గరికపాటి మల్లావధాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గరికపాటి మల్లావధాని

గరికపాటి మల్లావధాని (సెప్టెంబరు 18, 1899 - జనవరి 5, 1985) స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ స్ఫూర్తితో పాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఈయన కొవ్వూరు లో 1899లో వికారి నామ సంవత్సర భాద్రపద పూర్ణిమ నాడు సీతారామయ్య, వెంకటసుబ్బమ్మలకు మొదటి కుమారునిగా జన్మించాడు[1]. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో, విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలోనూ, సంస్కృతాంధ్రాలను అభ్యసించాడు. ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ళ సుబ్రహ్మణ్యశాస్త్రి, తాతా సుబ్బరాయశాస్త్రుల శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు దిద్దుకున్నాడు. కల్లూరి వెంకట్రామశాస్త్రి, వజ్ఝల సీతారామ శాస్త్రుల దగ్గిర తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు. వేలూరి శివరామశాస్త్రి గారి అష్టావధానాల ఆకర్షణలో పడి అవధానాలు చేయడం ప్రారంభించాడు.

ఉద్యోగ ప్రస్థానం[మార్చు]

ఈయన కొంతకాలం ఎర్నగూడెం తాలూకాలో తెలికిచెర్ల జమీందారు రాజా కాకర్లపూడి వేంకటరమణయ్య ఆశ్రయములో వున్నాడు. ఆ జమీందారుగారి వినోదార్థము కవితాగోష్ఠులను, అష్టావధానములను కావించి, 8 ఎకరముల భూవసతిని సన్మానముగా గ్రహించినాడు. నర్సాపురములో జరిగిన సభలో "కవిశేఖర" బిరుదమును పొందాడు. 1922 లో ఏలూరులోని గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయములో సంస్కృతాంధ్ర పండితుడిగా చేరినాడు. 1930వ దశకంలో "ఢంకా" అనే పత్రికను నడిపినాడు. 1935 లో మంజువాణీప్రెస్ , రామా అండ్ కో, వెంకటరమణ పవరుప్రెస్ మొదలైన ముద్రణాలయములలో గ్రంథపరిశోధనము గావించాడు. 1947 లో సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీలో తెలుగుపండితులుగా చేరి పెక్కుమంది శిష్య ప్రశిష్యులను సంపాదించి విశిష్ట భాషాసేవ ఒనర్చినాడు.

స్వాతంత్ర్య పోరాటం[మార్చు]

1921 లో ఆయన చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికీ పోయి జాతీయగీతాలు రాసి, పాడి, బ్రిటీషువాడికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చి, జనాన్ని మేలుకొలిపాడు! 1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించాడు. కోర్టువారు ఆయన్ని, ఏలూరులో బ్రిటీషు జిల్లాజడ్జి గారి ముందు విచారణకి బోనెక్కించారు. అప్పుడు, ఆయన ఆశువుగా చెప్పిన పద్యం.

లేదుగదయ్య! మా నుడుల లేశమసత్యము సత్య బద్ధమౌ
వాదమె దోసమయ్యెడు నభాగ్యమిదే మనకబ్బె నింక నౌ
కాదననేల? మీ విహిత కార్యకలాపము దీర్పబూనుడా
మీదట దేవుడే గలడు మిమ్మును మమ్ము పరీక్షసేయగన్‌.

“మేము చెప్పేది కాస్త కూడా అబద్ధం కాదు. నిజం చెప్పడం అపరాధం అయ్యింది. ఇది మన దురదృష్టం. ఇక అవును, కాదు అనడం ఎందుకు? మీరు చెయ్యవలసిన పని, (అంటే నన్ను జైలులో పెట్టడం) మీరు చెయ్యండి. ఆపైన మిమ్మలినీ, మమ్మలిని పరీక్షచేసేందుకు దేవుడే ఉన్నాడు,” అని ఆయన చెప్పాడు. జైలు కెళ్ళాడు.

రచనలు[మార్చు]

 1. గరికపాటి కలంలో దేశభక్తి గళం
 2. భారతాంబికా శతకము
 3. విద్యార్థి శతకము
 4. ఋతుషట్కము
 5. శివనివేదనము
 6. శంకర జననము
 7. పుష్పవివేకము
 8. పండిత రాయలు
 9. ఆదర్శజ్యోతి (శ్రీరాముని గుణగణ ప్రశంస)
 10. అమరుక కావ్యం (ఆంధ్రీకరణము)
 11. దిగంబరి (తత్త్వనాటికలు)[2]

అవధానాలు[మార్చు]

ఇతడు సుమారు 20వరకు అష్టావధానాలు చేశాడు. ఇతని అష్టావధానాలలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, కావ్యపాఠము, వ్యస్తాక్షరి, పురాణపఠనము, చదరంగం, అప్రస్తుత ప్రసంగం అనే ఎనిమిది అంశాలు ఉండేవి[3]. ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలు కొన్ని:

 • సమస్య: పికమా దగ్గర లేదు పొమ్మతడు సంప్రీతి న్నిన్నుం బ్రోచెదన్

పూరణ:

సకియా! నేనును గూడియుంటి నిట నో చానా! మదీయానుజుం
డొకఁడై యుంటను నీకు గూర్పగలఁడేమో యంచు నూహింతు నిం
చుకయున్ లాభము గూడ దొక్కతెకె మెచ్చున్ దీర్పగాఁ జాలు నో
పిక మా దగ్గర లేదు పొమ్మతడు సంప్రీతి న్నిన్నుం బ్రోచెదన్

 • సమస్య: కరణంబును జూచి భూమికాంతుడు బెదరెన్

పూరణ:

పరిపూర్ణ బాహుసత్త్వులు
హరిపుత్రకు లొకరి కొక్క రందక పెలుచన్
గిరులం బోరంగని భీ
కరణంబును జూచి భూమికాంతుడు బెదరెన్

మూలాలు[మార్చు]

 1. సాహిత్య కృషీవలులు
 2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో దిగంబరి పుస్తకప్రతి
 3. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ సంపాదకులు.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 224–227. |access-date= requires |url= (help)