గంగాధర్ అధికారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగాధర్ అధికారి
భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి
In office
1933–1935
అంతకు ముందు వారుఎస్.వి.ఘటే
తరువాత వారుపి.సి.జోషి
వ్యక్తిగత వివరాలు
జననం(1898-12-08)1898 డిసెంబరు 8
పన్వేల్, కొలాబా జిల్లా, బాంబే ప్రెసిడెన్సీ
మరణం1981 నవంబరు 21(1981-11-21) (వయసు 82)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత కమ్యూనిస్టు పార్టీ
జీవిత భాగస్వామివిమల్ సమర్థ్
వృత్తిసైద్ధాంతికవేత్త

డాక్టర్ గంగాధర్ అధికారి (1898 డిసెంబరు 8 - 1981 నవంబరు 21) [1] మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త, గొప్ప రచయిత. [2] అతను భారతదేశ రాజకీయ పార్టీలలో ఒకటైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) మాజీ ప్రధాన కార్యదర్శి. అతను 1927లో బెర్లిన్‌లో రసాయన శాస్త్రంలో Ph.D సంపాదించాడు. అతను మాక్స్ ప్లాంక్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ల ఉపన్యాసాలకు హాజరయ్యాడు. కొంతమంది అత్యుత్తమ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశాడు. [3]

జీవిత చరిత్ర[మార్చు]

జీవితం తొలి దశ, విద్య[మార్చు]

గంగాధర్ మోరేశ్వర్ అధికారి 1898 డిసెంబరు 8 న ముంబైకి సమీపంలోని కోల్బా జిల్లాలోని పన్వేల్‌లో జన్మించాడు. అతని తాత రత్నగిరిలో చిన్న భూస్వామి. కానీ ఆస్తిని కోల్పోయి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తా అయ్యాడు. అధికారి తండ్రి బొంబాయి వెళ్ళి, చాల్‌లో నివసించాడు.

పట్టణీకరణ చెందిన మహారాష్ట్ర కుటుంబంలో గంగాధర్ తన జీవిత తొలి దశలను దాటాడు. ప్రారంభ పాఠశాల విద్య దాదర్‌లోని ఉన్నత పాఠశాలలో చదివి, 1916లో విల్సన్ కళాశాల నుండి మెట్రిక్యులేషను చేసాడు. అతను మొత్తం ప్రెసిడెన్సీలో 8వ స్థానంలో నిలిచి, స్కాలర్‌షిప్ పొందాడు.

1918లో తన మొదటి రాజకీయ సమావేశానికి గంగాధర్ హాజరై తిలక్ ప్రసంగాన్ని విన్నాడు. అతను కళాశాలలో SA డాంగే తదితరులు స్థాపించిన మరాఠీ లిటరరీ సొసైటీలో ప్రసంగాలను కూడా విన్నాడు. అధికారి ఖుదీరామ్ బోస్, డాక్టర్ ఆర్‌జి భండార్కర్‌లచే బాగా ప్రభావితమయ్యాడు. శాస్త్రవేత్త జెసి బోస్‌ పట్ల అతడికి గొప్ప గౌరవం ఉండేది. 1918లో తన ఇంటర్మీడియట్ సైన్స్ పరీక్షలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలిచాడు. 1920 లో పట్టభద్రుడయ్యాడు. చదువులో ప్రతి దశలోనూ అతనికి స్కాలర్‌షిప్ లభించింది.

గంగాధర్ అధికారి బెంగళూరులోని IISc (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్)లో రీసెర్చ్ స్కాలర్‌గా చేరాడు. జర్మనీ సాధించిన విజయాలకు ముగ్ధుడై జర్మన్ భాష నేర్చుకున్నాడు. అతను బేరియం సల్ఫేట్ నుండి లవణాల వెలికితీతపై తన MSc డిసర్టేషన్ రాశాడు. వైవా కోసం హాజరవ్వాల్సిన అవసరమే లేకుండా MSc ఉత్తీర్ణత సాధించాడు. గైర్హాజరులో మాస్టర్స్ డిగ్రీని పొందిన అరుదైన విద్యార్థులలో అతనొకడు.

