గోరు చిక్కుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోరు చిక్కుడు
Guar bean cluster
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
C. tetragonoloba
Binomial name
Cyamopsis tetragonoloba
Synonyms

Cyamopsis psoralioides L.

గోరుచిక్కుడు భారతదేశమున చాలా చోట్ల సాగు చేయబడు దేశీ కూరగాయ.

భౌతిక వివరములు

[మార్చు]

ఇది చిక్కుడు జాతికి చెందినది. సుమారు రెండు మీటర్ల ఎత్తువరకు పెరుగును. కొన్ని అనుకూల పరిస్థితుల యందు ఇది మూడు మీటర్ల ఎత్తువరకు పెరుగును. గోరుచిక్కుడు సామాన్యముగా విత్తిన ఆరు ఏడు వారముల లోపున పూయనారంభించును.

సాగు చేయు పద్దతి

[మార్చు]

దీనిని అన్ని నేలలయందూ, అన్ని కాలములందూ సాగు చేయవచ్చు. దీనిని ఒంటిగా కానీ, అంతర పంటగా కానీ, మిశ్రమ పంటగా కానీ సాగు చేయవచ్చు. బాగుగా దున్ని సాగు చేయవలెను. దీనికి ఎరువు అంతగా అవసరములేదు, ఎందుకంటే ఇది సూక్ష్మ జీవుల సహాయముతో నేలలోని నత్రజని స్వీకరించును. ఇది నీటిపారు దలతో గాని వర్షాధార పంటగా గాని పండించ వచ్చును. దీనికి చీడ పీడల సమస్య చాల తక్కువ. అందు చేత గోరుచిక్కుడు సాగు చాల సులభము. పూర్తిగా గోరు చిక్కుడును సాగు చేయడము ఇంత వరకు చాల తక్కువ. సామాన్యంగా ఇతర పంటలలో అంతర పంటగానె సాగు చేస్తుంటారు. ఇంతకాలము గోరు చిక్కుడు కేవలం ఒక సామాన్య కూరగాయ లాగానె పండించే వారు. ఇప్పుడిప్పుడే గోరుచిక్కుడు పారిశ్రామికంగా ఉపయోగంలోని వచ్చింది. దాంతో గోరు చిక్కుడుకు ప్రపంచ వ్వాప్తంగా మంచి గిరాకి ఏర్పడినది. ప్రత్తి, పొగాకు మొదలగు వాణిజ్య పంటలతో నష్టాల ఊబిలో చిక్కుకుంటున్న రైతులు పర్వవసానంగా గోరు చిక్కుడును వాణిజ్య పంటగా పండించ నారంబిస్తున్నారు.

గోరుచిక్కుడు కాయలు/ పాకాల సంతలో తీసిన చిత్రము

వంటకములు

[మార్చు]
గోరు చిక్కుడు బంగాళాదుంప కూర.

సామాన్యముగా గోరు చిక్కుడు కాయలను పులుసు, బెల్లముపెట్టి వండెదరు. ఇంకా కొబ్బరి చేర్చి ఇగురు లేదా వేపుడు చేయుదురు. ఇది మంచి బలవర్థకమైన ఆహారము. గోరు చిక్కుడు కాయలను సాంబారులోను, ఇతర కూరలలోను వాడుతారు. దీనితో పచ్చడి కూడా చెయ్య వచ్చు. కాని ఎక్కువగా వేపుడుగా గోరు చిక్కుడు కాయలను తెలుగునాట ఎక్కువ ఉపయోగములో ఉంది.

పుట్టుక

[మార్చు]

ఇది చాల తరాల క్రితమే ఆఫ్రికా నుండి వచ్చినదని నిపుణుల అంచనా. ఇది పుట్టిన దేశంలో కన్నా భారత్ లో దీని ఉత్పత్తి ఎక్కువ. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే దానిలో భారత్ ది 80% వాట ఉంది. తర్వాత స్థానంలో పాకిస్థాన్, అమెరికా ఉన్నాయి. రాజస్థాన్, వంటి ప్రాంతాలలో దీనిని పశువులకు, ఒంటెలకు ఆహారంగా వాడే వారు.

