కల్పనా చావ్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్పనా చావ్లా
స్థితిచనిపోయారు
జాతీయతఅమెరికా , భారత్
అంతరిక్ష జీవితం
వ్యోమగామి
పూర్వపు వృత్తి
విజ్ఞాని1994 NASA Group
అంతరిక్షంలో గడిపిన కాలం
31d 14h 54m
అంతరిక్ష నౌకలుSTS-87, STS-107
అంతరిక్ష నౌకల చిత్రాలు

కల్పనా చావ్లా (మార్చి 17, 1962ఫిబ్రవరి 1, 2003), ఈమె ఒక ఇండియన్ - అమెరికన్ వ్యోమగామి , వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది. 1997 లో మొదటి సారిగా కొలంబియా స్పేస్ షటిల్ లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటరుగా ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. 2003 లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్ లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన ఏడు మంది సిబ్బందిలో ఈమె కూడా ఒకటి. 2003 ఫిబ్రవరి 1 న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమె మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఈమె పేరు మీదుగా నామకరణం చేశారు. భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది.

బాల్యం

[మార్చు]

కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ర్టంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1 1961కి మార్చారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం.[1] సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా "మోంటు" అని పిలుచుకొనే కల్పనా చావ్లా కులీన కుటుంబంలో పుట్టలేదు. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకూ టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. తర్వాత డబ్బు కోసం బనారసీ కుటుంబం ఇబ్బంది పడింది లేదు. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో పాదుకోవడానికి తండ్రే కారణం. "పరిస్థితులు ఎలాగున్నా. కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుకపోయాయి. అందుకు నాన్నే కారణం." అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత జరిగిన ముఖాముఖి లో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించారు.

విద్యాభ్యాసం

[మార్చు]

కల్పనా చావ్లా ముందుగా, కర్నాల్ లో ఉన్న టైగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ. బార్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో, ఆమె తెల్లవారు జామునే లేచి సైకిల్ పై బడికెళ్ళేవారు. బళ్ళో చిత్రలేఖన పాఠాలలో విమానం బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారు. ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమానాల బొమ్మలుంచేవాడు. అవి కల్పనలో స్ఫూర్తిని కలిగించాయి. కల్పన తన కలల్ని నిజం చేసుకోవటానికి ఈమె సోదరుడు సంజయ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇద్దరి కలలూ ఒకటే - ఆకాశంలో ఎగరడం.

పంజాబ్ ఇంజరీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 1982 లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి "ఏరోస్పేస్ ఇంజనీరింగు"లో మాస్టర్స్ డిగ్రీని 1984లో పొందారు. 1986 లో చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని , ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్ .డిని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు. అందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ముందు ఉండేది. ఈమెను ఎక్స్‌ట్రావెర్ట్ గా ఉపాధ్యాయులు పేర్కొనేవారు. సహజంగా ఒక వ్యక్తి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో కెరియర్ ను ప్రారంభించినా, అప్పటి నుంచి ఓ 15 ఏళ్ళు కష్టపడితే గాని పేరు రాదు. కానీ కల్పన పిన్నవయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు ఈమెతో 2 వేల మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు సంప్రదాయవాదులే అయినా కొత్త పద్దతులను ఎప్పుడూ ఆహ్వానించేవారని అంటారీమె. తన కెరియర్ ను వారెప్పుడూ అడ్డుకోలేదనని, తాను కోరుకున్న దానికి ఆమోదం తెలిపేవారని అన్నారు.

ఆమె కాలిఫోర్నియాలో ఓ కంపెనీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసారు. పరిశోధన శాస్త్రవేత్తగా అక్కడెంతో అనుభవం గడించారు. ఏరో డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించిన సమర్థమైన మెళకువలు నేర్చుకున్నారు. సిమ్యులేషన్, అనాలసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యమున్న అంశాలను శోధించారు. ఇదతా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కు దరఖాస్తు చేయకముందే జరిగింది.

ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు , విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు, 1990 లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరసత్వం పొందారు.[2]

కెరియర్ ప్లాన్ (నాసా కి యిచ్చిన ఇంటర్వ్యూలో కల్పన)

[మార్చు]

తాజాగా రోదసీకి వెళ్ళే ముందు నాసాకి ఇచ్చిన ఇంటార్యూలో ఈమె తన కెరియర్ ఎలా ప్లాన్ చేసుకున్నారో వివరించారు.

