కందాళ సుబ్రహ్మణ్య తిలక్
కందాళ సుబ్రహ్మణ్య తిలక్ | |
---|---|
జననం | కందాళ సుబ్రహ్మణ్య తిలక్ 1920 జూలై 15 [1] విశాఖపట్నం |
మరణం | 2018 జూన్ 8 విశాఖపట్నం | (వయసు 97)
మరణ కారణం | సహజ మరణం |
నివాస ప్రాంతం | విజయనగరం |
ఇతర పేర్లు | కందాళ సుబ్రహ్మణ్య తిలక్ |
వృత్తి | మొదటి లోక్‌సభ సభ్యులు |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమరయోధుడు |
భార్య / భర్త | సూర్య శేషుకాంతం |
పిల్లలు | 1 కుమారుడు(అశోక్), ఇద్దరు కుమార్తెలు (అరుణ, అమల) |
కందాళ సుబ్రహ్మణ్య తిలక్, (1920 జూలై 15 - 2018, జూన్ 8) ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు. ఇతను స్వాతంత్ర్య కోసం తనదైన శైలిలో పోరాడుతున్న గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. క్షణం కూడా ఆలోచించకుండా అతను బాటన నడిచేందుకు ఉద్యుక్తుడయ్యాడు.స్వాతంత్ర్యోద్యమంలో విజయనగరం జిల్లా నుంచి కీలక పాత్రధారయ్యారు.
జీవిత విశేషాలు
[మార్చు]కందాళ సుబ్రహ్మణ్య తిలక్ విశాఖపట్నం జిల్లాలో జూలై 15 1920 న విశాఖపట్నంలో అల్లిపురంలో శేషశాయి, రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు. తిలక్ గర్భంలో ఉండగా రాజేశ్వరిగారికి కడుపుపై నాగుపాము కాటువేసినట్లు కల వచ్చింది. అందుకనే అతను పేరులో సుబ్రహ్మణ్యమనియూ, శేషశాయికి బాలగంగాధర్ తిలక్‌పై మక్కువతో తిలక్‌అనియు కలిపి సుబ్రహ్మణ్య తిలక్ అని పేరు పెట్టారు. దురదృష్టవశాత్తు పుట్తిన 5 రోజులకే మాతృవియోగం కలిగినందతనికి. తిలక్ గారి ప్రాథమిక విద్య విజయనగరం దాసన్నపేట పూసపాటి ఆనందగజపతి మెమోరియల్ మునిసిపల్ హైస్కూల్లో జరిగింది. విజయనగరం మహారాజా కాలేజీలో ఇంటర్మీడియట్ (ఎఫ్.ఎ) పూర్తిచేసారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో బి.ఎస్సీ అభ్యసించారు. అక్కడ తిలక్ గారు విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. 1943 నుండి 1945 వరకు కర్ణాటక్లోని బెల్గాంలో గల లక్ష్మాగౌడా న్యాయకళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. తిలక్ 1941 ఫిబ్రవరి 7వ తేదీన మంథా సర్వేశ్వర శాస్త్రి, పేరిందేవి దంపతుల కుమార్తె సూర్యకాంతంగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలు. అరుణా అసఫ్ ఆలీని స్ఫూర్తిగా తీసుకొని పెద్ద కుమార్తెకు ఆమెకు అరుణ అని, రెండవ సంతానం అశోక్ మెహతాను ఆదర్సంగా తీసుకొని కొడుకుకు అశోక్ అని, మూడవ కుమార్తెకు తన అమల అని పేరుపెట్టారు. ఈయన శ్రీరామసామ్రాజ్య పట్టాభిషేకం చేయించినప్పుడు ఏడుగురు తాతగార్లు ఉపనయనం చేసిన సందర్భంలో వేసిన యజ్ఞోపవేతాన్ని జాతీయ ఉద్యమంలో అడుగుపెట్టినప్పుడు త్యజించారు. అన్నింటా ఆదర్శవంతంగా నిలచిన సూర్యాకాంతంగారు కూడా 1949లో తనకు వివాహసమయంలో భర్త కట్టిన మంగళసూత్రాన్ని త్యజించారు. జాతీయోద్యమ సమయంలో ఈయన ఇంటికి వచ్చిన అందరినీ సమానంగా కులమతాలకు అతీతంగా ఆదరించి భోజనం పెట్టేవారు.