పారిశ్రామిక ఉపయోగము

[మార్చు]

ఇంత వరకు గోరుచిక్కుడు చాల సామాన్యమైన కూరగాయగా జన బాహుళ్యంలో పేరు పడింది . ఇది అత్యంత రుచికరమైన కూరగాయ అని ఎవరు అనరు. అలాగే ఇది పనికి రాని కూరగాయ అని కూడా ఎవరు అనరు. దీనికి రుచి విషయంలో ప్రత్యేక స్థానం ఏమి లేదు. అందు చేత ఇది అతి సామాన్యమైన కూరగాయ. దీని ధర కూడా చాల తక్కువగా వుంటుంది. పండించడము కూడా సులబమే. ఇది కేవలము కూరగాయగానె గాక దీనికి పారిశ్రామిక ఉపయోగము కూడా ఉంది. గోరు చిక్కుడు గింజలను పారిశ్రామికంగా వుపయోగిస్తుంటారు.

గోరుచిక్కుడు కాయలను ముదరబెట్టి వాటిని ఎండ బెట్టి వాటినుండి గింజలను వేరు చేస్తారు. ఆ గింజల నుండి పొట్టును వేరు చేసి ఆ పప్పును పొడి చేస్తారు. ఆ పొడిలో నీళ్ళు కలిపితే అది జిగురుగా మారుతుంది. ఆ జిగురు పదార్తము., దాని గుణ గణాలె సాదారణమైన గోరుచిక్కుడు కాయలను అమాంతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద గుర్తింపు నిచ్చింది. దీనిని ఐస్ క్రీంలు, సాఫ్ట్ డ్రింకులు, పుడ్డింగులు, చాక్లైట్, ప్లేవర్డ్ మిల్క్, జాం, జెల్లీ, క్యాండ్ పిష్, క్యాండ్ మేట్, నూడుల్స్, బిస్కెట్ ఇలా అనేక అహార పదార్థాలలో దీని వాడతారు. ఇందులో కేలరీలు అసలు వుండవు. కనుక బరువు తగ్గాలనుకునే వారు దీని ఎక్కువగా వాడుతారు. దీన్ని కొద్దిగా తీసుకున్నా కడుపు నిండినట్టుగా వుంటుంది జీర్ణ వ్వవస్త శుద్ధికి చాల పుపయోగ పడుతుంది.

అంతేగాక చర్మ సౌందర్య సాధనాలలో దీని ఉపయోగము ఎక్కువగానె ఉంది. వస్త్ర పరిశ్రమ, ముద్రణ, దోమల నివారణలు, కాగితము, వాటర్ పైంట్లు, మొదలగు వాటిలో ఈ గోరుచిక్కుడు జిగురు ఉపయోగము చాల ఎక్కువ.

ఇప్పుడిప్పుడు ' షెళ్ ' చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే బావులకు ఈ గోరు చిక్కుడు జిగురు అత్యంత ప్రధానమైన వస్తువుగా అవతరించింది. ఇది లేక పోతె వారి పని నడవదు. వారికి ఇది అత్యంత కీలకమైన పదార్థము. అమెరికాలో షెల్ ఆయిల్, షెల్ గ్యాస్ వెలికి తీత పై దృష్టి పెట్టడంతో మనదేశంలో గోరు చిక్కుడు జిగురు ధరకు రెక్కలొచ్చాయి. గతంలో ఈ జిగురు ఒక క్వింటాలు ధర రెండు లేదా నాలుగు వేల రూపాయల మధ్య వుండగా 2011 వ సంవత్సరంలో గోకర కాయ గింజల ధర ముప్పై ఐదు వేలు రూపాయలు పలికింది. గోకర కాయ గింజల ధర అలా వుంటే దాని జిగురు ధర లక్ష రూపాయల పై మాటె.

ఎందు కింత గిరాకి

[మార్చు]

గోరు చిక్కుడు జిగురుకు అంతర్జాతీయంగా ఈమధ్యన గొప్ప డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా తన చమురు పరిశ్రమ ఉత్పత్తుల కోసం భారత్ లో తయారయ్యే గోకరకాయ/ గోరు చిక్కుడు జిగురు పైనే అదార పడి ఉంది. గోరు చిక్కుడు పంట మనదగ్గర విరగ పండితె అమెరికాలోని షెల్ ఆయిల్/గ్యాస్ పారిశ్రామికులకు పండగే. ఇక్కడ గోరుచిక్కుడు పంట దిగుబడి తగ్గితే అమెరికాలోని చమురు క్షేత్రాల నిర్వహకుల మొఖాలలో నెత్తురు చుక్క వుండదు. అదీ మన దేశంలో పండే గోకరకాయ లేదా గోరు చిక్కుడు మహత్యం.