మేం ఉన్నత పాఠశాల లో చదువుకుంటున్నప్పుడు మేం కర్నాల్ అనే చిన్న ఊర్లో ఉండేవాళ్ళం. ఆ ఊర్లో ఫ్లయింగ్ కల్బ్ ఉండటం చాలా కలిసి వచ్చింది. నేనూ, మా సోదరుడూ సైకిల్ తొక్కుతూ ఊళ్ళో తిరుగుతుంటే ఆకాశంలో పుష్పక్ విమానాలు కన్పించేవి. ఇద్దరికీ వాటిల్లో ప్రయాణించాలని ఉండేది. ఒకసారి నాన్నను అడిగితే ఫ్లయింగ్ క్లబ్ కు తీసుకువెళ్ళి ఆ విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కు సంబంధించి ఇదే నా తొలి అనుభవం. ఎదిగే కొద్దీ జె.ఆర్.డి టాటా గురించి కూడా తెలిసింది. తొలిసారి మన దేశంలో విమానాలను నడిపింది ఈయనే. ఆనాడు టాటా నడిపిన విమానాన్ని కూడా చూశాను. విమానాన్ని చూసిన రోజుల్లో ఆయనేం చేసిందీ తెలుసుకోగానే నా ఆలోచనలు అలా అలా మబ్బుల్లో తేలిపోయాయి. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుదు 'నీవు ఏం కావాలని అనుకుంటున్నావు ' అని అడిగినపుడు 'ఏరోస్పేస్ ఇంజనీర్ ' అని ఠక్కున చెప్పేదాన్ని. అది నాకింకా గుర్తే, పదో తరగతి తర్వాత ఇంటర్ లో చేరాలంటే ఇంటర్ లో ఏ గ్రూపు తీసుకోవాలన్నది ముందే నిర్ణయించుకోవాల్సి ఉండేది. నేను ఏరో స్పేస్ ఇంజనీర్ నికావాలని అనుకున్నందున లెక్కలు, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాను. ఇంజనీరింగ్ ముందే ఈ అంశాలలో ప్రావీణ్యం సంపాదించాలి. తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో సీటు వచ్చింది. అప్పట్లో నా లక్ష్యం ఏరోస్పేస్ ఇంజనీర్ కావడమే. వ్యోమగామి అవుతానని ఆ రోజుల్లో నేను ఊహించలేదు. ఎయిర్ క్రాప్ట్ ఇంజనీర్ కావాలని కోరుకున్నాను. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కూడా తరగతి గదిలో అడిగినప్పుదు 'ఫ్లైట్ ఇంజనీర్ ' అవుతాను అని చెప్పాను. అప్పట్లో ఫ్లైట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారో కూడా నాకు అవగాహన లేదు. నేను అనుకొన్న ఎయిర్ క్రాప్ట్ డిౙైనింగ్ కూ, ప్లైట్ ఇంజనీర్ కూ సంబంధం లేదు. వ్యోమగామిగా ఒక రకంగా చేస్తున్నది. ఫ్లైట్ ఇంజనీర్ గానే కదా. ఇంజనీరింగ్ కళాశాలలోలో నాతో పాటు ఏడుగురే అమ్మాయిలం ఉండేవాళ్ళం. వాళ్ళల్లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేసింది నేనొక్కర్తినే. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాలన్నప్పుడు మా ప్రధానోపాధ్యాయులు వద్దన్నారు. చాలా కష్టమని, ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ గానీ తీసుకోమన్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవ్వండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోతానంటూ చెప్పాను. చివరికి ఇవ్వక తప్పిందికాదు. 'నీకు అందుబాటులో ఉన్నదీ, లేనిదీ అని కాదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ వైపు మాత్రమే ప్రయాణించాలి ' అని మాత్రమే నేను యువతకు సూచించగలను

—కల్పనా చావ్లా (నాసాకు యిచ్చిన ముఖాముఖిలో)

ఊహా లోకంలో

[మార్చు]

