర్, బెన్ (1 November 2003), "వియ్ నో ఈట్జి హ్యాడ్ ఫ్లీస్, హిస్ లాస్ట్ సప్పర్ వస్ స్టీక్ ... అండ్ హి డైడ్ 5,300 ఇయర్స్ ఎగో", ది టైమ్స్, archived from the original on 2 జూలై 2019, retrieved 27 సెప్టెంబరు 2016.
- మర్ఫీ, విలియమ్ ఎ., జూ.; జుర్ నెడ్డెన్, డయెటర్; గోస్ట్నర్, పాల్; న్యాప్, రుడాల్ఫ్; రెచీస్, వుల్ఫ్‌గాంగ్; సీడ్లర్, హోర్స్ట్ (24 January 2003), "ది ఐస్‌మ్యాన్: డిస్కవరీ అండ్ ఇమేజింగ్", రేడియాలజీ, 226 (3), ఓక్ బ్రూక్, ఇల్లి.: రేడియాలజీ: 614–629, doi:10.1148/radiol.2263020338, ISSN 0033-8419, PMID 12601185
{{citation}}
: CS1 maint: multiple names: authors list (link). ఆన్-లైన్ పబ్లికేషన్ వెర్షన్.
పుస్తకాలు
[మార్చు]- డీమ్, జేమ్స్ (2008), బాడీస్ ఫ్రమ్ ది ఐస్, బోస్టన్: హాటన్ మఫ్లిన్, p. 64, ISBN 0-618-80045-X, archived from the original on 2011-06-29, retrieved 2016-09-27
- బోర్టెన్‌ష్లేడర్, సిగ్మార్; ఓగ్ల్, క్లాస్, ఎడ్స్. (2000), ది ఐస్‌మ్యాన్ అండ్ హిస్ నేచురల్ ఎంవైరాన్‌మెంట్:పేలియోబొటానికల్ రిజల్ట్స్, వియెన్; న్యూ యార్క్ N.Y.: స్ప్రింగర్ సైన్స్ + బిసినెస్ మీడియా, ISBN 3-211-82660-2
{{citation}}
: CS1 maint: multiple names: authors list (link). - ఫౌలర్, బ్రెండా (2000), ఐస్‌మ్యాన్: అన్‌కవరింగ్ ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ ఎ ప్రిహిస్టారిక్ మ్యాన్ ఫౌండ్ ఇన్ ఎన్ ఆల్పైన్ గ్లేసియర్, న్యూ యార్క్, N.Y.: ర్యాండమ్ హౌస్, ISBN 0-679-43167-5
బయటి లింకులు
[మార్చు]- Official website about Ötzi
- New insights into the Tyrolean Iceman's origin and phenotype as inferred by whole-genome sequencing
- Iceman Photoscan, published by EURAC Research, Institute for Mummies and the Iceman
- "Death of the Iceman" – a synopsis of a BBC Horizon TV documentary first broadcast on 7 February 2002
- Ötzi Links ... Der Mann aus dem Eis vom Hauslabjoch – a list of links to websites about Ötzi in English, German and Italian (last updated 28 January 2006)
- Otzi, the 5,300 Year Old Iceman from the Alps: Pictures & Information (last updated 27 October 2004)
- "Five millennia on, Iceman of Bolzano gives up DNA secrets" Michael Day, The Independent, 2 August 2010
- "An Ice Cold Case" RadioLab interviews Albert Zinc, Head of EURAC Research and the scientist in charge of Otzi research.
- "Ötzi's Shoes
మూలాలు
[మార్చు]- ↑ "NOVA - Iceman Murder Mystery". pbs.org. Archived from the original on 2016-09-20. Retrieved 2016-09-25.
- ↑ Description of the Discovery Archived 2011-12-13 at the Wayback Machine at the South Tyrol Museum of Archaeology web site
- ↑ Brenda Fowler (2001). Iceman: Uncovering the Life and Times of a Prehistoric Man Found in an Alpine Glacier. University of Chicago Press. p. 37 ff. ISBN 978-0-226-25823-2.
- ↑ "The Incredible Age of the Find". South Tyrol Museum of Archaeology. 2013. Archived from the original on 2016-09-01. Retrieved August 3, 2015.