ఇంత కాలం అతి సామాన్యమైన కూరగాయగా మిగిలి పోయిన గోరు చిక్కుడు, దానిలోని జిగురు పదార్థంలోని విలువలను గుర్తించడంతో దానికి అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం కలిగి ఎనలేని గిరాకిని తెచ్చిపెట్టింది. అమెరికాలో షెల్ గ్యాసు, ఆయిల్ ఉత్పత్తి ఇంచుమిందు ముప్పై శాతం ఉంది. ఆ గ్యాస్/లేదా ఆయిల్ బావులకు అత్యంత కీలకమైన పదార్థం మన గోరక కాయ గింజల జిగురే. మనం ఈ జిగురును సరపరా చేయక పోతె ఆ చమురు/ఆయిల్ బావులు మూత పడినట్లే. అందుచేతనే మన దేశంలో గోరు చిక్కుడు ఉత్పత్తి తగ్గితే అమెరికా ఆయిల్/గ్యాస్ ఉత్పత్తి ధారులకు చెమటలు పడ్తాయి.

షెల్ ఆయిల్/ గ్యాస్ అంటే.....?

[మార్చు]

సాధారణంగా సహజ వాయువు, చమురు భూమి అడుగున రాతి పొరల్లో నిక్షిప్తంమై వుంటుంది. ముఖ్యంగా ఇసుకరాయి, సున్నపు రాయి పొరల్లో నిక్షేపాలుంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు, సహజవాయువు 90 శాతం ఈ రెండు రకాల రాళ్ళ పొరల మధ్యనున్న ఖాళీలనుండే వస్తున్నది. ఇసుకరాతి రేణువుల మధ్యనున్న ఖాళీల లోను, సున్నపు రాతి పొరల మధ్యనున్న ఖాళీలలో ఈ నిక్షేపాలుంటాయి. సాంప్రదాయ విధానంలో ఈరాళ్ళను ముక్కలు చేసి లోనికి కొన్ని రసాయనాలను పంపిస్తారు. అప్పుడు ఆ రాళ్ళలోని ఆయిల్, గ్యాసి బావుల్లోకి వస్తుంది. ఇక షేల్ గ్యాస్ ను షేల్ చమురును వెలికి తీయడానికి ఒక ప్రత్యేకమైన విధానమున్నది. భూమి లోపల వున్న బంకమట్టి, అక్కడ వున్న అధిక ఉష్టోగ్రతకు, ఒత్తిడి కారణంగా కాలక్రమంలో అది గట్టి పడి రాళ్ళ లాగ ఏర్పడతాయి. ఈ రాళ్ళనే 'షేల్ ' అంటారు. ఈ రాళ్ళ పొరలలో ఆ నిక్షేపాలు ఉంటాయి. దాన్ని బయటకు తీయాలంటే ఆ రాళ్ళను పగలగొట్టాలి. అలా పగులగొట్టిన రాళ్ళముక్కలమధ్యకు వివిధ రసాయనాలు కలిపిన నీటిని అధిక పీడనముతో భూమి లోపలికి పంపిస్తారు. అప్పుడు రాళ్ళపొరల మధ్య చిక్కుకొని వున్న చమురు, సహజ వాయువు వేరుపడి బావిలోనికి చేరుతుంది. ఈ ప్రక్రియను ప్రాకింగ్ అని పిలుస్తారు. ఇలా భూమిలోపలికి పంపే పదార్థాన్ని ప్రొపొనెంట్ అని అంటారు. షేల్ బావుల్లోకి పంపే ప్రొపొనెంట్స్ లో గోరుచిక్కుడు జిగురు వుంటుంది. ఆ జిగురు లేకుండా షేల్ గ్యాస్/చమురు బయటకు తీయడము అసాద్యం. మనం ఈ గోరుచిక్కుడు జిగురును సరపరా చేయక పోతే ఆ బావులన్ని మూత పడినట్లే. అందుకే మనదేశంలో గోరు చిక్కుడు ఉత్పత్తి తగ్గితె అమెరికాకు చెమటలు పడతాయి.

షేల్ గ్యాస్ బావులు ఎక్కెడెక్కడున్నాయి?