స్నేహితులన్నా, కుటుంబ సభ్యులన్నా, చదువు చెప్పిన ఉపాధ్యాయులన్నా కల్పనకు ఎనలేని అభిమానం. ఎక్కడున్నా మనసుకు దగ్గరైన వారందరితోనూ భావాలను పంచుకునేవారు. కొత్త కొత్త లోకాలకు వెళుతున్నట్లు భావిస్తూ ఊహల లోకాల్లో విహరించేది. తరచూ స్నేహితులందరితో కలసి పార్కులకు వెళుతుండేది. అలా ఒకసారి పార్కుకు వెళ్ళిన కల్పనా ..." మనం ఇక్కడ లేనట్లు ఊహించుకుందాం. ఇపుడు ఎక్కడో తెలియని దిగంతాల ఆవలికి వెళ్ళిపోయాం. అక్కడే ఎంతో ఆనందంగా ఉన్నాం" అంటూ తనతో పాటు స్నేహితులను కూడా ఊహాలోకాల్లోకి తీసుకుపోయేవారు. ఈమె ఊహలు ఈమె ఊహించని దానికన్నా ఎక్కువగా .... తీరాలను దాటి వెళ్ళాయి. తర్వాత్తర్వాత ఈమె వ్యోమగామిగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగడానికి పునాదిగా ఈ ఊహలే ఉపకరించాయి.

ఇంటర్ ఉత్తీర్ణురాలైన తర్వాత కల్పనకు సమస్య ఎదురైంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలన్న కోరికను తండ్రి వద్ద బయటపెట్టారు. తండ్రి అంగీకరించలేదు. గౌరవప్రదమైన వైద్య వృత్తిని స్వీకరించాలని సూచించారు. ఏదైనా విషయాన్ని ఒకటికి రెండు సార్లు నమ్మకంగా చెబితే తండ్రి కాదనరన్నది కల్పన విశ్వాసం. ఈమె అనుకున్నట్లే జరిగింది. కల్పనే గెలిచారు. చండీగఢ్ లోని పంజాబ్ ఇంజరీరింగ్ కాలేజీలో బి.ఎస్.సి. (ఏరోనాటికల్ ఇంజనీరింగ్) పూర్తి చేశారు. 1982 లో పట్టా చేతికొచ్చింది. ఆమెకింకా పై చదువులు చదవాలని ఉంది. అమెరికాకు వెళ్లాలన్న అన ఆకాంక్షను తండ్రి వద్ద బయట పెట్టారు. తండ్రి వీల్లేదన్నారు. అందరిలాగే పెళ్ళి చేసుకుని స్థిరపడాలన్నది ఆయన కోరిక. ఈమె అంగీకరించలేదు. తుదకు తండ్రిని ఒప్పించి తన మాటే నెగ్గించుకున్నారు. (అమెరికా వెళ్ళిన చాలా కాలానికి ఫ్రెంచ్ ఫ్లైయింగ్ ఇన్‌స్ట్రక్టర్, వైమానిక వ్యవహారాల రచయిత జీన్ పియెర్రా హారిసన్ తన భర్తగా చేసుకున్నారు)

మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికా లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో వాలారు. 1984 లో అది కూడా పూర్తయింది. కొలరాడో యూనివర్సిటీలో పిహెచ్‌డి చేసి... నాలుగేళ్ళ తరువాత డాక్టరేట్ పొందారు. కాలిఫోర్నియా లోని ఓ కంపెనీలో ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. పరిశోధనా శాస్త్రవేత్తగా అక్కడెంతో అనుభవం గడించారు. ఏరోడైనమిక్స్ ఉపయోగానికి సంబంధించి సమర్థమైన మెళకువలు నేర్చుకున్నారు. సిమ్యులేషన్, అనాలిసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యమున్న అంశాలను శోధించారు. ఇదంతా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కు దరఖాస్తు చేయక ముందే....!!

నాసా శాస్త్రవేత్తగా ఎంపిక

[మార్చు]

1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను "నాసా" వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా "నాసా"కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి... కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హూస్టన్ లో గల జాన్సన్ స్పేస్ సెంటర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారీమె... అక్కది శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ "శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా ఉండేది. తమాషాగానూ ఉండేది లెండి." అనేవారు. తరువాత విమానచోదకురాలిగా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు.

అంతరిక్ష యానం

[మార్చు]

1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమే 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి, 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు. నాసా వ్యోమగామిగా కల్పనను ఎంపిక చేసేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. అదేమిటంటే ఈమెకు వైద్య పరీక్షలు చేశారు. ఒక వైద్యుడు ఈమె ఎక్స్‌రే పరిశీలిస్తూ "నువ్వు శాఖాహారివా?" అంటూ ప్రశ్నించారు. "అవును, నేనెప్పుడూ మాంసం ముట్టలేదు" అని కల్పన జవాబిచ్చారు. "అది ఎక్స్‌రే చూడగానే తెలిసిందిలే. ఎందుకంటే లోపలంతా చాలా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంది" అంటూ ఆయన పెద్దగా నవ్వేశారు. కల్పన కూడా ఆయనతో గొంతు కలిపారు.