- ↑ WWI bodies are found on glacier, BBC News, 23 ఆగస్టు 2004, archived from the original on 30 జూన్ 2006
- ↑ Rory Carroll (26 September 2000), "Iceman is defrosted for gene tests: New techniques may link Copper Age shepherd to present-day relatives", The Guardian
- ↑ Rory Carroll (26 September 2000), "Iceman is defrosted for gene tests: New techniques may link Copper Age shepherd to present-day relatives", The Guardian
- ↑ James M. Deem (3 జనవరి 2008), Ötzi: Iceman of the Alps: His health, Mummy Tombs, archived from the original on 13 నవంబరు 2006, retrieved 6 జనవరి 2008
- ↑ Müller, Wolfgang; et al. (31 October 2003), "Origin and Migration of the Alpine Iceman", Science (journal), 302 (5646), American Association for the Advancement of Science: 862–866, doi:10.1126/science.1089837, PMID 14593178, archived from the original on 20 October 2007, retrieved 18 October 2007
- ↑ T.G. Holden (2002), "The Food Remains from the Colon of the Tyrolean Ice Man", in Keith Dobney; Terry O'Connor (eds.), Bones and the Man: Studies in Honour of Don Brothwell, Oxford: Oxbow Books, pp. 35–40, ISBN 978-1-84217-060-1
- ↑ Than, Ker (23 June 2011). "Iceman's Stomach Sampled—Filled With Goat Meat". National Geographic. Archived from the original on 26 జూన్ 2011. Retrieved 24 June 2011.
- ↑ "Iceman's final meal". BBC News. 16 September 2002. Archived from the original on 30 మార్చి 2015. Retrieved 16 జూలై 2018.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Christopher Ruff; Holt, BM; Sládek, V; Berner, M; Murphy Jr, WA; Zur Nedden, D; Seidler, H; Recheis, W (July 2006), "Body size, body proportions, and mobility in the Tyrolean "Iceman"", Journal of Human Evolution, 51 (1): 91–101, doi:10.1016/j.jhevol.2006.02.001, PMID 16549104
- ↑ 5,300-Year-Old Iceman Mummy Gets a Makeover Archived 2018-08-23 at the Wayback Machine - Wynne Parry
- ↑ James H. Dickson; Klaus Oeggl; Linda L. Handly (May 2003), "The Iceman Reconsidered" (PDF), Scientific American: 70–79, archived from the original (PDF) on 12 అక్టోబరు 2008, retrieved 26 సెప్టెంబరు 2016
- ↑ James M. Deem (3 January 2008), Ötzi: Iceman of the Alps: His health, Mummy Tombs, archived from the original on 13 నవంబరు 2006, retrieved 6 January 2008
- ↑ "Ötzi the Iceman Needed a Dentist". Archived from the original on 2017-08-30.
- ↑ "Iceman's DNA reveals health risks and relations". Nature. Nature. Archived from the original on 13 March 2018.
- ↑ In the book Cookwise by Shirley Corriher, the point is made (in relation to cooking) that plant leaves have a waterproof, waxy cuticle which makes raindrops roll off, with the comment "it was interesting that the 5,000-year-old Alpine traveler ... had a grass raincoat": Shirley O. Corriher (1997), Cookwise: The Hows and Whys of Successful Cooking, New York, N.Y.: William Morrow and Company, p. 312, ISBN 978-0-688-10229-6
- ↑ బెల్టూ దాని సంచీ Archived 2018-08-02 at the Wayback Machine - South Tyrol Museum of Archaeology 2016 ఏప్రిల్ 13
- ↑ Katka Krosnar (17 July 2005), "Now you can walk in footsteps of 5,000-year-old Iceman – wearing his boots", The Daily Telegraph, archived from the original on 29 జూన్ 2011, retrieved 26 సెప్టెంబరు 2016
- ↑ మంచుమనిషి అత్యంత పురాతన మంచుబూట్లు ధరించాడు Archived 2014-11-29 at the Wayback Machine -
- ↑ Brenda Fowler (2001), Iceman: Uncovering the Life and Times of a Prehistoric Man found in an Alpine Glacier, Chicago, Ill.: University of Chicago Press, pp. 105–106, ISBN 0-226-25823-8
- ↑ Norman Davies (1996), Europe: A History, Oxford: Oxford University Press, ISBN 0-19-820171-0
- ↑ 5300 years ago, the Ice Man used natural laxatives and antibiotics Archived 2018-07-10 at the Wayback Machine -1998 డిసెంబరు
- ↑ "The Axe - Ötzi Archived 2018-08-02 at the Wayback Machine - South Tyrol Museum of Archaeology". iceman.it.