[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా చాల దేశాలలో షేల్ గ్యాస్/చమురు నిల్వలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి కొన్ని దేశాలు మాత్రమే షేల్ చమురు/గ్యాస్ ను వెలికి తీస్తున్నాయి. అమెరికాలో నైతే 2004లోనె షేల్ గ్యాస్/చమురు బయటకు తీసే కార్యక్రమం మొదలైంది. ప్రస్తుతం అమెరికాలో 30 శాతం సహజ వాయువు షేల్ బావులనుండే వస్తున్నది. భారత్ లో కూడా షేల్ గ్యాస్/చమురు వంటి ప్రత్యామ్నాలను వెతకాల్సిన అవసరం ఉంది. భారత్ లో అనేక చోట్ల షేల్ వున్నా.... గ్యాస్/చమురు నిక్షేపాలున్న షేల్ కొన్ని చోట్లమాత్రమే ఉన్నట్లు చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ అవసరాలకు 176 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు అవసరమైతే, 2011 - 12 లో 48 మిలియన్ మెట్రిక్ టన్నులే ఉత్పత్తి చేయగలిగారు. గ్యాస్ 64 బిలియన్ క్యూబిక్ మీటర్ల అవసరమైతే 52 బిలియన్ క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి చేయ గలిగారు. భవిషత్ లో షేల్ ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశమున్నది. దాంతోబాటు గోరు చిక్కుడు ఉత్పత్తి, గిరాకి పెరగడము తప్పని సరి.

భారత్ లో గోరు చిక్కుడు ఉత్పత్తి....

[మార్చు]

భారత్ లో ఉత్పత్తి అవుతున్న గోరుచిక్కుడు జిగురులో 75 శాతం వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండే వస్తున్నది. ఈ రాష్ట్రంలో గోరు చిక్కుడు పై పరిశోధన చేసే కేంద్రం కూడా ఉంది. గత ఏడాది వరకు గోరు చిక్కుడుకు సరైన ధరలేక, రైతులకు అవగాహన లేక దళారులు, వ్వాపార వేత్తలు, పరిశ్రమల యజమానులు మాత్రమే లాభపడే వారు. ప్రస్తుతం పరిస్థితి మారి పోయింది. ఉత్తర అమెరికాలో షేల్ గ్యాస్ ' బూం ' తో గోరుచిక్కుడు జిగురుకు ఒక్కసారిగా గిరాకి పెరిగి పోయింది. ధరలు పెరిగి పోయాయి. ఊహించని ఈ పరిణామానికి అధిక మొత్తంలో డబ్బు రావడంతో రాజస్థాన్ రైతులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను వ్వాపారుల వద్దకు తీసుకొని వెళ్ళి వారిని ప్రాదేయ పడే పరిస్థితి పోయి ఇప్పుడు వ్వాపారులే రైతుల వద్దకు వచ్చి ముందుగానె పంట సాగుకు కొంత డబ్బు, గోరుచిక్కుడు విత్తనాలు ఇచ్చి పంటను కొనుక్కుంటున్నారు. అప్పటి వరకు పూరి గుడెసెల్లో బ్రతుకీడుస్తున్న సామాన్య రైతులు పక్కాగృహాలు కట్టుకొని అధునూత గృహోపకరణాలను సమకూర్చుకున్నారు. ఒకరైతు 20 క్వింటాళ్ళ గోరుచిక్కుడు గింజల్ని ఐదు లక్షల రూపాయలకు విక్రయించాడు. రైతే రజు అన్న నానుడి రాజస్థాన్ రైతుల విషయంలో నిజమైంది. రాజస్థాన్ లో వర్షపాతం అంతంత మాత్రమే. గోరు చిక్కుడు సాగుకు ఇది అనుకూలమే.

గోరుచిక్కుడు పంటలోను, గోరుచిక్కుడు జిగురు ఎగుమతిలోను భారత్ అగ్రగామిగా ఉంది. అంతర్జాతీయ పారిశ్రామిక అవసరాల్లో ఎనభై శాతం వరకు భారత్ నుండే వెళ్తోంది. ఇక్కడి నుండి ఏటా సుమారు లక్షన్నర టన్నుల గోరుచిక్కుడు జిగురు ఎగుమతి అవుతున్నది. గోరుచిక్కుడు గింజల రూపంలో ఎగుమతి పై నిషేధం వున్నందున జిగురు రూపంలోనె ఎగుమతి చేయాలి. భారత్ నుండి ఎగుమతి అవుతున్న ఆహార పదార్థాలలో బాసమతి బియ్యం తర్వాతి స్థానం గోరు చిక్కుడుదె.