జర్మనీలో[మార్చు]

దేశభక్తి పరంగాను, ద్రవ్యపరమైన కారణాల వలనా ఇంగ్లాండు కంటే జర్మనీకి ప్రాధాన్యత ఇస్తూ, అతను 1922 జూలైలో కొలంబో నుండి జర్మనీకి బయలుదేరాడు. బెర్లిన్‌లోని ఫ్రెడరిక్ విల్హెల్మ్ విశ్వవిద్యాలయం (హంబోల్ట్ విశ్వవిద్యాలయం) లో చేరాడు. అతను ఫిజికల్ కెమిస్ట్రీని అభ్యసించడానికి చార్లోటెన్‌బర్గ్‌లోని టెక్నిష్చ్ హోచ్‌స్చుల్‌లో చేరాడు. అతను సాధించిన శాస్త్రీయ విజయాలు, జర్మన్ భాషా పరిజ్ఞానం కారణంగా అతడు ఆరేళ్లకు బదులుగా మూడేళ్ళలోనే డాక్టరేట్ పూర్తి చేయగలిగాడు.

ప్రొఫెసరు వోల్మార్ అధికారికి అన్ని విధాలుగా సహాయం చేసాడు. వారి స్నేహం జీవితకాలం కొనసాగింది. అధికారి తర్వాత 1964లో తూర్పు జర్మనీలో మళ్లీ కలిశాడు. అధికారి అనేక మంది ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలను కలుసుకున్నాడు. లియో స్జిలార్డ్, యూజీన్ విగ్నర్ వంటి శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసాడు. ఈ ఇద్దరూ అమెరికా లోని మన్‌హట్టన్ అణుబాంబు ప్రాజెక్టులో పనిచేశారు. [4]

డబ్బు లేకపోవడంతో అతడు ఒక్కపూటే భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అతని ప్రొఫెసర్ సిరామిక్స్ విస్తరణ గుణకాన్ని కొలిచే పనిని ఇచ్చాడు. తరువాత పరిశోధన సహాయకుడిగా నియమించాడు. అతను 1927 లో ఒక కర్మాగారంలో రసాయన శాస్త్రవేత్తగా కూడా పనిచేశాడు.

యూనివర్శిటీ ప్రయోగశాలలో తన పని చేస్తున్న సమయంలోనే ఐన్‌స్టీన్ అతనిని చూడటానికి వచ్చాడు. భారతీయ యువ శాస్త్రవేత్తను అతను 'చూడాలని' కోరుకున్నాడు. 

రాజకీయ పరిచయాలు[మార్చు]

బెర్లిన్‌లో ఉన్నప్పుడు, అధికారి వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ అనే విప్లవకారుడు, కమ్యూనిస్టును కలిశాడు. ఆయన ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించాడు. వీరి సమావేశాలకు డాక్టర్ అధికారి హాజరయ్యాడు. అధికారి జాకీర్ హుస్సేన్, అబిద్ హుస్సేన్, M. ముజీబ్ తదితరులను కలిశాడు. వాళ్ళే ఆ తరువాత జామియా మిలియా ఇస్లామియాను స్థాపించారు.

అధికారి ఇండియా హౌస్‌లో మాక్స్ బీర్ తదితరుల రాజకీయ ఉపన్యాసాలకు హాజరయ్యాడు. జాన్ రీడ్, RPD మొదలైనవారి రచనలు చదివాడు. RPD రాసిన 'ఇండియా టుడే' చివరకు అతన్ని మార్చేసింది. అతను మార్క్సిస్ట్ సాహిత్యం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ కేంద్ర కార్యాలయంలోని పుస్తకాల దుకాణాన్ని క్రమం తప్పకుండా సందర్శించేవాడు.

అధికారి త్వరలోనే ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యాడు. మోతీలాల్ నెహ్రూ, ముహమ్మద్ అలీ, S. శ్రీనివాస అయ్యంగార్, తదితరులతో పాటు, CPG నాయకులు కూడా సందర్శించారు. జలియన్ వాలాన్ బాగ్ వార్షికోత్సవం సందర్భంగా అధికారి తన మొదటి ప్రసంగాన్ని జర్మన్ భాషలో చేశారు.

'బాటిల్‌షిప్ పోటెమ్‌కిన్‌’ సినిమా చూసి ఆయన తీవ్రంగా చలించిపోయాడు. అతను జైసూర్య నాయుడు, సుహాసిని ఛటోపాధ్యాయ (వీరేంద్రనాథ్ సోదరి), సరోజినీ నాయుడు తదితరులను కలిశాడు. భారతదేశం చైనాల స్నేహితురాలైన ఆగ్నెస్ స్మెడ్లీ అయితే అతనితో ఎప్పుడూ ఉండేది.