- ↑ Keller, Andreas; Graefen, Angela; et al. (28 February 2012). "New insights into the Tyrolean Iceman's origin and phenotype as inferred by whole-genome sequencing". Nature Communications. 3: 698. doi:10.1038/ncomms1701. PMID 22426219.
- ↑ "Ancient DNA reveals genetic relationship between today's Sardinians and Neolithic Europeans - HudsonAlpha Institute for Biotechnology". Archived from the original on 2016-10-08. Retrieved 2016-09-27.
- ↑ "New insights into the Tyrolean Iceman's origin and phenotype as inferred by whole-genome sequencing". Archived from the original on 2017-07-17. Retrieved 2016-09-27.
- ↑ "Iceman's DNA reveals health risks and relations". Archived from the original on 2016-09-11. Retrieved 2016-09-27.
- ↑ "Tratti genetici comuni tra la mummia Oetzi e gli attuali abitanti di Sardegna e Corsica". Archived from the original on 2012-03-02. Retrieved 2016-09-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-08-18. Retrieved 2016-09-27.
- ↑ "Link to Oetzi the Iceman found in living Austrians". BBC News. 10 అక్టోబరు 2013. Archived from the original on 12 అక్టోబరు 2013. Retrieved 12 అక్టోబరు 2013.
- ↑ OWEN, JAMES (1 May 2012). "World's Oldest Blood Found in Famed "Iceman" Mummy". National Geographic. National Geographic Society. Archived from the original on 2018-01-08.
- ↑ Preservation of 5300 year old red blood cells in the Iceman Archived 2016-09-20 at the Wayback Machine - Journal of the Royal Society, Interface / the Royal Society
- ↑ 36.0 36.1 36.2 Maixner, Frank; Krause-Kyora, Ben (Jan 8, 2016). "The 5300-year-old Helicobacter pylori genome of the Iceman". Science. 351 (6269). doi:10.1126/science.aad2545.
- ↑ Sarah Ives (30 October 2003), Was ancient alpine "Iceman" killed in battle?, National Geographic News, archived from the original on 15 అక్టోబరు 2007, retrieved 25 October 2007
- ↑ Rollo, Franco; Ubald, Massimo; Ermini, Luca; Marota, Isolina (1 Oct 2002). Salzano, Francisco (ed.). "Ötzi's last meals: DNA analysis of the intestinal content of the Neolithic glacier mummy from the Alps". PNAS. National Academy of Sciences. Archived from the original on 3 Jun 2018.
- ↑ Pain, Stephanie. "Arrow points to foul play in ancient iceman's death". New Scientist. New Scientist Ltd. Archived from the original on 13 July 2018.
- ↑ 40.0 40.1 "Scientific Studies: What Has Been Discovered About the Iceman". 10 Aug 2003. Archived from the original on 2 సెప్టెంబరు 2015. Retrieved 27 సెప్టెంబరు 2016.
- ↑ Jha, Alok. "Iceman bled to death, scientists say". The Guardian. Guardian News and Media Limited. Archived from the original on 7 Nov 2017.
- ↑ Rory Carroll (21 March 2002). "How Oetzi the Iceman was stabbed in the back and lost his fight for life". The Guardian. Archived from the original on 9 డిసెంబరు 2007. Retrieved 27 సెప్టెంబరు 2016.
- ↑ "USATODAY.com - 'Iceman' was murdered, science sleuths say". usatoday.com. Archived from the original on 2012-06-27. Retrieved 2016-09-27.
- ↑ Fagan, Brian M.; Durrani, Nadia (25 September 2015). In the Beginning: An Introduction to Archaeology. Routledge. ISBN 9781317346432. Archived from the original on 5 ఫిబ్రవరి 2017. Retrieved 27 సెప్టెంబరు 2016.