2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. "భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి.టాటా యే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్ గా తీసుకున్నా" అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే..... "ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మీరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటే ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,... దానిలో లీనమై అనుభవించాలి" అనేవారు. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నాట్లేనని చెప్పేవారు.

పరిశోధనా రంగంలో

[మార్చు]

డాక్టర్ కల్పన 1988 లో నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. విమాన యానానికి సంబంధించిన అనేకాంశాలపై పరిశోధనలు చేశారు. 1993 లో కాలిఫోర్నియా లోని లాస్ అల్టోన్ లో గల ఓవర్ సెట్ మెథడ్స్ ఇన్‌కార్పోరేటెడ్ లో ఉపాధ్యక్షురాలు (రీసెర్చి సైంటిస్ట్) గా చేరారు. అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిశోధనలు చేశారు. ఏరో డైనమిక్స్ ఆప్టిమైసేషన్ కు సంబంధించిఅనేక టెక్నిక్స్ ను అభివృద్ధి పర్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు.

వ్యోమగామిగా

[మార్చు]

వ్యోమగామిగా ఎంపికైన తర్వాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేశారు. వ్యోమగాములందరూ కొండ ఎక్కుతున్నారు. వెంట తెచ్చుకున్న బరువూ మోయలేక ఒక్కొక్కరు వాటిని వదిలివేస్తూ ఉంటే ఆ వెనకే వస్తున్న కల్పన వాటిని మోసుకొచ్చేవారు. సహచర వ్యోమగాములు వారించిన తర్వాతే వాటిని వదిలివేసేవారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. కల్పన ఒక శక్తిగా ఎదిగారు. కనుకే 1988 లో నాసా లోని రీసెర్చి సెంటర్ లో సైంటిస్ట్ గా చేరిన కల్పన అయిదేళ్ళకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్ సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంత్ గా ఎన్నికైనారు. 1995 లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ప్రకటించింది. 15 మంది వ్యోమగాములు కలసి కల్పన అంతరిక్షంలోకి వెళ్ళేందుకు మూడేళ్ళపాటు శిక్షణ తీసుకున్నారు. 1997 లో ఎస్‌టిఎస్ - 87 లో అంతరిక్షం పైకి వెళ్ళారు. 1997, నవంబరు 19 న మిషన్ స్పెషలిస్టుగా ఆరుగురు సభ్యులు గల చోదక సిబ్బందిలో ఒకరుగా 4 వ యు.ఎస్.మైక్రో గ్రావిటీ పేలోడ్ ప్లైట్ లో కొలంబియా "ఎస్‌టిఎస్ -87" మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేశారు.

రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడా ఆమెకు లభించింది. 2003, జనవరి 16 న ఎస్‌టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లడానికి నిర్ణయం జరిగింది.

NASA కెరీర్

[మార్చు]
వ్యొమనౌకను పోలిన దాన్లో చావ్లా

1995 లో NASA వ్యోమగామి కార్పస్ లో చేరారు , 1996 లో మొదటి సారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికైయ్యారు. దాన్ని STS-87 అని, కొలంబియా వ్యొమనౌక అని అంటారు. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19 న కొలంబియా వ్యొమనౌక (STS-87) లో ఆరు వ్యోమగాముల సభ్యులతో మొదలైంది. చావ్లా భారతదేశంలో పుట్టి అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి మహిళ , భారత దేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండో వ్యక్తి. ఈమె, 1984 లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షయానం చేసిన వ్యోమోగామి రాకేశ్ శర్మాను అనుసరించారు. ఆమె మొదటిసారి ప్రయాణంలో, చావ్లా భూగ్రహం చుట్టూ 252 సార్లు మొత్తం 10.4 మిలియన్ మైళ్ళ దూరాన్ని 360 గంటలకన్నా ఎక్కువ సేపు ప్రయాణం చేసారు. STS-87 సమయంలో, ఈమె తన బాధ్యతను సద్వినియోగం చేస్తూ స్పార్టన్ ఉపగ్రహం వదలగా, అది పనిచేయకపోవటం వల్ల, విన్‌స్టన్ స్కాట్ , తకౌ డొఇ తప్పని స్థితిలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని పట్టుకోవటానికి నడిచారు. నాసా విచారణ తర్వాత, తప్పులు సాఫ్టవేర్ లో , విమాన సభ్యులకి నిర్వచించిన పద్ధతులు ఇంకా భూమి నుండి అదుపు చేయటం లోనే ఉన్నాయని, చావ్లా తప్పేమీ లేదని తేల్చి చెప్పింది.