తిరిగి భారతదేశానికి[మార్చు]

భారత్‌లో జరిగుతున్న సంఘటనలకు దూరంగా ఉండిపోయినట్లు డాక్టర్ అధికారి భావించాడు. వెనక్కి తిరిగి రావాలని కోరుకుంటూ, అతను భవిష్యత్తు అవకాశాల కోసం మేఘనాద్ సాహా, సత్యేన్ బోస్, సర్ CV రామన్‌లను కలిశాడు. సహాయం చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు.

అధికారి 1928 డిసెంబరులో బొంబాయికి తిరిగి వచ్చాడు. వలసవాద ప్రశ్నపై 6వ కొమింటర్న్ కాంగ్రెస్ యొక్క థీసెస్‌ను రహస్యంగా తీసుకువెళ్లాడు. సీఐడీ ఉన్నతాధికారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓడరేవులో అతని వస్తువులను సోదాలు చేసినప్పటికీ మార్క్సిస్ట్ సాహిత్యం మాత్రమే పట్టుకోగలిగారు. 1929లో మీరట్ కుట్ర కేసులో వాటిని 'సాక్ష్యం'గా ప్రదర్శించారు.

మీరట్ కుట్ర కేసులో[మార్చు]

జైలు వెలుపల తీయబడిన మీరట్ ఖైదీలలో 25 మంది చిత్రపటం. వెనుక వరుస (ఎడమ నుండి కుడికి): KN సెహగల్, SS జోష్, HL హచిన్సన్, షౌకత్ ఉస్మాని, BF బ్రాడ్లీ, A. ప్రసాద్, P. స్ప్రాట్, G. అధికారి . మధ్య వరుస: RR మిత్ర, గోపెన్ చక్రవర్తి, కిషోరి లాల్ ఘోష్, LR కదమ్, DR తెంగ్డి, గౌర శంకర్, S. బెనర్జీ, KN జోగ్లేకర్, PC జోషి, ముజఫర్ అహ్మద్ . ముందు వరుస: MG దేశాయ్, D. గోస్వామి, RS నింబ్కర్, SS మిరాజ్కర్, SA డాంగే, SV ఘాటే, గోపాల్ బసక్ .

డాక్టర్ అధికారిని 1929 మార్చి 20న మరో 31 మందితో సహా అరెస్టు చేసి అత్యంత అమానవీయ పరిస్థితుల్లో మీరట్ జైలులో ఉంచారు. అతను జైలు బృందానికి కార్యదర్శిగా నియమితుడడ్డాడు. అనేక పత్రాలను రూపొందించాడు. మోతీలాల్ నెహ్రూ, తదితరులు అతనినీ, ఇతర ఖైదీలనూ కలవడానికి వెళ్ళాడు. అతనికి MG దేశాయ్‌తో కలిపి చేతులకు సంకెళ్లు వేసేవారు. మీరట్‌లోని రోజుల్లో అధికారి చురుకైన పాత్ర పోషిస్తూ మార్క్సిజం విశ్వవిద్యాలయంలో ఉన్నట్లుగా ఉపయోగించుకున్నాడు. స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ అతడితో స్నేహపూర్వకంగా ఉండేవాడు. వీరి కోసం ఒక వ్యక్తిగత లైబ్రరీని కూడా తెరిచారు!

వారు కూడా చాలా సరదాగా గడిపారు. ఘాటే తదితరులు 'ఆర్కామ్' (అండమాన్ రిక్రూటింగ్ కంపెనీ!)అనే పత్రికను ప్రచురించేవారు. ఇందులో కార్టూన్లు, స్కెచ్‌లు, వ్యక్తిగత రాజకీయ 'మసాలా'ను ప్రచురించేవారు. కళాకారులు, కార్టూనిస్టుల ముఠాకు డాక్టర్ అధికారి నాయకత్వం వహించాడు. వారు నాటకాలు కూడా వేసేవారు. అందులో బక్కపాటి దేహం కలిగిన అధికారి, మహాత్మా గాంధీగా నటించాడు.

అధికారి పనిచేసిన పారిశ్రామిక సముదాయంలోని పరిశోధన విభాగంతో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కు అనుబంధం ఉండేది. అధికారి గురించి ఐన్‌స్టీన్‌కు తెలుసు. దీంతో, అధికారిపై మీరట్ కేసును ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్‌కు ఐన్‌స్టీన్‌ బహిరంగ లేఖ రాసాడు. ఐన్‌స్టీన్ డాక్టర్ అధికారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశాడు.