ఆంధ్ర ప్రదేశ్ లో... గోరుచిక్కుడు....

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలోను గోరుచిక్కుడు సాగవుతున్నది. గతేడాది గోరుచిక్కుడు కిగిరాకి పెరగడంతో కూరగాయగా పండించిన గోరుచిక్కుడునే రైతులు జిగురు కొరకు పండించి విక్రయించారు. ఇప్పుడు రాజస్థాన్ నుండి విత్తనాలను తెచ్చుకొని వాణిజ్య ప్రాతిపదికన సాగు చేసేందుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కరువు జిల్లాగా పేరు పొందిన అనంతపురం జిల్లాలో ప్రభుత్వ సహకారంతో గోరు చిక్కుడు సాగు చేస్తుండగా.... ఇప్పుడు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని రైతులు సైతం పెద్ద ఎత్తున గోరుచిక్కుడు సాగు చేయాలని బావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఇతర పారిశ్రామిక అవసరాల కొరకు నెల నెలా సుమారు 200 టన్నుల జిగురును ఉత్తర భారత్ నుండి దిగుమతి చేసుకుంటున్నది. అందులో 50 టన్నుల వరకు మస్కిటో కాయిల్స్ తయారీ లోనె వాడుతున్నారు. గోరు చిక్కుడుకు పెద్దగా తెగుళ్ళు సోకక పోవడం, వర్షాభావ పరిస్థితులను తట్టుకొని నిలబడగలగడము, పెట్టుబడి తక్కువ కావడము, గిరాకి బాగుండటం మొదలగు కారణాల వల్ల మన రైతులు గోరుచిక్కుడు సాగుకు మక్కువ చూపుతున్నారు. ప్రత్తి, మిరప వంటి పంటలు రైతులను దెబ్బ తీస్తుండటంతో గోరు చిక్కుడు సాగు ఈ రైతులకు ఆశాకిరణంగా కనిపిస్తున్నది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే షేల్ గ్యాస్/చమురు వెలికి తీత కార్యక్రమం జరుగుతున్నది . చైనాలో కూడా భారి నిల్వలున్నట్టు అంచనా. మరికొన్ని దేశాలు షేల్ గ్యాస్/చమురు వెలికి తీయడము పై సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోసించిన ఆధ్రప్రదేశ్ రైతులు తమ భవిషత్తును గోరుచిక్కుడు సాగు ఆదుకుంటుందని కొండంత ఆశ పెట్టుకున్నాడు. అతి సాధారణమైన గోరు చిక్కుడు పంట రాబోవు కాలంలో ప్రముఖ వాణిజ్య పంటగా అభివృద్ధి చెందగలదని నమ్ము తున్నాడు.

ఆధారము: ఈనాడు ఆదివారము: 2012 డిసెంబరు 2.

[లాభాల 'చిక్కు'డే]

[మార్చు]