STS-87 ముగింపు పనులు పూర్తి అయిన తర్వాత, వ్యోమగాముల కార్యాలయంలో చావ్లాను సాంకేతిక స్థానంలో నియమించారు. ఇక్కడ ఈమె పనిని గుర్తించి, సహోద్యోగులు ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు.

2000 లో, STS-107 ఈమెను రెండవసారి అంతరిక్ష యానం చేయటానికి మిగిలిన సభ్యులతోపాటు ఎన్నుకున్నారు. ఈ క్షిపణి, నిర్ణీత కాలం నిశ్చయించటంలో విభేదాలు , సాంకేతిక సమస్యలు, ఎలాంటివంటే 2002 లో గుర్తించిన నౌకా ఇంజనులో బీటలు వంటివాటివల్ల పలుమార్లు ఆలస్యం జరిగింది. 2003 జనవరి 16, చివరగా చావ్లా తిరిగి కొలంబియా , విధివంచితమైన STS-107 క్షిపణిలో చేరారు. చావ్లా బాధ్యతలలో SPACEHAB/BALLE-BALLE/FREESTAR మైక్రో గ్రావిటీ ప్రయోగాలు ఉన్నాయి, వీటి కోసం భూమీ ఇంకా అంతరిక్ష విజ్ఞానం, నూతన సాంకేతిక అభివృద్ధి , వ్యోమగాముల ఆరోగ్యం ఇంకా వారి జాగ్రత మీద సభ్యులు 80 ప్రయోగాలు చేసారు.[3][4][5][6][7][8][9][10][11][12][13][14]

1991 లో భర్తతో కలసి చావ్లా, తన కుటుంభ సభ్యులతో సెలవలు గడపటానికి చివరిసారిగా భారతదేశం వచ్చారు. వివిధ కారణాలవల్ల, చావ్లా వ్యోమగామి ఐన తర్వాత భారతదేశం రమ్మని ఆహ్వానించినప్పటికి ఆమె దానిని అనుసరించ లేక పోయారు.

అవార్డులు

[మార్చు]

మరణానంతర గౌరవాలు;

 • కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ అఫ్ ఆనర్
 • NASA స్పేస్ ఫ్లైట్ మెడల్
 • NASA విశిష్ట సేవా మెడల్
 • డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్