అతను 1933 మార్చిలో విడుదలయ్యాడు [3]

సీపీఐ ప్రధాన కార్యదర్శి[మార్చు]

పార్టీ చెడ్డ స్థితిలో ఉన్నందున, అధికారి, మరికొందరు అందుబాటులో ఉన్న కామ్రేడ్‌ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ అధికారి ప్రధాన కార్యదర్శిగా తాత్కాలిక కేంద్ర కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో పార్టీ ఏకీకరణలో అతడు కీలక పాత్ర పోషించారు.

అతను 1934 మేలో అరెస్టయ్యాడు. ముందు బైకుల్లా జైలుకు, తరువాత బీజాపూర్ జైలుకూ పంపించారు. 1937 ఫిబ్రవరిలో అతను బీజాపూర్ నుండి అజోయ్ ఘోష్ సహాయంతో కలకత్తా చేరుకున్నాడు. అక్కడ అతను సిపిఐ మేనిఫెస్టోను రూపొందించాడు. 'గేదరింగ్ స్టార్మ్' పేరుతో కాంగ్రెస్ ఫైజ్‌పూర్ సెషన్‌లో దాన్ని పంపిణీ చేసారు.

పీసీ జోషి తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయ్యాడు. తిరిగి బొంబాయిలో, అధికారి పార్టీ అనుబంధ 'నేషనల్ ఫ్రంట్' ఆర్కిటెక్ట్‌లలో ఒకరిగా అయ్యాడు.

ఆంధ్రప్రదేశ్ లోని మంతెనవారిపాలెంలో జరిగిన పార్టీ రాజకీయ పాఠాల్లో అధికారి ప్రసంగించాడు. అక్కడే చండ్ర రాజేశ్వరరావును ఆయన మొదటిసారి కలిసాడు.

శాంతాబాయి వెంగార్కర్‌ను ఓడించి అధికారి 1939లో బొంబాయి ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి ఎన్నికయ్యారు. అధికారికి పోలింగ్ ఏజెంటు దిల్షాద్ చారి, పోలింగ్ అధికారి భూలాభాయ్ దేశాయ్. పిసి జోషి, భరద్వాజ్, అజోయ్ ఘోష్‌లతో పాటు సిపిఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా అయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు అతను ప్రచ్ఛన్నం లోకి వెళ్ళాడు. గాంధీజీ జీవితచరిత్ర రచయిత డిజి టెండూల్కర్‌ ఇల్లు అతని రహస్య స్థావరాలలో ఒకటి. [5]

నేతాజీ తప్పించుకోవడానికి కుట్ర పన్నూడు[మార్చు]

1940లో సుభాష్ చంద్రబోస్ సోవియట్ యూనియన్ పారిపోయే తన ప్రణాళికల గురించి CPI కు చెప్పాడు. ఆ విషయమై పార్టీ అధికారి చేత వివరాలను రూపొందించింది. పంజాబ్‌లోని CPI నాయకుడు తేజా సింగ్ దీనికి స్వతంతర్ లాజిస్టిక్స్ అందించాడు. NWFP లో CPIకి చెందిన భగత్ రామ్ తల్వార్ 1941లో సుభాష్‌ భారతదేశం నుండి కాబూల్‌కు వెళ్ళినపుడూ అతడితో కలిసి వెళ్ళాడు. అనంతరం తల్వార్, అధికారికి సవివరమైన నివేదిక ఇచ్చాడు. 1942లో పార్టీ ప్రధాన కార్యాలయం రాజ్ భవన్ (బాంబే)కి మారినప్పుడు, అధికారి అక్కడే నివసించాడు.

బి.టి.రణదివే కాలం[మార్చు]

ఫిబ్రవరి 1948లో కలకత్తాలో జరిగిన CPI 2వ కాంగ్రెస్‌లో డాక్టర్ అధికారి కేంద్ర కమిటీకి, పోలిట్ బ్యూరోకూ ఎన్నికయ్యాడు. BT రణదివే (GS), భవాని సేన్, సోమనాథ్ లాహిరి పోలిట్ బ్యూరోలో ఇతర సభ్యులు. అధికారి రణదివేకు మద్దతు ఇచ్చాడు. అతడే దానికి బాధ్యుడు కూడా. 1950 లో పార్టీ కొత్త పోలిట్ బ్యూరోను ఎన్నుకుని, అధికారితో సహా రణదివే నాయకత్వాన్ని సస్పెండ్ చేసింది. అధికారి గొప్ప స్వీయ విమర్శనాత్మక విశ్లేషణ చేశాడు. ఆ తర్వాత 1951లో సాధారణ సభ్యునిగా పని చేసేందుకు పంజాబ్ వెళ్లాడు. 1952 సాధారణ ఎన్నికల్లో అక్కడ పనిచేశాడు. అతను ఢిల్లీలోని పార్లమెంటరీ కార్యాలయంలో, తరువాత బొంబాయిలో సాధారణ సభ్యునిగా కూడా పనిచేశాడు.