విత్తన గోరుచిక్కుడు జిగురుఎగుమతుల్లో రికార్డుఏకంగా రూ.21, 287 కోట్ల ఆదాయం. కేజీ రూ.250 నుంచి రూ.300పలుకుతున్న విత్తనాలు. ఈనాడు - హైదరాబాదు‌త్తన గోరుచిక్కుడు పంట మరోసారి రికార్డు సృష్టించింది. గతేడాది భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయిన వ్యవసాయోత్పత్తుల్లో ఈ పంట నుంచి తీసిన జిగురుదే అగ్రస్థానం. రికార్డుస్థాయిలో రూ.21, 287 కోట్ల విలువైన గోరుచిక్కుడు జిగురును విదేశాలకు పంపి భారత వ్యాపారులు రికార్డు సృష్టించారు. అంతకుముందు ఏడాది (2011-12) తో పోలిస్తే ఇది రూ.4, 764 కోట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పంటలకు ఉన్న డిమాండులో విత్తన గోరుచిక్కుడుదే ప్రథమస్థానం కావడం విశేషం. ఈ జిగురుకు భారీ డిమాండు ఏర్పడటం వల్ల వరసగా రెండో ఏడాదీ దీని వ్యాపారం అత్యున్నత స్థాయిలో నిలిచింది. గోరుచిక్కుడు విత్తనాల నుంచి తీసే జిగురును పలు దేశాల్లో విరివిగా వాడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో బేకరీ ఆహార పదార్థాల్లో చిక్కదనం కోసం దీనికి గిరాకీ ఉంది. నిజానికి గతేడాది దీనికి పెద్దగా మార్కెట్‌ ఉండదని తొలుత అంచనా వేశారు. కానీ 2012-13 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి వ్యవసాయోత్పత్తుల్లో ఈ జిగురు మళ్లీ అగ్రస్థానాన్నినిలబెట్టుకోవడం గమనార్హం. ఉత్తరాది రాష్ట్రాల రైతులకు ఇది కాసుల వర్షం కురిపించే పంటగా మారింది. ఒక్కో రాష్ట్రంలో దీనిసాగు విస్తీర్ణం లెక్కలు ఏటేటా మారిపోతున్నాయి. పంజాబ్‌లో రెండేళ్ల క్రితం కేవలం 4 వేల హెక్టార్లల్లో విత్తన గోరుచిక్కుడు పంట వేసేవారు. గతేడాది ఇది కాస్తా 50 వేల హెక్టార్లకు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పంట ధర కూడా మార్కెట్లో ఇదే రకంగా భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఉదాహరణకు ఈ నెల 11 నుంచి 13 వరకూ ఈ పంట ధర క్వింటాకు రూ.6, 300 ఉండగా ఆ తరువాత రెండు రోజులకే ఏకంగా రూ.7 వేలకు చేరింది. గత ఏప్రిల్‌, మే నెలల్లో దీని ధర ఒకదశలో రూ.13 వేలు దాటింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది తక్కువే కావడం మరో విశేషం.అనంతపురంలో ఎగరేసుకెళ్లారు..రాష్ట్రంలో విత్తన గోరుచిక్కుడును గతేడాది ప్రయోగాత్మకంగా 2500 ఎకరాల్లో కంపెనీలు, వ్యవసాయశాఖ సంయుక్తంగా వేయించాయి. పంటను కనీసం రూ.5 వేలకు క్వింటా చొప్పున కొంటామని ముందే కంపెనీలు రైతులతో తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) పేరుతో ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం రైతులకు విత్తనాలు సైతం ఉచితంగా ఇచ్చాయి. కానీ చివరికి పలువురు రైతులు అసలు ఒప్పందం ప్రకారం కంపెనీలకు అమ్మలేదు. మార్కెట్‌లో ధర రూ.9 వేల దాకా రావడంతో నేరుగా అమ్మేసుకున్నారు. దీనికితోడు తెలంగాణ, కోస్తా జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులు అనంతపురం నుంచి ఈ విత్తనాలను కిలో రూ.300 చొప్పున కొన్నారు. ఇలా విత్తనాలు అమ్ముకున్నవారికీ మంచి ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఈ పంట విత్తనాలు మార్కెట్‌లో రూ.250పైనే ఉంది. కొన్ని కంపెనీలు రూ.500 దాకా వసూలు చేస్తున్నాయి. ఈ ఏడాదీ రాష్ట్రంలో పెద్దయెత్తున విత్తన గోరుచిక్కుడు పంట సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలని, అనంతపురం జిల్లాలో 50 వేల ఎకరాల దాకా పెంచడానికి అవకాశం ఉందని ఆ జిల్లా యంత్రాంగం రాష్ట్ర వ్యవసాయశాఖకు ప్రతిపాదన పంపినట్లు తాజా సమాచారం. కానీ రాష్ట్రస్థాయిలో దీనిపై ఇంతవరకూ స్పందన లేదు. గోరుచిక్కుడు నిజానికి కూరగాయ పంట. రాష్ట్రంలో కూరగాయ పంటల పర్యవేక్షణ వ్యవహారాలు ఉద్యానశాఖ పరిధిలో ఉంది. కానీ ఈ శాఖ విత్తన గోరుచిక్కుడు సాగును పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ శాఖ నిర్లక్ష్యంతో అనంతపురంలో వ్యవసాయశాఖ అధికారులే ఈ పంట గురించి రైతులకు చెపుతున్నారు.

ఆధారము: ఈనాడు 17 Jun 2013 10:00,