జ్ఞాపకార్థం

[మార్చు]
 • కల్పనా చావ్లా స్మృతిచిహ్న విద్యార్థివేతనం , ఎల్ పసో (UTEP) లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం లోని భారతదేశ విద్యార్థుల సంఘం ప్రతిభావంతులై పట్టా పుచ్చుకున్న విద్యార్థులకు విద్యార్థివేతనం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.[15]
 • కొలంబియా సభ్యులు ఏడుగురిలో గ్రహశకలం 51826 కల్పనాచావ్లా గా ఉదహరించారు.[16]
 • 2003 ఫిబ్రవరి 5 న, భారతదేశ ప్రధానమంత్రి వాతావరణ క్రమం తెలిపే గ్రహాలు, METSATకు కల్పనా అని పేరు మార్చి పెట్టారు. METSAT క్రమంలోని మొదటి గ్రహాన్ని, భారతదేశం 2002 సెప్టెంబరు 12 లో ఆరంభించింది. ఇది ఇప్పుడు "కల్పనా-1 గా పిలవబడుతోంది. "కల్పనా -2" 2007 లో ఆరంభించవచ్చని ఆశిస్తునారు.[17]
 • న్యూయార్క్ సిటీ లోని క్వీన్స్ ప్రాంతం లో 74 జాక్సన్ హైట్స్ వీధిని ఇప్పుడు ఆమె గౌరవార్థం 74 వ కల్పనా చావ్లా వీధి మార్గం అని పేరు పెట్టారు.
 • 2004 సంవత్సరంలో అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం (ఇక్కడ నుంచే చావ్లా కు 1984 లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీ ఇన్ ఎరోస్పేస్ ఇంజనీరింగ్ లో వచ్చింది) చావ్లా గౌరవార్థం ఆమె పేరు మీద 2004 లో కల్పనా చావ్లా హాల్ వసతి గృహాన్ని ఆరంభించారు.[18]
 • కల్పనా చావ్లా పురస్కారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రతియేటా ఆగస్టు 15న వివిధ రంగాలలోని మహిళా శక్తిమంతులకు అందిస్తోంది. 
 • 2004 వ సంవత్సరం లో 'కల్పనా చావ్లా పురస్కారము ను యువ మహిళా శాస్త్త్రవేత్తల కోసం కర్ణాటక ప్రభుత్వము ఆరంభించింది.[19]
 • చావ్లా పోయిన తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ లోని ఆడపిల్లల వసతి గృహానికి కల్పనా చావ్లా అని పేరు పెట్టారు. దానితోపాటు, ఏరోనాటికాల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో ఉత్తమ విద్యార్థికి ఇరవై ఐదు వేల రూపాయలు, ఒక పతకము, , ఒక యోగ్యతాపత్రం ఇవ్వటం ఆరంభించారు.[20]
 • NASA ఒక సూపర్ కంప్యూటర్ ని కల్పనా కి అంకితమిచ్చింది.[21]
 • ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కొలంబియా విలేజ్ సూట్,లో ఉన్న విద్యార్థుల అపార్ట్మెంట్ ఆవరణలోని హాళ్ళకి ఒకొక్క వ్యోమగామి పేరు ఒకొక్కదానికి పెట్టారు, చావ్లా పేరు కూడా ఉంది దీన్లో.
 • NASA మార్స్ యక్సప్లోరేషన్ రోవేర్ సంస్థ కొలంబియా కొండల లోని ఏడు శిఖరాలకి కొలంబియా వ్యోమనౌక దుర్ఘటన లో పోయిన ఏడుగురు వ్యోమగాముల పేర్లు పెట్టారు, కల్పనా చావ్లా పేరు మీద ఒక కొండను చావ్లా కొండ అని పిలుస్తారు.
 • కొలంబియా దుర్ఘటన జ్ఞాపకార్థం , బేండ్ మీద ఉన్న మమకారం తో డీప్ పర్పుల్ బెండ్ నుండి స్టీవ్ మోర్స్ "కాంటాక్ట్ లాస్" అనే పాటను సృష్టించాడు.బనానాస్ అనే ఆల్బంలో ఈ పాట ఉంది..[22]
 • ఆమె సోదరుడు, సంజయ్ చావ్లా, "నా సోదరి నా దృష్టిలో చనిపోలేదు. ఆమె మరణానికి అతీతమైనది. ఇదే కదా నక్షత్రం అంటే? ఈమె, ఆకాశం లో ఒక శాశ్వత మైన నక్షత్రం. ఆమె ఎప్పటికి ఆకాశం లోనే ఉంటారు, ఆమె అక్కడ చెందినదే."[23]
 • 2007 లో నవలారచయిత పీటర్ డేవిడ్ తన నవల స్టార్ ట్రెక్ లో ఒక వ్యొమనౌకకు చావ్లా అని పేరు పెట్టారు. స్టార్ ట్రెక్: ది నెక్స్ట్ జనరేషన్:బిఫోర్ డిజానర్ .[24]
 • హర్యానా ప్రభుత్వము, కురుక్షేత్రా లో ఉన్న జ్యోతిసర్లో ఒక నక్షత్రశాలను ఏర్పాటు చేసి దానికి కల్పనా చావ్లా నక్షత్రశాలగా పేరు పెట్టారు.[25]
 • ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ , ఖరగ్పూర్ వారు ఆమె గౌరవార్థం కల్పనా చావ్లా స్పేస్ టెక్నాలజీ సెల్ ను ఆరంభించారు.[26][27]
 • మరీల్యాండ్ , నావల్ ఎయిర్ స్టేషను పటుక్సేంట్ రివెర్ , లో ఉన్న మిలటరీ ఇళ్ళను అభివృద్ధి చేసేవారు ఈ ప్రాంతానికి కొలంబియా కాలనీ అని పేరు పెట్టారు. దీనిలో ఒక వీధి చావ్లా మార్గం అని ఉంది.