డాక్టర్ అధికారి మధురై (1953-54), పాల్‌ఘాట్ కాంగ్రెస్‌లలో (1956) కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. అమృత్‌సర్ (5వ) కాంగ్రెస్‌లో ఆయన కొత్త పార్టీ రాజ్యాంగంపై నివేదికను అందించాడు. అతను విజయవాడలో (1961) మళ్ళీ జాతీయ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీలకు ఎన్నికయ్యాడు. [6]

చీలిక, ఆ తరువాత[మార్చు]

1960లలో జైరిగిన సైద్ధాంతిక-రాజకీయ చర్చల సమయంలో అధికారి విస్తృతంగా రాశాడు. 1964లో 'కమ్యూనిస్ట్ పార్టీ, జాతీయ పునస్సృష్టి దిశగా భారతదేశం' అనే ముఖ్యమైన రచన కూడా చేసాడు. అతను కొత్త కార్యక్రమాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. బాంబే కాంగ్రెస్ (1964)లో పార్టీ కార్యక్రమంపై నివేదికను అందించాడు. అతను పార్టీ విద్య అనే నిర్దుష్టమైన బాధ్యతతో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. పాట్నా కాంగ్రెస్‌లో అతను 'పార్టీ ఎడ్యుకేషన్ అండ్ స్టడీస్ డిపార్ట్‌మెంట్' కు నాయకుడిగా కేంద్ర ఎన్నికల కమిటీకి ఎన్నికయ్యాడు. 'సిపిఐ చరిత్ర పత్రాలు' సేకరించడం, సవరించడం, రాయడం కూడా అతనికి అప్పగించారు. ఇది అనేక సంపుటాలు ప్రచురితమైంది. అతను ప్రపంచం నలుమూలల నుండి వస్తువులను నిశితంగా సేకరించాడు. గొప్ప ఆర్కైవ్‌లను నిర్మించాడు. అతను దాదాపు తన దృష్టిని కోల్పోయి, మరణించే వరకూ ఈ పనిని కొనసాగించాడు. తరువాత అతను అన్ని పార్టీ పదవుల నుండి వైదొలిగాడు. శేష జీవితాన్ని పూర్తిగా అధ్యయనానికి, పరిశోధనకూ అంకితం చేసాడు. [6]

83 సంవత్సరాల వయస్సులో 1981 నవంబరు 21 న డాక్టర్ గంగాధర్ అధికారి గుండెపోటుతో మరణించాడు అతని భార్య విమల్ అదే సంవత్సరం ప్రారంభంలో మరణించింది.

గ్రంథ పట్టిక[మార్చు]

అధికారి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పత్రాలు కు చెందిన పది సంపుటాలను సంకలనం చేశాడు. [7]

మూలాలు[మార్చు]

  1. "Adhikari, Gangadhar 1898 – 1981". Communist Party of India (Marxist) (in ఇంగ్లీష్). 2015-02-20. Retrieved 2020-07-19.
  2. "Latest Volume18-Issue12 News, Photos, Latest News Headlines about Volume18-Issue12". Frontline (in ఇంగ్లీష్). Retrieved 2020-07-19.
  3. 3.0 3.1 Shaikh, Juned (2011). "Translating Marx: Mavali, Dalit and the Making of Mumbai's Working Class, 1928-1935". Economic and Political Weekly. 46 (31): 65–73. ISSN 0012-9976. JSTOR 23017878 – via JSTOR. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Dr. Gangadhar Adhikari and SG Sardesai". bhupinder_singh.tripod.com.
  5. PATI, BISWAMOY. "A vital chapter from the past". Frontline.
  6. 6.0 6.1 Kamran Asdar Ali (2015). Surkh Salam: Communist Politics and Class Activism in Pakistan, 1947-1972. p. 296. ISBN 978-0-19-940308-0. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "s296" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. Zene, Cosimo (2013-10-23). The Political Philosophies of Antonio Gramsci and B. R. Ambedkar: Itineraries of Dalits and Subalterns (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-134-49408-8.