తిలక్ గారు 1975లో విజయనగరంలో సొసైటీ ఫర్ సోషల్ ఛెంజ్ అనే సంస్థను స్థాపించారు. 1981 నుండి 1982 వరకు ఒయాసిస్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సేవలందించారు. 1982 నుండి 1984 వరకు యలమంచిలిలో గల భాగవతుల ట్రస్టుకు సేవలందించారు.తమ కుమారుడికి కులాంతర వివాహం చేసారు.వరకట్న వ్యవస్థను తీవ్రంగా విమర్సించారు. 1997లో ఆంధ్రవిశ్వవిద్యాలయం అతనుకు కళాప్రపూర్ణ ను ప్రదానం గావించింది. అతనుకు 80 సం. వయస్సు వచ్చిన నేపథ్యంలో విశాఖ సముద్రతీరంలో గల విశ్రాంత అనే వృద్ధాశ్రమంలో చేరారు. 2012 మే 13వ తేదీన లోక్సభకు జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా తిలక్‌ను ఘనంగా సత్కరించారు.2105 మే27న అతనుకు భార్యా వియోగం కలిగింది. 2015 లో విశాఖపట్నంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిలక్‌ను సత్కరించారు. ఆంధ్ర తిలకంగా పేర్గాంచిన తిలక్ గారు 2018 జూన్ 8వ తేదీన మరణించారు.అతను భౌతిక కాయాన్ని విశాఖపట్నం కొమ్మాదిలో గల గాయత్రి మెడికల్ కళాశాలకు అప్పగించారు. కందాళ అశోక్ వ్యవస్థాపకులుగా కె.ఎస్. తిలక్ ఫౌండెషన్ ట్రస్ట్ ను స్థాపించి ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేస్తున్నారు.
అప్పట్లో బ్రిటిష్ వారి చిత్రహింసలకు గురవుతున్న ప్రజలను చూసి అతను చలించిపోయారు.తెల్ల దొరల ఆగడాల నుంచి భారత ప్రజలను విముక్తి చేయాలనే ఆలోచన అతనికి కలిగింది. అదే సమయంలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, విద్యాభ్యాసం చేస్తుండగానే ఉద్యమంలోకి దిగారు.1942 ఆగస్టు 9 న చేపట్టిన పికెట్‌తో తిలక్ ఉద్యమంలోకి ప్రవేశించాడు. ఈ పికెట్‌లో ఉత్తరాంధ్రకు చెందిన 14 మంది పాల్గొన్నారు. వారితో కలిసి చాలా ఉద్యమాల్లో తిలక్ భాగస్వామి అయ్యాడు.[2]
స్వాతంత్ర్యోద్యమంలో
[మార్చు]కందాళ సుబ్రహ్మణ్య తిలక్ స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా రెండు సార్లు జైలు జీవితం గడిపారు. ఈ రెండు విడతల్లో దాదాపు 130 రోజులు జైలులోనే గడిపారు.1942లో పికెటింగ్ చేపడుతున్న సమయంలో తిలక్‌ను ఆంగ్లేయులు అరెస్టు చేశారు.విజయనగరం సబ్ జైలులో కొంత కాలం ఉంచారు. ఆ తర్వాత 1943 జనవరి 26 న విజయనగరంలోని ప్రకాశం పార్కులో జాతీయ జెండా ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు ఉద్యుక్తులవుతున్న సమయంలో ఆంగ్లేయ అధికారులు వచ్చి అందరినీ పట్టుకుపోయారు. వీరిలో తిలక్ కూడా ఉన్నారు. అప్పట్లో కేరళ రాష్ట్రం బళ్లారి ఎయిర్‌ఫోల్డ్ జైలుకు తరలించారు. ఈ జైలులో తిలక్ నాలుగు నెలలు గడిపారు. జైలు జీవితం ఎలా గడిచిందంటే....