ఇంకా చదవడానికి

[మార్చు]
 • అమాంగ్ ది స్టార్స్ -లైఫ్ అండ్ డ్రీమ్స్ అఫ్ కల్పనా చావ్లా రాసినవారు గుర్దీప్ పందేర్
 • ఇండియాస్ 50 మోస్ట్ ఇల్లస్ట్రియస్ వొమెన్ (ISBN 81-88086-19-3) రాసినవారు ఇంద్ర గుప్త
 • కల్పనా చావ్లా, ఏ లైఫ్ (ISBN 0-14-333586-3) రాసినవారు అనిల్ పద్మనాభన్

మూలాలు

[మార్చు]
 1. "Tragedy of Space Shuttle Columbia". Space Today. Retrieved 2007-06-08.
 2. "She lived her dream". The Hindu newspaper, India. Archived from the original on 2009-09-25. Retrieved 2007-06-08.
 3. "కల్పనా చావ్లా ఫ్యామిలీ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ది ఎన్విరాన్మెంట్". Archived from the original on 2013-03-02. Retrieved 2020-01-07.
 4. "యాన్ యక్ష్క్లుజివె వెబ్సైటు ఆన్ కల్పనా చావ్లా". Archived from the original on 2013-06-10. Retrieved 2020-01-07.
 5. NASA బైఒగ్రఫికాల్ డేటా - కల్పనా చావ్లా, పిహెచ్ .డి.
 6. స్పేస్ ఫేక్ట్స్ బయోగ్రఫి అఫ్ కల్పనా చావ్లా
 7. "కల్పనా చావ్లా STS-107 క్రూ మెమోరియల్". Archived from the original on 2016-03-04. Retrieved 2009-07-14.
 8. "కల్పనా చావ్లా -- మిషన్ స్పెషలిస్ట్". Archived from the original on 2008-10-12. Retrieved 2009-07-14.
 9. "ఇండియా రీనేమ్స్ శాటిలైట్ ఇన్ మెమరీ అఫ్ కొలంబియా అస్ట్రోనాట్". Archived from the original on 2003-02-19. Retrieved 2003-02-19.
 10. సెవెన్ హీరోస్ , సెవెన్ ఫైథ్స్
 11. "రిపోర్టర్ టిప్స్, Dr. కల్పనా సి. చావ్లా , ఆస్ట్రోనాట్". Archived from the original on 2008-06-12. Retrieved 2009-07-14.
 12. పిక్చర్స్ ఆఫ్ కల్పనా చావ్లా
 13. ది చావ్లాస్ ' ఒడిస్సీ
 14. "ఆస్ట్రోనాట్ మెమోరియల్ ఫౌండేషన్ వెబ్ పేజ్". Archived from the original on 2009-06-01. Retrieved 2009-07-14.
 15. "Kalpana Chawla Memorial Scholarship". UTEP. Archived from the original on 2011-10-02. Retrieved 2008-06-10.
 16. "Tribute to the Crew of Columbia". NASA JPL. Archived from the original on 2008-02-08. Retrieved 2007-06-10.
 17. "ISRO METSAT Satellite Series Named After Columbia Astronaut Kalpana Chawla". Spaceref.com. Retrieved 2007-06-10.[permanent dead link]
 18. "More about Kalpana Chawla Hall". University of Texas at Arlington. Archived from the original on 2010-06-09. Retrieved 2007-06-10.
 19. "Kalpana Chawla Award instituted". The Hindu. Archived from the original on 2004-07-13. Retrieved 2007-06-10.
 20. "Punjab Engineering College remembers Kalpana". Indian Express. Archived from the original on 2006-08-27. Retrieved 2007-06-10.
 21. "NASA Names Supercomputer After Columbia Astronaut". About.com. Archived from the original on 2007-12-30. Retrieved 2007-06-10.
 22. హాబీ స్పేస్ - స్పేస్ మ్యూజిక్ - రాక్ /పాప్
 23. "'COLUMBIA IS LOST' A Muse for Indian Women". LA Times (reprint on IndianEmbassy.org). Archived from the original on 2009-01-25. Retrieved 2007-06-02.
 24. డేవిడ్ , పీటర్ ; స్టార్ ట్రెక్: నెక్స్ట్ జనరేషన్ : బిఫోర్ డిస్ఆనర్  ; పేజ్ 24.
 25. http://ibnlive.in.com/news Archived 2009-07-21 at the Wayback Machine /planetarium -in-kalpana-chawlas-memory/36993-11.html IBN News
 26. http://www.flickr.com/photos/ambuj/421069342/
 27. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-30. Retrieved 2009-07-14.

బాహ్య లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.