- ↑ Rossella Lorenzi (31 August 2007), Blow to head, not arrow, killed Otzi the iceman, Australian Broadcasting Corporation, archived from the original on 11 అక్టోబరు 2007, retrieved 27 సెప్టెంబరు 2016; Nicole Winfield (30 August 2007), Ancient murder mystery takes new turn, MSNBC, archived from the original on 1 సెప్టెంబరు 2007, retrieved 27 సెప్టెంబరు 2016
- ↑ A. Vanzetti, M. Vidale, M. Gallinaro, D.W. Frayer, and L. Bondioli. "The iceman as a burial Archived 2010-09-06 at the Wayback Machine."[Antiquity (journal)|Antiquity]. Volume: 84 Number: 325 Page: 681–692. September 2010
- ↑ 47.0 47.1 47.2 "Prehistoric 'Iceman' gets ceremonial twist Archived 2010-08-30 at the Wayback Machine", Science News, 25 September 2010. (Retrieved 19 September 2010)
- ↑ <Please add first missing authors to populate metadata.> (29 September 2008), 'Iceman' row ends after 17 years, BBC News, archived from the original on 30 సెప్టెంబరు 2008, retrieved 27 సెప్టెంబరు 2016
- ↑ James M. Deem (September 2008), Ötzi: Iceman of the Alps: Finder's fee lawsuits, Mummy Tombs, archived from the original on 2 నవంబరు 2008, retrieved 1 October 2008
- ↑ "Magdaleni ne bodo plačali za Ötzija" [Magdalena Won't Get Paid for Ötzi]. Slovenske novice (in Slovenian). 9 అక్టోబరు 2008. Archived from the original on 18 మే 2015. Retrieved 27 సెప్టెంబరు 2016.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 51.0 51.1 Nick Pisa (22 October 2005), "Cold case comes to court – After 5,300 years", The Daily Telegraph, archived from the original on 6 డిసెంబరు 2008, retrieved 27 సెప్టెంబరు 2016
- ↑ "'Iceman' row ends after 17 years". BBC. BBC. 29 Sep 2008. Archived from the original on 16 Sep 2017.
- ↑ Nick Squires (29 September 2008), "Oetzi The Iceman's discoverers finally compensated: A bitter dispute over the payment of a finder's fee for two hikers who discovered the world famous Oetzi The Iceman mummy has finally been settled", The Daily Telegraph, archived from the original on 2 అక్టోబరు 2008, retrieved 27 సెప్టెంబరు 2016
- ↑ "Iceman's finder missing", The Guardian, 19 October 2004, archived from the original on 2007-12-09, retrieved 27 సెప్టెంబరు 2016; Stephen Goodwin (25 October 2004), "Helmut Simon: Finder of a Bronze Age man in the alpine snow [obituary]", The Independent, archived from the original on 1 అక్టోబరు 2007, retrieved 27 సెప్టెంబరు 2016
- ↑ Barbara McMahon (20 April 2005), "Scientist seen as latest 'victim' of Iceman", The Guardian, archived from the original on 9 డిసెంబరు 2007, retrieved 27 సెప్టెంబరు 2016
- ↑ "Is there an Ötzi curse?", Ötsi - the Iceman, South Tyrol Museum of Archaeology, archived from the original on 21 ఆగస్టు 2012, retrieved 15 August 2012,
hundreds of people have worked on the Iceman project, and many years have passed since the corpse was first discovered. It is therefore not remarkable that some of those people have since died.
- ↑ The Curse of the Ice Mummy, a television documentary screened on UK Channel 4 on 8 March 2007. See also Kathy Marks (5 November 2005), "Curse of Oetzi the Iceman strikes again", The Independent, archived from the original on 21 నవంబరు 2008, retrieved 27 సెప్టెంబరు 2016 (also reported as Kathy Marks (5 November 2005), "Curse of Oetzi the Iceman claims another victim", New Zealand Herald, archived from the original on 29 సెప్టెంబరు 2007, retrieved 27 సెప్టెంబరు 2016); Nick Squires (5 November 2005), "Seventh victim of the Ice Man's 'curse'", The Daily Telegraph, archived from the original on 11 అక్టోబరు 2007, retrieved 7 జనవరి 2020