జైలులో దాదాపు 130 రోజులు గడిపిన తిలక్ అనేక ఇబ్బందులకు గురయ్యారు. జైలులో జెండా ఊంఛా రహే హమారా... బొలో స్వతంత్ర భారత్‌కి జై... అనే నినాదాలను ఉద్యమకారులు చేసేవారు. దీనికి ఆంగ్లేయ అధికారులు కోపోద్రోక్తులై లాఠీలు విరిగేలా చితకబాదేవారు.అలాగే వీరికి సరైన భోజనం ఆంగ్లేయ అధికారులు అందించేవారు కాదు.ఉదయాన నూకల జావ, మధ్యాహ్నం 14 గ్రాములు మాత్రమే అన్నం, మట్టి కుండల్లో వేసిన పిక్క చారును భోజనంగా ఇచ్చేవారు.అయినప్పటికీ స్వాతంత్ర్యోద్యమంలో లీనమైన ఉద్యమకారులు లాఠీ దెబ్బలను లెక్క చేయలేదు. అలాగే వారు ఏ భోజనం పెట్టినా ఆనందంగా భుజించేవారు. ఈ విధంగా తెల్ల దొరల చిత్ర హింసలను తట్టుకుంటూనే ఎంతో ఓపికతో తిలక్ జైలు జీవితం గడిపారు. కాగా, తిలక్‌ను అరెస్టు చేసిన సమయంలో భార్య సూర్య శేషుకాంతం తనను కూడా అరెస్టు చేసి భర్తతో తీసువెళ్లాలని పట్టుబట్టారు.
రాజకీయ నేపథ్యం
[మార్చు]కందాళ సుబ్రహ్మణ్య తిలక్ ఎన్నో పోరాటాల ద్వారా స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో పోటీ రంగంలో దిగారు. పూసపాటి విజయరామగజపతిరాజు, ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు జయప్రకాష్ నారాయణ ప్రోద్బలంతో తిలక్ ఇచ్ఛాపురం పాయకరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేశారు. పోటీ బరిలో నలుగురు నిలిచారు. బివి సంజీవరావు, పసుమర్తి వీరభద్రరావు, కాళ్లకూరి కృష్ణమూర్తి, తిలక్ మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో లక్షా 87 వేల ఓట్ల ఆధిక్యతతో తిలక్ విజయం సాధించి ఎంపిగా ఎన్నికయ్యారు. అప్పట్లో మహాత్మా గాంధీ ఎప్పటికప్పుడు తిలక్‌కు ఉత్తరాలు రాసేవారు.
1944 నుండి 1945 వరకు లాకాలేజి స్టూడెంట్స్ యూనియన్ కు సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1945లో బొంబాయిలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావశంలో పాల్గొన్నారు. 1945-46లో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంయుక్త కార్యదర్సిగా పనిచేసారు. 1947లో సోషలిస్ట్ పార్టీలో చేరారు. 1947 నుండి 1952 వరకు విజయనగరం జిల్లా, రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ కార్యదర్సిగా సేవలందించారు.
అభిప్రాయాలు
[మార్చు]భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆనందపడడమే తప్ప, ఆ ఫలాలు అందరికీ దక్కడం లేదని, మనకు స్వాతంత్ర్యం 1948 లో వచ్చి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా దేశంలో పేదరికం కొనసాగుతూనే ఉందని, రాజకీయ నాయకుల హవా కొనసాగుతున్న ప్రస్తుత కాలంలో పేదవారు మరింత పేదరికంలోకి వెళ్తున్నారన్నారనీ అతని అభిప్రాయం.
మూలాలు
[మార్చు]- ↑ first parliament member
- ↑ "Parliament honours KS Tilak". News18. Retrieved 2018-06-08.
- విప్రవాణి: విజయనగరం బ్రాహ్మణ సమాఖ్య సెప్టెంబరు-2020 అక్టోబరు సంచిక. వ్యాస కర్త: బాబూజి భోగరాజు.