జి. వి. సుబ్రహ్మణ్యం
గూడ వెంకట సుబ్రహ్మణ్యం | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | సెప్టెంబర్ 10, 1935 ఆదిపూడి, ప్రకాశం జిల్లా |
మరణం | ఆగష్టు 15, 2006 |
వృత్తి | వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు |
జాతీయత | భారతీయుడు |
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం ( సెప్టెంబర్ 10, 1935 - ఆగష్టు 15, 2006) [1] గా ప్రసిద్ధిచెందిన గూడ వెంకట సుబ్రహ్మణ్యం సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రకాశం జిల్లా ఆదిపూడి గ్రామంలో శ్రీ గూడ రాఘవయ్య, సరస్వతమ్మలకు 1935, సెప్టెంబర్ 10 న జన్మించారు. రాఘవయ్య సంగీతంలో లోతైన పరిజ్ఞానం ఉన్నవాడు. ఆయన తల్లిదండ్రులు దానధర్మాలు చేసి దాతలుగా పేరుపొందారు. మేనమామ శనగల రామదాసు కుమార్తె, సంగీత విద్వాంసురాలు సుశీలను 1950 మే 18న వివాహం చేసుకున్నాడు. పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువు కొనసాగించిన సుబ్రహ్మణ్యం ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించి తద్వారా ఉన్నతోద్యోగాలను పొందాడు. ఆయన ఆగస్టు 15, 2006లో మరణించాడు.
విద్యాభ్యాసం, వృత్తి
[మార్చు]జి.వి.సుబ్రహ్మణ్యం పర్చూరు గ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీలో ఉండగానే బిరుదు వెంకటశేషయ్య వద్ద అలంకారశాస్త్ర విషయాలను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లోనే ఎంఫిల్ చదివిన జి.వి.సుబ్రహ్మణ్యం విశ్వవిద్యాలయంలోనే సర్వప్రథమునిగా నిలిచాడు. విశ్వవిద్యాలయంలో సర్వప్రథమునిగా నిలిచినవారికి ఉద్యోగం కల్పించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్లో తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. 1975 నుంచి 1995 వరకు హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్ గా, ఆచార్యునిగా, 1995 నుంచి 1998 వరకు అతిథి ఆచార్యునిగా, 1998 నుంచి 2000 వరకు యు.జి.సి.ఎమిరటస్ స్కాలర్ గా పనిచేశారు.[2] 1979లో ప్రథమాంధ్ర మహాపురాణము - ప్రబంధ కథామూలము అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు.
సాహిత్య రంగం
[మార్చు]ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం సాహిత్యరంగంలో విమర్శకునిగా ప్రసిద్ధుడు. 1960లో వీరరసం, 1983లో రసోల్లాసం, 1986లో ఆంధ్ర సాహిత్య విమర్శ-ఆంగ్ల ప్రభావం గ్రంథాల రచనతో పురస్కారాలు అందుకున్నాడు. నన్నయ నుంచి ప్రారంభించి నాటి ప్రఖ్యాత కవులైన సినారె, శివారెడ్డిల వరకూ తెలుగు కవుల సాహితీ ప్రక్రియల స్వరూప స్వభావాలను విశ్లేషిస్తూ ఈయన రచించిన "సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు" అన్న వ్యాస పరంపర ఆయనకు విశేష ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. క్లాసిక్ తత్త్వాన్ని జీర్ణించుకొని, సమకాలీన చైతన్య ప్రభావంతో విన్నూత్న దృక్పథంతో ఆధునిక యుగంలో కొనసాగిన కావ్య రచనా మార్గానికి "నవ్య సంప్రదాయం" అని నామకరణం చేసి ఈ వాదానికి ప్రతిష్ఠ, ప్రచారాలను కల్పించిన ఘనత వీరికి దక్కుతుంది.[3] సారస్వత వ్యాసములన్న పేరిట ఆయన వ్యాససంకలనం సాహిత్య, వ్యాకరణ, ఆలంకారాది శాస్త్రాల్లో దిగ్దంతులైన మహా పండితుల వ్యాసాలతో సుసంపన్నమైంది. తెలుగు నాట సాహిత్య విమర్శ రంగంలో సుప్రసిద్ధ పత్రికలైన ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, భారతి, శారద, ఆంధ్రపత్రిక ఉగాది సంచికల నుంచి ప్రామాణికమూ, ఆసక్తిదాయకమూ, విజ్ఞాన ప్రథమూ ఐన వివిధ వ్యాసాలను ఎంచి ప్రముఖ పరిశోధకుడు జి.వి.సుబ్రహ్మణ్యం సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆ పుస్తకాన్ని వెలువరించింది.[4]
రచనలు
[మార్చు]- వీరరసము
- రసోల్లాసము
- ఆంధ్రసాహిత్య విమర్శ - ఆంగ్ల ప్రభావము
- ఆలోచనం
- అభినవ లోచనం
- అక్షరాల ఆలోచనలు
- జీవియస్ సాహితీ సమాలోచనం
- జీవియస్ వ్యాసాలు
- జీవియస్ చిత్రాక్షరాలు
- జీవియస్:మహాద్వైతం (కవితాసంపుటి)
- జీవియస్ నవలలు - కథలు
- జీవియస్ పీఠికలు
- మా విమర్శ ప్రస్థానమ్ (వ్యాస సంకలనం)
- నవయుగ రత్నాలు
- ప్రథమాంధ్ర మహాపురాణము
- రామకథ - సాయిసుధ
- సుశీల కథలు
- తిరుపతి వేంకట కవుల కావ్యసమీక్ష
- వెలుగుబాట
- విభావన (వ్యాస సంపుటి)
పురస్కారాలు, గౌరవాలు
[మార్చు]- 1960లో ఆయన 25వ ఏట వీర రసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం.
- 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రథమాంధ్ర మహాపురాణము - ప్రబంధ కథామూలము అన్న అంశం పై చేసిన పరిశోధనకు డాక్టరేట్ పట్టా.
- 1983లో రసోల్లాసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం.
- 1986లో ఆంధ్ర సాహిత్య విమర్శ-ఆంగ్ల ప్రభావం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-18. Retrieved 2014-02-20.
- ↑ జి.వి.సుబ్రహ్మణ్యం జీవిత సంగ్రహం:గంగిశెట్టి లక్ష్మీనారాయణ:జి.వి.సుబ్రహ్మణ్యం అధికారిక వెబ్సైట్
- ↑ ఈమాట పత్రికలో సుబ్రహ్మణ్యం నివాళి వ్యాసంలోని సమాచారం
- ↑ సుబ్రహ్మణ్యం, జి.వి. సారస్వత వ్యాసములు. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. Retrieved 9 December 2014.
యితర లింకులు
[మార్చు]- జీవిత విశేషాలు Archived 2012-11-03 at the Wayback Machine
- యూట్యూబ్లో జీవియస్ పై డాక్యుమెంటరీ
- Pages using div col with unknown parameters
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1935 జననాలు
- 2006 మరణాలు
- సాహితీకారులు
- నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- ప్రకాశం జిల్లా రచయితలు
- ప్రకాశం జిల్లా సాహితీ విమర్శకులు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు
- తెలుగు ఆచార్యులు